పాడి పంటలు

Thursday, December 30, 2010

ఆశలు కృష్ణార్పణం * కర్ణాటక, మహారాష్ట్ర వాదనలకే ట్రిబ్యునల్ మొగ్గు * నోట్లో ‘మట్టి’..! ఆలమట్టి డ్యాం ఎత్తు.....

*కర్ణాటక నిర్మించిన ఆలమట్టి డ్యాం ఎత్తుకు అనుమతి
* మిగులు జలాల గుర్తింపు... పంపిణీ - నీటి లభ్యత 65 శాతం ప్రకారం లెక్కింపు
* నికర జలాల లెక్కల్లోనూ మార్పులు... మన ప్రాజెక్టులకు కష్ట కాలం
* మొత్తం జలాల్లో మనకు 1,001, కర్ణాటకకు 911, మహారాష్టక్రు 666 టీఎంసీలు
* చెన్నై నీటి అవసరాలకు ప్రత్యేక కోటా... నీటి వాడకంపై ప్రత్యేక అథారిటీ
* ఈ తీర్పు 2050 వరకు అమలు... అభ్యంతరాలను మూడు నెలల్లో చెప్పాలి


రాష్ట్రానికి మరో పిడుగుపాటు... జల పంపిణీలో తీవ్ర అన్యాయం.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం.. పచ్చని పైర్లతో కళకళలాడే కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం..!! కృష్ణా జల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఊహించని తీర్పును వెలువరించింది. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల వాదనలకే మొగ్గు చూపింది. ఇప్పటి వరకు మనం మాత్రమే వాడుకునే స్వేచ్ఛ కలిగిన మిగులు జలాల్లో ఎగువ రాష్ట్రాలకూ వాటా కల్పించింది. అంతేకాదు.. మన రాష్ర్ట ప్రయోజనాలకు గొడ్డలిపెట్టయిన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకూ పచ్చజెండా ఊపింది. ఫలితంగా కృష్ణా నదిని ఆధారం చేసుకుని నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ కృష్ణా ట్రిబ్యునల్ గురువారం ఈ కీలక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుపై ఉండే ఫిర్యాదులను మూడు మాసాల్లోపు నమోదు చేసుకోవచ్చని ట్రిబ్యునల్ సూచించింది.

రాష్ట్రానికి నష్టమిలా...

‘మిగులు’ దిగులే
దిగువ పరీవాహక ప్రాంతంగా మన రాష్ట్రానికి ప్రకృతి పరంగా ఉన్న అననుకూలతను ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. నికర, మిగులు జలాలను కలిపి లెక్కించి మూడు రాష్ట్రాలకు పంచటం వల్ల మన ప్రస్తుత, కొత్త ప్రాజెక్టులకు నీరు దైవాధీనమైంది.

పొరుగు ‘ఎత్తు’తో చిత్తు
ఆలమట్టి ఎత్తు పెంపు వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్.. వాటి అనుబంధ ప్రాజెక్టులకు నీటి లభ్యత గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా కృష్ణా ఆయకట్టు మీద ఆధారపడిన లక్షలాది ఎకరాలకు నీరు అందడం గగనమే.

ఖరీఫ్ హరీ!
ఖరీఫ్ ప్రస్తావన ట్రిబ్యునల్ తీర్పులో లేదు... ఫలితంగా కృష్ణా బేసిన్‌లో మన ఖరీఫ్ పంట ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. తమ ప్రాజెక్టులు నిండేదాకా కర్ణాటక, మహారాష్ట్ర నీరు విడవకపోతే కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ అన్నమాట వినపడదు.

ప్రశ్నార్థకమైన ప్రాజెక్టులు
మిగులు జలాలు పంపిణీ చేయడంతో తెలుగుగంగ, ఎస్‌ఎల్‌బీసీ, గాలేరు-నగరి, హంద్రీనీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ఆశలకు నీళ్లొదిలినట్టే!

కృష్ణా నది జలాలపై మన రాష్ట్రంతో పాటుగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ర్టల మధ్య వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు 1969లో ఆర్‌ఎస్ బచావత్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ 1973లో తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా 2002లో మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. దాంతో 2004 ఏప్రిల్‌లో బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రి బ్యునల్‌లో ఎస్‌పీ శ్రీవాస్తవ, డీకే సేథ్ సభ్యులుగా ఉన్నారు. బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణాజల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ముందు ఆయా రాష్ట్రాలు తమ వాదనల్ని సుదీర్ఘంగా వినిపించాయి.

మన రాష్ట్రం తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది దిపాంకర్ పి గుప్తా వాదించారు. కృష్ణాలో మిగులు జలాలు లేవని, ఒకవేళ కొద్దిగా ఉన్నా.. వాటిని వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ర్టమైన తమకే ఉందని రాష్ట్రం వాదించింది. ఆలమట్టి డ్యాం ఎత్తును పెంచవద్దని కోరింది. అయితే మన వాదనలన్నీ అరణ్య రోదనలే అయ్యాయి. మిగులు జలాలున్నాయని, వాటిని పంచాల్సిందేనని, ఆలమట్టి డ్యాం ఎత్తుకు అనుమతిని ఇవ్వాలన్న కర్ణాటక, మహారాష్ట్ర వాదనల వైపే ట్రిబ్యునల్ మొగ్గుచూపిం ది. నీటి లభ్యతను 75 శాతం నుంచి 65 శాతం మేర లెక్కించింది. మిగులు జలాలున్నాయన్న వాదనతో ఏకీభవిం చింది. ఎగువ రాష్ట్రాలకు మేలు జరిగే తీర్పు వె లువరించింది.

ఇదీ నీటి పంపకం..
బచావత్ అవార్డు ప్రకారం కృష్ణానదిలో (75 శాతం నీటి లభ్యత) 2,060 టీఎంసీల నికర జలాలు, మరో 70 టీఎంసీల రీ జనరేషన్ జలాలు ఉన్నట్టు లెక్క తేల్చారు. అయితే ప్రస్తుత ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని 65 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుంది. 2,578 టీఎంసీల జలం ఉన్నట్టు తేల్చింది. కొత్తగా 163 టీఎంసీల నికర జలం, మరో 285 టీఎంసీల మిగులు (మొత్తం 448 టీఎంసీలు) జలాలు ఉన్నట్టు ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ నీటిని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ లెక్కన ఇప్పటికే ఉన్న కేటాయింపులకు అదనంగా ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్టక్రు 81 టీఎంసీలు కేటాయించారు.

నోట్లో ‘మట్టి’..!
ట్రిబ్యునల్ తీర్పులో మరో ప్రధానాంశం ఆలమట్టి డ్యాం ఎత్తు. ఈ విషయంలో మన రాష్ట్రం తీవ్ర అభ్యంతరాన్ని వెలిబుచ్చింది. డ్యాం ఎత్తు పెంచితే తమకు తీవ్ర నష్టం ఉంటుందని పేర్కొంది. అయితే మన మొరను ట్రిబ్యునల్ ఆలకించలేదు. డ్యాం ఎత్తు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్యాం ఎత్తును 524.256 మీటర్ల వరకు పెంచుకోవచ్చని అనుమతిని ఇచ్చింది. ఈ ఎత్తు పెంపు వల్ల కర్ణాటక అదనంగా మరో 130 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 303 టీఎంసీల నీటిని కర్ణాటక ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. మహారాష్ర్ట ప్రభుత్వానికి కూడా ఈ తీర్పు లాభసాటిగానే ఉంది. ఆ రాష్ర్టం కోరుకుంటున్నట్టుగా కోయినా జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా 92 టీఎంసీలను ఉపయోగించుకుని, ఈ నీటిని అరేబియా సముద్రంలోకి వదిలివేయడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది.

గత ట్రిబ్యునల్ ప్రకారం 25 టీఎంసీలను మాత్రమే ఈ అవసరానికి ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ట్రిబ్యునల్ తీర్పులో చెన్నై మంచినీటి అవసరాలకు ప్రత్యేక నీటి కోటాను ప్రకటించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మూడు రాష్ట్రాలు 3.30 టీఎంసీల చొప్పున, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో 1.70 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. తీర్పు ప్రకారం కోటా మేరకు ఆయా రాష్ట్రాలు నీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా కృష్ణా జల రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ తన తీర్పులో సూచించింది. తుంగభద్ర కుడి కాల్వ నీటి వినియోగానికి సంబంధించి ఆంధ్రా, కర్ణాటక అధికారులతో బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది. కృష్ణానది ఎండిపోయి జీవావరణం దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా వేసవిలో ఆలమట్టి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు 2050 మే 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

మిగులు జలాలంటే..?
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులో... నికర, మిగులు, వరద జలాలు, స్కీం-ఏ, స్కీం-బీ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. వాటి వివరాలు ఇవీ..

నికర జలాలు: కృష్ణా బేసిన్‌లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకొని... బేసిన్‌లో ఏటా అందుబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని గణిస్తారు. ఈ పరిమాణాన్నే నికర జలాలుగా పేర్కొంటారు.
మిగులు జలాలు: విస్తారంగా వర్షాలు పడినప్పుడు.. సాధారణం కంటే ఎక్కువ పరిమాణంలో లభ్యమయ్యే నీటిని మిగులు జలాలుగా వ్యవహరిస్తున్నారు.
వరద జలాలు: వరదలు సంభవించిన సందర్భాల్లో నదుల్లో అధికంగా (నికర, మిగులు జలాల పరిమాణాన్ని మించి) ప్రవహించే నీటిని వరద జలాలుగా పిలుస్తారు.
స్కీం-ఏ: గణించిన నికర జలాలను మూడు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర) కేటాయింపుల ప్రకారం వినియోగించుకోవాలి. మిగులు జలాలను వాడుకొనే స్చేచ్ఛ కింది రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్‌కు) ఉంటుంది. ఇప్పటి వరకు ఇదే విధానాన్ని అనుసరించారు. తాజా తీర్పుతో ఈ విధానం రద్దయింది.
స్కీం-బీ: మిగులు జలాలను మూడు రాష్ట్రాలు నిర్దేశిత నిష్పత్తిలో పంచుకొంటాయి. తగులు (డెఫిసిట్)నూ పంచుకోవడం ఈ విధానం ప్రత్యేకత. ఇప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

కేటాయింపుల్ని ఇలా వాడాలి !
కేటాయించిన నీటిని పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు కొన్ని సూచనలను చేసింది. ఆయా రాష్ట్రాలకు బేసిన్‌ల వారీగా ఎంత నీటిని ఉపయోగించుకోవాలనే విషయాన్ని తీర్పులో స్పష్టం చేసింది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం పాత ట్రిబ్యునల్ కేటాయించిన 2,130 టీఎంసీలు, కొత్తగా కేటాయించిన 448 టీఎంసీల నీటి వాడకడంలో ఈ సూచనలు వర్తిస్తాయని పేర్కొంది.

మహారాష్ట్ర పాటించాల్సిన సూచనలు...: కే-5 బేసిన్ (అప్పర్ బీమా)లో 92.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించరాదు. సాధారణ నీరు ఉండే సంవత్సరంలో 663 టీఎంసీల కంటే ఎక్కువ వాడకూడదు.

కర్ణాటక...: కే-8 బేసిన్‌లో 360 టీఎంసీల కంటే ఎక్కువ వాడకూడదు. ఆలమట్టి ద్వారా 303 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడుకోకూడదు.

ఆంధ్రప్రదేశ్...: సాధారణ సంవత్సరంలో 1,001 టీఎంసీలే వాడుకోవాలి. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు

వర్షాలు సకాలంలో రాకుంటే అంతే..
కృష్ణా బేసిన్‌లో సకాలంలో వర్షాలు రాకపోతే.. మన పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మామూలుగా అయితే ఆలమట్టిలోకి 173 టీఎంసీల నీరు చేరిన వెంటనే కిందకు నీటిని వదలడానికి అవకాశం ఉండేది. అయితే... ప్రస్తుత తీర్పు ద్వారా ఈ డ్యాం ఎత్తు 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచుకోవడానికి కర్ణాటకకు అవకాశం ఏర్పడింది. అదనంగా మరో 130 టీఎంసీల నీటి వినియోగానికి ఆస్కారం ఉంది. అంటే... ఎగువ ప్రాంతంలో కురిసే వర్షం ఆలమట్టిలోకే సరిపోతుంది. కిందకు నీరు రావాలంటే భారీ వర్షాలు కురవాలి. వర్షాలు రాలేని పరిస్థితిలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇబ్బంది తప్పదు. ఇలాంటి పరిస్థితిలో నీటిని సమానంగా ఉపయోగించుకోవడానికి వీలుగా నీటివిడుదలకు సంబంధించి రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఆథారిటీలోని సభ్యుల్ని కేంద్రంతో పాటు మూడు రాష్ట్రాలు నియమించనున్నాయి.

రాష్ట్రాలపై ట్రిబ్యునల్ ఖర్చు
గత ఆరు సంవత్సరాల పాటు ట్రిబ్యునల్ నిర్వహణకు అయిన ఖర్చును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర భరించాలని ట్రిబ్యునల్ ప్రకటించింది. మొత్తం ఖర్చును మూడు రాష్ట్రాలు సమానంగా భరించాలని సూచించింది.

తీర్పు ముఖ్యాంశాలివీ..
* మిగులు జలాలపై ఇన్నాళ్లూ రాష్ట్రానికున్న స్వేచ్ఛకు ఈ తీర్పుతో తెరపడింది.
* నికర జలాలపైనా మన వాదనలకు పూర్తి భిన్నంగా ట్రిబ్యునల్ లెక్కలేసింది.
* పాత బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుంటే ఈ ట్రిబ్యునల్ 65 శాతాన్ని లెక్కలోకి తీసుకుంది.
* ఈ కొత్త లెక్క కారణంగా కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే నికర జలాల పరిమాణాన్ని ఎక్కువగా చూపించారు.
* పాత ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం 2,130 టీఎంసీల నికర జలాలు ఉండగా ఇప్పుడు కొత్త లెక్క కారణంగా అదనంగా మరో 163 టీఎంసీలు కలిపి మొత్తం 2293 టీఎంసీల నికరజలాలున్నట్లు కొత్త ట్రిబ్యునల్ లెక్క తేల్చింది.
* దీంతోపాటు బేసిన్‌లో 285 టీఎంసీల మిగులు జలాలు కూడా ఉన్నట్టు ట్రిబ్యునల్ గుర్తించింది. మొత్తం నీటి లభ్యతను 2,578 టీఎంసీలుగా లెక్కించారు.
* ఈ మొత్తాన్ని బేసిన్‌లోని మూడు రాష్ట్రాలకూ పంపిణీ చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌కు 1,001 టీఎంసీలు (గతంలో 811), కర్ణాటకకు 911 టీఎంసీలు (734), మహారాష్ర్టకు 666 టీఎంసీలు (585) కేటాయించారు.
* కర్ణాటక డిమాండ్ మేరకు ఆలమట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచుకోవటానికి అనుమతించింది. దీనివల్ల కర్ణాటక ఆ డ్యాం ద్వారా 303 టీఎంసీలు(ఇప్పటివరకు 173) ఉపయోగించుకోవచ్చు.
* అసలే బేసిన్‌లో నీటి లభ్యత తగ్గిపోతున్న పరిస్థితిలో ఆలమట్టి ఎత్తు పెంపు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, దీని అనుబంధ ప్రాజెక్టులు, కృష్ణా డెల్టాలపై ఆధార పడ్డ లక్షలాది మంది రైతులకు ఇబ్బందులు తప్పవు.
* మహారాష్ట్ర కోరుతున్నట్టు 92 టీఎంసీల నీటిని కోయ్‌నా విద్యుత్ ప్రాజెక్టు ద్వారా అరేబియా సముద్రంలోకి మళ్లించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* కృష్ణా నీటి వాడకంపై కేంద్రం, మూడు రాష్ట్రాల ప్రతినిధులతో ఒక రె గ్యులేటరీ అథారిటీని సత్వరం ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ సూచించింది.
* తుంగభద్ర ఎడమ కాలువ నీటి వాడకానికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల అధికారులతో బోర్డు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
* చెన్నై తాగు నీటి అవసరాల కోసం మూడు రాష్ట్రాలు సమానంగా నీటిని విడుదల చేయాలని సూచించింది.
* కృష్ణా నది ఎండిపోయి జీవావరణం దెబ్బతినకుండా నదీప్రవాహం ఉండేలా వేసవిలో ఆలమట్టి నుంచి 10 టీఎంసీలు విడుదల చేయాలని తీర్పునిచ్చింది.


పురోభివృద్ధికి శరాఘాతం..
‘ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర పురోభివృద్ధికి శరాఘాతం. జలయజ్ఞం ప్రాజెక్టులు పనికి రాకుండాపోయే ప్రమాదం ఏర్పడింది. మన ఇంజినీర్లు, న్యాయవాదులు సమర్థంగా వాదించలేదని అర్థమవుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం చేయాల్సిన తక్షణ కర్తవ్యం’
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, మాజీ అధ్యక్షుడు ప్రభాకర్

రబీ పంట ఉండదు...
‘తీర్పు నిరాశాజనకంగా ఉంది. ఆలమట్టి ఎత్తు పెంచితే.. ముందు అది నిండాలి.. తర్వాత జూరాల, శ్రీశైలం, సాగర్ నిండితే, అప్పుడు మనం నారుమళ్లు వేసుకోవాలి. ఇదంతా జరగాలంటే అక్టోబరు మొదటి వారం వస్తుంది. అప్పుడు ఖరీఫ్ మొదలు పెడితే ఇక రబీ పంటవేసేదుండదు’’
- చెరుకూరి వీరయ్య, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్

తెలంగాణ వాటా తేల్చాలి
‘1,001 టీఎంసీలో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలి. గతంలో ఉన్న 811 టీఎంసీల్లోనే తెలంగాణకు సరైన వాటా దక్కలేదు. కొత్తగా వస్తున్న 200 టీఎంసీలను తెలంగాణకు ఇస్తారా?లేదా? దాంతో పాటు గతంలో రావలసిన 290 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలి’
- ఆర్.విద్యాసాగర్‌రావు, సీడబ్ల్యూసీ, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్

బాబు వల్లే జల కేటాయింపుల్లో అన్యాయం: పీఆర్పీ
కృష్ణా జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరగడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సగం కారణమని ప్రజారాజ్యం పార్టీ ఆరోపించింది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లలో ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించడంవల్లే ప్రస్తుతం రాష్ట్రానికి కేటాయింపులు తగ్గాయని ఆ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.

రాష్ట్రానికి తీరని అన్యాయం: ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బీజేపీ
కృష్ణా జలాలకేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. సీఎం వెంటనే అఖిలపక్ష భేటీని ఏర్పాటుచేసి, ట్రిబ్యునల్ ఎదుట అభ్యంతరాలను తెలియజేయాలి. ఆలమట్టి ఎత్తును పెంచేందుకు కర్ణాటకకు అనుమతినివ్వడం ద్వారా రాష్ట్ర ప్రజల నోట్లో మట్టికొట్టినట్లు అయ్యింది.

Sunday, December 19, 2010

కష్టాల కడలిలో.. అనకాపల్లి బెల్లం

bellamఅనకాపల్లి పట్టణ ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయంతో ముడిపడి ఉంది. అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగంతో సంబంధాలు కలిగి ఉన్నారు. పంటలు పండితే గాని వీరి పోషణ కష్టం. ప్రధానంగా ఈ ప్రాంత రైతాంగం వరి, చెరుకు, కాయగూరలు ఎక్కువగా పండిస్తుంటారు. చెరుకు పంట, బెల్లం వంట, అనకాపల్లి పరిసర ప్రాంతాల రైతుల జీవినవిధానంగా మారింది. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా చెరుకు పంట వేసి షుగర్‌ ఫ్యాక్టరీలకు చెరకును పంపిణీ చేయడం, బెల్లం తయారు చేయడం ఎన్నో ఏళ్లుగా రైతులు అలవాటుగా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బెల్లం మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని బెల్లం తయారీ చేయడం ఇక్కడి రైతుల వ్యవసాయ విధానంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు బెల్లాన్ని రెండు విధాలుగా తయారు చేస్తారు. ఒకటి రంగుబెల్లం, రెండవది రంగులేని బెల్లం (నల్లబెల్లం). మొదటి విధానమైన రంగుబెల్లం తయారీ విధానంపై ప్రత్యేక కథనం.

రంగు బెల్లం తయారీ విధానం...
Jaggeryమార్కెట్‌లో బెల్లానికి ఎంత మంచి రంగు ఉంటే అంత మంచి సరుకుగా పరిగణిస్తారు. అందుకే రంగు బెల్లానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుం ది. వినియోగదారులు, కొనుగోలుదారుల కూడా రంగు బెల్లానికే మక్కువ చూపుతారు. కాగా ఈ రంగు బెల్లం తయారు చేయడానికి రైతులు పడే శ్రమ అంతాఇంతా కాదు. బెల్లాన్ని బంగారపు రంగులో తయారు చేయడాని కి రైతులు ఎంతో శ్రమిస్తారు. ప్రమాదకరమైన రసాయనాలు కూడా కలిపి బెల్లానికి రంగు వచ్చేలా చేస్తున్నారు. ఇటువంటి బెల్లం ప్రమాదకరమని, వినియోగదారులకు చేటు చేస్తుందని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నా రు. మన రాష్ట్రంలో బెల్లాన్ని ఎక్కువగా తయారు చేసే నిజామాబాద్‌, మెదక్‌, చిత్తూరు, తూర్పుగోదా వరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తరహా బెల్లాన్ని ఎక్కువ గా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లానికి బంగారపు రంగు వచ్చేందుకు రైతులు హైడ్రోస్‌ (సోడియం హైడ్రోజన్‌ సల్ఫేట్‌) అనే రసాయ నాన్ని వాడతా రు. సాధారణంగా క్వింటాల్‌ బెల్లం తయారీలో 7 గ్రాములకు మించి సల్ఫర్‌ వినియోగించకూడదు.

Jaggery1అయితే రైతులు రంగుకోసం 70 పిపిఎం (పార్ట్‌‌స పర్‌ మిలియన్‌) మేరకు దీనిని వినియో గిస్తున్నారు. హైడ్రోస్‌ కలిపిన బెల్లాన్ని వినియోగించడం ద్వారా మూత్రపిండ సమస్యలు, ఉదరకోశ సంబంధ వ్యాధులు, ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హైడ్రోస్‌ ఎక్కువగా వాడితే ప్రజల ఆరోగ్యానికి చేటని తెలిసినప్పటికీ మార్కెట్‌లో తాము తయారుచేసిన బెల్లాన్ని అధిక రేట్లకు అమ్ముకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా చేయాల్సివస్తోందని రైతులు చెబుతున్నారు. హైడ్రోస్‌ వాడిన బెల్లం బంగారు రంగులో ఉంటే, హైడ్రోస్‌ వాడని బెల్లం గోధుమ రంగులో ఉంటుంది. దాన్నే నల్లబెల్లంగా పిలుస్తారు. హైడ్రోస్‌ బదులు సున్నం, బెండమొక్కల గుజ్జు వంటి క్షారపదా ర్థాలు వాడితే మంచి బెల్లం తయారవుతుందని ఇక్కడి వ్యవసాయ పరిశో ధనా స్థానం శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అదే విధంగా సకాలంలో చెరుకును నాటి తగు సమయంలో నరికి సరైన సాగు పద్ధతులను పాటిస్తే నాణ్యమైన ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారుచేయవచ్చని కూడా వారు చెబుతున్నారు. అయినప్పటికీ రైతులు మార్కెట్‌ డిమాండ్‌ రీత్యా హైడ్రోస్‌ ఉపయోగించిన రంగు బెల్లాన్నే ఎక్కువగా తయారు చేస్తున్నారు.
నాణ్యమైన బెల్లం తయారీ విధానం...
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్తవ్రేత్తలు తెలిపిన ప్రకారం ప క్వానికి వచ్చిన చెరుకు నుంచి నాణ్యమైన బెల్లాన్ని తయారుచేయవచ్చు. చెరు కురసంలో ఉదజని సూచిక 5.2 ఉండాలని, దాని ఆమ్లతను 5.8 వరకు తీ సుకువెళ్లాలని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. చెరుకును నరికిన వెంటనే రసా యనాలకు బదులు తగినంత సున్నం కలిపి గానుగ ఆడితే మంచి రకం బెల్లం తయారు చేయవచ్చునని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. జనవరి, ఫిబ్రవ రి నెలల్లో నాటిన తోటలను మళ్లీ అదే సమయానికి సకాలంలో నరికితే రసనాణ్యత బాగుండి నాణ్యమైన బెల్లం తయారయ్యే అవకాశం ఉందన్నారు. ఆలస్యంగా నాటితే దాని ప్రభావం బెల్లం తయారీపై ఉంటుందని తెలిపారు.
ముక్క బెల్లానికి డిమాండ్‌, పెరుగుతున్న వినియోగం...
bellam1ముక్కబెల్లానికి కార్పొరేట్‌ రంగంలో రిటైల్‌ అవుట్‌లె ట్‌లలో, సూపర్‌బజార్లలో ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. సాధారణం గా వినియోగదారులు ఏదైనా ప్రయోజనం కోసం బెల్లాన్ని కొనుగోలు చేయవలసి వస్తే దిమ్మల రూపంలో కొనాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొనుగోలు చేసిన ఆ బెల్లం దిమ్మలో కొంత మాత్రమే ఉపయోగపడగా మిగతా బెల్లం వృధా అవుతోంది. దీంతో ఎక్కువ మొత్తం పట్టి బెల్లాన్ని కొన్న వినియోగదారులు నష్టపోతున్నారు. బెల్లం ఎంత పరిమాణంలో అవసరమో అంతే కొనుక్కునే విధంగా సౌలభ్యం లేకపోవడంతో ఈ పరిస్థితి మొన్నటి దాకా ఉంది. ప్రస్తుతం తక్కువ పరిమా ణం వున్న చిన్న బెల్లం దిమ్మలు, కిలో, అరకిలో బరువుండే బెల్లం ముక్కలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని తూర్పుగోదావరి జిల్లా రైతులు ఎక్కువగా తయారుచేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా రైతులు కూడా ఈ చిన్న పరిమా ణం వున్న ముక్కబెల్లం తయారీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

bellam23చెరుకు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వ్యవసాయ శాస్తవ్రేత్తలు బెల్లం పరి శ్రమ అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగం గా ఉత్తరాంధ్రలో బెల్లం అధికంగా తయారుచేసే ప్రాంతాల్లో ఆగ్రోప్రాసె సింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యా లయం సన్నాహాలు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో ఆగ్రోప్రాసెసింగ్‌ సెంటర్‌ను ప్రారంభిం చారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా విజయనగరం, శ్రీకాకు ళం జిల్లాలకు కూడా విస్తరించారు. బెల్లాన్ని ముక్క, పౌడర్‌, పాకం రూపంలో తయారుచేసి మార్కెటింగ్‌ చేయడమే ఈ ఆగ్రోప్రాసెసింగ్‌ సెంటర్ల ప్రధాన ఉద్దేశం. బెల్లాన్ని దిమ్మరూపంలో కాకుండా ముక్కరూపంలో తయారుచేసి అమ్మితే ఏటా రాష్ట్రంలోని బెల్లం రైతులకు కోట్లలో అదనపు ఆదాయం వస్తుం దని శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం కొన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టి అక్కడి బెల్లం రైతులు ముక్కబెల్లం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, మెదక్‌, నిజామాబాద్‌, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు బెల్లాన్ని వందగ్రాముల నుంచి వివిధ పరిమాణాల్లో తయారుచేసి అట్టపెట్టెలలో ప్యాకింగ్‌ చేస్తూ ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు.

Jaggery2 కాగా విశాఖజిల్లాలోని రైతులను కూడా ఆ దిశగా మరల్చేందుకు శాస్తవ్రేత్తలు ప్రయత్నించారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముక్కబెల్లం, బెల్లం పౌడర్‌, బెల్లం పాకం తయా రీ యూనిట్లను ప్రయో గాత్మకంగా రూపొందించి దీనికి సంబం దించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఇక్కడి ఆర్‌.ఎ.ఆర్‌.ఎస్‌లో అభివృద్ధి చేశారు. మునగపాక మండలంలో ప్రప్రథంగా ఈ ఆగ్రోప్రాసెసింగ్‌ సెంటర్‌ను ప్రారంభించి రైతులకు వాటిపై శిక్షణ ఇచ్చి, వారి చేత పరికరాలను కొనుగోలు చేయించి, బెల్లం తయారీ యూనిట్లను నెలకొ ల్పారు. మునగపాక మండలంలో ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ యూనిట్లను ఉపయోగిం చుకుని ముక్క బెల్లాన్ని తయారు చేయడం ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం వారు అందిం చిన పరికరాల ద్వారా ముక్కబెల్లాన్ని తయారుచేసి అమ్మడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని, ఈ విధానం ఎంతో సౌలభ్యకరంగా ఉందని పైప్రాంతాల నుం చి వినియోగదారులు ఇక్కడకు వచ్చి ముక్క బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నారని, తిమ్మరాజు పేటకు చెందిన చెరుకు రైతులు సూరిశెట్టి ముసి లినాయుడు, శరగడం గోవింద, సూరిశెట్టి వెంక టి, నీటి సంఘం అధ్యక్షు లు భీమిశెట్టి నాయుడు తదితరులు తెలిపారు.
కష్టనష్టాలతో చెరుకు రైతు సావాసం... ఆర్థిక సాయం అందని ద్రాక్షే...
విశాఖ జిల్లాలో కౌలు రైతులకు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని కౌలు రైతులు కష్టాలతో సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరుసగా సంభవించిన తుఫాన్లు, వరదలు, భారీ వర్షాల కారణంగా వీరంతా తీవ్రంగా నష్టాలు చవిచూశారు. వీరంతా పెద్ద కమతాలు ఉన్న భూస్వాముల వద్ద నుంచి పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తు న్నారు. పెరిగిన పెట్టుబడులు, పెరిగిన కూలీ రేట్లతో ఖర్చులు భారీగా అధి మై కౌలు చెల్లించలేని పరిస్థితులు రైతన్నకు దాపురించాయి. దీనికి వర్షాలు తోడవడంతో పంటలు పండక రైతులు వీధిన పడ్డారు. రాష్ట్రంలో చెరుకు సా గు విస్తీర్ణంలో ప్రథమస్థానం విశాఖ జిల్లాదే. ఇక్కడ నాలుగు సహకార చక్కెర కర్మాగారాలున్నాయి. జిల్లాలో సాధారణ చెరుకు సాగు విస్తీర్ణం 40,896 హెక్టార్లు కాగా ఈ ఏడాది 44,004 హెక్టార్లలో సాగు అయింది. చెరుకు విత్తనం, దుక్కులు, నాట్లు ఇతరత్రా పెట్టుబడులతో టన్ను చెరుకు ఉత్పత్తి చేయాలంటే రైతుకు 1600 రూపాయలకుపైగా ఖర్చవుతోంది. కుటుంబ మంతా రేయింబవళ్లు శ్రమించినా రైతుకు గిట్టుబాటు ధర రావడంలేదు. మదుపులు భారీగా పెరిగిపోయాయి.
నష్టాలను చవి చూస్తున్నాం
ramanaగానుగాట ఆడేందుకు, బెల్లం తయారీ చేసుందుకు కూలీలు దొరకడంలేదు. కొంత మంది దొరికినా పెద్ద మొత్తంలో కూలీ రేట్లు డిమాండ్‌ చేస్తున్నారు. మగవారికి 200 రూపాయలు, ఆడవారికి 90 రూపాయలు రోజువారి కూలీ చెల్లిస్తున్నాం. పెట్టుబడులు, కూలీలకు చెల్లించింది పోనూ రైతుకు ఏమీ మిగలడం లేదు. దీంతో నష్టాలు చవిసూస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సరైన చెరుకు ఉత్పత్తి కాకపోవడంతో రసనాణ్యత తగ్గిపోతోంది. దీంతో నల్లబెల్లం తయారవుతోంది. దీనికి మార్కెట్‌లో డిమాండ్‌ లేని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. చెరుకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.
- బొడ్డేడ రమణ (చెరుకు రైతు)

ఉపాధి హామీ పథకం అమలుతో కూలీలు దొరకడం లేదు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్క లు చేసుకున్నా నాలుగు డబ్బులు మిగలని దుస్థితి నెలకొంది. రైతుకు చెరుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది సెప్టెం బర్‌, నవంబర్‌ నెలల్లో జల్‌తుఫాన్‌, వర్షాలు, వరదల సమయంలో నష్టాలకు గురైన రైతన్న లకు ఇంతవరకూ ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ప్రభుత్వ అధికారులు పంట నష్టం పై సర్వేలు చేస్తున్నట్లు హడావుడే తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఇదిలా ఉండగా తాజాగా వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా రైతు ల చేతికందిన పంట చేజారిపోయింది. నష్టపో యిన కౌలు రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతు న్నారు.

ఈ సమయంలో ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే ఏడాది రబీ పంట సాగు చేసేందుకు రైతులు సుముఖంగా లేరు. వ్యవసాయం పట్ల అనాసక్తత కనబరు స్తున్నారు. అనకాపల్లి, మునగపాక మండలా ల్లోని చెరుకు పంటపై ఆధారపడే రైతులు ఫ్యాక్టరీలకు చెరుకును సరఫరా చేసేందుకు వెనుకాడుతున్నారు. ఫ్యాక్టరీలు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం. గత ఏడాది పంచదార ధరలు బాగుండడంతో గోవాడ షుగర ్‌ఫ్యాక్టరీ 2,200, తాండవ, ఏటికొప్పాక షుగర్‌ఫ్యాక్టరీ లు 1800 రూపాయలు, తుమ్మపాల షుగర్‌ఫ్యాక్టరీ 1700 రూపాయలు రైతులకు మద్దతు ధరగా చెల్లించాయి. ఈ ఏడాది చక్కెర ధరలు తగ్గాయి. గత ఏడాది మాదిరి గా మద్దతు ధర చెల్లించడానికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు జంకుతున్నాయి. ఇప్పటికే చోడవరం షుగర్‌ఫ్యాక్టరీ, ఏటికొప్పాక షుగర్‌ఫ్యాక్టరీలు మద్దతు ధరను 1800 రూపాయలు ప్రకటించి, క్రషింగ్స్‌ను మొదలుపెట్టాయి. కాగా ఈ మద్దతు ధరపై నిన్నటి వరకూ ఒక నిర్ణయానికిరాని తుమ్మ పాల షుగర్‌ఫ్యాక్టరీ ఎట్టకేలకు స్పందించింది.

1700 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్టు ఫ్యాక్టరీ చైర్మెన్‌ డి.ఆర్‌.డి.ఎ - పి.డి.శ్రీకాంత్‌ ప్రభాకర్‌ ఇటీవల ప్రకటించారు. ఈ మద్దతు ధర తమకు ఏ కోశానా సరిపోవడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తుమ్మపాల షుగర్‌ఫ్యాక్టరీ పరిధిలో బెల్లం గానుగలు, క్రషర్లు ఎక్కువగా ఉన్నాయి. చెరుకును ఫ్యాక్టరీకి తరలించేకంటే రైతే స్వయంగా బెల్లం గానుగాడుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరుకు పంట నీటమునిగిపోవడంతో చెరుకులో ఎదుగుదల లోపించింది. దిగుబడులు తగ్గిపోయాయి. చక్కెర శాతం పడిపోయింది. దీనికి తోడు అనకాపల్లి బెల్లం మార్కెట్‌ లో బెల్లం రేటు ఆశాజనకంగా లేకపోవడం రైతులను కుంగదీస్తోంది. గత ఏడాది మార్కెట్‌లో బెల్లం దిమ్మ ఖరీదు 325 రూపాయలు ధర పలకగా ప్రస్తుతం ఈ సీజన్‌లో 200 రూపాయలకు మించి ధర రావడంలేదు. దీంతో చెరుకు రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టా డుతున్నాడు. ఇదిలా ఉండగా నల్ల బెల్లం సమస్య రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరుకు తోటలు నీటమునిగి ఉన్నాయి. దీనికి తోడు చెరుకు రైతులు నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో విపరీతంగా నష్టపోతు న్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు గత ఏడాది 25,96,108 బెల్లం దిమ్మలు రైతుల ద్వారా దిగుమతి కాగా వాటిలో సగం నల్లబెల్లానికి చెందినవే. నల్ల బెల్లానిి, రంగుబెల్లానికి మధ్యధర వ్యత్యాసం ఎంతో ఉంది. మార్కెట్‌లో నలుపు, రంగు బెల్లం మధ్య ధర వ్యత్యాసం పదికిలోలకు 200 వరకు ఉంటుంది. ఈ కారణంగా నల్లబెల్లం తయారుచేసిన రైతులు తీవ్రంగా ధర విషయంలో నష్టపోతున్నారు. మార్కెట్‌లో రంగుబెల్లానిి డిమాండ్‌ ఉండడంతో నల్లబెల్లం వైపు ఎవరూ మొగ్గుచూపడం లేదు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. నల్లబెల్లానికి, రంగుబెల్లానికి మధ్య ధరవ్యత్యాసం వలన నల్లబెల్లం పంపిణీ చేసే రైతులు ఎకరాకు 20,000 వరకు నష్టపోవలసి వస్తోంది. నల్లబెల్లం తయారీ రైతు కావాలని తయారు చేయడం జరగదు. పండించే నేలలను బట్టి, ఎంచుకున్న రకాలను బట్టి బెల్లానికి ఈ రంగు వస్తుంది. చెరుకు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించక పోవడంతో బెల్లంలో నాణ్యత తగ్గి బెల్లం నలుపు రంగుకు మారుతోందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. బెల్లం తయారీ వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నష్టాలు చవిచూస్తున్నామని చెరుకు రైతులు చెబుతున్నారు.
ఏడాదికి రూ.100 కోట్ల వ్యాపారం...
జాతీయ స్థాయిలో పేరు పొందిన అనకాపల్లి మార్కెట్‌కు విశాఖ, శ్రీకాకుళం, విజయనగ రం జిల్లాలు నుంచి రైతులు బెల్లం తీసుకు వస్తారు. రైతులు తీసుకువచ్చిన బెల్లాన్ని యథావిధిగా ఇక్కడి వ్యాపార్లు అమ్మకాలు చేస్తారు. రకాలవారీగా పేర్చి, బహిరంగ వేలం నిర్వహిస్తారు. రోజుకు మార్కెట్‌కు 20,000 దిమ్మల నుంచి 25,000 దిమ్మల వరకు అమ్మకానికి వస్తున్నాయి. ఒక్కొక్క దిమ్మ బరువు 13 కిలోల నుంచి 16 కిలోల వరకు ఉంటుంది. ఏటా రూ.100 కోట్లకు పైగా వ్యాపారం సాగుతుంది. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒరిస్సా, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని చెరుకు సాగుచేస్తున్నాం. ఎకరానికి శిస్తు కింద 14,000 రూపాయలు కడుతున్నాం. ఈ ఏడాది ఒక ఎకరా దగ్గర పెట్టుబడి పోనూ తిరిగి 15 వేల రూపాయల నష్టం వాటిల్లింది. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాం. మార్కెట్‌లో బెల్లానికి సరైన ధర లేకపోవడం, ఫ్యాక్టరీ చెరుకు రైతుకు సరైన మద్దతు ధర ప్రకటించకపోవడంతో నష్టాలపాలవుతున్నాం. ప్రభుత్వం చెరుకు రైతులను ఆదు కోవాలి.
- సూరిశెట్టి సన్యాసమ్మ (చెరుకు రైతు)

చిల్లిగవ్వ మిగలడం లేదు
గత ఏడాది ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయ లు లాభం వచ్చింది. గత సంవత్సవరం పది కేజీల దిమ్మ ఖరీదు 325 రూపా యలు ధర పలికిం ది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. బెల్లం ధర పడిపోయింది. పది కేజీల దిమ్మధర 210 నుంచి 220 రూపాయలు ప లుకుతోంది. పెట్టుబడి పోను చేతికి చిల్లిగవ్వ మిగలడంలేదు.
- సూరిశెట్టి మహాలక్ష్మినాయుడు (చెరుకు రైతు, తిమ్మరాజుపేట)

వ్యవసాయం దండగ
వ్యవసాయం దండగ అనిపి స్తోంది. వృత్తి మీద అనాసక్తత పెరుగుతోంది. కష్టించి పని చేసినా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రా వడం లేదు. నష్టాల ఊబిలో కూరుకు పోతు న్నాం. ప్రభుత్వం చెరుకు రైతులను ఆదుకోవాలి.
- సూరిశెట్టి వెంకటసత్యనారాయణ (చెరుకు రైతు)

తిండి తిప్పలు * బ్రెడ్డే దొరకట్లేదంటే..కేక్ తినమన్నట్లుంది

ఉపాధి హామీ పథకం వల్ల కూలి రేట్లు పెరిగి ఒక రైతుగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఒక సామాజిక కార్యకర్తగా ఆ పథకాన్ని సమర్థిస్తున్నాను. నిజానికి రైతు కూలీలు, కార్మికులు శక్తివంతులై వేతనం పెంచకపోతే పని కూడా వద్దనుకునే స్థాయికి ఎదగడం నాకు సంతోషాన్నిస్తోంది. కాని బాధ కలిగించే విషయం ఏమిటంటే- పథకం అమలులో జరుగుతున్న అవినీతి, చేసే పని పట్ల శ్రద్ధ లేకపోవటం, రైతులు ఆహారేతర పంటలవైపు మొగ్గు చూపడానికి అది కూడా ఒక కారణం కావడం. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి మరింత తగ్గిపోతోంది.

వ్యవసాయ పని ఒక్కళ్లుగా చేసుకోలేరు. పని ఉన్నప్పుడు ఎక్కువమంది కూలీలు అవసరమవుతారు. అది కూడా పనితనం ఉన్నవాళ్లు కావాల్సి వస్తుంది. పని తెలిసి, ఇష్టంతోనూ ఉత్సాహంతోనూ చేసేవారు కావాల్సి వస్తుంది. అయితే పట్టణాలకు వలసల వల్ల గ్రామాల్లో పని నైపుణ్యం ఉన్నవాళ్లు తగ్గడమే కాదు, తీవ్ర కొరత కూడా ఏర్పడడంతో రైతులు ఆహార పంటల నుంచి శ్రమ, శ్రద్ధ పెద ్దగా అవసరం లేని ఆహారేతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఇంకో కారణం ఏమిటంటే... రైతులు గంటల తరబడి తమ సొంత పొలాల్లో సైతం పని చేయడానికి సిద్ధంగా లేరు. నేటి తరానికి పాలు పిండడం చేతకాదు, నాగలి పట్టడం రాదు, నీరు పెట్టడం తెలీదు. ఎక్కువ కాలం బడిలో గడపడం మూలాన ఎండకి వానకి పని చేయడం తెలీదు. కాయకష్టాన్ని తక్కువ చేసి చూడటం, మురికి పని అనుకోవడం, అది దిగువ వర్గాలకి, కులాలకి చెందినదిగా భావించడం వల్ల చాలామంది యువత పని పట్ల విముఖత చూపుతున్నారు. అదే తప్పనుకుంటే ఆ దిగువ వర్గాలు, కులాలు కూడా పనికి అందుబాటులో లేకపోవడం మరో సమస్య.

జనం ఎక్కడా ఒకచోట నిలకడగా ఉండటం లేదు. మొబైల్, మోటారు బైకు, డబ్బు అనే మూడు విషయాలు జనాన్ని ఒక దగ్గర ఉండనీయటం లేదు. ఈ పరిస్థితుల్లో పని చేయటం కష్టం. వ్యవసాయం ్జ్ఛ్చజూౌఠట ఝజీట్టట్ఛటట లాగా రైతు నిరంతరం తన చుట్టే తిరగాలనుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరక్కపోదు. వర్షాలు కురుస్తున్నప్పుడో, ఎండాకాలం మధ్యాహ్నాల లాంటి సమయాల్లోనో. కాని ఎప్పుడూ అటో ఇటో తిరుగుతుంటే వ్యవసాయం ముందుకు సాగదు. పని వాళ్లు దొరక్కపోతే యంత్రాలను ఉపయోగించటమో ఆధునికీకరించటమో చేసుకోవచ్చు కదా అని మీరనొచ్చు. ఇదెట్లా ఉంటుందంటే బ్రెడ్డే దొరకట్లేదంటే కేక్ తినమన్నట్లుంటుంది. యంత్రం మనకన్నా తొందరగా పని చేస్తుందేమో కాని అన్ని రకాల సాగు పనులు చేయలేదు. పైగా దానికి కావాల్సిన డీజిల్ డబ్బులు పోసి కొనాలి. ఫలితం పర్యావరణానికి హాని, మన ఖజానాకు గండి. మనిషి మెదడు లాంటి యంత్రమైతే ఇప్పటి దాకా రాలేదు. మనకు యంత్ర సాయం అవసరమే కాని మరీ బ్రెడ్డుకి బదులు కేక్ తినలేము కదా!

యంత్రాల వైపు మళ్లే బదులు మనము భూమాత వైపు మళ్లాలి. సహజ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఆయా భూములకు అనువైన పంటలను పండిస్తూ , సహజ ఎరువులను, క్రిమిసంహారకాలను తయారు చేసుకొని సాగు చేయటం మంచిది. అయితే ఈ రకమైన వ్యవసాయం పెరుగుతున్న జనాభాకు సరిపోను తిండిని పండించగలదా అని అనుమానం రావొచ్చు. బహుశా మొదట్లో సాధ్యం కాకపోవచ్చు. కాని పట్టుదలతో చేస్తే, తప్పని సరిగా కొద్ది సంవత్సరాల్లోనే సాధ్యం చేసుకోవచ్చు. క్యూబా ప్రజలు చేసుకోగా మనమెందుకు చేసుకోలేము? అప్పుడు మనం స్వచ్ఛమైన మందులు, విషాలు లేని ఆహారం తినటమే కాదు, మన భూములు, నీరు, గాలి కూడా స్వచ్ఛంగా కాలుష్య రహితంగా ఉంటాయి. ఆహార కొనుగోలుదారులు (సాధారణ వినియోగదారులు) కూడా సహజ ఆహారాన్ని కోరుకోవాలి. అందుకు తగిన ధర చెల్లించడానికి మనం ముందుకొస్తే రసాయనాలువాడకుండా పంటలు పండించడానికి రైతులు కూడా సిద్ధమవుతారు.

గౌరమ్మను గౌరవించండి

ఎలాగైతే తల్లి తన బిడ్డ విసర్జించే మలాన్ని శుభ్రం చేయడానికి జంకదో మట్టి కూడా అదే విధంగా జంకదు. జంకకపోవటమే కాదు మన కంటికి కనపడని తన సంతానంతో ఆ మలాన్ని మంచి ఎరువుగా కూడా మార్చగలదు. మనుషుల నుంచి జంతువుల దాకా అన్నిటి మలాన్ని మట్టిలోపల పూడ్చి సారవంతంగా మార్చొచ్చు. మా ఊళ్లో సంక్రాంతి ముందు నెల రోజుల పాటు పిల్లలు గౌరమ్మ ఎదుట నిలబడి దణ్ణం పెట్టుకుంటారు. గౌరమ్మ అంటే... ఆవుపేడతో చేసిన గౌరమ్మ! ఇండియాలో పంట పెంటతో ఎంతో దగ్గరగా ముడిపడి ఉంటుంది. అమెరికాలో మాత్రం పెంటను ఇట్లా భూమిలో కలిపేయరు. దాంతో పెద్ద సమస్యను తెచ్చి పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లష్ లెట్రిన్లు నీటిని కలుషితం చేస్తున్నాయనేది అందరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని అర్థం నేను మళ్లీ పూర్వకాలంలో లాగ 'బయటి'కెళ్లమనటం లేదు. మన మరుగుదొడ్ల నిర్మాణాన్ని పునః సమీక్షించాలంటున్నాను. నీటి అవసరం లేని డ్రై లెట్రిన్స్‌ని తయారు చేయాలంటున్నాను.


- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Tuesday, December 14, 2010

తిండి తిప్పలు * పండిద్దునా... కొనుక్కుందునా ?

ఆహారం పండిద్దునా .........
లేక కొనుక్కుందునా?
మా ఊరయిన చిత్తూరు జిల్లా వెంకటాపురంలో రైతులు ఈ విధంగా మాట్లాడుకుంటారు... "మా కుటుంబ అవసరాలకు ఏటా ఎన్ని వేరుశనగలు కావాలి... మహా అయితే ఒక గోతాము చట్నీకి, రెండు మూడు గోతాలు వంట నూనెకి. దానికోసం ఇంత కష్టపడి పండించడం ఎందుకు? సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టాలి మన వద్ద లేకపోతే వడ్డీకి అప్పు చెయ్యాలి. పొలంలో పని చేయడానికి కూలి వాళ్లు దొరకాలి. అంతా చేసి పంట చేతికి వచ్చేనాటికి ధరలు పడిపోవచ్చు. అదే జరిగితే మిగిలేది అప్పులే. అందుకే దాని బదులు పొలాన్ని మామిడి తోట కిందకు మార్చేసి మనకి కావాల్సిన వేరుశనగల్ని కొనుక్కుంటే నయం కాదా?''

ఇదే రకమైన వాదన మిరప, కూరగాయలు, పాల విషయంలో కూడా వినపడుతుంది. ఎన్ని మిరపకాయలు కావాలి? ఐదు కిలోలో, పది కిలోలో. దాని కోసం పండించే బదులు కొనుక్కుంటే సరిపోతుంది. పాలెన్ని కావాలి? రోజుకి అర లీటరో లీటరో. టీకి, పెరుగుకి లేదా మజ్జిగకి. దాని కోసం ఆవుల్ని పెంచడం, గడ్డి కోసుకొచ్చి వేయడం, వాటికి దాణా కోసం వేరుశనగ చెక్కను కొనడం, అవి జబ్బు పడితే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లడం... ఎందుకీ గోలంతా? ఇదే విధంగా కూరగాయలు... దుక్కి దున్నాలి, సాళ్లు తోలాలి. క్రమం తప్పకుండా నీరు పెట్టుకోవాలి, కలుపు తీస్తుండాలి, పురుగు మందులు కొట్టాలి, ముదరక ముందే కాయలు కోసి మార్కెట్టుకు పంపాలి. ఇంత కష్టపడితే గిట్టుబాటు ధర రాకపోవచ్చు... ఎందుకొచ్చిన తలనొప్పి.

కొనుక్కుంటే సరిపోతుంది. కూరల ధరలు ఎక్కువుంటే ఆకు కూరలతో సరిపెట్టుకోవచ్చు. అవీ లేకపోతే మునగాకుతో ముగించవచ్చు. లేదా చింతపులుసు, చట్నీ, రసంతో కానిచ్చేయొచ్చు. ఇలా ఆలోచించడం వల్లే రైతులు వర్షాధార పంటలు, ముఖ్యంగా మెట్ట పంటలైన తృణ ధాన్యాలు, పప్పు గింజలు, నూనె గింజలు, కూరగాయలు పండించడానికి ముందుకు రావడం లేదు. పశువుల పెంపకం పట్ల వారికి ఆసక్తి మరీ తగ్గిపోతోంది. పంట భూములన్నిటిని తోటల కిందకు మార్చేసి హాయిగా సేద తీరుతున్నారు. మా ఊళ్లో అయితే ఇంతకు ముందు వేరుశనగలు, పప్పులు, నూనె గింజలు పండిన నేలల్లో ఇప్పుడు మామిడి పండ్లు పండుతున్నాయి. మరి పప్పు, ధాన్యం బదులు రోజూ మామిడి పండ్లనే తినగలమా? పంటభూమి ఉన్న రైతులంతా ఇట్లాగే ఆలోచిస్తే ఆహార పంటలనెవరు పండిస్తారు? ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటే అంటవా మరి? కాని రైతులిట్లా ఎందుకు చేస్తున్నారు?

సాగు ఖర్చులు పెరుగుతున్నాయి, చేతికొచ్చే డబ్బులు తగ్గుతున్నాయి. పంట ఉంటే ధర ఉండదు.. ధర ఉంటే పంట ఉండదు. ఏడాది కేడాదికి పెరుగుతున్న నష్టాలను చూసి రైతులు ఆ పంటలకి దణ్ణం పెడుతున్నారు. కొబ్బరి తోటల విషయంలో నా సొంత అనుభవమే చెపుతాను. గత ఇరవై సంవత్సరాల నుంచీ వాటి ధర ఒక్కో కాయకి రూ. 2 నుండి రూ. 3 పలుకుతోంది. అంతకు మించి ఒక్క పైసా పెరగలేదు. అందుకే చిత్తూరు జిల్లాలో కొబ్బరి రైతులు చెట్లు కొట్టేసే యోచనలో ఉన్నారు. ఆ పంటకేమో ఎక్కువ నీళ్లు కావాలి. నీటి మట్టమేమో తగ్గుతూ పోతోంది. అదే విధంగా ఇరవై ఏళ్లలో పాల ధర లీటరు రూ4 నుండి రూ16కి పెరిగింది. అయితే మేతగా వాడే వేరుశనగ చెక్క ధర అదే కాలంలో కిలోకి రూ4 నుండి రూ26కు పెరిగింది.

వరికి, గోధుమకు తప్పించి మిగతా వేటికీ ఖచ్చితమైన మద్దతు ధర లభించట్లేదు. ప్రతి సంవత్సరం రైతు మొదట్లో రుతుపవనాలతోను చివర్లో మార్కెట్టుతోను జూదమాడినట్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎందుకు చేయాలి? ఈ మధ్యన కొత్త అంశం వచ్చి చేరింది. పోయిన దశకంలో గ్రామాలలో మూడు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే... డ్వాక్రా, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయ రోజ్‌గార్ యోజన. డ్వాక్రా పుణ్యమా అని భూమి లేని మహిళా రైతులకు రుణ సదుపాయం లభిస్తోంది. దాంతో పశువుల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలతో వారికి బతుకుతెరువు దొరుకుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పుణ్యమా అని దారిద్య్రరేఖకి దిగువనున్న కుటుంబాలకు పదిరోజులకు సరిపడా ధాన్యం రెండురూపాయలకు కేజీ చొప్పున లభిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పుణ్యమా అని పనివాళ్ల జేబుల్లో డబ్బు కదలాడుతున్నది.

దాంతో వ్యవసాయం పట్ల, పని పట్ల వారి ఆలోచనలు అభిప్రాయాలు మారిపోయాయి. వారమంతా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పనికి వెళ్లని రోజు తమ సొంత పని చేసుకుంటున్నారు. అది వారి స్వీయ ఉపాధి వ్యాపారం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాల్లో కూలి రేట్లు పెరిగి వ్యవసాయం ఖర్చు పెరిగిపోయింది. దీని వల్ల ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూలీల వలస కొంతమేర తగ్గిపోయిందేమో కాని, గ్రామాల నుండి పట్టణాలకి వలస మాత్రం తగ్గలేదు. ఎందుకంటే పట్టణాల్లో కూలి ఎక్కువగా లభిస్తుంది కనుక.

ఈ రకంగా నిరంతరాయంగా పట్టణాలకు వలస వెళ్లటం మూలాన గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడుతున్నది. మా గ్రామాల్లో ఈ సీజనల్ వలసలు శాశ్వత వలసలకు దారి తీశాయి. ఉపాధి హామీ పథకం చాలా వరకు లోపభూయిష్టంగా ఉంటుంది. నిర్వహణలో చాలా అవినీతి చోటు చేసుకుంటుంది. దీనివల్ల నష్టపోయే వాళ్లూ, లాభపడేవాళ్లు కూడా వ్యవసాయ కూలీలే. ఎలాగంటే... ఇందులోని మస్టర్ రోల్స్ (కూలీల వివరాలు) అన్నీ ఉత్తుత్తివే. పని చేసిన వాళ్లకంటే ఎక్కువమందిని చూపించి ఆ డబ్బు తీసుకోవడం సాధారణం. పని కొలతలు కూడా ఉత్తుత్తివే. అసలు జరిగిన దానికంటే ఎక్కువ పని జరిగినట్టుగా చూపించటం మామూలయిపోయింది. కూలీలకు కూడా ఇదంతా అలవాటైపోయింది. దీనివల్ల ఒక రైతు పర్యవేక్షణలో పని చేయటానికి వాళ్లు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం ఇచ్చినంత వేతనం రైతు కూడా ఇవ్వాలనుకుంటున్నారు వాళ్లు. ఫలితంగా కూలీ రేట్లు రైతులకు మోయలేని భారమయ్యాయి. దీని ప్రభావం వారిపై ఎలా ఉందో వచ్చేవారం తెలుసుకుందాం.

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Saturday, December 4, 2010

తిండి తిప్పలు * అన్నం తిందామా ..... సున్నం తిందామా.... ?

ఆహార ధరలు ఆకాశాన్నంటితే మనలో మనకే ఒక అనుమానం వస్తుంది. అన్నం తిందామా లేక సున్నం తిందామా అని. 1970ల తర్వాత ఆహార ధాన్యాల ధర ఇంతగా పెరగటం ఎప్పుడూ లేదు. ముఖ్యంగా గత రెండేళ్లలో.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాధారణ ధరల సూచీ (జనరల్ ప్రైస్ ఇండెక్స్) తక్కువగానే ఉన్నా, ద్రవ్యోల్బణం సైతం 1-2 శాతం మాత్రమే ఉన్నా ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 20 శాతం పెరిగినట్టు పోయిన ఏడాది ఆర్ధిక నివేదికలు చెపుతున్నాయి (బిజినెస్‌లైన్ 23, ఫిబ్రవరి 2010. సి. పి. చంద్రశేఖర్, జయతి ఘోష్).
ఆహార ధరలు పెరగటం ఇండియాలో మరీ కొత్తేమీ కాదు. కాని నాకు బాగా గుర్తు- గతంలో తిండిగింజల ధరలు పెరిగినప్పుడు ఒకటో రెండో నిరసనలు వినపడేవి. సామాజిక స్ఫూర్తి కలిగిన ప్రమీల దండావతే లాంటి వాళ్ల నిరసనలో లేదా వర్షాలు వచ్చో ధరలను తాత్కలికంగానైనా తగ్గించేవి. తరువాత షరామామూలే. కాని ప్రస్తుతం ధరలు ఏమాత్రం తగ్గేట్టుగా కనపడటం లేదు. అవి అలాగే నిలిచిపోయేలా ఉన్నాయి. నేనుండే కుగ్రామం వెంకట్రామపురంలో కూడా కూరగాయల ధరలు కిలో రూ.20-30 పలుకుతున్నాయి. వరి, గోధుమలు గవర్నమెంటు గోడౌన్లలో నిండి ఉన్నా కూడా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇట్లా ధరలు పెరగటానికి కారణం గోడౌన్ల లోని ధాన్యం ప్రజలకి చేరవేయడంలో ప్రభుత్వం విఫలమవ్వటమే ననిపిస్తుంది.

రెండేళ్ల క్రితం పెసరపప్పు ధర కిలో రూ.37 ఉండగా ప్రస్తుతం అది రూ. 88. ఈ రెండేళ్లలో కందిపప్పు ధర 71 శాతం పెరిగింది. 2008లో మినప్పప్పు ధర కిలో రూ. 40 ఉండగా ఇప్పుడు రూ.80 కి చేరింది. పంచదార ధర కూడా అంతే, 2008లో కిలో రూ. 17 కు లభిస్తే ఇప్పుడు రూ.38 కి చేరింది. పాలు కూడా ప్రియమైపోతున్నాయి. పాల ధరలు 21 శాతం పెరిగిపోయాయి. కూరగాయల ధరలు 4 శాతం, పండ్ల ధర 13 శాతం పెరిగాయి (ఇండియాటుడే 23 ఆగస్టు 2010).

ఇప్పుడు చెప్పండి... అన్నం తిందామా లేక సున్నం తిందామా? సున్నమే చవకేమో. ఆహార ధాన్యాల ధరలు ఇలా పెరగటానికి కారణాలేమిటి? చమురు ధరలు పెరగటమే ఆహార ధాన్యాల ధరలు పెరగటానికి ప్రధాన కారణంగా చూపుతుంది ప్రభుత్వం. నిజమే, పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు ఆహారధరలకు ఆజ్యం పోసినట్లయింది. కాని ఆహార ధరల పెరుగుదల ఇంకా అనేక మౌలిక అంశాలతో ముడిపడి ఉన్నది. మొదటిది ఆహార ధాన్యాల దిగుబడి తగ్గడం.. అందునా పప్పులు, నూనెగింజల పంటల దిగుబడి తగ్గటం. వాటిని విదేశాల నుండి దిగుమతి చేసుకోవటం ద్వారా కొరతను తగ్గించారు. అయితే వరి, గోధుమ పంటల దిగుబడి కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు పెరగట్లేదు. నిజానికి స్వాతంత్య్రం వచ్చాక మన తలసరి ధాన్యాల లభ్యత తగ్గింది. ఎందుకు? ఎందుకంటే జనాభా పెరుగుతున్నదే కాని వ్యవసాయ భూమి విస్తరణలో గాని సగటు ఎకరా దిగుబడిలో గాని పెరుగుదల లేదు.

గత 15 ఏళ్లలో సాగులోకి వచ్చిన భూమిని ఒక్కసారి గమనిస్తే... 1995-96లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం సాగుభూమి సుమారు 100 లక్షల హెక్టార్లు. అందులో నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి 36-46 లక్షల హెక్టార్లు. ఒకటి కంటే ఎక్కువ పంటలు పండే భూమి ఈ పదిహేనేళ్లలో 40 నుంచి 60 శాతానికి పెరిగింది. అంటే ఓ పక్క నీటిపారుదలపైఆధారపడే సాగు పెరుగుతోంది. దాంతోపాటు వ్యవసాయం చేయకుండా పడావ్ (బీడు) పెట్టిన భూమీ పెరుగుతోంది. 1955-56లో 7లక్షల హెక్టార్లున్న పడావ్ భూమి 2000-01లో 14 లక్షల హెక్టార్లకు, 2008-09 నాటికి 26 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇంతకూ ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయి?

రైతులు చెప్పేదేమిటంటే నీళ్లుంటేనే పంటలకు భరోసా ఉంటుంది. కాబట్టి రైతులు నీటిపారుదల వ్యవసాయాన్నే చేస్తామంటున్నారు. నీటిపారుదల సౌకర్యం లేని, వర్షాధారిత భూముల్లో వ్యవసాయం చేయటం వల్ల రాబడి పెద్దగా ఉండడం లేదు కాబట్టి ఆ భూములను వదిలేస్తున్నారు. ఫలితంగా బీడు భూములు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్లయితే ఈ బీళ్లను తోటల కిందకు మార్చేస్తున్నారు. వాటిలో మామిడి (టెక్నికల్‌గా ఆహార పంటే అయినా ఇవి సంవత్సరానికి ఒకేసారి, అదీ కొన్ని రోజులు మాత్రమే కాస్తాయి కదా. దీని బదులు పప్పులు, నూనెగింజలు కనక వేసినట్లయితే సంవత్సరమంతా తినొచ్చు), జీడి మామిడి, కొబ్బరి, సుబాబుల్, యూకలిప్టస్ మొదలైన తోటలు పెంచుతున్నారు. ఒకసారి చెట్లను పెంచాక ఇక ఆ భూముల్లో మరేరకమైన ధాన్యాలను కానీ, చిరుధాన్యాలను కానీ, పప్పుధాన్యాలను కానీ, నూనె గింజలను కానీ, మరే ఇతర రోజువారీ పంటలను కానీ పండించడానికి వీలు కాదు. ప్రభుత్వం కూడా ఈ రకమైన 'క్యాష్ క్రాప్స్'నే పండించమని రైతుల్ని ప్రోత్సహిస్తోంది. ఆహార పంటల సాగుతో పోలిస్తే పత్తి లాంటి వ్యాపార పంటలు, మామిడి, సుబాబుల్ లాంటి తోటలు పెంచడంలో ఎటువంటి చికాకులు, తలనొప్పులు ఉండవు. అందుకే రైతులు ఆ పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.  
దీనంతటి ఫలితమే ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల.


- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Gouthamaraju as WUA