పాడి పంటలు

Sunday, April 15, 2012

బిందుసేద్యంతో చెరకు సాగు


 
 
 
 
 
 
 
 
 
 
 
వేసవి ఉష్ణోగ్రతలు చెరకు పైరు ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయి. ఎందుకంటే అత్యధిక-అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని, ఎండ తీవ్రతను, వడగాడ్పుల్ని చెరకు పైరు తట్టుకోలేదు. ముఖ్యంగా లేత తోటలు ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేసిన చెరకు తోటలు ప్రస్తుతం పిలకలు తొడిగి, పెరిగే దశలో ఉన్నాయి. ఈ నెల నుంచి జూన్ వరకూ ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. గాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందుసేద్య పద్ధతి ద్వారా భూమిలో తేమను కాపాడుకుంటూ, చెరకు పైరును రక్షించుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో...

బిందుసేద్యం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలోని చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు నాలుగు ఎకరాల్లో ఈ పైరును సాగు చేయొచ్చు. వేసవిలో రైతులు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న విష యం తెలిసిందే. రోజుకు ఆరేడు గంటలు మాత్ర మే కరెంట్ అందుబాటులో ఉంటోంది. అయితే బిందుసేద్య పద్ధతిని అనుసరించే రైతులు విద్యుత్ కోతల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఆ ఆరేడు గంటల సమయంలోనే కనీసం నాలుగైదు ఎకరాల తోటకు నీరు అందించవచ్చు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్న దిగులే అవసరం లేదు. ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడు ఆటోమేటిక్ పరికరం సాయంతో ఏ ఇబ్బందీ లేకుండా తోటకు నీరు అందించవచ్చు. పైగా నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా మనిషి అవసరం ఉండదు. మామూలు పద్ధతిలో రాత్రి సమయంలో తోటకు నీరు పెట్టేటప్పుడు పాములు, ఇతర విష పురుగుల వల్ల ప్రాణహాని ఉంటుంది. బిందుసేద్య పద్ధతిలో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు.


బిందుసేద్య పద్ధతి వల్ల ఒనగూడే మరో ప్రయోజనమేమంటే కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. తద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చు. భూమికి ఎక్కువ నీరు అందుతోందన్న ఆందోళన అవసరం లేదు. మొక్కలకు క్రమ పద్ధతిలో సరిపడినంత నీరు మాత్రమే అందుతుంది. పైగా తోట అంతటికీ సమానంగా అందుతుంది. భూమి చౌడు బార దు. ధాతు లోపాలు తలెత్తవు. మొక్కలు ఆరోగ్యవంతంగా, ఏపుగా, క్రమ పద్ధతిలో పెరుగుతాయి. చీడపీడల తాకిడి తగ్గుతుంది. దీనివల్ల నాణ్యమైన పంటను పొందవచ్చు. రస నాణ్యత కూడా బాగా ఉంటుంది. కూలీలు, సస్యరక్షణపై పెట్టే ఖర్చు కలిసొస్తుంది. దిగుబడి 40-50 శాతం పెరుగుతుంది. బిందుసేద్య పద్ధతిలో చెరకు తోటలో అంతర పంటలు కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. బిందుసేద్య పద్ధతి ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాల్ని మొక్కలకు సరైన మోతాదులో సమానంగా అందించవచ్చు. తద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలపై పెట్టే అనవసరపు ఖర్చును నియంత్రించుకోవచ్చు. ఇసుక నేలలు, గుట్టలు... అంటే ఎగుడు దిగుడుగా ఉండే భూముల్ని చదును చేయాల్సిన అవసరం లేకుండానే తోట వేసుకోవచ్చు. చదును చేయడానికి వీలులేని భూముల్లో కూడా బిందుసేద్యం ద్వారా చెరకు సాగు చేయవచ్చు.


ప్రోత్సాహం-దిగుబడులు

చెరకు సాగులో బిందుసేద్యాన్ని ప్రోత్సహిం చేందుకు పలు చక్కెర కర్మాగారాలు రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నాయి. దీనివల్ల బిందుసేద్యంపై చెరకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది రైతులు బిందుసేద్య పద్ధతిలో చెరకు సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మం డలం పోతవరం గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం మొక్క తోటలో ఎకరానికి సగటున 70 టన్నులు, పిలక తోటలో 69.4 టన్నుల దిగుబడి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దాసరి వెంకటాచలం ఎకరానికి సగటున 70 టన్నుల దిగుబడి పొందారు. వీరిద్దరూ ఇటీవలే ఉగాది పురస్కారాలు కూడా అందుకున్నారు.

బి.హనుమంతరెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్

అగ్రానమిస్ట్, రాజమండ్రి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

జంట సాళ్ల పద్ధతిలో చెరకు ముచ్చెలు నాటినట్లయితే లేటరల్ పైపుల అవసరం తక్కువగా ఉంటుంది. దీనివల్ల డ్రిప్పులపై పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. సాళ్ల మధ్య నాలుగు లేదా ఐదు అడుగుల దూరాన్ని పాటించిన వారు లేదా సాధారణ పద్ధతిలో (సాళ్ల మధ్య మూడు అడుగుల దూరం) ముచ్చెలు నాటిన వారు కూడా బిందుసేద్య పద్ధతిని అనుసరించవచ్చు. బావులు, చెరువులు వంటి నీటి వనరుల ద్వారా చెరకు సాగు చేసే వారు ప్రతి 15 రోజులకు ఒకసారి సిస్టమ్ ఫిల్టర్లను శుభ్రపరచుకోవాలి. ఫర్టిగేషన్ (పైపుల ద్వారా పైరుకు ఎరువులు అందించడం) తర్వాత 10 నిమిషాల పాటు లేటరల్ పైపుల ద్వారా మంచినీటిని పారించాలి. పంటను కోసిన తర్వాత యాసిడ్ (33%) ట్రీట్‌మెంట్‌తో పైపుల్ని శుభ్రపరచాలి. మొక్కల దగ్గర పీడనాన్ని పరీక్షించాలి.

No comments:

Gouthamaraju as WUA