పాడి పంటలు

Saturday, January 1, 2011

తిండి తిప్పలు * పంటచేలలో రియల్ ఎస్టేట్‌లు

ప్రస్తుతం భారత దేశ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక్క అంగుళం కూడా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఇచ్చేట్టు లేదు. 'మరి ఫ్యాక్టరీలు ఎక్కడ కట్టాలి? ఆకాశంలోనా?' అని పశ్చిమ బెంగాల్ మంత్రి ఒకాయన అన్నారు. మనం ఆయన్ని మనం తిరిగి ఒక ప్రశ్న అడగాలి.. మరి పంటలు ఎక్కడ పండించాలి.. ఆకాశంలోనా?

1950ల్లో 9.36 మిలియన్ హెక్టార్ల భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించగా 2000 సంవత్సరానికి అది 22.4 మిలియన్ హెక్టార్లకు పెరిగిపోయింది. పంట భూమి మాత్రం 1970 నుంచి కూడా140 మిలియన్ల దగ్గరే ఆగిపోయింది. పట్టణీకరణ పుణ్యమా అని గత ఇరవై ఏళ్లుగా వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలకు, కళాశాలలకు, కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు ఉపయోగించడం ఎక్కువైపోయింది.

మరోవైపు ప్రభుత్వం కూడా వ్యవసాయ భూములను హస్తగతం చేసుకొని -సెజ్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్లు లాంటి వాటికి కేటాయిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇతరులకు తక్కువ ధరకు అమ్ముతోంది. ఇదంతా రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల అత్యాశ, మిలాఖత్‌ల వల్లే జరుగుతోంది. ప్రభుత్వానికి డబ్బు తెచ్చి పెట్టే పేరుతో వారు తమకు తామే ఇచ్చుకుంటున్న లంచం ఇది. భారతదేశంలో ఏటా 1.65 లక్షల మంది పుడుతున్నారు. 2060 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకోగలదని అంచనా. కాని ధాన్యం ఉత్పత్తి ఆ దామాషాలో పెరగడం లేదు. 1972లో మనిషికి ఏడాదికి 171.1 కిలోల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటే 2006 నాటికి అది 162.5 కిలోలకు తగ్గింది.

1958-59లో తలసరి పప్పు వాడకం 27.3 కిలోలుంటే 2010 నాటికి అది 10 కిలోలకి తగ్గింది. దిగుబడి తగ్గుతుండడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూనె గింజల ఉత్పత్తి తగ్గడం వల్ల వంట నూనె అవసరాలను తీర్చడానికి గత కొన్ని దశాబ్దాలుగా మన దేశం పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అవగాహనా రాహిత్యంతో ప్రభుత్వం మాత్రం వాణిజ్య పంటలనే ప్రోత్సహిస్తోంది. రైతులు కూడా నష్టాలు భరించలేక వాణిజ్య పంటలవైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, కడుతున్న ప్రాజెక్టులన్నీ కలిసి నీటిని అందించినా కూడా 60 శాతం భూములు వర్షం మీదే ఆధారపడాల్సి ఉంటుంది.

వర్షపాతంలో ఉండే హెచ్చుతగ్గుల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వర్షం ఎక్కువైనా, తక్కువైనా సమస్యలు వస్తాయి. దానివల్ల ఆ భూముల్లో పంట దిగుబడులు తగ్గినా కూడా అవి ఎంతో విలువైనవి. ఎందుకంటే అవి తక్కువ పంటనిచ్చినా ఆహార భద్రతనైతే కల్పిస్తున్నాయి. కాని రైతులు మెట్ట ఆహార పంటలను వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఆ పంటలను ప్రోత్సహిస్తే రైతులు కనీసం వారి అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా పంటలైనా పండిస్తారు. దాని బదులు ప్రభుత్వమే భూములను స్వాధీనం చేసుకొని- మంచి నీటి వసతి ఉన్న భూములను కూడా- అభివృద్ధి పేరిట వాడుకుంటున్నది.

ప్రభుత్వాలు వ్యవసాయ భూములను తీసుకొని, రైతులకు నష్టపరిహారం కింద చాలా తక్కు వ డబ్బును అందజేస్తుండడంతో ఆ కాస్త డబ్బూ పాత అప్పులు తీర్చుకోవడానికి, ఆరోగ్య అవసరాలకే సరిపోతోంది. ఏ కొద్ది మందికో మాత్రమే ఆ డబ్బు వల్ల కాస్త ప్రయోజనం ఉంటుంది. అందుకే అనేకచోట్ల ప్రజలు భూమిని వదులుకోవడానికి జంకుతున్నారు. వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. ఐతే ప్రజల వ్యతిరేకతని పోలీసు బలగాలతో అణచివేస్తున్నాయి ప్రభుత్వా లు. అంతేకాని ఇరుపక్షాలకు లాభదాయకమైన మార్గం గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు చెప్పిన సూక్ష్మ ప్రణాళిక పద్ధతి గాలికి కొట్టుకు పోయి ప్రాజెక్టులు స్థానికులతోను, స్థానిక ప్రభుత్వాలతోను ప్రమేయం లేకుండానే నిర్ణయింపబడుతున్నాయి. నిర్ణయాలన్నీ కూడా పై స్థాయిలో ప్రభుత్వం, కార్పొరేట్ హౌస్‌లు, కాంట్రాక్టర్ల గూడుపుఠాణితో తీసుకోబడుతున్నాయి.

మన పంటల్ని మనం పండిచుకోలేకపోతే దిగుమతి చేసుకోవచ్చుగా? అమెరికా, ఐరోపా దేశాలు అధిక పంటలతో పొంగిపొర్లుతున్నాయి అనంటారా? అయితే ఇండియా లాంటి దేశం ఆహార అవసరాలను దిగుమతి ద్వారా తీర్చుకోగలదా? మన అధిక జనాభా అవసరాలకు ప్రపంచ మార్కెట్టులో ఏది కొనాలని వెళ్లినా దాని ధరలు పెరిగిపోతాయి. మనకొక సామెత ఉన్నది. ఉప్పు అప్పు తెచ్చుకోవచ్చు కాని గింజలు(ధాన్యం) కాదు. ప్రపంచ వాణిజ్య సంస్థ వచ్చిన తర్వాత ఆహార ఎగుమతులు పెరిగి బహుళ జాతి కంపెనీలు ఆహార వ్యాపారంలోకి దిగాయి. దాంతో దేశంలో ఆహార కొరత ఏర్పడి ఆహార భద్రత కరువైంది.

కథ కంచికి..

చాలా మంది అనుకునేదేమంటే వ్యవసాయం, ఆహారం అనేవి రైతులకు, ప్రభుత్వాలకు సంబంధించినవని. కానే కాదు. ఇది వందకు వంద శాతం ప్రజలందరికి సంబంధించిన వ్యవహారం. మనకు పొట్టలో ఆకలేసినంత కాలం, రోజుకు మూడు పూటలా అన్నం తినాలనుకుంటున్నంత కాలం మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయాలు ప్రజలందరి వ్యవహారం.

కథలోని నీతి

నిజమైన ఆహారాన్ని తినండి. అతిగా మర పట్టిన (ప్రాసెస్ చేసిన) ఆహారం తినవద్దు. వీలైనంత వరకు ఇంట్లో వండుకు తినండి. ఆడవాళ్లు బిజీగా ఉంటే మగవాళ్లు వండడం నేర్చుకోండి. సహజాహారానికి (ఆర్గానిక్) ప్రాధాన్యం ఇవ్వండి. మొదటి ప్రాధాన్యం ఆహార పంటలకు ఇవ్వండి. వ్యవసాయేతర పనులకు వ్యవసాయ భూమిని వాడుకోవడాన్ని వ్యతిరేకించండి. పేదలకు ఆహార భద్రత, రైతులకు గిట్టుబాటు ధరను డిమాండ్ చేయండి. దేశ ఆహార సార్వభౌమత్వాన్ని కాపాడుకోండి. చివరగా పంటల విషయంలోగాని ఆహార విషయాల్లోగాని అమెరికాను అనుసరించకుండా ఉండండి.


- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

No comments:

Gouthamaraju as WUA