



రాజుల మామిడికి దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ రావడం వెనుక తరాల శ్రమ దాగుంది. లాభాల కోసం రాజులు వ్యవసాయం చేయరు. నిష్టతో ప్రతిష్ట కోసం పంట పండిస్తారు. చదువు సంధ్యలకంటే మామిడితోటల పెంపకంపైనే ఎక్కువ శ్రధ్ధ కనబరుస్తారు. మొక్కలు నాటిన రోజు నుంచి పెరిగి పెద్దయి, కాపుకొచ్చే వరకు వారి కంటి మీద కును కుండదు. నిజానికి ఈ ప్రాంతంలో మామి డికంటే.. సరు గుడు తోటల సాగే బాగా గిట్టుబాటు అవుతుంది. కాని రాజులు మామిడిని కాదని మరో పంటను సాగు చేసేందుకు ఇష్ట పడరు. "ఎకరా సరుగుడు తోటకు ఎంత లేదన్నా రూ.60 నుంచి రూ.70 వేలు ఆదాయం వస్తుంది.
ఇక్కడి వాతావరణానికి సరిపోయే పనుకు మామిడి, రాజు మామిడి రకాలను మొట్టమొదట విజయనగరంలో సాగుచేసింది రాజులే. అయితే సువర్ణరేక, బంగినపల్లి రకాల మాదిరిగానే ఇవి కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు దిగుబడి రాకపోవడంతో రైతులకు ఇబ్బందులొస్తున్నాయి. అందుకే, మార్చిలోపు పంట చేతికొచ్చే కొత్త రకాల కోసం అన్వేషిస్తున్నారు. మార్చి తరువాత ఏప్రిల్‌లో విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటకు నష్టం వాటిల్లుతోందని రాజుల అభిప్రాయం. మార్చిలోపు పంట చేతికొస్తే, వాతావరణ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అందుకే ఇలాంటి రకాల కోసం పరిశోధించాలని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు (ఐఏఆర్ఐ) జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోషియేషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మధ్య ఐఏఆర్ఐ పరిశోధనల్లో వెలువడిన కొత్త రకాలు.. పూసాప్రతిపా, పూసా ఫాస్ట్, పూసా లాలీమాలు కూడా మార్చి తర్వాతే దిగుబడిని ఇస్తున్నాయి.
విజయనగరవాసి మునగపాటి సీతారామరాజు కుటుంబానికి వందేళ్లుగా మామిడితోటలే జీవనాధారం. తాత నారాయణరాజు నుంచి తండ్రి రామ్మూర్తిరాజుకు మామిడితోట వారసత్వంగా వచ్చింది. "నాకు నా చిన్నతనం నుంచే మామిడితోటలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందుకే, ఆ తోటల్ని విడిచి నేను పెద్ద చదువులు కూడా చదువుకోలేక పోయాను. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లకు మంచి చదువులు అబ్బలేదు. మామిడితోటల మీదే ఆసక్తి ఏర్పడింది..'' అన్నారు సీతారామ రాజు. ప్రస్తుతం జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన విజయనగరం లాంటి జిల్లాలో వరి పంట తరువాత రైతుకు ఆదాయాన్నిచ్చే మేలైన పంటలు ఏవీ లేవంటారు. జిల్లాలో జనుము, వేరుశనగ సాగు పూర్తిగా అంతరిం చింది.
ఏ పరిశోధనశాలలో కొత్తరకం మామిడి మొక్కను ఉత్పత్తి చేసినా.. విజయనగరం, బొబ్బిలికి రావాల్సిందే. అందుకే, నర్సరీలను సైతం ఇక్కడి రైతులే నిర్వహిస్తున్నారు. బంగినపల్లి, కోలంగోవ, పణు మామిడి రకాల మొక్కలు నర్సరీల్లో దొరుకుతున్నాయి. "మేము నర్సరీలను పెంచుతున్నాం. అయితే, ఇక్కడ వస్తున్న ఇబ్బందల్లా ఎగుమతులకు అవసరమైన మౌళిక సదుపాయాలు లేకపోవడం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి యార్డులను ఏర్పాటు చేస్తే మంచిది. రైతులే నేరుగా పంటల్ని తెచ్చి అమ్ముకుంటారు. ఇప్పటికే విజయవాడ, రాజమండ్రిలలో ఈ పద్ధతి అమలవుతోంది'' అంటున్నారు భీమాలికి చెందిన కమ్మెళ్ల కృష్ణంరాజు.
మామిడి తోటలతో మా కుటుంబానికి వందేళ్ల అనుబంధం అల్లుకుంది. ముత్తాతల నుంచి తోటల పెంపకం, వ్యాపారం చేస్తున్నాము. మా నాన్నగారి తరం వరకు మామిడి సాగుతోపాటు వ్యాపారమూ లాభసాటిగానే ఉండేది. ఇప్పుడు భారంగా మారింది. రైతులు, వ్యాపారులు ఇద్దరూ సంతోషంగా లేరు.
దేశంలో దొరికే మామిడి రకాలన్నీ మా తోటలో పండించాలన్నదే మా ఆశయం. ప్రస్తుతం వందెకరాల భూమిలో 30 రకాల మామిడి చెట్లను పెంచుతున్నాం. మామిడి సాగులో మా కుటుంబానికి వందేళ్ల అనుభవం ఉంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హైబ్రిడ్, స్థానిక రకాలు మంచి దిగుబడినే ఇస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం సువర్ణరేక, బంగినపల్లి, కోలంగోవ, కలెక్టరు రకాలను పండిస్తాం. ఇంటికి, బంధుమిత్రులకు నార్త్ ఇండియా రకాలైన దశరి, అయినా, లాంగరా, సఫేదా, కేసరి, మాల్టా, మాల్‌గోవా, రత్నా, అల్పాన్జో రకాలను వేశాము. కేసరి రకానికి 2009లో రాష్ట్రస్థాయి మామిడి పోటీలో ప్రథమ బహుమతి దక్కింది. సౌత్ ఇండియా మామిడి రకాలైన నీలిమా, ఆమ్రపాలి, రకాలకు 2010లో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. స్థానిక రకాలైన బొబ్బిలి పీచు, మెట్టవలస, ఫిరంగి లడ్డూ, గుర్రాం, కృష్ణపసందు, స్వర్ణ సింధూ, జలాలు కూడా మధురంగా ఉంటాయి. మెట్టవలసపీచు, బొబ్బిలి పీచులనే మామిడి రకాల్లో.. 70 పండ్ల ధర రూ.7000 పలికింది.
ఒకప్పుడు వందల ఎకరాల్ని తీసుకుని కౌలుకు సాగు చేశాం. ఇప్పుడు కౌలుకు వ్యవసాయం చేస్తే ఏమీ మిగలడం లేదు. మామిడితోటలున్న భూములు కూడా తగ్గిపోయాయి. ఉన్నంతలో తక్కువ విస్తీర్ణంలో అయినా.. సొంతంగా సేద్యం చేస్తున్నాం. ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అది కూలీల సమస్య. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంతో అన్ని గ్రామాల్లోనూ కూలీల కొరత ఏర్పడింది. అక్కడక్కడ దొరికే కూలీలు కూలీ రేట్లు పేంచేశారు. వస్తున్న దిగుబడికి, పెడుతున్న పెట్టుబడికి సరిపోవడం లేదు. అన్ని పంటల్లాగే మామిడికీ ఇవే కష్టాలొచ్చాయి. వీటన్నిటికి తోడు దళారులు మమ్మల్ని తినేస్తున్నారు.
మారుతున్న కాలానికి అను గుణంగా మామిడి రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం లేదు. అలా చేస్తే మరింత దిగుబడి పెరుగుతుంది. వందలాది ఎకరాల్లో తోటలు సాగుచేసినప్పుడు ఎకరానికి మరో ఎకరానికి కొంత దూరం ఉండాలి. చెట్లు సంఖ్య పెరగాలనే ఆశతో రైతులు ఇలాంటి పద్ధతుల్ని అమలు చేయడం లేదు. దీనివల్ల మామిడి కోతలప్పుడు.. కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దిగుబడి అమ్మకాల్లో కూడా రైతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే ఢిల్లీ, ముంబయి వ్యాపారులకు పంటను అమ్మేస్తున్నారు. సీజన్‌లో పెరిగే ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. అందుకే, రైతులే పంట ఉత్పత్తుల్ని నేరుగా అమ్ముకునే పరిస్థితి రావాలి.|
|
|
|





|









మీరు తరచూ సూపర్‌మార్కెట్‌లకు వెళుతుంటారా..? ఈసారి వెళితే.. ఆర్గానిక్ ఫుడ్‌రాక్‌లను చూడండి. అందులో బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు ఆకర్షణీయమైన ప్యాక్‌లలో ఆకట్టుకునేలా ఉంటాయి. వాటిని కొనాలని చేతుల్లోకి తీసుకోగానే బహుశా మీకు వచ్చే సందేహం 'ఇది ఆర్గానిక్ ఫుడ్' అని ఎలా నమ్మొచ్చు? అన్న అనుమానం కలుగుతుంది. ఫుడ్‌ప్యాక్‌లను తేరిపార చూస్తే 'ఇండియా ఆర్గానిక్' అన్న లోగో కనిపిస్తుంది. అప్పుడే అది నిజమైన ఆర్గానిక్. ఈ లోగోతో దొరికే ఉత్పత్తుల వెనుక పెద్ద కథే ఉంది. రసాయనాలు లేకుండా పండించే రైతు దగ్గర నుంచి.. ఢిల్లీలోని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సంస్థ అందించే సర్టిఫికెట్ల వరకు.. మధ్యలో బోలెడు ప్రక్రియలు నడుస్తాయి..


కృత్రిమ ఎరువులతో, క్రిమిసంహారక మందులతో ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం గురించి మనందరికీ తెలుసు. ఒక రైతు పొలానికి మూడుసార్లు మందు కొడితే ఎకరాకు ముప్పై బస్తాల ధాన్యం పండిందని.. పక్క పొలం రైతు అదే మందు డోసు పెంచి, నాలుగుసార్లు కొడతాడు. ఈయనకు నలభై బస్తాలు పండొచ్చు. కాని నేలతల్లి ఏం కావాలి? తిండి పెట్టే తల్లికి మనం తిరిగి ఏమిస్తున్నాం..? జీర్ణం కాని ఎరువుల్ని తినిపిస్తున్నాం. శరీరాన్ని గుల్ల చేసే పురుగుమందులను తాగిస్తున్నాం. ప్రకృతి నేర్పిన సహజ సేద్యాన్ని వదులుకుని, పాడి పశువులతో కళకళలాడే పల్లెల్ని మరిచిపోయాం.
దీన్ని మార్చడానికి కొద్దిమందే అయినా గట్టి ప్రయత్నం చేసినవాళ్లు కొందరు ఉన్నారు

ప్రస్తుతం మన రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతులున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, చిత్తూరు, కడప, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు సేద్యంలో కొత్త అనుభవం పొందుతున్నారు. "ఒక ఆవు రెండు లీటర్లే పాలిస్తుందనుకోండి. అత్యాశకు పోయి నాలుగు లీటర్లు కావాలనుకుంటే పాలకు బదులు రక్తమొస్తుంది. భూమి కూడా అంతే. ఎంత పంటనివ్వాలో అంతే ఇస్తుంది. బలవంతంగా పిండుకోవాలని చూస్తే ఏదో ఒక రోజు అసలు పండే స్వభావాన్నే కోల్పోతుంది..'' అంటాడు ప.గోదావరి జిల్లా నాచుగుంటకు చెందిన 'సర్టిఫైడ్' రైతు భూపతిరాజు రామకృష్ణరాజు.
వేపాకు ఉడకబెట్టి రసం తీసి.. పంటకు చల్లే తిమ్మయ్యను చూస్తే తోటి రైతులకు నవ్వొస్తుంది. "ఇంత పవరున్న మందులు చల్లుతుంటేనే పురుగు చావటం లేదు. నీ వేపాకు రసానికి చచ్చిపోతుందా?'' అని వెక్కిరిస్తారు. చిత్తూరు జిల్లా పచ్చారోళ్లపల్లికి చెందిన తిమ్మయ్య ఇప్పుడు సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతు. మూడేళ్లు కష్టపడితే కాని ఈ సర్టిఫికెట్టు రాలేదు. మూడెకరాల్లో వేరుసెనగ, ఎకరంలో చెరకు వేశాడు. సేంద్రీయంతోనే రుచికరమైన కందిపప్పు పండించి.. కిలో రూ.75కు అమ్ముతున్నాడు. ఇదే కందిపప్పు బయట మార్కెట్‌లో రూ.200 పెడితే కాని దొరకదు. కొండప్రాంతాల్లో వ్యవసాయం చేయడమంటే చాలా కష్టం. వచ్చే దిగుబడీ తక్కువ. అయినా సరే అత్యాశకు పోలేదు సుక్రు గైరమ్మ. విజయనగరం జిల్లా అడ్డతీగ గిరిజన గూడేనికి చెందిన ఈ మహిళా రైతు సేంద్రీయ సేద్యాన్ని ఇష్టపడింది. వరి, రాగులు, జొన్న, సామలు, కొర్రలు పండిస్తోంది.
పంట ఉత్పత్తులను విజయనగరం తీసుకురావాలంటే పడవలో గోస్తనీ నదిని దాటాలి. "సేంద్రీయ సేద్యంలో రైతు కు ఖర్చు తక్కువ. సమాజానికి లాభం ఎక్కువ. నేను చేస్తున్నది మంచి పనేగా'' అంటుందామె. చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రంలోనూ సేంద్రీయ పంటల్ని పండిస్తున్నారు. పాతిక ఎకరాల్లో ఆర్గానిక్ కూరగాయాల్ని పండిస్తున్నారు. సేంద్రీయ రైతుల్ని ప్రభుత్వమే కాదు, స్వచ్ఛందసంస్థలూ ప్రోత్సాహిస్తున్నాయి. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, టింబక్టూ ఆర్గానిక్, ఆర్‌డీటీ, వికాస, చేతన, ఉర్వి.. ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్న సంస్థలు. సాధారణ సేద్యంతో పోల్చితే, సేంద్రీయ సేద్యం పరిధి చాలా తక్కువే కాని భవిష్యత్తు మీద ఆశ కలిగించే సేద్యం ఇదే.
రాష్ట్రంలో ఆర్గానిక్ సేద్యం కింద వరి, రాజ్మా, కంది, తృణధాన్యాలు, కూరగాయలు సాగవుతున్నాయి. వీటిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే బయ్యర్స్-సెల్లర్స్ మీట్ పెట్టాం. ఇక్కడికి 20 కంపెనీలొచ్చాయి. సేంద్రీయ రైతుల వివరాలను తీసుకున్నాయవి. మొన్న హైదరాబాద్‌లో జరిగిన హార్టీకల్చర్ ఎక్స్‌పోలో కూడా స్టాల్స్ పెట్టుకునేందుకు రైతులకు అవకాశం ఇచ్చాం. వాళ్లు ఇక్కడికి రావడానికి రవాణా, ఫుడ్‌ప్యాకింగ్ సదుపాయాలను కల్పించాం. సాధారణంగా ఆర్గానిక్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలంటే ఒక్కో రైతుకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికి అయిదు లక్షలు చెల్లించాం.