దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్‌బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...
దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.
జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..
వేచూర్
కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.
శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.
కాసరగడ్
కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.
మాల్వీ
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.
పుంగనూరు ఆవులు
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.
వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేని ప్రత్యేకత దానిదే
|
No comments:
Post a Comment