పాడి పంటలు

Showing posts with label Drip irrigation. Show all posts
Showing posts with label Drip irrigation. Show all posts

Sunday, April 15, 2012

బిందుసేద్యంతో చెరకు సాగు


 
 
 
 
 
 
 
 
 
 
 
వేసవి ఉష్ణోగ్రతలు చెరకు పైరు ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయి. ఎందుకంటే అత్యధిక-అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని, ఎండ తీవ్రతను, వడగాడ్పుల్ని చెరకు పైరు తట్టుకోలేదు. ముఖ్యంగా లేత తోటలు ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేసిన చెరకు తోటలు ప్రస్తుతం పిలకలు తొడిగి, పెరిగే దశలో ఉన్నాయి. ఈ నెల నుంచి జూన్ వరకూ ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. గాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందుసేద్య పద్ధతి ద్వారా భూమిలో తేమను కాపాడుకుంటూ, చెరకు పైరును రక్షించుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో...

బిందుసేద్యం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలోని చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు నాలుగు ఎకరాల్లో ఈ పైరును సాగు చేయొచ్చు. వేసవిలో రైతులు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న విష యం తెలిసిందే. రోజుకు ఆరేడు గంటలు మాత్ర మే కరెంట్ అందుబాటులో ఉంటోంది. అయితే బిందుసేద్య పద్ధతిని అనుసరించే రైతులు విద్యుత్ కోతల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఆ ఆరేడు గంటల సమయంలోనే కనీసం నాలుగైదు ఎకరాల తోటకు నీరు అందించవచ్చు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్న దిగులే అవసరం లేదు. ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడు ఆటోమేటిక్ పరికరం సాయంతో ఏ ఇబ్బందీ లేకుండా తోటకు నీరు అందించవచ్చు. పైగా నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా మనిషి అవసరం ఉండదు. మామూలు పద్ధతిలో రాత్రి సమయంలో తోటకు నీరు పెట్టేటప్పుడు పాములు, ఇతర విష పురుగుల వల్ల ప్రాణహాని ఉంటుంది. బిందుసేద్య పద్ధతిలో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు.


బిందుసేద్య పద్ధతి వల్ల ఒనగూడే మరో ప్రయోజనమేమంటే కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. తద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చు. భూమికి ఎక్కువ నీరు అందుతోందన్న ఆందోళన అవసరం లేదు. మొక్కలకు క్రమ పద్ధతిలో సరిపడినంత నీరు మాత్రమే అందుతుంది. పైగా తోట అంతటికీ సమానంగా అందుతుంది. భూమి చౌడు బార దు. ధాతు లోపాలు తలెత్తవు. మొక్కలు ఆరోగ్యవంతంగా, ఏపుగా, క్రమ పద్ధతిలో పెరుగుతాయి. చీడపీడల తాకిడి తగ్గుతుంది. దీనివల్ల నాణ్యమైన పంటను పొందవచ్చు. రస నాణ్యత కూడా బాగా ఉంటుంది. కూలీలు, సస్యరక్షణపై పెట్టే ఖర్చు కలిసొస్తుంది. దిగుబడి 40-50 శాతం పెరుగుతుంది. బిందుసేద్య పద్ధతిలో చెరకు తోటలో అంతర పంటలు కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. బిందుసేద్య పద్ధతి ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాల్ని మొక్కలకు సరైన మోతాదులో సమానంగా అందించవచ్చు. తద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలపై పెట్టే అనవసరపు ఖర్చును నియంత్రించుకోవచ్చు. ఇసుక నేలలు, గుట్టలు... అంటే ఎగుడు దిగుడుగా ఉండే భూముల్ని చదును చేయాల్సిన అవసరం లేకుండానే తోట వేసుకోవచ్చు. చదును చేయడానికి వీలులేని భూముల్లో కూడా బిందుసేద్యం ద్వారా చెరకు సాగు చేయవచ్చు.


ప్రోత్సాహం-దిగుబడులు

చెరకు సాగులో బిందుసేద్యాన్ని ప్రోత్సహిం చేందుకు పలు చక్కెర కర్మాగారాలు రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నాయి. దీనివల్ల బిందుసేద్యంపై చెరకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది రైతులు బిందుసేద్య పద్ధతిలో చెరకు సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మం డలం పోతవరం గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం మొక్క తోటలో ఎకరానికి సగటున 70 టన్నులు, పిలక తోటలో 69.4 టన్నుల దిగుబడి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దాసరి వెంకటాచలం ఎకరానికి సగటున 70 టన్నుల దిగుబడి పొందారు. వీరిద్దరూ ఇటీవలే ఉగాది పురస్కారాలు కూడా అందుకున్నారు.

బి.హనుమంతరెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్

అగ్రానమిస్ట్, రాజమండ్రి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

జంట సాళ్ల పద్ధతిలో చెరకు ముచ్చెలు నాటినట్లయితే లేటరల్ పైపుల అవసరం తక్కువగా ఉంటుంది. దీనివల్ల డ్రిప్పులపై పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. సాళ్ల మధ్య నాలుగు లేదా ఐదు అడుగుల దూరాన్ని పాటించిన వారు లేదా సాధారణ పద్ధతిలో (సాళ్ల మధ్య మూడు అడుగుల దూరం) ముచ్చెలు నాటిన వారు కూడా బిందుసేద్య పద్ధతిని అనుసరించవచ్చు. బావులు, చెరువులు వంటి నీటి వనరుల ద్వారా చెరకు సాగు చేసే వారు ప్రతి 15 రోజులకు ఒకసారి సిస్టమ్ ఫిల్టర్లను శుభ్రపరచుకోవాలి. ఫర్టిగేషన్ (పైపుల ద్వారా పైరుకు ఎరువులు అందించడం) తర్వాత 10 నిమిషాల పాటు లేటరల్ పైపుల ద్వారా మంచినీటిని పారించాలి. పంటను కోసిన తర్వాత యాసిడ్ (33%) ట్రీట్‌మెంట్‌తో పైపుల్ని శుభ్రపరచాలి. మొక్కల దగ్గర పీడనాన్ని పరీక్షించాలి.

Wednesday, July 6, 2011

కంటికి రెప్పలా చూసుకుంటేనే డ్రిప్పు పదిలం

అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు ఎక్కువ నీటిని అందించాలన్న అభిప్రాయం చాలా మంది రైతుల్లో ఉంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పైర్లకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో నీరు అందించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. దీనికి సూక్ష్మ సాగు నీటి విధానం (మైక్రో ఇరిగేషన్) ఎంతగానో ఉపయోగపడుతుంది. సూక్ష్మ సాగు నీటి విధానంలో రెండు పద్ధతులున్నారుు.

అవి 1.బిందు సేద్యం 2.తుంపర్ల సేద్యం. బిందు సేద్యానికి (డ్రిప్ ఇరిగేషన్) అవసరమైన పరికరాల్ని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల పథకం (ఏపీఎంఐపీ) ద్వారా ప్రభుత్వం 90 శాతం రాయితీతో అందిస్తోంది. అయితే రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వీటిని సమర్థవంతంగా వినియోగించుకోలేక పోతున్నారు. పరికరాలు దీర్ఘకాలం ఉపయోగపడాలంటే వాటిని సరైన రీతిలో సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యం లో డ్రిప్ పరికరాల నిర్వహణ, సంరక్షణకు సంబంధించి నల్గొండ ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ సహాయ అధికారి బాబు ‘న్యూస్‌లైన్’కు పలు విషయాలు తెలియ జేశారు. ఆ వివరాలు...

శాండ్ ఫిల్టర్‌ను ఇలా శుభ్రపరచాలి...
బావి నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు శాండ్ ఫిల్టర్‌ను అమరుస్తారు. ఇందులో ప్రత్యేకమైన ఇసుక ఉంటుంది. బావి నీటిని అందులోకి పంపించినప్పుడు నీటిలో ఏమైనా చెత్త, ఇతర వులినాలు ఉంటే అవి ఇసుకలోకి చేరి శుభ్రమైన నీరు మాత్రమే పైపుల ద్వారా మొక్కలకు అందుతుంది. ఇసుకలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించనట్లయితే నీటి ఒత్తిడి (ప్రెషర్) తగ్గుతుంది. అందువల్ల బిందు సేద్యానికి గుండె లాంటి శాండ్ ఫిల్టర్‌ను ప్రతి వారం శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఇసుకను చేతితో కలుపుతూ చెత్తను బయట పడేయాలి.

స్క్రీన్ ఫిల్టర్‌ను కూడా...
బోరు నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు స్క్రీన్ ఫిల్టర్‌ను అమరుస్తారు. దీనిని ప్రతి రోజూ శుభ్రం చేయాలి. స్క్రీన్ ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఫిల్టర్ ఎలిమెంట్‌ను, సూక్ష్మ రంధ్రాలు ఉన్న స్టీల్ జాలీని శుభ్రపరచాలి. నీటి ధార కింద జాలీని ఉంచి మెత్తని బ్రష్‌తో రుద్దాలి.

పైపును ఎలా శుభ్రం చేయాలంటే...
శాండ్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ ఉన్నప్పటికీ సన్నని మట్టి కణాలు, ఇతర సేంద్రియ పదార్థాలు సబ్ మెయిన్ పీవీసీ పైపు వరకూ వస్తాయి. అక్కడి నుండి లాటరల్ ఇన్ లైన్ దిశగా వెళతాయి. వీటిని తొలగించడానికి సబ్ మెయిన్ పీవీసీ పైపు చివరి భాగంలో ఉండే ఫ్లష్ వాల్వ్‌లను వారానికో రోజు తెరవాలి. లోపల పేరుకున్న చెత్త, వులినాలు నీటి ప్రవాహంతో పాటు బయటికి వస్తారుు.

లాటరల్స్ మూసుకుపోతాయి...జాగ్రత్త
ట్యూబ్ లాటరల్స్‌ను శుభ్రం చేయకపోతే డ్రిప్పర్ల రంధ్రాల్లో మలినాలు పేరుకొని మూసుకుపోతాయి. లాటరల్స్‌ను శుభ్రం చేయడానికి పైపు చివర ఎండ్ క్యాప్ ఉంటుంది. దీనిని వారం లేదా 15 రోజులకు ఒకసారి తెరిచి పంపు ద్వారా పూర్తి ప్రెషర్ తో నీటిని లోపలికి పంపాలి. నీటి ప్రవాహం వేగంగా ఉంటే లాటరల్స్‌లో ఉన్న చెత్త నీటితో పాటే బయటికి వస్తుంది. వర్షాకాలంలో డ్రిప్ పరికరాలను పెద్దగా ఉపయోగించరు కనుక పైపులో సాలీళ్లు గూడు కట్టుకుంటాయి. అందువల్ల డ్రిప్‌ను తిరిగి వాడేటప్పుడు ముందుగా నీటిని పూర్తి ప్రవాహ వేగంతో వదలాలి.

ఇలా వాడుకోండి...
మోటారు ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ దగ్గర ఉన్న ప్రెషర్ గేజ్ సరిగా పని చేస్తున్నదో లేదో పరిశీలించాలి. గేజ్ మీటర్ పైన పాలిథిన్ కవర్ తొడగాలి. గేజ్‌లోని సూచిక పని చేయకపోతే నెమ్మదిగా తీసి సరి చేయాలి. నీటి వేగం సెకనుకు 1.5 మీటర్లు ఉంటేనే లాటరల్ పైపుకు నీరు అందుతుంది. మోటారు పంపు ఫుట్ వాల్వ్ దగ్గర వాచర్ పాడైనప్పుడు రైతులు అవగాహన లేక పేడ నీళ్లు ఉపయోగిస్తారు.

దీని వల్ల మోటారు ఆన్ చేసేటప్పుడు పేడ నీరు ఫిల్టర్‌లోకి చేరి దానిపై భారం పడుతుంది. దీనిని నివారించేందుకు బైపాస్ ద్వారా మురుగు నీటిని బయటికి పంపాలి. శాండ్ ఫిల్టర్‌లో తప్పనిసరిగా నాలుగింట మూడు వంతులు ఇసుక ఉండాలి. డ్రిప్పర్లను శుభ్రం చేయడానికి వాటిని లాటరల్ నుండి బయటికి తీయకూడదు. తెరిచి శుభ్రం చేయాలి. లాటరల్ నుండి డ్రిప్పర్లను బయటికి తీస్తే కన్నాలు పెద్దవై లీకేజీలు మొదలవుతాయి. ఉడతలు, ఎలుకల వంటివి లాటరల్స్‌కు నష్టం కలిగిస్తుంటే లాటరల్స్‌ను నేలలో మూడు నాలుగు అంగుళాల లోతుకు పరిచి మట్టి కప్పాలి.

డ్రిప్పర్లు పైకి ఉండేలా చూసుకోవాలి. నీటి కోసం పక్షులు లాటరల్స్‌ను కొరకకుండా అక్కడక్కడా నీటిని అందుబాటులో ఉంచాలి. డ్రిప్పర్ల చుట్టూ ఎంత మేరకు భూమి తడుస్తోందో తెలుసుకునేందుకు తరచుగా నేలను తవ్వి పరిశీలించాలి. లవణాలు, చెత్త పేరుకుపోయి డ్రిప్పర్లు మూసుకుపోతే ప్రతి ఆరు నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్‌మెంట్ చేయాలి. వర్షాకాలంలో కూడా రోజూ కనీసం అరగంట పాటు మోటారు ఆన్ చేసి పరికరాలు పని చేసేలా చూసుకోవాలి.

ఏం చేయకూడదు?
డ్రిప్ పరికరాల్ని వాడాల్సిన అవసరం లేనప్పుడు వాటిని అలాగే తోటలో వదిలెయ్యకూడదు. చుట్టలుగా చుట్టి భద్రపరచుకోవాలి. పైపుల్ని అలాగే ఉంచి చేలో చెత్తను కాల్చకూడదు. యాసిడ్ ద్రావణం తయారు చేసేందుకు యాసిడ్‌ను నీటిలో పోయాలే తప్ప నీటిని యాసిడ్‌లో పోయకూడదు. ఫిల్టర్‌లో జాలీ లేకుండా పరికరాల్ని పని చేయించకూడదు. ఫిల్టర్‌లోని జాలీని శుభ్రం చేయడానికి పదునైన వస్తువులు, పుల్లలు, ఇనుప బ్రష్‌లు వాడకూడదు. లాటరల్ పైపును బలంగా లాగకూడదు. డ్రిప్ పరికరాల ద్వారా అవసరమైన మేరకే చెట్లకు నీరు అందించాలి. అవసరానికి మించి ఎక్కువగా నీరు పెడితే పల్లాకు తెగులు వచ్చే ప్రమాదం ఉంది.

Gouthamaraju as WUA