పాడి పంటలు

Showing posts with label Andhra Pradesh. Show all posts
Showing posts with label Andhra Pradesh. Show all posts

Sunday, September 9, 2012

Sunday, June 3, 2012

మామిడి రా'రాజులు'

 

ఇన్నాళ్లూ మండుటెండల్లో వేపుకుతిన్న వేసవి.. మరికొన్ని రోజుల్లో వెళ్లిపోతోంది. వేసవి ఎండల్ని భరించిన అందరికీ మధురమైన జ్ఞాపకం ఏదైనా ఉందా అంటే .. అది మామిడి మాధుర్యం అనే చెప్పవచ్చు. పండ్ల రుచుల్ని ఆస్వాదించిన వాళ్లకే కాదు. మామిడిని సాగు చేస్తున్న రాజుల కుటుంబాలకూ ఇదే అనుభవాన్ని మిగిల్చి వెళుతోంది ఈ వేసవి. మామిడి సాగులో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. పరువు కోసం పంట పండించే ఈ సామాజిక వర్గం విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో వేలాది ఎకరాల మామిడి తోటల్ని సాగు చేస్తోంది. తరతరాల వారసత్వ సంపదగా భావిస్తోంది. దేశంలోనే అరుదైన మామిడి రకాల్ని పండించి.. ప్రధాన నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతుల్ని చేస్తోంది. 

రాజుల మామిడి సాగుపైనే ఈ ‌స్టోరీ..

పండ్లలో రారాజు?
మధురఫలం, అదేనండీ మామిడి.
మరి, మామిడిని పండించడంలో మారాజులు ఎవరు?
ఇంకెవరు? విజయనగరం రాజులు.
రాజులు రాజ్యాలను కోల్పోయినా.. మామిడితోటల మీద మమకారాన్ని ఇప్పటికీ వదులుకోవడం లేదు.


విజయనగరం, బొబ్బిలి ఒకప్పటి రాజుల సంస్థానాలు. ఇప్పుడవి లేవు కాని, వాళ్ల అడుగుజాడల్లో మొలకెత్తిన విలాసమైన మామిడితోటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. తోటల సాగులో నష్టమొచ్చినా, కష్టమొచ్చినా.. రాజదర్పం ఊరికే ఉండనిస్తుందా? అప్పులు చేసైనా సరే, ఆస్తులు కరిగిపోయినా సరే.. పచ్చటి తోటలు కళకళలాడాల్సిందేనంటున్నారు రాజులు. తోటల్లోనే రాజప్రాసాదాలు నిర్మించి (గెస్ట్‌హౌస్‌లు) మామిడిని పండించడం వీరి సంప్రదాయం. ఈ సంస్కృతి పాతకాలం రాజుల నుంచే వచ్చినా ఇప్పటికీ కొనసాగుతోంది. తాతతండ్రుల నుంచి వచ్చిన మామిడి తోటలంటే ప్రతి రాజు కుటుంబానికీ మహా ప్రీతి.

విజయనగరంలో అప్పటి రాజవంశీయులైన పీవీజీ రాజు మొదలుకొని ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్‌గజపతి రాజుల వరకు మామిడితోటల సాగును వారసత్వ సంపదగా భావిస్తున్నారు. బొబ్బిలి సంస్థాన పాలకులైనవెలమదొర రాజారావు బహుదూర్ రంగారావు కుటుంబం మామిడి తోటలకు పెట్టింది పేరు. ఈ రెండు కుటుంబాల రాజవంశీయులతోనే మామిడితోపుల సాగుకు బాటలు పడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో 15 వేల హెక్టార్లను రాజుల సామాజికవర్గమే సాగు చేస్తున్నది.

మామిడిపంటల మీద రాజులకు ఎప్పటి నుంచో మోజుంది. బొబ్బిలి సంస్థానంలో ఒకటైన రాజాం (శ్రీకాకుళం) కోట పరిసరాల్లో 'గుర్రాం' అనే ఒక రకం మామిడి చెట్టు ఉండేదట. ఆ చెట్టు పండ్లు రాలిన వెంటనే బొబ్బిలి రాజావారికి అందజేయడానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసేవారట. అలనాడు రాజుల మనసుదోచిన ఆ మామిడి పండ్లకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. ఒకప్పటి తీపిగుర్తుగా గుర్రాం రకం మామిడితోటల్ని వెలమదొరలు ఈనాటికీ వందలాది ఎకరాల్లో సాగు చేస్తుండటం విశేషం. బొబ్బిలి వెలమదొర సాలా వెంకట మురళి కృష్ణ వంద ఎకరాల్లో 30 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. అత్యంత నాణ్యమైన 'కేసరి' రకానికి 2009లో రాష్ట్రస్థాయి ప్ర«థమ బహుమతి దక్కింది. అమ్రపాలి, నీలిమ రకాలకు కూడా ఆ తరువాతి సంవత్సరం మరో అవార్డు లభించింది. విజయనగరం, బొబ్బిలిలోని మామిడితోటల మాధుర్యం.. ఢిల్లీని కూడా తాకింది. సీజన్ వచ్చిందంటే చాలు.. రాజధాని నుంచి మామిడి వ్యాపారులు ఉత్తరాంధ్రకు పరిగెత్తుకొస్తారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేస్తున్నారు.

తోటలే బంగారం...

రాజుల మామిడికి దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ రావడం వెనుక తరాల శ్రమ దాగుంది. లాభాల కోసం రాజులు వ్యవసాయం చేయరు. నిష్టతో ప్రతిష్ట కోసం పంట పండిస్తారు. చదువు సంధ్యలకంటే మామిడితోటల పెంపకంపైనే ఎక్కువ శ్రధ్ధ కనబరుస్తారు. మొక్కలు నాటిన రోజు నుంచి పెరిగి పెద్దయి, కాపుకొచ్చే వరకు వారి కంటి మీద కును కుండదు. నిజానికి ఈ ప్రాంతంలో మామి డికంటే.. సరు గుడు తోటల సాగే బాగా గిట్టుబాటు అవుతుంది. కాని రాజులు మామిడిని కాదని మరో పంటను సాగు చేసేందుకు ఇష్ట పడరు. "ఎకరా సరుగుడు తోటకు ఎంత లేదన్నా రూ.60 నుంచి రూ.70 వేలు ఆదాయం వస్తుంది.

కాని ఇవి భూగర్భజలాలను హరిస్తాయి. అందుకే మా కుటుంబాలకు మామిడి తోటలంటేనే ప్రాణం. మామిడి పర్యా వరణానికి మేలు చేస్తుంది. పది మందికి తియ్యటి ఫలాల్ని అందించామన్న సంతృప్తిని మిగిలిస్తుంది. అందుకే దిగుబడి ఎంత వచ్చినా వెనుకంజ వసే ప్రసక్తే లేదు'' అంటు న్నారు రాజులు. మధ్య తరగతి కుటుం బాలు ఎంత బంగారం ఉంటే అంత భద్రత ఉన్నట్లు భావిస్తారు. రాజులు కుటుంబాల్లో అలా కాదు. పెళ్లిళ్లతో బంధు త్వాల్ని కలుపు కోవాలన్నా, ఎన్ని ఎకరాల మామిడి తోటలు ఉన్నాయో? చూశాకే ఇంట్లో మేళ తాళాలు మోగుతాయి. ఆడ పిల్లలకు బంగారానికి బదులు మామిడితోటల్ని కట్నంగా రాసిస్తా రంటే.. వాటికున్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడ ఎక్కువ సాగు..?

ఆలమండ, భీమాలి, జొన్నవలస, గంట్యాడ, డెంకాడ, కొత్త వలసలలో వేలాది ఎకరాల మామిడి తోటల్ని రాజులే సాగు చేస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి పరిధిలో వెలమదొరల తోటలు ఉన్నాయి. మామిడి మొక్కల నర్సరీలను కూడా రాజులే పెంచుతున్నారు. ఎల్.కోటలోని భీమాలి రాజుల నర్సరీలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా పేరొందిన మేలైన మామిడి రకాల మొక్కలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. విజయనగరం, బొబ్బిలి రాజులు సాగు చేస్తున్నన్ని మామిడి రకాలు మరెక్కడా సాగు కావడం లేదు. వ్యాపార అవసరాల కోసం వేసిన దేశవాళీ, హైబ్రీడ్, నార్త్ ఇండియా, సౌత్ఇండియాలతో కలిపి 50 మామిడి రకాలను సాగు చేస్తున్నారు. బంగినపల్లి, సువర్ణరేక, పనుకులు, చిన్నరసం, పెద్దరసం, చెరుకురసం, బారామతి (పునాస మామిడి), కోలంగోవ, హిమామ్ పసంద్, దసేరీ, లంగడా, నీలం, మల్లిక, ఆమ్రపాలి, కేసర్, సఫేదా, సుయా, నీలుద్దీన్, నీలిషాన్, జహంగీర్, స్వర్ణ జహంగీర్, పెద్ద సువర్ణరేక, పోలిపిల్లి సువర్ణరేక, పానకాలు, ఆల్ఫాన్సో వంటి రకాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

'మార్చి'కొస్తే మంచిది...

ఇక్కడి వాతావరణానికి సరిపోయే పనుకు మామిడి, రాజు మామిడి రకాలను మొట్టమొదట విజయనగరంలో సాగుచేసింది రాజులే. అయితే సువర్ణరేక, బంగినపల్లి రకాల మాదిరిగానే ఇవి కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు దిగుబడి రాకపోవడంతో రైతులకు ఇబ్బందులొస్తున్నాయి. అందుకే, మార్చిలోపు పంట చేతికొచ్చే కొత్త రకాల కోసం అన్వేషిస్తున్నారు. మార్చి తరువాత ఏప్రిల్‌లో విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటకు నష్టం వాటిల్లుతోందని రాజుల అభిప్రాయం. మార్చిలోపు పంట చేతికొస్తే, వాతావరణ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అందుకే ఇలాంటి రకాల కోసం పరిశోధించాలని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు (ఐఏఆర్ఐ) జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోషియేషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మధ్య ఐఏఆర్ఐ పరిశోధనల్లో వెలువడిన కొత్త రకాలు.. పూసాప్రతిపా, పూసా ఫాస్ట్, పూసా లాలీమాలు కూడా మార్చి తర్వాతే దిగుబడిని ఇస్తున్నాయి.

మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు విజయనగరం జిల్లా నుంచి కేవలం మామిడి వ్యాపార ఎగుమతుల వల్లే.. ఈస్ట్‌కోస్టు రైల్వేకు రూ.5 కోట్లు రాబడి వస్తుంది. రైల్వే వ్యాగన్‌ల ద్వారా విజయనగరం నుంచి న్యూఢిల్లీకి మామిడి పండ్లు ఎగుమతి అవుతాయి. ఏడాది ముందుగానే ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి రైతులకు పెట్టుబడులు ఇచ్చి మరీ మామిడి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క ఢిల్లీయే కాకుండా, కోల్‌కతా, ఒడిశ్సాలకూ విజయనగరం నుంచే మామిడి పండ్లు వెళుతున్నాయి. ఈ ఏడాది ఒక్క ఢిల్లీకి మాత్రమే 40 వ్యాగన్‌ల సరుకు ఎగుమతయ్యింది. ఢిల్లీకి సరుకు చేరాక.. అట్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు మామిడి వెళుతోంది.

మింగేస్తోన్న రియల్ఎస్టేట్..?

రింగురోడ్లు, సెజ్‌లు, అణువిద్యుత్ ఫ్యాక్టరీలు.. ఇవన్నీ సేద్యపు భూముల్ని మింగేస్తున్నట్లే.. రియల్ఎస్టేట్ దెబ్బకు మామిడితోపులు కూడా మాయమైపోతున్నాయి. తరాల నుంచి కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడితోటలు రకరకాల సమస్యల వల్ల కనుమరుగైపోవడం ఈ ప్రాంతవాసుల్ని కలచి వేస్తోంది.
కొత్తవలసలోని గులిపల్లి దగ్గరున్న మిస్సమ్మ మామిడి తోటలంటే చుట్టుపట్టు పల్లెల్లో పెద్ద పేరుండేది. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలు ఇప్పుడు కనిపించడం లేదు. వన్నెపాలెంలో వందేళ్ల వయసున్న 300 ఎకరాల మామిడి తోటలు ఉండేవి. దిగుబడి తగ్గిపోవడంతో.. మామిడి చెట్లను తొలగించి లే అవుట్లను వేశారు. ఈ తోటలన్నీ ఒకప్పుడు రాజులవే! ఎన్ని సంక్షోభాలు ఎదురయినా.. మామిడితోటల పెంపకంపై వారి ఆసక్తి మాత్రం చావడం లేదు. అందుకే, భూముల్ని అమ్మేసినా.. మరో ప్రాంతంలో భూముల్ని కొనుగోలు చేసి, కొత్త తోటల్ని సాగు చేస్తున్నారు.

ఒక్కొక్క రైతుదీ ఒక్కో కథ..

విజయనగరవాసి మునగపాటి సీతారామరాజు కుటుంబానికి వందేళ్లుగా మామిడితోటలే జీవనాధారం. తాత నారాయణరాజు నుంచి తండ్రి రామ్మూర్తిరాజుకు మామిడితోట వారసత్వంగా వచ్చింది. "నాకు నా చిన్నతనం నుంచే మామిడితోటలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందుకే, ఆ తోటల్ని విడిచి నేను పెద్ద చదువులు కూడా చదువుకోలేక పోయాను. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లకు మంచి చదువులు అబ్బలేదు. మామిడితోటల మీదే ఆసక్తి ఏర్పడింది..'' అన్నారు సీతారామ రాజు. ప్రస్తుతం జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన విజయనగరం లాంటి జిల్లాలో వరి పంట తరువాత రైతుకు ఆదాయాన్నిచ్చే మేలైన పంటలు ఏవీ లేవంటారు. జిల్లాలో జనుము, వేరుశనగ సాగు పూర్తిగా అంతరిం చింది.

అందుకే, పల్లపు భూముల్లోనూ మామిడిని పండిస్తు న్నారు. ఇక్కడ మామిడిసాగు కుటుంబ ప్రతిష్టకు సంబంధించినది కూడా. దాని కోసం ఏమైనా చేస్తాం అంటారు కొత్తవలస రైతు దండు నరశింహరాజు లాంటి వాళ్లు. మొక్కలు పెంచే సమయంలో నీళ్లు లేకపోతే.. రెండ్రోజులకు ఓసారి స్వయంగా నీళ్లు పోసి పోషించుకున్నారాయన. మామిడి ఎగుమతి గురించి మాట్లాడుతూ "పెద్ద మార్కెట్‌లకు ఒకేసారి అన్ని ప్రాంతాల నుంచి మామిడి ఎగుమతి అవుతోంది. దీంతో మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుంది..'' అన్నారు రాజు. నలభై ఎకరాల్లో మామిడి తోటను సాగుచేస్తున్న నరశింహ రాజు ఏడాదికి పెట్టుబడి కిందే రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది భారమైనా మారే ఆలోచన చేయడం లేదు. "ఇంత పెట్టు బడిపెట్టి నష్టపోయే బదులు మరో పంట వేసుకోవచ్చు కదా'' అని తోటి రైతులు చెప్పినా రాజుకు మామిడిని వదిలే ఉద్దేశ్యం లేదిప్పుడు. ఎందుకంటే, ఆయనకు మామిడి తోటలతో 60 ఏళ్ల అనుబంధం ఉంది. తోటల సమీపంలోనే రూ.30లక్షలతో అతిథి గృహాన్ని నిర్మించుకుని సంతోషంగా జీవిస్తున్నారు శివరామరాజు కుటుంబీకులు.

మామిడి రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య దళారీ వ్యవస్థ. దీన్ని తగ్గిస్తే రాజుల మామిడితోటలు ఇంత వేగంగా కరిగిపోవంటున్నారు లక్కవరపుకోట మండలం భీమాలికి చెందిన రైతు ముదునూరు జోగి జగన్నాథరాజు. మామిడిని సాగు చేయడంలో ఈ కుటుంబానికి ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఎకరాల్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నది. "దళారీల వల్ల మాలాంటి కౌలు రైతులకు నష్టాలే మిగులుతున్నాయి..'' అని ఆవేదన వ్యక్తం చేశారాయన. రాజుకు చెందిన ఇద్దరు కొడుకులు కూడా మామిడి సాగు మీదే జీవనం సాగిస్తున్నారు.

నర్సరీలను పెంచుతూ..

ఏ పరిశోధనశాలలో కొత్తరకం మామిడి మొక్కను ఉత్పత్తి చేసినా.. విజయనగరం, బొబ్బిలికి రావాల్సిందే. అందుకే, నర్సరీలను సైతం ఇక్కడి రైతులే నిర్వహిస్తున్నారు. బంగినపల్లి, కోలంగోవ, పణు మామిడి రకాల మొక్కలు నర్సరీల్లో దొరుకుతున్నాయి. "మేము నర్సరీలను పెంచుతున్నాం. అయితే, ఇక్కడ వస్తున్న ఇబ్బందల్లా ఎగుమతులకు అవసరమైన మౌళిక సదుపాయాలు లేకపోవడం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి యార్డులను ఏర్పాటు చేస్తే మంచిది. రైతులే నేరుగా పంటల్ని తెచ్చి అమ్ముకుంటారు. ఇప్పటికే విజయవాడ, రాజమండ్రిలలో ఈ పద్ధతి అమలవుతోంది'' అంటున్నారు భీమాలికి చెందిన కమ్మెళ్ల కృష్ణంరాజు.

మామిడి సాగులో తరిస్తున్న రాజుల కుటుంబాలు.. వ్యాపార అవసరాలకే పంట పండించరు. తోటల్లోకి కొన్ని మధురమైన మామిడి చెట్లను సొంతానికి కూడా పెంచుకుంటారు. బంధువులు, స్నేహితులకు ప్రతి సీజన్‌లోనూ మామిడి పండ్లను అభిమానంతో బహుమానంగా పంపించడం అలవాటు. "సేద్యంలో దిగుబడి అనేది శ్రమకు దక్కే ప్రతిఫలం. ఆ ఫలితాన్ని పదిమందితో పంచుకుంటే గొప్ప సంతృప్తి కలుగుతుంది. అందుకే, మాకు మామిడి వాణిజ్య పంటే కాదు. అనుబంధాల్ని మరింత మధురం చేసే పంట'' అంటూ తరిస్తున్నారు రాజు కుటుంబాల్లోని మామిడి రైతులు.

మాది వందేళ్ల తీపి బంధం

మామిడి తోటలతో మా కుటుంబానికి వందేళ్ల అనుబంధం అల్లుకుంది. ముత్తాతల నుంచి తోటల పెంపకం, వ్యాపారం చేస్తున్నాము. మా నాన్నగారి తరం వరకు మామిడి సాగుతోపాటు వ్యాపారమూ లాభసాటిగానే ఉండేది. ఇప్పుడు భారంగా మారింది. రైతులు, వ్యాపారులు ఇద్దరూ సంతోషంగా లేరు.
ప్రస్తుతం భీమాలిలో నర్సరీని పెంచుతున్నాం. రైతులకు మొక్కల్ని సరఫరా చేసి.. బతుకుతున్నాం. ఇన్నాళ్లూ మామిడి తోటలే మమ్మల్ని బతికించాయి. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కదాని.. మరో పని చేయడానికి సిద్ధంగా లేము. రాజుల కుటుంబాల్లో ఎంత నిరుపేదలైనా కూలి పని చేయడానికి ఇష్టపడరు. అందుకే, ఈ బాధలు పడుతున్నాం.
- ముదునూరు గోపాలకృష్ణ, బలిగట్టం


30 రకాలను సాగు చేస్తున్నాం

దేశంలో దొరికే మామిడి రకాలన్నీ మా తోటలో పండించాలన్నదే మా ఆశయం. ప్రస్తుతం వందెకరాల భూమిలో 30 రకాల మామిడి చెట్లను పెంచుతున్నాం. మామిడి సాగులో మా కుటుంబానికి వందేళ్ల అనుభవం ఉంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హైబ్రిడ్, స్థానిక రకాలు మంచి దిగుబడినే ఇస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం సువర్ణరేక, బంగినపల్లి, కోలంగోవ, కలెక్టరు రకాలను పండిస్తాం. ఇంటికి, బంధుమిత్రులకు నార్త్ ఇండియా రకాలైన దశరి, అయినా, లాంగరా, సఫేదా, కేసరి, మాల్టా, మాల్‌గోవా, రత్నా, అల్పాన్జో రకాలను వేశాము. కేసరి రకానికి 2009లో రాష్ట్రస్థాయి మామిడి పోటీలో ప్రథమ బహుమతి దక్కింది. సౌత్ ఇండియా మామిడి రకాలైన నీలిమా, ఆమ్రపాలి, రకాలకు 2010లో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. స్థానిక రకాలైన బొబ్బిలి పీచు, మెట్టవలస, ఫిరంగి లడ్డూ, గుర్రాం, కృష్ణపసందు, స్వర్ణ సింధూ, జలాలు కూడా మధురంగా ఉంటాయి. మెట్టవలసపీచు, బొబ్బిలి పీచులనే మామిడి రకాల్లో.. 70 పండ్ల ధర రూ.7000 పలికింది.

కౌలు భూమి తగ్గింది...

ఒకప్పుడు వందల ఎకరాల్ని తీసుకుని కౌలుకు సాగు చేశాం. ఇప్పుడు కౌలుకు వ్యవసాయం చేస్తే ఏమీ మిగలడం లేదు. మామిడితోటలున్న భూములు కూడా తగ్గిపోయాయి. ఉన్నంతలో తక్కువ విస్తీర్ణంలో అయినా.. సొంతంగా సేద్యం చేస్తున్నాం. ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అది కూలీల సమస్య. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంతో అన్ని గ్రామాల్లోనూ కూలీల కొరత ఏర్పడింది. అక్కడక్కడ దొరికే కూలీలు కూలీ రేట్లు పేంచేశారు. వస్తున్న దిగుబడికి, పెడుతున్న పెట్టుబడికి సరిపోవడం లేదు. అన్ని పంటల్లాగే మామిడికీ ఇవే కష్టాలొచ్చాయి. వీటన్నిటికి తోడు దళారులు మమ్మల్ని తినేస్తున్నారు.
- ఎం.వెంకట సత్యనారాయణరాజు, కొత్తవలస


రైతులు మారాలి..

మారుతున్న కాలానికి అను గుణంగా మామిడి రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం లేదు. అలా చేస్తే మరింత దిగుబడి పెరుగుతుంది. వందలాది ఎకరాల్లో తోటలు సాగుచేసినప్పుడు ఎకరానికి మరో ఎకరానికి కొంత దూరం ఉండాలి. చెట్లు సంఖ్య పెరగాలనే ఆశతో రైతులు ఇలాంటి పద్ధతుల్ని అమలు చేయడం లేదు. దీనివల్ల మామిడి కోతలప్పుడు.. కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దిగుబడి అమ్మకాల్లో కూడా రైతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే ఢిల్లీ, ముంబయి వ్యాపారులకు పంటను అమ్మేస్తున్నారు. సీజన్‌లో పెరిగే ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. అందుకే, రైతులే పంట ఉత్పత్తుల్ని నేరుగా అమ్ముకునే పరిస్థితి రావాలి.
- రహీమ్, ఉద్యానవన శాఖాధికారి, విజయనగరం
by
* బిర్లంగి ఉమామహేశ్వరరావు,
విజయనగరం

Monday, April 2, 2012

దేశవాళి ఆవులే మేలు


  దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్‌బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...


  దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.


  జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..

వేచూర్


కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.

శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.


కాసరగడ్


కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.

మాల్వీ

http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.

పుంగనూరు ఆవులు

http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.

వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 దేని ప్రత్యేకత దానిదే
గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని.

కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...


మన రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, కేరళలోని వేచూర్, కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.


పాల దిగుబడి స్థిరంగా ఉండదు

కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు, నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్, ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు. వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని ప్రదర్శిస్తాయి.

పనిలో దిట్ట
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.

మైసూర్ రాజుల కాలం నుంచి...

మైసూర్ రాజుల కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్ సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు) భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి.

దక్షిణాది ఆవులకు మాతృ జాతి

దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్‌ను మాతృ జాతిగా చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది. దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి కలిగి ఉంటుంది.

రవాణాకూ ఉపయోగపడతాయి

ఖిలారీ జాతి ఆవులు వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ, తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా ఉపయోగపడతాయి.

ప్రతికూల వాతావరణంలోనూ...

పొలం పనులకు, రవాణాకు కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు, మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు.

పాడికి పనికిరావు

తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది. పొట్ట చిన్నదిగా ఉంటుంది.

ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
 

Sunday, February 19, 2012

టూనా..A MILLION DOLLAR FISH




ప్రపంచంలోనే ఖరీదైన చేప 'టూనా'. మన దగ్గర దాన్ని 'తూర' అని పిలుస్తారు. టూనాలను చూస్తే జపనీయులు లొట్టలేస్తారు. అచ్చం వంజరంలా వుంటుంది. కొందరికి అదేమిటో కూడా తెలియదు కాబట్టి సింపుల్‌గా అద్భుతమైన చేప అని చెప్పాల్సి ఉంటుంది. దాని మాంసం మహాద్భుతం. అయితే విదేశాల్లోనే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ. మన టూనాలు జపాన్, అమెరికాలకే ఎగుమతి అవుతాయి. దీనివల్ల భారతదేశానికి ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ఇంత విలువైన టూనా ఎక్కడంటే అక్కడ దొరకదు. విశాఖపట్నం సముద్రతీరంలోనే ఎక్కువగా దొరుకుతోంది.

ఒక్కొక్కసారి అండమాన్, కేరళ, తమిళనాడుల్లోని కొన్నిచోట్ల మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే అంటే- నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది సముద్రంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆ సమయంలోనే జాలర్లు వాటిని వేటాడి పట్టుకుని సొమ్ము చేసుకుంటారు. టూనా నీటిలో ఈదే తీరు, వాటి సంచారం, వేటాడే పద్ధతి, మార్కెట్‌కు చేరవేసే ప్రక్రియ, విక్రయించే పద్ధతి అన్నీ ఆసక్తి కలిగిస్తాయి. జపాన్‌లో గత నెల ఐదవ తేదీన సుజుకీ అనే చేపల సంతలో టూనాలను వేలం వేస్తే- బ్లూఫిన్ అనే ఒక చేప 7.36 లక్షల డాలర్లు పలికింది. మన కరెన్సీలో చెప్పాలంటే...రూ.3.58 కోట్లు. ఖరీదులో టూనాతో సరితూగే చేప మరొకటి లేదు.


ఇది కొత్త జీవరాశి ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇదివరకు ఈ చేపను ప్రత్యేకంగా ఎవరూ వేటాడలేదు. అందుకే వెలుగులోకి రాలేదు. మన సముద్ర జలాల్లో దొరికే టూనాను విదేశీయులే ముందు పసిగట్టారు. వేటాడేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొన్నారు. సముద్రంలో చేపను పట్టి, అటు నుంచి అటే వాళ్ల దేశాలకు తీసుకెళ్లేవారు. దాదాపుగా ఇరవై ఏళ్లపాటు ఇలాగే జరిగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. విదేశీ ట్రాలర్లు వచ్చి మన చేపలను పట్టుకెళుతున్నారని కనిపెట్టిన తర్వాత భారత జాలర్లు దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అవి 'తూరలు' అని తేలింది. ఆ చేపల్ని విదేశీయులు 'టూనా' అని పిలుస్తారని, వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఉందని మనవాళ్లకు అర్థమైంది. కాని టూనా చేపల్ని ఎలా పట్టుకోవాలో తెలియలేదు. ఎందుకంటే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం.

అన్వేషణలో తగిలిన టూనా..

ఇదివరకు పాత పద్ధతులతోనే చేపల్ని పట్టేవారు. కొన్నేళ్ల కిందటి నుంచి సాంకేతిక పద్ధతుల్ని జోడించారు. అందులో 'ట్రాలింగ్' ఒకటి. ట్రాలర్‌కు ముందు రెండు ఆర్టర్ బోట్లు వుంటాయి. అవి సముద్రంలోపలికి వలలను వేసుకుంటూ ముందుకు వెళతాయి. ఆ వలలకు పిల్లలతో సహా రొయ్యలు, చేపలు చిక్కుతాయి. అయితే దీని వల్ల చేపలు బాగానే దొరుకుతున్నా మత్స్య సంపద మొత్తం నాశనమైపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆ విషయాన్నే మత్స్యకారులకు చెప్పారు. మరోవైపు నేలపై రొయ్యలసాగు విస్తరించింది. ఈ రంగం కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో.. మత్స్యకార సంఘం నాయకుడు వైజీకే మూర్తి సముద్రపు చేపలపై ప్రత్యేక అధ్యయనం చేశారు. విశాఖ సముద్ర తీరంలో టూనాలు పుష్కలంగా వున్నాయని, వాటికి ఎక్కడలేని డిమాండ్ ఉందని తెలుసుకున్నారు.

అప్పటికే తైవాన్ జాలర్లు టూనాలను పట్టి సొమ్ము చేసుకుంటున్నారు. టూనాల జాడ కనిపెట్టడం, పట్టుకోవడం, అమ్ముకోవడంలో మెళకువలను అధ్యయనం చేసేందుకు పన్నెండు దేశాలను చుట్టొచ్చారు మూర్తి. సాధారణ ట్రాలర్లతో వేటాడితే భారీ సంఖ్యలో టూనాలను పట్టుకోవడం కష్టమని తెలుసుకున్నారు. టూనాల వేటకు ప్రత్యేక 'లాంగ్‌లైనర్లు' తప్పనిసరని గుర్తించారు. విశాఖపట్నం జాలర్లతో ఆ విషయాన్నే చెప్పారు. జాలర్లకు శిక్షణ ఇప్పించేందుకు శ్రీలంక నుంచి 40 మంది నిపుణులను తీసుకొచ్చారు. అప్పట్లో కేంద్ర వాణిజ్య శాఖా మంత్రిగా వున్న జైరామ్ రమేష్ విషయం అర్థం చేసుకొని సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అలా మొదలైంది విశాఖలో టూనాల వేట.

ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది?

టూనా చేపలది చాలా చిత్రమైన జీవనశైలి. సాధారణ చేపల్లో వుండే 'ఫ్లోటింగ్ బ్లాడర్' దీనికి వుండదు. బ్లాడర్ లేకపోవడం వల్ల నీటిలో తేలేందుకు నిత్యం ఈదుతూ ఉండాల్సొస్తుంది. పొరపాటున ఈత ఆపిందనుకో ఆక్సిజన్ అందక చనిపోతుంది. అందుకే ఈ చేపకు విశ్రాంతి అనేదే ఉండదు. టూనా గంటకు 70కి.మీ. వేగంతో కదులుతుంది. ఒక మాటలో చెప్పాలంటే టూనా వలస జీవి. నిత్యం ఈదడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా వుంటుంది. వేడిని తగ్గించుకోవడానికి చల్లని ప్రాంతాల్లో సంచరిస్తుంది. సుమారు 26 డిగ్రీలు, అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత వున్న నీటిలోనే ఎక్కువగా సంచరిస్తుంది. సముద్రంలో గ్రీన్ ఆల్గేలు అధికంగా వుంటాయి. వాటిలో ఉన్న క్లోరోఫిల్ తినడానికి చిన్నిచిన్న చేపలు వాటి చుట్టూ చేరుతాయి. ఆ చిన్ని చేపలను భోంచేయడానికి టూనా ఆ ప్రదేశానికి వెళుతుంది. అంటే- గ్రీన్ ఆల్గేలు, చిన్నచేపలు, చల్లటి ప్రాంతం.. ఇవన్నీ ఎక్కడుంటే టూనా అక్కడ ఉంటుందని జాలర్లు తెలుసుకున్నారు. డాల్ఫిన్ చేపల్లా టూనా కూడా తెలివైన చేప. అది డాల్ఫిన్లతో సన్నిహితంగా మెలుగుతుంది. అందుకే టూనాలను పట్టుకునేందుకు డాల్ఫిన్లు కూడా ఒక ఆధారమయ్యాయి.

వేట కూడా సపరేటు...

ఏ చేపల్ని వేటాడాలన్నా.. వలలు తప్పనిసరి. అయితే టూనాలకు మామూలు వలలు పనికిరావు. రెండు నుంచి 80కిలోల దాకా బరువుండి, గంటకు 70కి.మీ. వేగంతో కదిలే టూనాల ధాటికి మామూలు వలలు తట్టుకోలేవు. ఒకవేళ వలకు చిక్కినా దాన్ని చించుకుని వెళ్లిపోతాయవి. అందుకని టూనాలను 'హుక్'లతో గేలం వేసి పట్టుకుంటారు. తైవాన్‌లో అయితే టూనాల వేటకు మరింత ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'లాంగ్ లైనర్' అనే ట్రాలర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రాలర్ ఖరీదు కోటి రూపాయలు.

టూనాలపై అధ్యయనం చేసిన వైజీకే మూర్తి ఈ లాంగ్‌లైనర్ల గురించి తెలుసుకున్నాక, వాటిని కొనేందుకు ప్రభుత్వ సాయం కోరారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) దానికి స్పందించి ముందుకొచ్చింది. అయితే కొత్తవి కొనడం కష్టం కాబట్టి అప్పటికే చేపలవేటకు వినియోగిస్తున్న ట్రాలర్లను లాంగ్‌లైనర్లుగా మార్చుకుంటే సాయం చేస్తామంది ఆ సంస్థ. ఆ మేరకు 20 మీటర్ల కంటే తక్కువ పొడవున్న ట్రాలర్ల కన్వర్షన్‌కు రూ.7.5 లక్షలు, అంతకంటే ఎక్కువ పొడవున్న ట్రాలర్లకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. ఇలా మొత్తం 20 ట్రాలర్లు జాలర్లకు అందాయి. వాటిని ఎంపెడా అధ్యక్షుడు మోహన్‌కుమార్ నేతృత్వంలో విశాఖపట్నంలో ప్రారంభించారు. దీంతో టూనాల వేట సులువైంది.

లాంగ్‌లైనర్ అంటే..?

టూనాల వేటకు ఉపయోగించే.. లాంగ్‌లైనర్‌కు అర్థం ఆ పేరులోనే వుంది. పొడవుగా, లైనుగా ఒక తాడును సముద్రంలోకి వేసి, వేలాడదీసిన ప్రత్యేకమైన హుక్కులను వాటికి అమరుస్తారు. పొడవాటి నైలాన్ తాడుకు పది మీటర్లకు ఒకటి చొప్పున ఈ హుక్కులుంటాయి. సముద్రంలో ఈ తాడును 200కి.మీ. పొడవు వరకు విడిచిపెడతారు. హుక్‌లు వంకీలు తిరిగి వుండడం వల్ల అది కూడా ఒక రకమైన సముద్రజీవి అనుకొని.. వాటిని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి టూనాలు. అలా నోటితో కొరకగానే హుక్కుకు చిక్కుకుపోతాయి. దాన్నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. కానీ తప్పించుకోలేవు. ఈ నైలాన్‌తాడును కొందరు జాలర్లు చేతితో ఉపయోగిస్తే, మరికొందరు హైడ్రాలిక్ సిస్టమ్‌తో వాడతారు. ఒక లాంగ్‌లైనర్‌కు పది అంతకంటే ఎక్కువ టూనాలు దొరికినప్పుడు ఆ నైలాన్ తాడును పట్టుకొని లాగడం చాలా కష్టం. ఒక్కో టూనా 20 కిలోలు తూగినా.. ఇరవై టూనాలు కలిస్తే 400కిలోల బరువుంటుంది. అంత బరువును లాగడం ఒకరిద్దరి వల్ల అయ్యే పనికాదు. అందుకని హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగిస్తారు.

రవాణా ప్రత్యేకం...

టూనాను పట్టుకోవడం ఎంత కష్టమో.. మార్కెట్‌కు చేరవేయడం అంతే కష్టం. చేప చర్మం గీసుకుపోకుండా, తాజాదనం తగ్గకుండా వుండే టూనాలకే అధిక ధర పలుకుతుంది. మొదటి రకం టూనాలను 'సష్మీ' గ్రేడ్ అంటారు. ఆ తరువాత రకాన్ని బి-గ్రేడ్‌గా వ్యహరిస్తారు. విదేశీ జాలర్లు టూనాలను పట్టుకున్న వెంటనే ఆ సమాచారాన్ని తమ కొనుగోలుదార్లకు తెలియజేసి, సముద్రం పైకే హెలికాప్టర్లను రప్పించుకుంటారు. నడిసముద్రంలోనే వాటిని జాగ్రత్తగా హెలికాప్టర్‌లోకి ఎక్కించి మార్కెట్‌కు తరలిస్తారు. మన దగ్గర ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు కాబట్టి మనకు దొరికిన వాటిని మిగిలిన చేపలతో పాటు కలిపేసి హార్బర్‌కు తరలించి.. బి- గ్రేడు సరకుగా అమ్ముతారు. ఇలా అమ్మితే జాలర్లకు పెద్దగా గిట్టుబాటు అవ్వదు. తాజా చేపకున్న రేటు ఆలస్యమయ్యేకొద్దీ తగ్గుతుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకునే టూనాలను జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు మన జాలర్లు.

ఎలాగంటే...?

సముద్రంలో టూనాను పట్టుకుంటూనే- 'స్టన్నర్' అనే పరికరంతో ఎల్రక్టిక్ షాక్ ఇస్తారు. దాంతో అది అచేతనంగా మారిపోతుంది. అప్పుడు బోటులోకి చేర్చి వెంట వెంటనే భద్రపరిచే చర్యలు చేపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌తో ఆపరేషన్‌లానే ఐసింగ్ చేస్తారు. ముందుగా తలపైన వుండే సాఫ్ట్‌స్పాట్‌లో రబ్బరు సుత్తితో ఒక దెబ్బ వేస్తారు. అక్కడ రంధ్రం వేసి లోపల వున్న మెదడు మొత్తం తీసేస్తారు. ఆ తరువాత మోనోఫిలమెంట్ లైన్ గాని, స్టీల్‌వైరు గాని స్పైన్‌లోకి పంపిస్తారు. అప్పుడు ఆ చేప న్యూరల్ డెత్‌కు గురవుతుంది. మొప్పల దగ్గరుండే యానస్ నుంచి పేగులు తీసేస్తారు. రక్తాన్ని కూడా లాగేస్తారు. ఎక్కడా చిన్న రక్తపుమరక లేకుండా చేపను శుభ్రపరుస్తారు.

ఇలా చేయడాన్ని గ్రిల్లింగ్ అండ్ గట్టింగ్ అంటారు. చేప శరీరంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు వున్నాయో వాటన్నిట్నీ ఐస్‌పౌడర్‌తో నింపేస్తారు. ప్రత్యేకంగా తయారుచేసిన 'స్లర్' అనే పెద్దతొట్టెలో ఐదు నుంచి ఏడు గంటలపాటు వుంచుతారు. కొద్దిసేపయ్యాక వేరే బాక్సుల్లో ఐసు లేయర్ల మధ్య భద్రపరుస్తారు. ఆ బాక్సుల్ని తీరానికి చేర్చి కొనుగోలుదార్లకు విక్రయిస్తారు. టూనా ఎంత భద్రంగా, తాజాగా వుంటే అంత మంచి ధర లభిస్తుంది. ఏమాత్రం డామేజీ వున్నా రేటు తగ్గిపోతుంది. ఈ పనులన్నీ లాంగ్ లైనర్లతో మాత్రమే చేయడానికి వీలవుతుంది. సాధారణ ట్రాలర్లు, బోట్లలో వెళ్లి టూనాలను వేటాడే జాలర్లకు ఇవన్నీ సాధ్యం కావు.

ఇద్దరే వ్యాపారులు..

విశాఖపట్నం కేంద్రంగా ఇద్దరంటే ఇద్దరే వ్యాపారులు వున్నారు. వారు చెప్పిందే వేదం. టూనాలు హార్బర్‌కు చేరగానే వారి వద్దకు చేరుస్తారు జాలర్లు. వ్యాపారుల దగ్గర ప్రత్యేక నైపుణ్యం కలిగిన గ్రేడర్లు వచ్చి టూనాలను వేరు చేస్తారు. ఇరవై కిలోల కంటే తక్కువ బరువున్నవన్నీ ఒక దగ్గర, అంతకంటే ఎక్కువ బరువున్నవి మరొక చోట చేరుస్తారు. ఆ తరువాత ఒక్కో చేపను పరిశీలిస్తారు. బియ్యం నాణ్యతను పరిశీలించడానికి చిన్నపాటి పరికరాన్ని బస్తాలోకి గుచ్చి ఎలా శాంపిల్ తీస్తారో... ఇక్కడ గ్రేడర్లు కూడా అలాగే చిన్న పరికరాన్ని టూనా శరీరంలోకి గుచ్చి చిన్న మాంసపుముక్కను బయటకు తీస్తారు. దాని రుచి, రంగు, నూనె పరిమాణం, చేప తాజాదనం నిర్ధారించి.. ధరను ఫిక్స్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చేపకు ఎందుకింత డిమాండ్ ఉందంటే వేటిలోనూ లేనంత స్థాయిలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి కనుక.

ధరలో దగా

ప్రస్తుతం విశాఖలో కిలో టూనా ధర రూ.130. అదే చేపను అమెరికా లేదా జపాన్ మార్కెట్లకు తీసుకెళితే రూ.400 వరకు వస్తుంది. కానీ జాలర్లకు సౌకర్యాలు అందుబాటులో లేవు. ఎంత వేగంగా అమ్ముకుంటే అంత ధర వస్తుందని తెలుసు కాబట్టి, త్వరగా విక్రయించాలనే చూస్తారు. మంచిరేటు వచ్చేవరకు ఎదురు చూడడానికి కుదరదు. కాలం గడిచే కొద్దీ నాణ్యత తగ్గిపోతుంది. ఇక్కడే దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువ వేట వచ్చిందని, రేటు పడిపోయిందని అబద్దాలు చెప్పి స్థానిక మత్స్యకారుల నుంచి తక్కువ ధరకు కొని లాభపడుతున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే.. టూనాలను ఎగుమతి చేసేవరకు నిల్వ చేసుకోవడానికి చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి.

దీని కోసం భారతీయ మత్స్యపరిశ్రమల సమాఖ్య తరఫున ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. విశాఖపట్నంలో వున్న హార్బర్‌లోనే కొంత స్థలం కేటాయిస్తే.. అక్కడ చిల్లింగ్ సెంటర్ పెట్టుకుంటామని జాలర్లు కోరుతున్నారు. అయితే ఏకంగా హార్బర్‌నే ఇంకో చోటుకు(భీమిలి సమీపాన మూలకుద్దు) తరలించే యోచన వుండడంతో విశాఖపట్నం పోర్టు వీరి అభ్యర్థనను పట్టించుకోవడం లేదు. స్థలం సమకూర్చుకుంటే... చిల్లింగ్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ఎంపెడా వంటి సంస్థలు అంగీకరించాయి. కానీ స్థలమే దొరకడం లేదు. చిల్లింగ్ సెంటర్ వుంటే.. టూనాలను వచ్చినవి వచ్చినట్టు నిల్వ చేసి, మంచి ధర వున్నప్పుడు మార్కెట్‌కు ఎగుమతి చేసుకునే సౌలభ్యం దొరుకుతుంది. ఇలా చేస్తే.. టూనా జాలర్లకే కాదు, దేశానికే సంపదవుతుంది.

అక్కరకు రాని 'ట్యాగింగ్'

టూనాలను పట్టుకునేందుకు విదేశాల్లో చురుకైన పరిశోధనలు సాగుతున్నాయి. టూనాల సంచారం, గమ్యం, ఏయే మార్గాల్లో వెళుతున్నాయో తెలుసుకోవడానికి 'ట్యాగింగ్ ప్రోగ్రాం' అమలు చేస్తున్నాయి. సముద్రంలో దొరికే పిల్ల టూనాలకు ఒక చిప్‌ను ట్యాగ్ సాయంతో కట్టి, దాని కదలికలను పసిగడతారు. ఎలాంటి వాతావరణంలోకి వెళుతున్నది, ఎంత లోతున సంచరిస్తున్నది తదితర వివరాలు సేకరిస్తారు. ఇటీవల జపాన్‌లో ఒక టూనాకు ట్యాగ్ కడితే... అది మూడు నెలల్లో పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నార్త్‌మెక్సికోలో జాలర్ల వలకు చిక్కింది. మనకూ అలాంటి ప్రోగ్రాం చేయాలని మత్స్యకార సంఘాల నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

టూనాలను ఎగరేసుకుపోతున్నారు

* కేంద్రంలో మత్స్యపరిశ్రమకు ప్రత్యేక శాఖ లేదు. దేశంలో అరవై లక్షలకు పైగా జాలర్లు వున్నా.. విదేశీ మారకద్రవ్యం భారీగా ఆర్జించే వీరి సంక్షేమానికి విధానాల రూపకల్పన అంతా వ్యవసాయ శాఖ కిందే జరుగుతోంది. దీన్ని మత్స్యకార సంఘాల నాయకులు నిరసిస్తున్నారు.
* కొందరు స్వార్థపరుల కారణంగా భారత సముద్రజలాల్లో చేపలను వేటాడేందుకు విదేశీ నౌకలకు అనుమతులు (లెటర్ ఆఫ్ పర్మిషన్- ఎల్ఓపీ) ఇస్తున్నారనేది జాలర్ల ప్రధాన వాదన. వారి అధునాతన ట్రాలర్లు సంపద మొత్తాన్ని కొల్లగొట్టుకుపోతున్నాయని, వారి ముందు తాము నిలువలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో మురారీ కమిటీ సిఫార్సు మేరకు 1996-2001 మధ్యన విదేశీ ట్రాలర్లను నిషేధించారు. అయినా వారు దొంగతనంగా వచ్చి టూనాలను వేటాడి తీసుకుపోయేవారు. ఇప్పుడు మళ్లీ వంద విదేశీ ట్రాలర్లకు అనుమతి ఇచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని ఐదువందలకు పైగా ట్రాలర్లను తెచ్చి.. విలువైన టూనాలను ఎగరేసుకుపోతున్నారు.
* టూనాలు ఎలాంటి వాతావరణంలో వుంటాయనేది తెలిసినా, కరెక్టుగా ఎక్కడ సంచరిస్తున్నాయో తెలిస్తే.. వాటిని వేటాడడం చాలా సులువు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఉపగ్రహ సాయంతో సేకరించిన సమాచారాన్ని విదేశీ నౌకలకు అమ్ముకుంటోంది. దాంతో వారు టూనాలను సులువుగా పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్ (ఇండియా నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్) చేపలవేటకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తోంది. టూనాలకు సంబంధించిన సమాచారం ప్రత్యేకంగా ఇవ్వాల్సి ఉంది.

ప్రత్యేక రాయితీ ఇవ్వాలి
-  వైజేకే మూర్తి, అధ్యక్షుడు, మత్స్యపరిశ్రమల సమాఖ్య
త్వరలో విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ విమానాలు నడపడానికి ముందుకు వస్తున్నందున, వాటి ద్వారా టూనాలను ఎగుమతి చేసుకోవడానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. అలాగే సముద్రంలో దొరికిన టూనాలను వెంటనే చిల్లింగ్ సెంటర్‌కు లేదంటే తీరానికి చేర్చడానికి మదర్‌బోట్లు రెండు మూడు మంజూరు చేయాలి. ఇవి సముద్రంలో తిరుగుతూ, ట్రాలర్లకు చిక్కిన టూనాలను వెంటవెంటనే ఒడ్డుకు చేర్చి మార్కెట్‌లో విక్రయించి, ఎక్కువ ధరను రాబట్టగలుగుతాయి.

మన సముద్రజలాల్లో ఎల్లోఫిన్ (మొప్పలు పసుపురంగులో వుంటాయి), బిగ్ ఐ (కళ్లు పెద్దవి వుంటాయి), స్కిప్‌జాక్ (చారలు వుంటాయి) అనే మూడు రకాలు దొరుకుతాయి. బ్లూఫిన్ అనే రకం అత్యంత విలువైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంతరించే పోయే దశలో వుంది. అందుకని వీటిని జపాన్, అమెరికా దేశాల్లో పెంచుతున్నారు. ఈ టూనా చేపలు మూడు మీటర్ల పొడవుండి 700కిలోల బరువుదాకా పెరుగుతాయి.
- ర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం 

Gouthamaraju as WUA