పాడి పంటలు

Showing posts with label పప్పు ధాన్యాలు. Show all posts
Showing posts with label పప్పు ధాన్యాలు. Show all posts

Tuesday, December 14, 2010

తిండి తిప్పలు * పండిద్దునా... కొనుక్కుందునా ?

ఆహారం పండిద్దునా .........
లేక కొనుక్కుందునా?
మా ఊరయిన చిత్తూరు జిల్లా వెంకటాపురంలో రైతులు ఈ విధంగా మాట్లాడుకుంటారు... "మా కుటుంబ అవసరాలకు ఏటా ఎన్ని వేరుశనగలు కావాలి... మహా అయితే ఒక గోతాము చట్నీకి, రెండు మూడు గోతాలు వంట నూనెకి. దానికోసం ఇంత కష్టపడి పండించడం ఎందుకు? సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టాలి మన వద్ద లేకపోతే వడ్డీకి అప్పు చెయ్యాలి. పొలంలో పని చేయడానికి కూలి వాళ్లు దొరకాలి. అంతా చేసి పంట చేతికి వచ్చేనాటికి ధరలు పడిపోవచ్చు. అదే జరిగితే మిగిలేది అప్పులే. అందుకే దాని బదులు పొలాన్ని మామిడి తోట కిందకు మార్చేసి మనకి కావాల్సిన వేరుశనగల్ని కొనుక్కుంటే నయం కాదా?''

ఇదే రకమైన వాదన మిరప, కూరగాయలు, పాల విషయంలో కూడా వినపడుతుంది. ఎన్ని మిరపకాయలు కావాలి? ఐదు కిలోలో, పది కిలోలో. దాని కోసం పండించే బదులు కొనుక్కుంటే సరిపోతుంది. పాలెన్ని కావాలి? రోజుకి అర లీటరో లీటరో. టీకి, పెరుగుకి లేదా మజ్జిగకి. దాని కోసం ఆవుల్ని పెంచడం, గడ్డి కోసుకొచ్చి వేయడం, వాటికి దాణా కోసం వేరుశనగ చెక్కను కొనడం, అవి జబ్బు పడితే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లడం... ఎందుకీ గోలంతా? ఇదే విధంగా కూరగాయలు... దుక్కి దున్నాలి, సాళ్లు తోలాలి. క్రమం తప్పకుండా నీరు పెట్టుకోవాలి, కలుపు తీస్తుండాలి, పురుగు మందులు కొట్టాలి, ముదరక ముందే కాయలు కోసి మార్కెట్టుకు పంపాలి. ఇంత కష్టపడితే గిట్టుబాటు ధర రాకపోవచ్చు... ఎందుకొచ్చిన తలనొప్పి.

కొనుక్కుంటే సరిపోతుంది. కూరల ధరలు ఎక్కువుంటే ఆకు కూరలతో సరిపెట్టుకోవచ్చు. అవీ లేకపోతే మునగాకుతో ముగించవచ్చు. లేదా చింతపులుసు, చట్నీ, రసంతో కానిచ్చేయొచ్చు. ఇలా ఆలోచించడం వల్లే రైతులు వర్షాధార పంటలు, ముఖ్యంగా మెట్ట పంటలైన తృణ ధాన్యాలు, పప్పు గింజలు, నూనె గింజలు, కూరగాయలు పండించడానికి ముందుకు రావడం లేదు. పశువుల పెంపకం పట్ల వారికి ఆసక్తి మరీ తగ్గిపోతోంది. పంట భూములన్నిటిని తోటల కిందకు మార్చేసి హాయిగా సేద తీరుతున్నారు. మా ఊళ్లో అయితే ఇంతకు ముందు వేరుశనగలు, పప్పులు, నూనె గింజలు పండిన నేలల్లో ఇప్పుడు మామిడి పండ్లు పండుతున్నాయి. మరి పప్పు, ధాన్యం బదులు రోజూ మామిడి పండ్లనే తినగలమా? పంటభూమి ఉన్న రైతులంతా ఇట్లాగే ఆలోచిస్తే ఆహార పంటలనెవరు పండిస్తారు? ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటే అంటవా మరి? కాని రైతులిట్లా ఎందుకు చేస్తున్నారు?

సాగు ఖర్చులు పెరుగుతున్నాయి, చేతికొచ్చే డబ్బులు తగ్గుతున్నాయి. పంట ఉంటే ధర ఉండదు.. ధర ఉంటే పంట ఉండదు. ఏడాది కేడాదికి పెరుగుతున్న నష్టాలను చూసి రైతులు ఆ పంటలకి దణ్ణం పెడుతున్నారు. కొబ్బరి తోటల విషయంలో నా సొంత అనుభవమే చెపుతాను. గత ఇరవై సంవత్సరాల నుంచీ వాటి ధర ఒక్కో కాయకి రూ. 2 నుండి రూ. 3 పలుకుతోంది. అంతకు మించి ఒక్క పైసా పెరగలేదు. అందుకే చిత్తూరు జిల్లాలో కొబ్బరి రైతులు చెట్లు కొట్టేసే యోచనలో ఉన్నారు. ఆ పంటకేమో ఎక్కువ నీళ్లు కావాలి. నీటి మట్టమేమో తగ్గుతూ పోతోంది. అదే విధంగా ఇరవై ఏళ్లలో పాల ధర లీటరు రూ4 నుండి రూ16కి పెరిగింది. అయితే మేతగా వాడే వేరుశనగ చెక్క ధర అదే కాలంలో కిలోకి రూ4 నుండి రూ26కు పెరిగింది.

వరికి, గోధుమకు తప్పించి మిగతా వేటికీ ఖచ్చితమైన మద్దతు ధర లభించట్లేదు. ప్రతి సంవత్సరం రైతు మొదట్లో రుతుపవనాలతోను చివర్లో మార్కెట్టుతోను జూదమాడినట్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎందుకు చేయాలి? ఈ మధ్యన కొత్త అంశం వచ్చి చేరింది. పోయిన దశకంలో గ్రామాలలో మూడు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే... డ్వాక్రా, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయ రోజ్‌గార్ యోజన. డ్వాక్రా పుణ్యమా అని భూమి లేని మహిళా రైతులకు రుణ సదుపాయం లభిస్తోంది. దాంతో పశువుల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలతో వారికి బతుకుతెరువు దొరుకుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పుణ్యమా అని దారిద్య్రరేఖకి దిగువనున్న కుటుంబాలకు పదిరోజులకు సరిపడా ధాన్యం రెండురూపాయలకు కేజీ చొప్పున లభిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పుణ్యమా అని పనివాళ్ల జేబుల్లో డబ్బు కదలాడుతున్నది.

దాంతో వ్యవసాయం పట్ల, పని పట్ల వారి ఆలోచనలు అభిప్రాయాలు మారిపోయాయి. వారమంతా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పనికి వెళ్లని రోజు తమ సొంత పని చేసుకుంటున్నారు. అది వారి స్వీయ ఉపాధి వ్యాపారం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాల్లో కూలి రేట్లు పెరిగి వ్యవసాయం ఖర్చు పెరిగిపోయింది. దీని వల్ల ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూలీల వలస కొంతమేర తగ్గిపోయిందేమో కాని, గ్రామాల నుండి పట్టణాలకి వలస మాత్రం తగ్గలేదు. ఎందుకంటే పట్టణాల్లో కూలి ఎక్కువగా లభిస్తుంది కనుక.

ఈ రకంగా నిరంతరాయంగా పట్టణాలకు వలస వెళ్లటం మూలాన గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడుతున్నది. మా గ్రామాల్లో ఈ సీజనల్ వలసలు శాశ్వత వలసలకు దారి తీశాయి. ఉపాధి హామీ పథకం చాలా వరకు లోపభూయిష్టంగా ఉంటుంది. నిర్వహణలో చాలా అవినీతి చోటు చేసుకుంటుంది. దీనివల్ల నష్టపోయే వాళ్లూ, లాభపడేవాళ్లు కూడా వ్యవసాయ కూలీలే. ఎలాగంటే... ఇందులోని మస్టర్ రోల్స్ (కూలీల వివరాలు) అన్నీ ఉత్తుత్తివే. పని చేసిన వాళ్లకంటే ఎక్కువమందిని చూపించి ఆ డబ్బు తీసుకోవడం సాధారణం. పని కొలతలు కూడా ఉత్తుత్తివే. అసలు జరిగిన దానికంటే ఎక్కువ పని జరిగినట్టుగా చూపించటం మామూలయిపోయింది. కూలీలకు కూడా ఇదంతా అలవాటైపోయింది. దీనివల్ల ఒక రైతు పర్యవేక్షణలో పని చేయటానికి వాళ్లు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం ఇచ్చినంత వేతనం రైతు కూడా ఇవ్వాలనుకుంటున్నారు వాళ్లు. ఫలితంగా కూలీ రేట్లు రైతులకు మోయలేని భారమయ్యాయి. దీని ప్రభావం వారిపై ఎలా ఉందో వచ్చేవారం తెలుసుకుందాం.

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Saturday, December 4, 2010

తిండి తిప్పలు * అన్నం తిందామా ..... సున్నం తిందామా.... ?

ఆహార ధరలు ఆకాశాన్నంటితే మనలో మనకే ఒక అనుమానం వస్తుంది. అన్నం తిందామా లేక సున్నం తిందామా అని. 1970ల తర్వాత ఆహార ధాన్యాల ధర ఇంతగా పెరగటం ఎప్పుడూ లేదు. ముఖ్యంగా గత రెండేళ్లలో.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాధారణ ధరల సూచీ (జనరల్ ప్రైస్ ఇండెక్స్) తక్కువగానే ఉన్నా, ద్రవ్యోల్బణం సైతం 1-2 శాతం మాత్రమే ఉన్నా ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 20 శాతం పెరిగినట్టు పోయిన ఏడాది ఆర్ధిక నివేదికలు చెపుతున్నాయి (బిజినెస్‌లైన్ 23, ఫిబ్రవరి 2010. సి. పి. చంద్రశేఖర్, జయతి ఘోష్).
ఆహార ధరలు పెరగటం ఇండియాలో మరీ కొత్తేమీ కాదు. కాని నాకు బాగా గుర్తు- గతంలో తిండిగింజల ధరలు పెరిగినప్పుడు ఒకటో రెండో నిరసనలు వినపడేవి. సామాజిక స్ఫూర్తి కలిగిన ప్రమీల దండావతే లాంటి వాళ్ల నిరసనలో లేదా వర్షాలు వచ్చో ధరలను తాత్కలికంగానైనా తగ్గించేవి. తరువాత షరామామూలే. కాని ప్రస్తుతం ధరలు ఏమాత్రం తగ్గేట్టుగా కనపడటం లేదు. అవి అలాగే నిలిచిపోయేలా ఉన్నాయి. నేనుండే కుగ్రామం వెంకట్రామపురంలో కూడా కూరగాయల ధరలు కిలో రూ.20-30 పలుకుతున్నాయి. వరి, గోధుమలు గవర్నమెంటు గోడౌన్లలో నిండి ఉన్నా కూడా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇట్లా ధరలు పెరగటానికి కారణం గోడౌన్ల లోని ధాన్యం ప్రజలకి చేరవేయడంలో ప్రభుత్వం విఫలమవ్వటమే ననిపిస్తుంది.

రెండేళ్ల క్రితం పెసరపప్పు ధర కిలో రూ.37 ఉండగా ప్రస్తుతం అది రూ. 88. ఈ రెండేళ్లలో కందిపప్పు ధర 71 శాతం పెరిగింది. 2008లో మినప్పప్పు ధర కిలో రూ. 40 ఉండగా ఇప్పుడు రూ.80 కి చేరింది. పంచదార ధర కూడా అంతే, 2008లో కిలో రూ. 17 కు లభిస్తే ఇప్పుడు రూ.38 కి చేరింది. పాలు కూడా ప్రియమైపోతున్నాయి. పాల ధరలు 21 శాతం పెరిగిపోయాయి. కూరగాయల ధరలు 4 శాతం, పండ్ల ధర 13 శాతం పెరిగాయి (ఇండియాటుడే 23 ఆగస్టు 2010).

ఇప్పుడు చెప్పండి... అన్నం తిందామా లేక సున్నం తిందామా? సున్నమే చవకేమో. ఆహార ధాన్యాల ధరలు ఇలా పెరగటానికి కారణాలేమిటి? చమురు ధరలు పెరగటమే ఆహార ధాన్యాల ధరలు పెరగటానికి ప్రధాన కారణంగా చూపుతుంది ప్రభుత్వం. నిజమే, పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు ఆహారధరలకు ఆజ్యం పోసినట్లయింది. కాని ఆహార ధరల పెరుగుదల ఇంకా అనేక మౌలిక అంశాలతో ముడిపడి ఉన్నది. మొదటిది ఆహార ధాన్యాల దిగుబడి తగ్గడం.. అందునా పప్పులు, నూనెగింజల పంటల దిగుబడి తగ్గటం. వాటిని విదేశాల నుండి దిగుమతి చేసుకోవటం ద్వారా కొరతను తగ్గించారు. అయితే వరి, గోధుమ పంటల దిగుబడి కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు పెరగట్లేదు. నిజానికి స్వాతంత్య్రం వచ్చాక మన తలసరి ధాన్యాల లభ్యత తగ్గింది. ఎందుకు? ఎందుకంటే జనాభా పెరుగుతున్నదే కాని వ్యవసాయ భూమి విస్తరణలో గాని సగటు ఎకరా దిగుబడిలో గాని పెరుగుదల లేదు.

గత 15 ఏళ్లలో సాగులోకి వచ్చిన భూమిని ఒక్కసారి గమనిస్తే... 1995-96లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం సాగుభూమి సుమారు 100 లక్షల హెక్టార్లు. అందులో నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి 36-46 లక్షల హెక్టార్లు. ఒకటి కంటే ఎక్కువ పంటలు పండే భూమి ఈ పదిహేనేళ్లలో 40 నుంచి 60 శాతానికి పెరిగింది. అంటే ఓ పక్క నీటిపారుదలపైఆధారపడే సాగు పెరుగుతోంది. దాంతోపాటు వ్యవసాయం చేయకుండా పడావ్ (బీడు) పెట్టిన భూమీ పెరుగుతోంది. 1955-56లో 7లక్షల హెక్టార్లున్న పడావ్ భూమి 2000-01లో 14 లక్షల హెక్టార్లకు, 2008-09 నాటికి 26 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇంతకూ ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయి?

రైతులు చెప్పేదేమిటంటే నీళ్లుంటేనే పంటలకు భరోసా ఉంటుంది. కాబట్టి రైతులు నీటిపారుదల వ్యవసాయాన్నే చేస్తామంటున్నారు. నీటిపారుదల సౌకర్యం లేని, వర్షాధారిత భూముల్లో వ్యవసాయం చేయటం వల్ల రాబడి పెద్దగా ఉండడం లేదు కాబట్టి ఆ భూములను వదిలేస్తున్నారు. ఫలితంగా బీడు భూములు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్లయితే ఈ బీళ్లను తోటల కిందకు మార్చేస్తున్నారు. వాటిలో మామిడి (టెక్నికల్‌గా ఆహార పంటే అయినా ఇవి సంవత్సరానికి ఒకేసారి, అదీ కొన్ని రోజులు మాత్రమే కాస్తాయి కదా. దీని బదులు పప్పులు, నూనెగింజలు కనక వేసినట్లయితే సంవత్సరమంతా తినొచ్చు), జీడి మామిడి, కొబ్బరి, సుబాబుల్, యూకలిప్టస్ మొదలైన తోటలు పెంచుతున్నారు. ఒకసారి చెట్లను పెంచాక ఇక ఆ భూముల్లో మరేరకమైన ధాన్యాలను కానీ, చిరుధాన్యాలను కానీ, పప్పుధాన్యాలను కానీ, నూనె గింజలను కానీ, మరే ఇతర రోజువారీ పంటలను కానీ పండించడానికి వీలు కాదు. ప్రభుత్వం కూడా ఈ రకమైన 'క్యాష్ క్రాప్స్'నే పండించమని రైతుల్ని ప్రోత్సహిస్తోంది. ఆహార పంటల సాగుతో పోలిస్తే పత్తి లాంటి వ్యాపార పంటలు, మామిడి, సుబాబుల్ లాంటి తోటలు పెంచడంలో ఎటువంటి చికాకులు, తలనొప్పులు ఉండవు. అందుకే రైతులు ఆ పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.  
దీనంతటి ఫలితమే ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల.


- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Gouthamaraju as WUA