పాడి పంటలు

Thursday, January 13, 2011

ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా...!?

 రాత్రనకా పగలనకా శ్రమించి, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకొని పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించకపోతే... రైతన్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే ఆ గ్రామ రైతులకు అలాంటి ఇబ్బంది ఏదీ ఎదురవదు. వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేయండంటూ వ్యాపారుల చుట్టూ తిరగడం వారి ఇంటా వంటా లేదు. వారికి తెలిసిం దల్లా ... నాణ్యమైన పంటలు పండించడం, వాటిని తామే మార్కెట్ చేసుకోవడం. ఎప్పటికప్పుడు మార్కెట్ పోకడల్ని గమనిస్తూ వాటికి అనుగుణంగా పంటలు సాగు చేయడం, వ్యాపారులనే తమ చుట్టూ తిప్పించుకోవడం వీరికి ‘సాగు’తో పెట్టిన విద్య.

అందుకే ఆ గ్రామ రైతులు వ్యవసాయంలో సిరులు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘వ్యవసాయం చేస్తే ఏం లాభ ం... మట్టి బుక్కడం... మట్టి కక్కడం తప్ప’ అన్న నానుడిని చెరిపేసి ‘మట్టి పిసికి... సిరులు పండించడం’ అని తిరగరాస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ వాసులు.


సమష్టి సేద్యం, మార్కెటింగ్‌లో మెలకువలు ఈ గ్రామానికి రాష్టవ్య్రాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంకాపూర్ గ్రామంలోకి వెళితే మనకు ఇంద్రభవనాన్ని తలదన్నే ఇళ్లు, ఖరీదైన కార్లు ఎన్నో దర్శనమిస్తాయి. కేవలం వ్యవసాయంతోనే ఆ ఆస్తుల్ని సముపార్జించుకున్నారంటే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాల్సిందే! పది వేల లోపు జనాభా ఉన్న ఈ గ్రామంలో మూడు వందలకు పైగా ఖరీదైన కార్లు ఉన్నాయంటేనే పరిస్థితి అర్థమవుతుంది. పొలానికి కారులో వెళ్లి పనులు ముగించుకొని వచ్చే స్థాయికి ఇక్కడి రైతులు ఎదిగారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం.


ఇది రాజన్న చలువే...

అంకాపూర్ అభివృద్ధి ప్రస్థానం 70వ దశకంలోనే ప్రారంభమైంది. సంకర జాతి విత్తనాలతో పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్న విషయాన్ని అర్థం చేసుకొన్న అప్పటి గ్రామ సర్పంచ్ రాజన్న గ్రామానికి హైబ్రిడ్ విత్తనాల్ని పరిచయం చేశారు. 1976లో అప్పటి వ్యవసాయాధికారి శ్యాంసుందర్ అంకాపూర్‌ను మోడల్ గ్రామంగా ఎంపిక చేసి సజ్జ పంట సాగు చేయించారు. ఎకరానికి 12 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు లాభాలు చవి చూశారు. దీంతో వారంతా వ్యవసాయంపై మక్కువ పెంచుకొన్నారు.

అప్పటి నుండి గ్రామ స్వరూపమే మారిపోయింది. 1977లో అక్కడ ఆంధ్రా బ్యాంక్ శాఖను ఏర్పాటు చేశారు. వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బుతో గ్రామానికి చెందిన 56 మంది అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 15 కుటుంబాలు స్థిరపడ్డాయి.


పసుపు పంట చేతికి రాగానే ఇక్కడి రైతులు కొత్త మోడల్ కార్లను కొనుగోలు చేస్తారంటే అతిశయోక్తి కాదు. దిగుబడులు చేతికి వచ్చే సమయంలో కార్ల కంపెనీలు గ్రామంలో మేళా నిర్వహించడం, ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం చూస్తే పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది.


డిమాండ్‌ను పసిగట్టి...

అంకాపూర్ వాసులు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. ఉత్తర భారతదేశంలో ఎర్ర జొన్నలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన అంకాపూర్ రైతులు ఎరజ్రొన్న విత్తనోత్పత్తి వైపు అడుగులు వేశారు. అయితే కేవలం ఒకరిద్దరు వేస్తే ఫలితం ఉండదని భావించి ఎక్కువ మంది కలిసి సమష్టి వ్యవసాయం సాగించాలని నిర్ణయించారు. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ పటిష్టంగా ఉండటంతో రైతుల ఆలోచన కార్యరూపం దాల్చింది.
పక్కపక్కన ఉన్న పొలాల్లో వేర్వేరు రకాల విత్తనాలు వేస్తే గాలి, కీటకాల ద్వారా పుప్పొడి పక్క పొలాల్లోకి చేరి విత్తనాలు కల్తీ అయి నాణ్యత లోపిస్తుందనే ఉద్దేశంతో అందరూ ఒకే రకం విత్తనాలు సాగు చేస్తున్నారు. నిజాంసాగర్ జలాలు విడుదల చేసిన వెంటనే కాలువ నుండి విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని పంప్ చేసి చెరువు నింపుకుంటారు.


ప్రాసెసింగ్‌పై దృష్టి

కేవలం పంటల సాగు పైనే దృష్టి సారిస్తే పెద్దగా లాభం ఉండబోదని గ్రహించిన రైతులు గ్రామ శివారులో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించారు. ప్రస్తుతం గ్రామంలో 29 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. పంటను విక్రయించడానికి వ్యాపారుల చుట్టూ తిరగడమేమిటి? వారినే మన చుట్టూ తిరిగేలా చేద్దామన్న ఆలోచన వచ్చిందే తడవుగా మార్కెట్ యార్డు నిర్మించుకున్నారు. దీని ద్వారా ప్రస్తుతం రోజూ సగటున పది లక్షల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. చుట్టు పక్కల గ్రామాల రైతులు కూడా అంకాపూర్ మార్కెట్ యార్డు ద్వారానే తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన పసుపును మహారాష్టల్రోని సాంఘ్లీ మార్కెట్‌కు ఎగుమతి చేస్తారు.

గ్రామ రైతులు ఎక్కువగా పసుపు, ఎర్ర జొన్న, కూరగాయలు సాగు చేస్తారు. పైరు వేసేటప్పుడే రైతులు తమ పంటల అమ్మకానికి సంబంధించి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటారు. అలా చేయడం వల్ల వారికి గిట్టుబాటు ధర లభిస్తోంది. అందరు రైతుల మాదిరిగానే తామూ పంటలు పండిస్తున్నామని, అయితే కలసికట్టుగా ఉండడం, పంటల ఉత్పత్తిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుండడంతో మంచి ఆదాయం పొందుతున్నామని సర్పంచ్ పెర్కిట్ రవి తెలిపారు. మరి మనందరం ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా?


కొత్తిమీరతో లక్షల ఆదాయం!


అంకాపూర్‌లో పండించిన కూరగాయలు గుం టూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. అంకాపూర్ మార్కెట్‌కు సరుకు రావడమే తరువాయి... కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉండటం రైతులకు కలిసొస్తోంది. అంకాపూర్‌లో కొత్తిమీర సాగుతో లక్షల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు. ఎకరం భూమిలో కొత్తిమీర వేసి 45 రోజుల్లో లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారు.

రాష్టవ్య్రాప్తంగా రైతులు కూరగాయలు పండిస్తున్నప్పటికీ పంటను మార్కెటింగ్ చేసుకోవడం, ఎగుమతి చేసే విధానం తెలియక నష్టాలు చవిచూస్తున్నారు. మార్కెటింగ్‌లో మెలకువలు నేర్చిన అంకాపూర్ వాసుల్ని ఆదర్శంగా తీసుకుంటే వ్యవసాయం పండుగే అవుతుంది మరి. అక్కడి రైతుల నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 

వి.అమృతరావు

No comments:

Gouthamaraju as WUA