అన్ని కాలాల్లోనూ పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఒక్కో పశువుకు ఎనిమిది కిలోల వరిగడ్డి లేదా ఎండు చొప్ప (జొన్న, మొక్కజొన్న), ఎనిమిది కిలోల లెగ్యూమ్ జాతి పచ్చిమేత (పిల్లిపెసర, అలసంద, గోరుచిక్కుడు), 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు (జొన్న, మొక్కజొన్న, ఇంకా ఇతర బహు వార్షిక పశుగ్రాసాలు) ఇచ్చినట్లయితే దానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా ఇవ్వాలి. ఈ విధంగా పోషణ చేపడితే సకాలంలో పశువులు ఎదకు వస్తాయి. ఈనిన తర్వాత మూడు నెలల లోపు పశువు ఎదకు వచ్చేటట్లు చూసి 13 నెలల్లో ఒక ఈత ఈనేటట్లు జాగ్రత్త పడాలి. అలా చేస్తే పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. పాడి పరిశ్రమ లాభదాయకంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన పశువులు తమ జీవిత కాలంలో 8-10 సార్లు గర్భం దాల్చే అవకాశం ఉంది.
గొడ్డుమోతు సమస్యలు
పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు మూడు కారణాలు ఉన్నాయి. సకాలంలో ఎదకు రాకపోవడం, పశువులకు గర్భకోశ వ్యాధులు ఉండటం, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనిని నివారించాలంటే పాడి రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు ఈనిన తర్వాత 60-90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువుల్ని సకాలంలో పశు వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలి. ప్రతి రోజూ ఎద లక్షణాల్ని పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. సకాలంలో చూడి పరీక్షలు చేయించాలి. కట్టు నిలవని పశువులకు పశు వైద్యాధికారితో ప్రత్యేక చికిత్స చేయించాలి. ఈనే సమయంలో పాకలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి. పుష్టికరమైన పచ్చిమేత వెయ్యాలి. లేకుంటే ‘ఎ’ విటమిన్ ఇంజక్షన్ ఇవ్వాలి. దాణాలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ మిశ్రమం తగు పాళ్లలో అందించాలి.
దూడల్ని ఎదగనీయండి
యుక్త వయసు రాని దూడల్ని కృత్రిమంగా పొర్లించి చూడి కట్టించే పనిని ఇటీవల కొందరు రైతులు గొప్పగా భావిస్తున్నారు. అయితే అశాస్ర్తీయమైన ఇటువంటి సంప్రదాయం పశువుల ఉనికికే ప్రమాదకరం. తగిన వయసు, సరిపడినంత బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల ఆ పశువుతో పాటు దాని సంతతికి కూడా అనేక రకాల బలహీనతలు, వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు రాజమండ్రి పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రామకోటేశ్వరరావు. వివరాలు ఆయన మాటల్లోనే...
దూడలు ఒక వైపు తల్లి పాలు తాగుతుండగానే పశువుల్ని చూడి కట్టించడం ఇటీవల ఒక పోకడగా మారుతోంది. మనుషుల్లో బాల్య వివాహాలు ఎంతటి దురాచారమో పశువులకు ఈ పద్ధతి అంతటి అనాచారమని చెప్పొచ్చు. సాధారణంగా సంకర జాతి ఆవులకు పోషక విలువలు ఉన్న దాణా ఇవ్వడం వల్ల వాటిలో ముందుగానే ఎద లక్షణాలు కన్పిస్తాయి. దీంతో కొందరు రైతులు వాటిని నాలుగో నెలలోనే పొర్లించి ఎద కట్టిస్తున్నారు. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తర్వాత మాత్రమే పొర్లించాలి. ఆవులైతే 200 కిలోలు, గేదెలైతే 250-300 కిలోల బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడి కట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువుల్ని పొర్లించినప్పుడు శరీరం లోపల కలిగే ఒత్తిడిని అవి తట్టుకోలేవు. తక్కువ వయసు, తక్కువ బరువు ఉన్న పశువుల్ని చూడి కట్టిస్తే వాటి శరీరంలోని లవణాలు, విటమిన్లు పాల ద్వారా బయటికి పోతాయి. దీంతో వాటి శరీర నిర్మాణం కుంటుపడుతుంది. చిరుప్రాయంలోనే ఆవును చూడి కట్టిస్తే కటి వలయం సరైన రీతిలో సిద్ధం కాక ఈనిక కష్టతరంగా మారుతుంది. ఈ సందర్భంలో తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది.
యుక్త వయసుకు రాకుండా పొర్లించడం వల్ల పశువు తన జీవిత కాలంలో ఇచ్చే దూడల సంఖ్య తగ్గిపోవచ్చు. అలాగే దాని పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. తర్వాత ఈతకు, ఈతకు మధ్య ఒక సంవత్సరం ఉండాల్సిన ఎడం రెండు మూడేళ్లకు పెరుగుతుంది. పశువు తీసుకునే ఆహారాన్ని దాని శారీరక ఎదుగుదలకు, పాల ఉత్పత్తికి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఎద లక్షణాలు పూర్తిగా కన్పించక మూగ ఎదలకు దారి తీసే అవకాశం ఉంది. పశువులు ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిన వెంటనే తిరిగి పొర్లు సమస్య వస్తుంది. పొదుగు కణజాలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. జన్యుపరమైన లక్షణాలు తగ్గుతాయి. ఈ విధంగా తొందరపాటుతో చూడి కట్టించడం వల్ల పాడి పశువులకి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వాటి సంతతి దూడలకు అనువంశికంగా ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు ఇలాంటి పొర్లింపు కార్యక్రమాలకు ఇకనైనా స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయి.
No comments:
Post a Comment