గోదావరి, కృష్ణా లంక భూముల్లోనే కాకుండా కందను కోస్తాలోని కొబ్బరి తోటల్లో కూడా అంతర పంటగా సాగు చేసే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో కొబ్బరి దిగుబడులు తగ్గిన నేపథ్యంలో పలువురు రైతులు అంతర పంటలు సాగు చేస్తున్నారు. కొబ్బరిలో అంతర పంటగా అరటి తర్వాత కంద ఎక్కువగా సాగవుతోంది. నదీ పరీవాహక లంక భూముల్లో కంద సాగు అధికంగా జరుగుతోంది. అయితే తెగుళ్లు ఎక్కువగా సోకే కంద అత్యంత సున్నితమైన పంట.
సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం, పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం వల్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సొంత విత్తనాన్ని తయారు చేసుకుంటే కందలో అధిక దిగుబడులు సాధించవచ్చునని కొత్తపేట మండలం వాడపాలానికి చెందిన పెదపూడి శ్రీనివాస్, బాపిరాజు నిరూపించారు. తండ్రి నుండి వ్యవసాయాన్ని వారసత్వంగా తీసుకున్న ఈ సోదరులు కంద సాగులో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. 2008లో వీరి తోటలో ఓ కంద దుంప ఏకంగా 16.60 కిలోల బరువు తూగి వ్యవసాయాధికారులను సైతం విస్మయపరచింది. ఈ నేపథ్యంలో సొంత విత్తన దుంపల తయారీపై వారు ఏమంటున్నారంటే...
సొంత విత్తనంపైనే నమ్మకం
కంద సాగులో రైతులు విజయం సాధించాలంటే సొంత విత్తన సేకరణ చాలా ముఖ్యం. విత్తనం కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అంతే కాకుండా విత్తనంలో నాణ్యత లోపిస్తే పంట దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇతర రైతుల వద్ద కొనుగోలు చేస్తే ఎకరం విస్తీర్ణంలో కంద సాగుకు లక్ష రూపాయల వరకూ ఖర్చవుతుంది. పైగా రవాణాలో విత్తనాలు నలిగి మొలక శాతం దెబ్బ తినవచ్చు. అందువల్ల సొంత విత్తనాన్ని వాడడమే మేలు.
సేకరణలో జాగ్రత్తలు
కందను భూమి నుండి సేకరించేటప్పుడు దుంపకు దెబ్బ తగలకుండా చూడాలి. విత్తనానికి ఎంపిక చేసే దుంప పావు కిలో నుండి కిలో వరకూ బరువు ఉంటుంది. అంతకంటే ఎక్కువ బరువున్న దుంపను సేకరించవచ్చు కానీ కిలో కంటే తక్కువ బరువున్న దుంపల్ని వాడితేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది.
సేకరించిన దుంపల్ని పక్కపక్కనే పేర్చి రెండు నెలల పాటు నీడలో ఆరబెట్టాలి. గాలి తగిలేలా చూడాలి. ఆరుబయట ఉంచాల్సి వస్తే పందిళ్లు వేసి ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తగిలే చోట దుంపల్ని ఉంచితే అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ప్రతి 20 రోజులకు ఒకసారి దుంపల్ని అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి. ఎకరం విస్తీర్ణంలో కంద సాగుకు సుమారు 7,500 కిలోల దుంపలు అవసరమవుతాయి.
ఎలా నాటాలి?
పంట సాగు చేసే ముందు ఎకరానికి 20 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా గోతులు తీసి అడుగు లోతున విత్తన దుంపల్ని నాటాలి. పావు కిలో కంటే తక్కువ బరువు ఉంటే ఒకే దుంపగానూ, అర కిలో బరువు ఉంటే రెండు ముక్కలుగానూ, కిలో బరువు ఉంటే నాలుగు ముక్కలుగానూ చేసి నాటుకోవాలి.
కోసే ముక్కల్లో మొలక వచ్చే కన్ను భాగం ఉండేలా చూసుకోవాలి. విత్తన దుంపల్ని కోయడానికి కత్తిపీట వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కోసిన ముక్కల్ని నిల్వ ఉంచకుండా వెంటనే నాటాలి. ఎకరానికి తొమ్మిది వేల దుంపల వరకూ నాటుకోవచ్చు. కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయాల్సి వస్తే కొబ్బరి చెట్టు చుట్టూ మూడు అడుగుల దూరం వదిలి ఎకరానికి ఏడు వేల దుంపలు నాటుకోవాలి. దుంప బొడుపు పైకి ఉండేలా నాటే కంటే ఏదో ఒక పక్కకు ఉండేలా పాతితే మొక్క వేగంగా, దృఢంగా ఎదుగుతుంది. మొక్కలు మొలిచే సమయంలో ఎకరానికి రెండు బస్తాల యూరియా వేయాలి.
తెగుళ్లతో జాగ్రత్త
కంద అత్యంత సున్నితమైన పంట కనుక తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువ. ఇనుము-జింక్ ధాతు లోపాలు ఏర్పడతాయి. ఆకుమచ్చ, కాండం కుళ్లు, మొదలు కుళ్లు, మెజాయిక్ వంటి తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి. వ్యవసాయాధికారుల సూచనల మేరకు సకాలంలో మందులు పిచికారీ చేయాలి. చేలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా మురుగు నీటి పారుదల కోసం కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అంతా సవ్యంగా ఉంటే ఎకరానికి 20 వేల కిలోల దిగుబడి వస్తుంది. పాతిక వేల కిలోల దిగుబడి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 250 కిలోలకు మూడు వేల రూపాయల ధర పలుకుతోంది. అంటే 20 టన్నుల కందకు 2.40 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది.
అప్రమత్తత అవసరం
ఒకసారి కంద సాగు చేసిన భూమిలో రెండేళ్ల పాటు తిరిగి అదే పంట వేయడం మంచిది కాదు. తెగుళ్లకు కారణమయ్యే శిలీంధ్రాల అవశేషాలు భూమిలోనే ఉంటాయి కనుక మళ్లీ కందనే సాగు చేస్తే పంట దెబ్బ తినవచ్చు. కందను సాగు చేసిన భూమిలో రెండేళ్ల పాటు అరటి వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మేము అరటిలో కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి రకాలు వేస్తున్నాం. కంద సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం వల్ల మంచి దిగుబడులు వస్తున్నాయి. వాతావరణం కూడా అనుకూలిస్తే ఆదాయం ఇంకా బాగుంటుంది. ఏదేమైనా కంద సాగు చేసే రైతులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
బొజ్జా గౌతం
ఉద్యాన పరిశోధనా స్థానం అధిపతి, అంబాజీపేట
ఉద్యాన పరిశోధనా స్థానం అధిపతి, అంబాజీపేట
No comments:
Post a Comment