పాడి పంటలు

Tuesday, April 19, 2011

హంస! * చిక్కటి పాలవంటి విలువలకు, ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే ‘రిలేషన్‌షిప్స్’

పాలూ నీళ్లను వేరుచేస్తుంది హంస.
నీళ్లు కలపని పాలు పోస్తుంది కాళ్లకూరు.
కాకిలా బతకొద్దనీ, కల్మషాలు కూడదనీ...
కష్టపడి పని చేయాలనీ చెబుతోంది.
ఆచరిస్తోంది.
అందుకే అది హంసలాంటి ఊరు అయింది.
ఆ ఊరికి ఇంతటి సంస్కారాన్ని నేర్పింది...
అమ్మమాటను జవదాటని పుత్రధర్మం, కన్నఊరిని మరువలేని ఒక బాంధవ్యం!
చిక్కటి పాలవంటి విలువలకు,ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే  - ఈ  ‘రిలేషన్‌షిప్స్’

చుక్క నీరు కలపకుండా చిక్కని పాలు పోసే వాళ్లు దొరికితే ఏం చేస్తాం? బహుశా ‘నీతిరత్న’ అనే బిరుదు ఇచ్చి సన్మానం చేస్తామేమో! అలాగైతే కాళ్లకూరు గ్రామంలోని రైతులు ఆ బిరుదు అందుకోవడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే ఈ గ్రామంలో వందలాది మంది పాల రైతులు నీళ్లు కలపని చిక్కని పాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ వేగేశ్న పృథ్వీరాజు (72)కు ఐదేళ్ల క్రితం వచ్చిన ఆలోచనతో అంకురించిన కాళ్లకూరు పాల ఉత్పత్తిదారుల సంఘం(కె.ఎమ్.పి)... పాలలో నీళ్లు కలపకపోవడంలోనే కాదు, ఆలోచనల్లో నిజాయితీని కలపడంలోనూ ముందుంది. ఈ సంఘస్థాపన ఒక ప్రయోగమని, అందుకే దీనిని ‘కాళ్లకూరు ప్రయోగం’ అని పేర్కొంటున్నామని పృథ్వీరాజు చెప్పారు.
అమ్మ ‘ఊరు’ కోలేదు...
పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్లకూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వేగేశ్న పృథ్వీరాజును ఉన్నత చదువులు, ఉద్యోగాలు విదేశాలకు తీసుకువెళ్లినా... జన్మనిచ్చిన పల్లెటూరు, దాని జ్ఞాపకాల నుంచి దూరం జరపలేకపోయాయి. దాదాపు నలభైఏళ్ల పాటు పుట్టిన ఊరుకు దూరంగా గడిపిన పృథ్వీరాజు, తన తండ్రి మరణించారన్న సమాచారంతో కాళ్లకూరుకు వచ్చారు. తిరిగి వెళ్లబోతుంటే... ‘‘నావి చివరి రోజులు నాయనా... నా తుదిశ్వాస విడిచే వరకూ నన్ను విడిచిపోకు’’ అంటూ తల్లి కోరారు. ఆమె కోరికను మన్నిస్తూ ఒక రోజు రెండ్రోజులు కాదు.. ఆరేళ్ల్ల పాటు తల్లి దగ్గరే ఉండిపోయారు. ఆ సమయంలోనే పృథ్వీరాజుకు ఆ ఊరు తను మునుపటిలా లేదని తెలిసింది. తను తప్పటడుగులు వేసిన చోట... అనేక మంది తప్పుటడుగులు వేస్తున్నారని అర్థమైంది. కష్టాన్ని అసహ్యించుకోవడం, తాగుడు, అబద్ధాలు, నోటుకు ఓటును అమ్ముకోవడం, పరస్పరం మోసాలు చేసుకోవడం... వంటి ఆధునిక ప్రపంచపు అవలక్షణాలన్నీ అమాయక పల్లెను వశం చేసుకుంటున్నాయని అర్థమైంది. దాంతో తన వంతుగా పుట్టిన ఊరిబాగు కోసం ఉపక్రమించారు.

విదేశాల్లో స్థిరపడిన తొలి రోజుల్లోనే తను స్థానిక పెద్దల సహకారంతో ప్రారంభించిన ‘సత్య సేవాట్రస్ట్’కు తన సంపాదన లోంచి రూ.25లక్షల్ని అప్పట్లో పృథ్వీరాజు కేటాయించారు. అత్యవసర సమయాల్లో గ్రామస్థులను ఆర్థికంగా ఆదుకోవడమే దీని లక్ష్యం. అయితే అది అంత మంచి ఫలితాన్నివటం లేదని ఆయన గ్రహించారు. పేదరికం పోవాలంటే వారికి చేయాల్సింది ఆర్ధికసాయం కాదని, చూపాల్సింది ఆదాయ పొందే మార్గమని అర్థం చేసుకున్నారు.

పల్లె ప్రయో‘జనం’ కోసం
కష్టపడడం, నిజాయితీగా సంపాదించిన దానిలోకొంత తోటివారి మేలుకు ఉపయోగించడం, కలసికట్టుగా ఊరిని అభివృద్ధి పథంలో నిలపడం... ఈ లక్ష్యాలతో చేపట్టిందే కాళ్లకూరు ప్రయోగం. దీనిలో భాగంగా మొదట ఒక పాల సేకరణ కేంద్రాన్ని పృథ్వీరాజు నెలకొల్పారు. నీళ్లు కలపని పాలకు తగిన రేటు కట్టి ఇస్తూ పాల రైతులను సంఘటితం చేశారు. పాలలో నీళ్లు కలపకపోవడం, ఓటును అమ్ముకోకపోవడం.. వంటి విలువలకు కట్టుబడితేనే... ‘సంఘంలో సభ్యత్వం’ అని షరతు విధించి, హామీ పత్రం తీసుకున్నారు. ట్రస్ట్ తరపున గేదెలు కొనే స్థోమత లేని వారికి రుణాలు అందించారు. ‘‘మేం యాచకులం కాము పోషకులం’’ అని మా ఊరివాళ్లు సగర్వంగా చెప్పుకునేలా ఈ ప్రయోగాన్ని చేపట్టాం’’ అని పృథ్వీరాజు అంటారు. పాలను విక్రయించగా వచ్చిన లాభాలను కూడా ప్రతి ఏటా పాల రైతులకే బోనస్‌గా ఇవ్వడం ఈ కేంద్రం మరో ప్రత్యేకత.

‘‘గత ఏడాది ఇలా వచ్చిన రూ.1.60 లక్షల్ని రైతులకి అందించాం’’ అని పృథ్వీరాజు చెప్పారు. అంతే కాకుండా ప్రతి లీటరు అమ్మకం విలువ నుంచీ మూడు పైసల్ని విరాళంగా ఇవ్వాలనేది మరో నిబంధన. ‘‘ఆ మూడు పైసల విరాళం నుంచి గ్రామంలో 50 మందికి పైగా వృద్ధులకు కొద్ది మొత్తంలో పింఛన్లు అందిస్తున్నాం. అలాగే రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్లాంట్ కోసం తీసుకున్న రుణాన్ని కూడా అందులోంచే తిరిగి చెల్లిస్తున్నాం’’ అని తెలిపారు ఆయన. ఈ ప్లాంట్ ద్వారా కాళ్లకూరు గ్రామంలోని ఎనిమిది పాఠశాలల్లో చదువుకుంటున్న 450 మంది విద్యార్థ్ధులకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నారు. ‘‘మూడు పైసల పవిత్రతగా దీన్ని మేం పేర్కొంటున్నాం. ఎందుకంటే ఇది కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బు. అంతే పవిత్రమైన కార్యక్రమాలకు ఇది ఉపయోగిస్తున్నాం’’ అని సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి.రామరాజు అన్నారు.

పృథ్వీరాజు ప్రవేశపెట్టిన ప్రయోగం త్వరితంగానే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. కేవలం పది మందితో ప్రారంభమైన పాల ఉత్పత్తిదారుల సంఘం... రెండొందలకి చేరింది. నాలుగేళ్లుగా స్థానికులు సాధిస్తున్న సమష్టి ప్రగతి సమీప గ్రామాలకూ అనుసరణీయంగా మారుతోంది. ప్రస్తుతం వీరి బాటలోనే దొడ్డనపూడి గ్రామస్థులు కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ‘‘ఇక్కడి రైతుల చేత విరివిగా కూరగాయలు సాగు చేయించి వాటికి కూడా ఇలాగే మంచి రేటు వచ్చేలా చేయడం, తర్వాత తర్వాత రైసు మిల్లర్లకు లాభాల పంట పండిస్తున్న వీరి కష్టాన్ని వీరే అనుభవించేలా చేయడం... వంటి మరికొన్ని లక్ష్యాలు కూడా మాకు ఉన్నాయి’’ అని పృథ్వీరాజు వివరించారు.

మసకబారిపోతున్న తన స్వచ్ఛతను ఇపుడు ఒక పల్లె తిరిగి సముపార్జించుకుంటోంది. తమ కష్టమే పెట్టుబడి చేసుకుని నీతిగా బతకగలమనే నూతన ధైర్యాన్ని సంతరించుకుంటోంది. అమ్మకు ఇచ్చిన మాట కోసం ఆరేళ్ల పాటు తన పల్లెలో ఉండిపోయిన పృధ్వీరాజు... అమ్మ ఆశ నెరవేర్చారు. అమ్మలాంటి ఊరును మార్చారు. అందుకు అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది. ఏ లోకాన ఉన్నా కుమారుడి ఆశయం నెరవేరాలంటూ దీవెనలు అందిస్తుంది.


పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం ఎంత తప్పో... నోటుకు ఓటు అమ్ముకోవడం ఎంత ముప్పో... ఇపుడు మా గ్రామస్థులకు అర్ధమవుతోంది. నీతిగా నిజాయితీగా ఉండడం గ్రామానికి మంచి చేస్తోం ది. ఇపుడు ఎన్నో మంచి పనులు చేసుకోగలు గుతున్నాం. - సుబ్బరాజు, కె.ఎం.పి సభ్యుడు, కాళ్లకూరు

సంఘంలో చేరాక మేం తీసుకువచ్చే చిక్కని పాలకు తగిన రేటు వస్తోంది. మా ఊరిలో ఉన్న ముసిలోళ్లకి కొంచెం పింఛను డబ్బులు కూడా వస్తున్నాయి. అందరం ఒక మాట మీద ఉండడం వల్ల ఊళ్లో అందరికీ లాభం కలుగుతోంది. - సీతారాముడు, కె.ఎం.పి సభ్యులు


- ఎస్.సత్యబాబు

Sunday, March 13, 2011

ద్రాక్షరత్న

నాకు ఎక్కువ పేరొచ్చింది విదేశాల్లోనే!

"నాకు ఎనిమిదేళ్ల వయసుండగా నాన్న ముత్యం రెడ్డి అల్వాల్‌లో వందెకరాల ఆసామిగా ఉండేవారు. కాయగూరలు, వరి సాగు చేస్తుండేవారు. నేను పన్నెండో తరగతి చదివాక ఏదైనా ఉద్యోగం చేసుకోమన్నారు మా వాళ్లు. కాని నాకు వ్యవసాయరంగం అంటే చాలా ఆసక్తి. అప్పటికే మా పొలం పక్కన గోదావరి జిల్లా వాసులైన మంతెన ఆదినారాయణ రాజుకి ద్రాక్షతోట ఉండేది. వారికి లక్షల్లో ఆదాయాలు వచ్చేవి. ' ఏంటి రెడ్డిగారు..ఎన్నాళ్లు ఈ వరీ,కూరగాయలు...ద్రాక్ష పెట్టకూడదూ' అన్నారాయన.

పక్కనే ఉండటంతో ద్రాక్షసాగు విషయాలన్నీ తెలుసుకున్నాం. నాన్నకు తోడు నేను, అన్నయ్య శంకర్‌రెడ్డి ద్రాక్షసాగులోకి దిగాం. మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాతావరణం అనుకూలించడంతో ముందుకు సాగాము. అల్వాల్, గోధుమకుంట, కీసర, రాంపల్లి....ఇలా చాలా చోట్ల భూములు తీసుకుని ద్రాక్షసాగు చేశాం. మమ్మల్ని చూసి చాలామంది ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో బాగానే ఆదాయం కళ్ల చూసినా..రాను రాను నష్టాల రుచి కూడా చూశారు. దాంతో మెల్లగా కొందరు రైతులు ద్రాక్షకు గుడ్‌బై చెప్పారు. కొందరంటే ఒకరిద్దరు కాదు రియలెస్టేట్ బూమ్‌లో పడి చాలామంది ద్రాక్షకు దూరమయ్యారు.

ద్రాక్ష రత్న అవార్డు...

ఎవరు ఏ కారంణంతో పక్కకు జరిగినా...మేము మాత్రం ద్రాక్ష తోటలోనే నడిచాం. ద్రాక్షసాగులో నేర్చుకున్న మెళకువలు రంగారెడ్డి జిల్లాలో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పలుకుబడే గ్రేప్ గార్డెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని చేసింది. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ వంటి విషయాల్లో చాలామంది రైతులు నా వద్ద సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు. జిల్లాలో పెద్దఎత్తున ద్రాక్ష పండిస్తున్న రైతుగా నన్ను గుర్తించి 1990లో గవర్నరు ద్రాక్షరత్న బిరుదును ప్రదానం చేశారు.

సేంద్రీయ ద్రాక్ష...

లాభాలకోసం రైతులు రసాయనాల వెంటపడడం మొదలుపెట్టాక లక్షరూపాయలయ్యే పెట్టుబడి రెండు లక్షలకు పెరిగింది. ఎంతో ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన రైతులు అకాలవర్షాల వల్ల, తుఫాన్ల వల్ల నష్టాలబాట పట్టాల్సి వచ్చింది. దాంతో చాలామంది రైతులు ద్రాక్షకు దణ్ణం పెట్టారు. నేనూ అలా దెబ్బ తిన్నవాణ్ణే. సమస్యను చూసి పారిపోవడం కన్నా..పరిష్కారం కనుగొని పదిమందికి ఆదర్శంగా నిలవాలని అనుకున్నాను. ద్రాక్షసాగుకి కావాల్సింది ఎన్‌పికే( నైట్రోజన్,ఫాస్పరస్, పొటాషియం). ఇవన్నీ కూడా రసాయనాల రూపంలో చెట్టుకు అందిస్తున్నాం. ఈ పోషకాలను సహజసిద్దంగా తయారుచేయగలిగితే చాలనుకున్నాను. ద్రాక్ష చెట్లమధ్య మొలిచే గడ్డిని ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రంగా ఉంచుతారు.

నేను అలా చేయకుండా గడ్డిని అలాగే వదిలేసాను. వానాకాలం ఏపుగా పెరిగేది, ఎండకాలం ఎండిపోయేది. అలా ఎండిన గడ్డి వర్షాకాలంలో కుళ్లిపోయేది. కుళ్లిన గడ్డికింద ఉన్న మట్టిలో వానపాములు చేరేవి. చెట్టుకు కావలసిన ఎరువు దొరికిందనుకున్నాను. ఎందుకంటే ఒక వానపాము ఆయుఃప్రమాణం 120 రోజులు. రోజూ వందల సంఖ్యలో పుట్టుకొచ్చే వానపాములు రోజుల వ్యవధిలోనే చనిపోతూ ఉంటాయి. ఇలా చనిపోయిన వానపాముల వల్లే ఎన్‌పికే తయారవుతుంది. నేల పైపొరలో చనిపోయిన వానపాముల్ని తినడానికి రెండు మూడు అడుగుల లోతునుంచి రకరకాల సూక్ష్మజీవులు వస్తాయి.

వీటి వల్ల మట్టి గుల్లబడుతుంది. చెట్టు ఆరోగ్యంగా ఎదగడానికి కావలసిన పక్రియ అది. చెట్టు మొదలు దగ్గర ఒక గంప పేడ వేసి డ్రిప్‌లతో నీళ్లు పెట్టి వదిలేసాను. చెట్టుకు ఇంజెక్షన్లు ఇచ్చి కాపాడుకునే పరిస్థితికి నేను కనిపెట్టిన ఈ విధానం తిరుగులేని ప్రత్యామ్నాయమైంది. రెండేళ్ల పాటు ఈ సహజపద్ధతిని పాటించాను. మునుపెన్నడూ లేని దిగుబడిని చూశాను. దురదృష్టం ఏంటంటే...అందరూ వచ్చి నా సేంద్రీయ ద్రాక్షను చూశారు, తిన్నారు కాని ఏ రైతు కూడా నేను చేసిన ప్రయోగం చేయడం లేదు.

విటమిన్ ఎ బియ్యం...

ద్రాక్షపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాక...నా దృష్టి వరిపైకి మళ్లింది. 2004లోనే వరిసాగులో అధిక దిగుబడితో ఆరోగ్యకరమైన ఆహారం పండించాలని అనుకున్నాను. మనం తినే ఆహారంలో ఆరోగ్యంకన్నా, హాని ఎక్కువున్నదని పరిశోధకులు మొత్తుకుంటున్నారు. కారణం పంటలకు వాడే రసాయనాలు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా...ఒంటికి సరిపడా ఆహారం కావాలన్నా ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని తినాలి. వాటి బదులు మనం తయారుచేసుకున్న టాబ్లెట్లు, టానిక్‌లు తింటే ఏమవుతుంది. ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది. ఆ తరువాత ఒళ్లంతా మందులమయమైపోయి జీవకళ పోతుంది. అలాగే విత్తు మొలిచే చోట రసాయనాలు గుమ్మరిస్తే నేలంతా నిస్సారమవుతుంది.

దిగుబడులు రాకపోగా...రసాయనాలతో పండించే ఆహారాన్ని తినాల్సివస్తుంది. ప్రస్తుతం రైతులందరూ చేస్తున్నది ఇదే. అప్పటివరకూ బీడుగా ఉన్న నేలలో మొదటిసారి వరి నాటితే పంట దిగుబడి అద్భుతంగా వస్తుంది. దానికి ఎలాంటి మందులు వేయక్కర్లేదు. ఎందుకంటే మట్టిలో సారం ఎక్కువగా ఉంటుంది. అదే నాలుగు పంటలయిన తర్వాత సారం పోతుంది కాబట్టి రసాయనాలపైన ఆధారపడాల్సి వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు తల్లిని బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోమని చెబుతారు డాక్టర్లు. ఈ సూత్రాన్ని వరి పంటకు వాడాను. సేంద్రీయ ఎరువులు వేసి వరి నాటాక... వరి పొట్టకు వచ్చే సమయంలో సహజంగా పొలం బీటలు వారుతుంది. ఆ సమయంలో నీళ్లు, రసాయన ఎరువులు బాగావేస్తే గింజ తోడుకుంటుంది. మట్టిలో బలం ఉంటేనే... లేకపోతే తోడుకోవు. నేను దీనికి ప్రత్నామ్నాయం ఆలోచించాను.

నీటిలో మట్టి కలిపి...
వరి నాటే ముందు ఒక్కొక్క మడిలో ఒక్కో చోట పది అడుగుల లోతు గొయ్యి తవ్వి ఎకరానికి టన్ను చొప్పున మట్టి తవ్వి పక్కన పెట్టుకోవాలి. ఆ గోతిలో మడిలో ఉన్న పైపైన మట్టిని వేసి పూడ్చేయాలి. వరి పొట్టకు వచ్చే సమయంలో మడుల్లోకి పారే నీళ్లలో ముందుగా తీసి పెట్టుకున్న మట్టిని కలపాలి. దీనికి మోటారు దగ్గర ఒక నీళ్లట్యాంకుని కట్టుకుని అందులో మట్టి కలుపుకోవాలి. పంట కోతకు వచ్చే లోపు ఈ పద్ధతిలో నాలుగైదు తడులు పెట్టాలి. మనం వేసిన కొత్త మట్టిలో ఉన్న సారమంతా నీళ్ల ద్వారా పొలంలోకి వెళుతుంది. దీని వల్ల చేను ఎండినా బీటలు రాకుండా ఉంటాయి. మట్టిలో ఉన్న బలమైన పోషకాలు గింజని గట్టిపడేలా చేస్తాయి. ఇలా పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న పరిశోధకులు కొన్ని రోజులపాటు చేసిన పరిశోధనలో తేల్చారు.

అరవై దేశాల్లో అంగీకరించాయి...

నేను పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన పరిశోధకులు నిర్ధారించాక, ఈ అంశంపై 32 పేజీల రికార్డు రాసి జెనీవాలోని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు పంపాను. అక్కడ మొదట 35 దేశాల కూటమి నేను పంపిన అంశంపై ప్రత్యేక అధ్యయనం చేసింది. ఎనిమిది నెలల తర్వాత నా బియ్యంలో విటమిన్ ఎ ఉందని అంగీకరించి ఆయా దేశాల్లో నాకు పేటెంట్ హక్కులు కల్పించారు. యూరప్ వెబ్‌సైట్‌లో నా పరిశోధన గురించి వివరంగా పెట్టారు. నేను మొత్తం 75 దేశాలకు నా పరిశోధన వివరాలు పంపిస్తే దాదాపు 60 దేశాలు నా ప్రయోగాన్ని అంగీకరించి వారి దేశాల్లో పేటెంట్ హక్కుల్ని కల్పించాయి. 2006లో మన రాష్ట్రం వచ్చిన జార్జ్‌బుష్ నాతో ప్రత్యేకంగా ఈ విషయం గురించి మాట్లాడారు.

నా ఆరోగ్యమే నిదర్శనం...

2003 నుంచి నేను ఈ సేంద్రీయ వరి పంటనే పండిస్తున్నాను. అప్పటి నుంచి మా ఇంట్లో ఇవే బియ్యాన్ని తింటున్నాం. నాకు కంటిచూపు తగ్గడంతో అద్దాలు వాడేవాడిని. అలాంటిది నాలుగేళ్ల నుంచి అద్దాలు లేకుండానే పేపరు చదువుతున్నాను. అప్పటివరకూ ఉన్న మోకాళ్ల నొప్పులు, అజీర్తి, ఆయాసం వంటి జబ్బులన్నీ ఎగిరిపోయాయి. నాలో నాకు తెలియని కొత్త శక్తి వచ్చింది. రసాయనాలతో పండించిన ఆహారానికి, సహజ పోషకాలతో పండిన ఆహారానికి ఉన్న తేడాని నేను స్వయంగా చూశాను. ఈ బియ్యాన్ని ఎవరు తిన్నా...తినకపోయినా ముందుగా మన దేశంలో ఉన్న రైతులందరూ తినాలి. వాళ్లు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే ఈ పంటపై పేటెంటు హక్కుని పొందినప్పటికీ రైతులు పండించుకుని తినడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు.

విత్తే మిషన్ వచ్చింది...

వరి పంటపై చేసిన ప్రయోగం ముగియగానే వరినాటుని సులభతరం చేసుకోవాలని అనుకున్నాను. రోజురోజుకూ పెరుగుతున్న కూలీల కొరత, మొలకల ఎదుగుదలలో మిషన్ చేసే సాయం వంటి విషయాలపై ఆలోచించాను. ఒకచోట వేసిన నారుని తీసి మరో చోట నాటడం వల్ల వేళ్లు తెగి, అవి మళ్లీ భూమిలోకి వెళ్లి అప్పుడు పిలకలు వేయడం దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అలాగే వరి కర్రలు కూడా చాలా తక్కువగా వస్తాయి. అందుకే ఒకటే విత్తుని విత్తితే అది మొక్క మొలిచి తనకున్న స్థలంలో చక్కగా వేళ్లూనుకుని పదుల సంఖ్యలో పిలకలు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఒక్కొక్క గింజ నాటడం చాలా కష్టం. దీని కోసం ఒక మెషిన్ తయారుచేశాను. దీని వల్ల నేరుగా గింజభూమిలోకి వెళుతుంది. అదే సమయంలో గింజకు రెండువైపులా నేలను చదును కూడా చేస్తుంది. ఈ మిషన్‌తో ఒక్క వరి విత్తనాలే కాదు గోధుమ, సజ్జ, మొక్కజొన్న, పెసలు, మినుములు...అన్ని రకాల విత్తనాలు సులువుగా నాటుకోవచ్చు. ఈ మిషన్‌కి పేటెంట్ కోసం చెన్నైలోని పరిశోధనా సంస్థకు పంపించాను. వారు నా మిషన్ గురించి వారి వెబ్‌సైట్‌లో పెట్టారు. అది చూసిన అమెరికావాళ్లు అక్కడ తమ దినపత్రికలలో రాశారు.

జూ భువనేశ్వరి
ఫొటోలు: సాయి

Friday, February 4, 2011

‘ ప్రగతి ’లో సహజ సేద్యం!


ప్రత్యేక మడుల్లో ఆదర్శప్రాయంగా
సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగు
ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), పంచగవ్య,
వేపనూనెతో పచ్చని కూరల పెంపకం
ఇటుకలు, చెక్క ముక్కలు, పెంకులతో
విభిన్నంగా మడుల తయారీ
కూరగాయల సహజ సేద్యం గురించి ఒక్క రోజులో తెలుసుకోవచ్చు!


ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మడుల్లో సహజమైన పద్ధతుల్లో ఆకుకూరలతోపాటు ఏ రకం కూరగాయలైనా ఆరోగ్యదాయకంగా పెంచుకోవచ్చని ప్రగతి రిసార్ట్స్ నిరూపిస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ వేలాది జాతుల ఔషధ మొక్కలు, చెట్లతో కూడి జీవవైవిధ్యంతో పచ్చగా అలరారుతోంది.


ప్రగతి సీఎండీ డాక్టర్ జీబీకే రావు, సీనియర్ వృక్ష శాస్తవ్రేత్త డాక్టర్ ఎస్వీ రామారావు పర్యవేక్షణలో దాదాపు 15 రకాల ఆకుకూరలు, కూరగాయలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మడుల్లో ముచ్చటగా పెంచుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహం పైన నాలుగేళ్లుగా కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్న జీబీకే రావు ఇటీవల తన రిసార్ట్స్‌లోనూ ప్రారంభించారు. హార్టికల్చర్ ఎక్స్‌పోలో ‘ప్రగతి’ ఇటీవల రెండు అవార్డులు దక్కించుకుంది.

ప్రత్యేకతలెన్నో...

ప్రగతి కిచెన్ గార్డెన్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. మట్టి ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, చెక్క ముక్కలు, పగిలిన పెంకులు, విరిగిన నాపరాళ్లు, విరిగిన టైల్స్ వంటి అందుబాటులో ఉన్న సామగ్రిని వినియోగించి తక్కువ ఖర్చుతో మడులను ఏర్పాటు చేయడం భలే బాగుంది.

ప్రత్యేకంగా తయారుచేసుకున్న ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), వర్మీ కంపోస్ట్, ఎరమ్రట్టితో కూడిన ప్రత్యేక మట్టి మిశ్రమం.. పంచగవ్య (15 రోజులకోసారి.. 3 శాతం పంచగవ్యను 97 శాతం నీటిలో కలిపి), వేప నూనె (నెలకోసారి.. 5 మిల్లీలీటర్ల వేపనూనెను లీటరు నీటిలో కలిపి) వంటి సహజ సస్య రక్షణ ఉత్పత్తులతోనే ఈ మడుల్లో సాగు చేస్తుండడం విశేషం. ప్రత్యేక మట్టి మిశ్రమం వాడుతున్నందున పంట దిగుబడి సాధారణ నేలలో కన్నా ఎక్కువగా వస్తున్నాయి.


మడుల్లో అధిక దిగుబడి

ఒక్కో టమాటా మొక్క సాధారణంగా 45 రోజులపాటు కాయలు కాస్తుంది. ప్రత్యేక మడిలో పోషకాలు నేలలోకన్నా బాగా అందుతాయి. కాబట్టి 60 రోజుల పాటు కాయలు కాస్తుందని, ఒక్కో మొక్క 20 నుంచి 25 కిలోల దిగుబడినిస్తుందని డాక్టర్ రామారావు ‘ఇంటి పంట’ ప్రతినిధితో చెప్పారు. టమాటా మొక్కలను రెండు అడుగులకో మొక్కను నాటాలన్నారు. ప్రత్యేక మడిలో వాడే మట్టి మిశ్రమం మొక్కకు వేళ్లు బాగా ఏర్పడేందుకు సాయపడుతుందని, పోషకాలు పుష్కలంగా అందడం వల్ల చక్కటి దిగుబడి ఇస్తుందని ఆయన తెలిపారు. మడులు ఏర్పాటుచేసుకున్న మొదటి పంట దిగుబడి అంతబాగా రాదని, లోపాలు సరిదిద్దుకుంటే ఆ తర్వాత నుంచి మంచి దిగుబడి తీయవచ్చన్నారు. అన్నిటికీ మించి అత్యంత ఆరోగ్యదాయకమైన, రుచికరమైన పంటలను ఇలా పెంచుకోవచ్చన్నారు. సహజాహారం ప్రాధాన్యం తెలుసుకున్న వారికి ఇంటి దగ్గర మడులలో, కుండీల్లో సాగుచేయడం సులువేనని రామారావు చెప్పారు. సందేహాలున్న వారు తనకు ఫోన్ చేయవచ్చని డాక్టర్ రామారావు (99484 39329) తెలిపారు.

ఒక్క రోజు శిక్షణ చాలు!
అందరూ తమ కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో కనీసం 50 శాతం మేరకైనా ఇంటిపట్టున పండించుకోవాలని డాక్టర్ జీబీకే రావు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరడంతో పాటు, కూరగాయల రవాణాకు వాడే ఇంధనం ఆదాతో పర్యావరణపరంగా దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. కిచెన్ గార్డెనింగ్‌పై తమ రిసార్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ హార్టికల్చరిస్ట్ ప్రవీణ్‌ను *  91601 75197 నంబరులో సంప్రదించవచ్చన్నారు. కనీసం పది మంది అడిగితే ఏ రోజైనా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.

సహజ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి

ప్రభుత్వం సహజ సేద్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ రావు అన్నారు. రసాయనిక సేద్యాన్ని భారీ సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ప్రపంచం యావత్తూ ఆదరిస్తున్న సహజ సేద్యాన్ని, దీనిపై పరిశోధనను విస్మరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఏ పార్కులోనో, ఖాళీ స్థలమో కేటాయించి ప్రోత్సహిస్తే శిక్షణ కేంద్రాలు నెలకొల్పడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రైవేటు సంస్థలను సైతం ప్రభుత్వం తగురీతిలో ప్రోత్సహించాలన్నారు.

Monday, January 31, 2011

వలస బతుకుల్లో తులసి కాంతులు * మార్పు తెచ్చిన తులసి సాగు...* మహిళలు సాగించిన తులసి విప్లవం

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్ప మరేమీ ఉండేవి కావు. పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్‌ లేవు.సరైన పోషకాహారం లేదు. భర్తలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఆదాయం అంతంత మాత్రమే. ఈ దృశ్యం ఒక దశాబ్దం కిందటిది. పదేళ్ళు గిర్రున తిరిగేసరికి ఇప్పుడక్కడ అంతా ఆనందమే.ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు, అన్ని రకాల వసతులతో కూడుకున్న ఆ గ్రామాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. సుమారు 300మంది మహిళలు సాగించిన తులసి విప్లవం వారి జీవితాలనే మార్చేసింది.

tulasi1 
1998.. ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌ జిల్లాలో ఉన్న మహిళ లు అంతవరకు తమ గ్రామంలో చేస్తున్న వ్యవసాయంలో సమూలమార్పులు తీసుకు రావడానికి నడుం బిగించారు. తద్వా రా తమ జీవితాలతో పాటు తమ కుటుంబాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకో వాలని సంకల్పించారు. వీరంతా వలస జీవితం గడిపే కార్మికుల భార్యలు. వారంతా కుటుంబ సభ్యులను ఊరిలోనే వదిలేసి ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళుతుంటారు. అనే క ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తుంటారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో మాత్రమే సొంత గ్రామానికి వచ్చి పనులు చేసుకుంటారు.

అలా ఓసారి అందరూ కలిసినప్పుడు వచ్చిన ఆలోచనే తులసి పెంపకం. తులసిలో అనేక ఆర్గానిక్‌ పదార్థాలు ఉన్నాయి. అందుకే దాని పెం పకం ద్వారా తమ కుటుంబాలను బాగుచేసుకోవాలని నిర్ణయించారు. తులసి పెంప కానికి సంబంధించి అన్ని రకాల విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే అందు లోకిి అడుగు పెట్టారు. ఇందుకు సాయం చేసేందుకు ఒక కార్పొరేట్‌ సంస్థ ముందుకు వచ్చింది.వారి లక్ష్యం ముందు వారు పడిన శ్రమ చాలా చిన్నది గా మారిపోవడంతో ఇప్పుడు వారి ఆనందానికి ఆకాశమే హద్ద యింది.

మార్పు తెచ్చిన తులసి సాగు...
Tulsi2 
ఇప్పుడు వారి కుటుంబాలు వల స వెళ్లకుండా ఊరిలోనే వ్యవసా యపనులు చూసుకుంటూ హా యిగా జీవిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు విజయం సాధించారు. ప్రస్తుతం వారు లక్నోలో ఉన్న ఆర్గానిక్‌ ఇండియా అనే మల్టీ నేషనల్‌ కంపెనీ కోసం ఆర్గానిక్‌ తులసిని ఉత్పత్తి చేస్తున్నారు. ఆ ర్గానిక్‌ ఇండియా సంస్థ తులసి ఉత్పత్తికి అజమ్‌ఘర్‌ను ఎన్నుకోవడానికి ప్రధానకారణం అక్కడి భూములు తులసి పండించడానికి అనుకూలంగా ఉండడం తో పాటు ఆ జిల్లా అన్ని రకాలుగా అభివృ ద్ధి చెందే అవకాశాలు ఉండడమే.

40 సంవత్సరాల విమలమౌర్య అజమ్‌ ఘర్‌ జిల్లాలోని బిజౌరా గ్రామానికి చెందిం ది. గత 10 సంవత్సరాలుగా ఆర్గానిక్‌ తు లసిని పండిస్తున్నారు. ఈ తులసితో ఆర్గా నిక్‌ టీలు, ఆరోగ్యానికి ఉపయోగపడే వివి ధరకాల మందులు తయారు చేస్తున్నారు. మొదట తులసి పండించడం ప్రారంభిం చింది వివులనే. ఆర్గానిక్‌ ఇండియా నుంచి మొదటి అవకాశాన్ని వినియోగించుకున్న ది కూడా ఆమె.తనతోపాటు మరి కొంత మంది మిహళలతో కలసి తులసి పండించ డం ప్రారంభించారు. 35 సంవత్సరాల బీను విశ్వకర్మ కమెన్‌ పూర్‌ గ్రామానికి చెందినవారు. నలుగురు పిల్లలు.

tulasi 
‘కుటుంబాన్ని పోషించడమే చాలా కష్టంగా వున్న సమయంలో మేము తులసి పెంపకం మొదలు పెట్టిన తర్వాత దానితో మా అనుబంధం ఎంతగానో పెరిగింది. గతంలో మేము చేసిన వ్యవసాయానికి భిన్నంగా తులసి పెంప కం మొదలెట్టాం. కంపెనీ నిర్దేశించిన మార్గదర్శ కాలను అనుసరించే తులసిని పండిస్తాము.మొదట మేము చేయగలమా? అనుకున్నాము. కానీ తులసి పండించడానికి ప్రత్యేక పద్ధతులు వినియోగించాల్సిన అవసరం లేదని సాధారణ పంటల మాదిరే పండించ వచ్చని నిరూ పణ అయిన తర్వాత మా మీద మాకు విశ్వాసం పెరిగింది’ అని ఆమె చెబుతున్నారు.

అందరూ విజేతలే..
జిల్లాలోని మహిళలను ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తాయి. ఆర్గానిక్‌ ఇండి యా కంపెనీ ఇక్కడి గ్రామస్తులకు తులసి పం డించడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పింది. పెట్టుబడి పెట్టడానికి కూ డా ముందుకు వచ్చింది. అయితే వారి గ్రామా లు అభివృద్ధి చెందిన తర్వాత సంస్థ పెట్టుబడి సంస్థకు ఇచ్చేలా ఒక ఒప్పందం కుదుర్చు కుంది. ఇప్పుడు జిల్లాలోని వివిధ గ్రామాల్లో సుమారు 300 మంది మహిళలు తులసి సా గు మీదే అధారపడి ఉన్నారు. సుమారు 2వేల ఎకరాల్లో తులసి సాగవుతుంది. జులై, ఆగస్టు లో తులసిని విత్తితే నవంబర్‌ వరకు కోతకు వస్తుంది. కనీసం 2వేల టన్నుల వరకు ఇక్కడ ఉత్పత్తి సాగిస్తున్నారు. కిలో ఒక్కింటికి రూ. 100 చొప్పున కంపెనీ రైతులకు చెల్లిస్తోంది.

Tulsi3 
తులసి సాగు తర్వాత పది సంవత్సరాల క్రితం ఉన్న గ్రామాలకు ఇప్పుడున్న గ్రామాల కు చాలా తేడా వచ్చింది. గ్రామాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి.ప్రత్యేకంగా అల్లో పతి, ఆయుర్వేదిక్‌ ఆసుపత్రులు, వైద్యులు ఉన్నారు. గ్రామస్తులకు వారు ఉచిత వైద్యం అందిస్తారు. రోగులకు అవసరమైన మందులు అందజేయడంతో పాటు, హెర్బ ల్‌ ఉత్పత్తులను అందిస్తారు. శానిటేషన్‌ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది.వారి ఇళ్ళ ల్లో టాయ్‌లెట్ల నిర్మాణానికి కూడా సంస్థ సహకరించింది. బ్యాంకింగ్‌ సంస్థలు ఉన్నా యి. రైతులు పండించిన పంటకు సంబంధిం చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ యా బ్యాంకుల్లో నేరుగా వారి ఖాతాలో జమా అయ్యేలా ఆర్గానిక్‌ ఇండియా ఏర్పాట్లు చేసింది.

వెల్లివిరిసిన గ్రామీణ వికాసం....
ఆయా గ్రామాల్లో సామాజిక పరిస్థితులు కూడా అంతంత మాత్రం గానే ఉండేవి. బిజౌరా, కమెన్‌పూర్‌ గ్రామాల్లో 1999లో 63 శాతం స్కూల్‌ డ్రాపౌవుట్స్‌ ఉండేవారు. ఇప్పుడది 29 శాతానికి తగ్గింది. విమల, బీను వంటి రైతుల పిల్లలు స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి డాక్టర్‌ను కలవాలంటే వారం ముందే పేరు నమోదు చేయించుకోవాలి. వైద్యులు ప్రతి రోజు రెండు పూటల వైద్య సేవలు అందిస్తారు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. తులసి సాగు, కోత సమయంలో మగవారు వారి భార్యలకు సహాకారం అందిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని పంటలు..
ఈ వ్యవసాయ పద్ధతిని ప్రవేశ పెట్టడంలో ఆర్గానిక్‌ ఇండియా అం తర్జాతీయ సిఇఓ కృష్ణగుప్తా కృషి కూడా ఎక్కువే అని చెప్పా లి. అక్కడి మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆయ న చేసిన ప్రయత్నం విజయవం తమైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వారితో గోధమ, పప్పుధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు, పుష్పాలు సాగు చేయించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.చేేయూతనందిస్తే ఎంతటి కార్యానై్ననా అవలీలగా పూర్తి చేయగలమని ఈ మహి ళామణులు నిరూపించారు. తక్కువ కాలంలోనే వారి కుటుంబాలతో పాటు గ్రామా న్ని అభివృద్ధి చేసుకున్నారు.

Friday, January 28, 2011

పల్లె పచ్చని కూరగాయలు

పెరట్లో సేంద్రియ కూరగాయల పెంపకం...
ఇంటి ల్లిపాదికీ బాగు బాగు
తీగ జాతి కూరగాయల సాగుకు ఇదే అదను
ఆకుకూరలు, టమాటా, వంగ..
ఏ కాలంలోనైనా చక్కగా ఎదుగుతాయి
ప్రత్యేక మడుల్లో అధిక దిగుబడులు సాధ్యం


శీతాకాలం వెళ్లిపోతోంది. ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో ఇళ్ల దగ్గర కాస్తో కూస్తో పెరటి స్థలం ఉంటుంది. పెద్దగా ఖాళీ స్థలం లేకపోయినా ఐదూ పది గజాల స్థలమైనా ప్రతి ఇంటి ముందో, వెనుకో, పక్కనో ఉంటుంది. ఈ కాస్త జాగాలో ఏం పండిస్తాంలే అననుకోకుండా.. కాస్త మనసు పెట్టి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, అనేక రకాల కూరగాయలు పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చు.

రాబోయే రోజుల్లో ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ఇంటిల్లిపాదీ తినడానికి ఈ రోజే పని ప్రారంభించడం ఉత్తమం. ఒకవైపు కూరగాయల్లో విష రసాయనాల అవశేషాలు, మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న ధరలు... ఏ విధంగా చూసుకున్నా.. ఉన్నంత స్థలంలో కొన్ని రకాలైనా ఇంటి పట్టున పండించుకోవడం ఉత్తమం కదండీ....!

పశువుల నుంచి రక్షణ అవసరం
గ్రామాల్లో ఇళ్ల దగ్గర ఎంతో కొంత ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పశువులు మొక్కల్ని బతకనివ్వవు. ప్రహరీ లోపలైతే ఫర్వాలేదు. కనీసం ముళ్ల కంచె అయినా గట్టిగా కట్టుకొని మొక్కలు పెంచడానికి శ్రీరారం చుట్టాలి. పల్లెల్లో మొక్కలకు పశువులే కాదు.. కోళ్ల బెడద కూడా ఎక్కువే. ఇతరులవే కాదు మనకూ కోళ్లుంటాయి. వాటిని తిరగకుండా కట్టడి చేసుకుంటే తప్ప మొక్కలు ఎక్కిరావు.
ప్రణాళికతో ఏడాది పొడవునా పెరటి కూరగాయలు
అన్ని కూరగాయలు, ఆకుకూరలూ ఒకే రోజు విత్తుకోకూడదు. ఇప్పుడు గుప్పెడు గింజలు, వారం పది రోజులు గడిచాక మరికొన్ని గింజలు.. అలా విడతల వారీగా చల్లుకోవాలి. ప్రతి వారం ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలంటే ఇలాంటి ఉపాయం అవసరమే. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతోపాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం పెంచుకోవచ్చు.

ఏ ఏ రకాల సాగుకు తగిన సీజన్ ఇది?
ఆకుకూరలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా చక్కగా పెరుగుతాయి. పాలకూర, చుక్కకూర.. తదితర ఆకుకూరలు మూడు, నాలుగు వారాల్లో కోతకు వస్తాయి. మొక్కలను కత్తిరిస్తే మళ్లీ పిలకలు వేస్తాయి. కత్తిరించిన తర్వాత మట్టిని గుల్ల చేసి చారెడు కంపోస్టు చల్లి నీరుపోస్తే చాలు. పిలకలు పెరిగాక కోసుకొని.. మళ్లీ విత్తనాలు చల్లుకోవాలి. మెంతి మొక్కల్ని మూడుసార్ల వరకూ కత్తిరించుకోవచ్చు. గోంగూర మొక్క నుంచి ఆకుల్ని కోసుకోవాలి. పూత, పిందె వచ్చేంత కోసుకుంటూ ఉండొచ్చు. మొక్క బచ్చలి మాత్రం 45 రోజులకు కోతకు వస్తుంది.

పందిళ్లతో అధిక దిగుబడులు
పెరటి తోటల్లో తీగజాతి మొక్కల పెంపకానికి ఇది చక్కటి సీజన్. బీర, పొట్ల, కాకర, దోస తీగలను చక్కగా పందిళ్లు వేసి పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. భారీగా పందిళ్లు అక్కర్లేదు. ఇంట్లో వాళ్లే తీరిక ఉన్నప్పుడు నాలుగు పురికొసలో, ఇనుప తీగలో కట్టి వాటిపైకి మొక్కల్ని పాకిస్తే చాలు. కొంచెం ఆసరా ఇస్తే చాలు. ఇంటి మీదకో, పందిరి మీదకో అల్లుకొని చక్కని దిగుబడినిస్తాయి. తీగ బచ్చలి వేసుకుంటే ఏడాది పొడవునా ఆకుకూర అందుబాటులో ఉంటుంది. దొండ పాదు నాటుకుంటే మూడేళ్ల వరకూ దిగుబడి ఇస్తూనే ఉంటుంది.

బెండకూ ఈ సీజన్ భేష్
బెండ సాగుకూ ఇది మంచి సీజన్. రెండు నెలల్లో కాపుకొస్తుంది. ఒకటిన్నర నెలలు కాస్తుంది. ఇంట్లో ఎందరు ఉంటారనే దాన్ని బట్టి ఎన్ని మొక్కలు వేసుకోవాలో చూసుకోవాలి. గోరుచిక్కుడు, మొక్కజొన్న.. టమాటా, వంగ వంటి పంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. బీర విత్తనం నాటిన నెలన్నర, రెండు నెలల్లో కాయలు కోతకు వస్తాయి.

పొట్ల తీగను పందిరిపైకి పాకిస్తే మంచి దిగుబడి వస్తుంది. కాయలు వంకరైపోకుండా రాయి కట్టాలి. వంగ మూడు నెలల్లో కాపుకొస్తుంది. 6 నెలల వరకూ కాపు ఉంటుంది. తర్వాత చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి.. కొంచెం కంపోస్టు వేస్తే.. మళ్లీ ఏపుగా పెరిగి కాపుకొస్తుంది. ఏడాదికిపైగా వంకాయలకు ఢోకా ఉండదు. వంగకే పురుగుల బెడద ఎక్కువ. ఏ రెమ్మకు తెగులు వచ్చినా అక్కడికి తుంచేసి నాశనం చేయడం అవసరం. టమాటా మొక్క వేసిన 2 నెలల్లో కాపుకొస్తుంది. రెండు నెలల పాటు కాయలు ఇస్తుంది.

సేంద్రియ ఆహారమే ఆరోగ్యం
రసాయనాలు వాడకుండా పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యం, కమ్మటి రుచి కూడా. ఖాళీ ఉంది కదా అని గొయ్యి తీసి ఆ మట్టి ఎలా ఉన్నా విత్తనం వేస్తే సరిగ్గా పెరగకపోవచ్చు. అందుకే... మట్టి, పశువుల ఎరువు, వర్మి కంపోస్టు లేదా ఇంటి వద్ద తయారుచేసుకున్న ఆకుల ఎరువు(లీఫీ మౌల్డ్) కలిపి ప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న మిశ్రమం వాడితే ఫలితం బావుంటుంది. ఈ మట్టి మిశ్రమంతో ప్రత్యేకంగామడులను తయారుచేసుకొని కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటే మామూలుగా కన్నా 3 నుంచి 5 రెట్లు అధిక దిగుబడి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఎరమ్రట్టి వాడితే ఇసుక కలపనక్కర్లేదు
కొన్ని ప్రాంతాల్లో నల్లమట్టి, మరికొన్ని ప్రాంతాల్లో ఎరమ్రట్టి ఉంటుంది. నల్లమట్టికి త్వరగా గట్టిపడి పిడచకట్టుకుపోయే స్వభావం ఉంది. దీనివల్ల మొక్కలు బాగా పెరగవు. అందుకని ఎరమ్రట్టి వాడితే మంచిది. నల్లమట్టే వాడాల్సి వస్తే కంపోస్టు, పశువుల ఎరువు వంటి వాటితోపాటు ఇసుకను కూడా కలపడం మంచిది. ఎరమ్రట్టి రెండుపాళ్లలో మిగతా సేంద్రియ ఎరువులు ఒక్కోపాళ్లలో కలిపి మొక్కలు పెంచొచ్చు. నల్లమట్టి అయితే ఒక పాలు కలిపితే మంచిది.
వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు తగినంత దొరక్కపోతే మట్టి, కంపోస్టు సమపాళ్లలో వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే... 65 శాతం మట్టి, మిగతా భాగం సేంద్రియ ఎరువులు కలిపి వాడొచ్చు. వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, మాగిన కొబ్బరి పొట్టు సాధ్యమైనంత కలుపుకుంటే మొక్కలను చీడపీడలు అంతగా ఆశించకుండా ఉంటాయి. ఇవి మొక్కలకు బలం కూడా. కొబ్బరి పొట్టు వల్ల వేళ్లు అధికంగా ఏర్పడడానికి వీలవుతుంది. మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా కొబ్బరి పొట్టు చూస్తుంది. మట్టిని పక్కన పెట్టి కేవలం ఆకుల ఎరువు లేదా శుద్ధిచేసిన కొబ్బరి పొట్టునే వాడుతూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మట్టిలోకన్నా అనేక రెట్లు ఎక్కువ దిగుబడి తీస్తున్నారు కూడా.

ప్రత్యేక మడులు...

ఇటుకలు మూడు వరుసలు పేర్చి లేదా చెక్క ముక్కలు చుట్టూ కట్టి మధ్యలో మట్టి మిశ్రమం పోసి ప్రత్యేక మడిని సిద్ధం చేయొచ్చు. అడుగున ఇటుకలు పరిచి.. దాని పైన కొంచెం మట్టి పోసి.. అక్కడక్కడా బెజ్జాలు(ఎక్కువైన నీరు కిందికి పోవడానికి) పెట్టిన పాలిథిన్ షీట్ పరిచి.. ఆపైన ఇటుకలు మూడు వరుసలు పేర్చి మట్టి మిశ్రమం పోస్తే.. పెరటి స్థలంలో ప్రత్యేక మడి సిద్ధమైనట్టే. వర్షం పడినా మడి కింద నేల చెదిరిపోకుండా ఉండడానికి, కలుపు పెద్దగా రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నారు.

ఆకుల రసాలు, కషాయాలతో చీడపీడలకు చెక్
కూరగాయ మొక్కలు, ఆకుకూరలకు చీడపీడలు రాకుండా, ఏవైనా పురుగు సోకినా.. ఆకుల రసాలనో, కషాయాలనో వాడొచ్చు. వేప నూనెను సైతం వాడొచ్చనిహైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ అధ్యక్షుడు, ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డి ‘ఇంటి పంట’తో చెప్పారు. ఈ కషాయాలను ఎవరికి వారు ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చని తెలిపారు. వేప ఆకులు, శీతాఫల ఆకులు, వావిలి ఆకులను మెత్తగా నూరి, రసం తీసి, వడపోసిన తర్వాత.. అంతకు 20 రెట్లు నీటిలో కలిపి పెరటి మొక్కలపై చల్లుకోవచ్చన్నారు. ఈ ఆకులను ఉడకబెట్టి కషాయాన్నయినా చల్లవచ్చన్నారు. ఈ ఆకుల వాసన ఘాటుగా ఉంటుంది. రసం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే చాలు. వేపకాయల రసం కూడా వాడొచ్చన్నారు. పచ్చిమిరప కాయలను గాని లేదా వెల్లుల్లిని గాని దంచి... కిరోసిన్‌లో ఒక రాత్రి నానబెట్టి తర్వాత నీటిలో కలిపి మొక్కలపై చల్లవచ్చన్నారు. చీడపీడలు ఆశించక ముందే 15 రోజులకోసారి వీటిని చల్లవచ్చని అంటూ.. పురుగుల గుడ్లు ఉన్నా నశిస్తాయన్నారు. ఈ రసాల వాసనకు చీడపీడలు పెరటి తోటల దరిదాపులకు కూడా రావన్నారు.

సంప్రదించవచ్చు..
ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డికి పెరటి తోటలు, పండ్ల తోటల సాగులో మంచి అనుభవం ఉంది. 57 ఏళ్లుగా ఉచిత సేవలందిస్తున్న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ’తో ఆయనకు ముప్పయ్యేళ్లుగా అనుబంధం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉద్యాన మిషన్‌కు అనుబంధంగా ఉన్న సాంకేతిక సలహా బృందం(టీఎస్‌జీ)లో ఆయన సభ్యులు. పట్నమైనా పల్లెలైనా ఇంటి పట్టున కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారు సందేహాలేమైనా ఉంటే 92461 08262 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు.

Thursday, January 13, 2011

ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా...!?

 రాత్రనకా పగలనకా శ్రమించి, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకొని పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించకపోతే... రైతన్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే ఆ గ్రామ రైతులకు అలాంటి ఇబ్బంది ఏదీ ఎదురవదు. వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేయండంటూ వ్యాపారుల చుట్టూ తిరగడం వారి ఇంటా వంటా లేదు. వారికి తెలిసిం దల్లా ... నాణ్యమైన పంటలు పండించడం, వాటిని తామే మార్కెట్ చేసుకోవడం. ఎప్పటికప్పుడు మార్కెట్ పోకడల్ని గమనిస్తూ వాటికి అనుగుణంగా పంటలు సాగు చేయడం, వ్యాపారులనే తమ చుట్టూ తిప్పించుకోవడం వీరికి ‘సాగు’తో పెట్టిన విద్య.

అందుకే ఆ గ్రామ రైతులు వ్యవసాయంలో సిరులు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘వ్యవసాయం చేస్తే ఏం లాభ ం... మట్టి బుక్కడం... మట్టి కక్కడం తప్ప’ అన్న నానుడిని చెరిపేసి ‘మట్టి పిసికి... సిరులు పండించడం’ అని తిరగరాస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ వాసులు.


సమష్టి సేద్యం, మార్కెటింగ్‌లో మెలకువలు ఈ గ్రామానికి రాష్టవ్య్రాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంకాపూర్ గ్రామంలోకి వెళితే మనకు ఇంద్రభవనాన్ని తలదన్నే ఇళ్లు, ఖరీదైన కార్లు ఎన్నో దర్శనమిస్తాయి. కేవలం వ్యవసాయంతోనే ఆ ఆస్తుల్ని సముపార్జించుకున్నారంటే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాల్సిందే! పది వేల లోపు జనాభా ఉన్న ఈ గ్రామంలో మూడు వందలకు పైగా ఖరీదైన కార్లు ఉన్నాయంటేనే పరిస్థితి అర్థమవుతుంది. పొలానికి కారులో వెళ్లి పనులు ముగించుకొని వచ్చే స్థాయికి ఇక్కడి రైతులు ఎదిగారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం.


ఇది రాజన్న చలువే...

అంకాపూర్ అభివృద్ధి ప్రస్థానం 70వ దశకంలోనే ప్రారంభమైంది. సంకర జాతి విత్తనాలతో పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్న విషయాన్ని అర్థం చేసుకొన్న అప్పటి గ్రామ సర్పంచ్ రాజన్న గ్రామానికి హైబ్రిడ్ విత్తనాల్ని పరిచయం చేశారు. 1976లో అప్పటి వ్యవసాయాధికారి శ్యాంసుందర్ అంకాపూర్‌ను మోడల్ గ్రామంగా ఎంపిక చేసి సజ్జ పంట సాగు చేయించారు. ఎకరానికి 12 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు లాభాలు చవి చూశారు. దీంతో వారంతా వ్యవసాయంపై మక్కువ పెంచుకొన్నారు.

అప్పటి నుండి గ్రామ స్వరూపమే మారిపోయింది. 1977లో అక్కడ ఆంధ్రా బ్యాంక్ శాఖను ఏర్పాటు చేశారు. వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బుతో గ్రామానికి చెందిన 56 మంది అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 15 కుటుంబాలు స్థిరపడ్డాయి.


పసుపు పంట చేతికి రాగానే ఇక్కడి రైతులు కొత్త మోడల్ కార్లను కొనుగోలు చేస్తారంటే అతిశయోక్తి కాదు. దిగుబడులు చేతికి వచ్చే సమయంలో కార్ల కంపెనీలు గ్రామంలో మేళా నిర్వహించడం, ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం చూస్తే పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది.


డిమాండ్‌ను పసిగట్టి...

అంకాపూర్ వాసులు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. ఉత్తర భారతదేశంలో ఎర్ర జొన్నలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన అంకాపూర్ రైతులు ఎరజ్రొన్న విత్తనోత్పత్తి వైపు అడుగులు వేశారు. అయితే కేవలం ఒకరిద్దరు వేస్తే ఫలితం ఉండదని భావించి ఎక్కువ మంది కలిసి సమష్టి వ్యవసాయం సాగించాలని నిర్ణయించారు. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ పటిష్టంగా ఉండటంతో రైతుల ఆలోచన కార్యరూపం దాల్చింది.
పక్కపక్కన ఉన్న పొలాల్లో వేర్వేరు రకాల విత్తనాలు వేస్తే గాలి, కీటకాల ద్వారా పుప్పొడి పక్క పొలాల్లోకి చేరి విత్తనాలు కల్తీ అయి నాణ్యత లోపిస్తుందనే ఉద్దేశంతో అందరూ ఒకే రకం విత్తనాలు సాగు చేస్తున్నారు. నిజాంసాగర్ జలాలు విడుదల చేసిన వెంటనే కాలువ నుండి విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని పంప్ చేసి చెరువు నింపుకుంటారు.


ప్రాసెసింగ్‌పై దృష్టి

కేవలం పంటల సాగు పైనే దృష్టి సారిస్తే పెద్దగా లాభం ఉండబోదని గ్రహించిన రైతులు గ్రామ శివారులో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించారు. ప్రస్తుతం గ్రామంలో 29 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. పంటను విక్రయించడానికి వ్యాపారుల చుట్టూ తిరగడమేమిటి? వారినే మన చుట్టూ తిరిగేలా చేద్దామన్న ఆలోచన వచ్చిందే తడవుగా మార్కెట్ యార్డు నిర్మించుకున్నారు. దీని ద్వారా ప్రస్తుతం రోజూ సగటున పది లక్షల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. చుట్టు పక్కల గ్రామాల రైతులు కూడా అంకాపూర్ మార్కెట్ యార్డు ద్వారానే తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన పసుపును మహారాష్టల్రోని సాంఘ్లీ మార్కెట్‌కు ఎగుమతి చేస్తారు.

గ్రామ రైతులు ఎక్కువగా పసుపు, ఎర్ర జొన్న, కూరగాయలు సాగు చేస్తారు. పైరు వేసేటప్పుడే రైతులు తమ పంటల అమ్మకానికి సంబంధించి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటారు. అలా చేయడం వల్ల వారికి గిట్టుబాటు ధర లభిస్తోంది. అందరు రైతుల మాదిరిగానే తామూ పంటలు పండిస్తున్నామని, అయితే కలసికట్టుగా ఉండడం, పంటల ఉత్పత్తిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుండడంతో మంచి ఆదాయం పొందుతున్నామని సర్పంచ్ పెర్కిట్ రవి తెలిపారు. మరి మనందరం ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా?


కొత్తిమీరతో లక్షల ఆదాయం!


అంకాపూర్‌లో పండించిన కూరగాయలు గుం టూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. అంకాపూర్ మార్కెట్‌కు సరుకు రావడమే తరువాయి... కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉండటం రైతులకు కలిసొస్తోంది. అంకాపూర్‌లో కొత్తిమీర సాగుతో లక్షల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు. ఎకరం భూమిలో కొత్తిమీర వేసి 45 రోజుల్లో లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారు.

రాష్టవ్య్రాప్తంగా రైతులు కూరగాయలు పండిస్తున్నప్పటికీ పంటను మార్కెటింగ్ చేసుకోవడం, ఎగుమతి చేసే విధానం తెలియక నష్టాలు చవిచూస్తున్నారు. మార్కెటింగ్‌లో మెలకువలు నేర్చిన అంకాపూర్ వాసుల్ని ఆదర్శంగా తీసుకుంటే వ్యవసాయం పండుగే అవుతుంది మరి. అక్కడి రైతుల నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 

వి.అమృతరావు

పాడి - పంట * పుష్టికరమైన మేతతో ఎన్నో లాభాలు!

పాడి పశువులకు పుష్టికరమైన, నాణ్యమైన మేత అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఈతకు, ఈతకు మధ్య దూరం తగ్గి ఎక్కువ ఈతలు వస్తాయి. దీనివల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని అమలాపురం పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి.లక్ష్మణస్వామి తెలిపారు.పాడి పశువుల్లో విటమిన్-ఎ, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషక పదార్థాల లోపాల వల్ల పునరుత్పత్తి సామర్థ్యం పడిపోతుంది. పోషకాల లోపాలు లేకుండా చూస్తే పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు, పునరుత్పత్తికి సంబంధించిన జబ్బులు రాకుండా నివారించవచ్చు. చాలా మంది రైతులు వర్షాకాలం, చలికాలంలో పచ్చిమేతలు, వేసవిలో ఎండుమేతలు దాణాగా అందిస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. పచ్చిమేత ఎక్కువగా దొరికే కాలంలో దానిని పాతర (సైలేజ్) వేసి నిల్వ చేసుకోవాలి.

అన్ని కాలాల్లోనూ పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఒక్కో పశువుకు ఎనిమిది కిలోల వరిగడ్డి లేదా ఎండు చొప్ప (జొన్న, మొక్కజొన్న), ఎనిమిది కిలోల లెగ్యూమ్ జాతి పచ్చిమేత (పిల్లిపెసర, అలసంద, గోరుచిక్కుడు), 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు (జొన్న, మొక్కజొన్న, ఇంకా ఇతర బహు వార్షిక పశుగ్రాసాలు) ఇచ్చినట్లయితే దానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా ఇవ్వాలి. ఈ విధంగా పోషణ చేపడితే సకాలంలో పశువులు ఎదకు వస్తాయి. ఈనిన తర్వాత మూడు నెలల లోపు పశువు ఎదకు వచ్చేటట్లు చూసి 13 నెలల్లో ఒక ఈత ఈనేటట్లు జాగ్రత్త పడాలి. అలా చేస్తే పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. పాడి పరిశ్రమ లాభదాయకంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన పశువులు తమ జీవిత కాలంలో 8-10 సార్లు గర్భం దాల్చే అవకాశం ఉంది.

గొడ్డుమోతు సమస్యలు

పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు మూడు కారణాలు ఉన్నాయి. సకాలంలో ఎదకు రాకపోవడం, పశువులకు గర్భకోశ వ్యాధులు ఉండటం, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనిని నివారించాలంటే పాడి రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు ఈనిన తర్వాత 60-90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువుల్ని సకాలంలో పశు వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలి. ప్రతి రోజూ ఎద లక్షణాల్ని పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. సకాలంలో చూడి పరీక్షలు చేయించాలి. కట్టు నిలవని పశువులకు పశు వైద్యాధికారితో ప్రత్యేక చికిత్స చేయించాలి. ఈనే సమయంలో పాకలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి. పుష్టికరమైన పచ్చిమేత వెయ్యాలి. లేకుంటే ‘ఎ’ విటమిన్ ఇంజక్షన్ ఇవ్వాలి. దాణాలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ మిశ్రమం తగు పాళ్లలో అందించాలి.

దూడల్ని ఎదగనీయండి

యుక్త వయసు రాని దూడల్ని కృత్రిమంగా పొర్లించి చూడి కట్టించే పనిని ఇటీవల కొందరు రైతులు గొప్పగా భావిస్తున్నారు. అయితే అశాస్ర్తీయమైన ఇటువంటి సంప్రదాయం పశువుల ఉనికికే ప్రమాదకరం. తగిన వయసు, సరిపడినంత బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల ఆ పశువుతో పాటు దాని సంతతికి కూడా అనేక రకాల బలహీనతలు, వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు రాజమండ్రి పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రామకోటేశ్వరరావు. వివరాలు ఆయన మాటల్లోనే...
దూడలు ఒక వైపు తల్లి పాలు తాగుతుండగానే పశువుల్ని చూడి కట్టించడం ఇటీవల ఒక పోకడగా మారుతోంది. మనుషుల్లో బాల్య వివాహాలు ఎంతటి దురాచారమో పశువులకు ఈ పద్ధతి అంతటి అనాచారమని చెప్పొచ్చు. సాధారణంగా సంకర జాతి ఆవులకు పోషక విలువలు ఉన్న దాణా ఇవ్వడం వల్ల వాటిలో ముందుగానే ఎద లక్షణాలు కన్పిస్తాయి. దీంతో కొందరు రైతులు వాటిని నాలుగో నెలలోనే పొర్లించి ఎద కట్టిస్తున్నారు. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తర్వాత మాత్రమే పొర్లించాలి. ఆవులైతే 200 కిలోలు, గేదెలైతే 250-300 కిలోల బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడి కట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువుల్ని పొర్లించినప్పుడు శరీరం లోపల కలిగే ఒత్తిడిని అవి తట్టుకోలేవు. తక్కువ వయసు, తక్కువ బరువు ఉన్న పశువుల్ని చూడి కట్టిస్తే వాటి శరీరంలోని లవణాలు, విటమిన్లు పాల ద్వారా బయటికి పోతాయి. దీంతో వాటి శరీర నిర్మాణం కుంటుపడుతుంది. చిరుప్రాయంలోనే ఆవును చూడి కట్టిస్తే కటి వలయం సరైన రీతిలో సిద్ధం కాక ఈనిక కష్టతరంగా మారుతుంది. ఈ సందర్భంలో తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది.

యుక్త వయసుకు రాకుండా పొర్లించడం వల్ల పశువు తన జీవిత కాలంలో ఇచ్చే దూడల సంఖ్య తగ్గిపోవచ్చు. అలాగే దాని పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. తర్వాత ఈతకు, ఈతకు మధ్య ఒక సంవత్సరం ఉండాల్సిన ఎడం రెండు మూడేళ్లకు పెరుగుతుంది. పశువు తీసుకునే ఆహారాన్ని దాని శారీరక ఎదుగుదలకు, పాల ఉత్పత్తికి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఎద లక్షణాలు పూర్తిగా కన్పించక మూగ ఎదలకు దారి తీసే అవకాశం ఉంది. పశువులు ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిన వెంటనే తిరిగి పొర్లు సమస్య వస్తుంది. పొదుగు కణజాలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. జన్యుపరమైన లక్షణాలు తగ్గుతాయి. ఈ విధంగా తొందరపాటుతో చూడి కట్టించడం వల్ల పాడి పశువులకి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వాటి సంతతి దూడలకు అనువంశికంగా ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు ఇలాంటి పొర్లింపు కార్యక్రమాలకు ఇకనైనా స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

Gouthamaraju as WUA