పాడి పంటలు

Thursday, December 30, 2010

ఆశలు కృష్ణార్పణం * కర్ణాటక, మహారాష్ట్ర వాదనలకే ట్రిబ్యునల్ మొగ్గు * నోట్లో ‘మట్టి’..! ఆలమట్టి డ్యాం ఎత్తు.....

*కర్ణాటక నిర్మించిన ఆలమట్టి డ్యాం ఎత్తుకు అనుమతి
* మిగులు జలాల గుర్తింపు... పంపిణీ - నీటి లభ్యత 65 శాతం ప్రకారం లెక్కింపు
* నికర జలాల లెక్కల్లోనూ మార్పులు... మన ప్రాజెక్టులకు కష్ట కాలం
* మొత్తం జలాల్లో మనకు 1,001, కర్ణాటకకు 911, మహారాష్టక్రు 666 టీఎంసీలు
* చెన్నై నీటి అవసరాలకు ప్రత్యేక కోటా... నీటి వాడకంపై ప్రత్యేక అథారిటీ
* ఈ తీర్పు 2050 వరకు అమలు... అభ్యంతరాలను మూడు నెలల్లో చెప్పాలి


రాష్ట్రానికి మరో పిడుగుపాటు... జల పంపిణీలో తీవ్ర అన్యాయం.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం.. పచ్చని పైర్లతో కళకళలాడే కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం..!! కృష్ణా జల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఊహించని తీర్పును వెలువరించింది. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల వాదనలకే మొగ్గు చూపింది. ఇప్పటి వరకు మనం మాత్రమే వాడుకునే స్వేచ్ఛ కలిగిన మిగులు జలాల్లో ఎగువ రాష్ట్రాలకూ వాటా కల్పించింది. అంతేకాదు.. మన రాష్ర్ట ప్రయోజనాలకు గొడ్డలిపెట్టయిన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకూ పచ్చజెండా ఊపింది. ఫలితంగా కృష్ణా నదిని ఆధారం చేసుకుని నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ కృష్ణా ట్రిబ్యునల్ గురువారం ఈ కీలక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుపై ఉండే ఫిర్యాదులను మూడు మాసాల్లోపు నమోదు చేసుకోవచ్చని ట్రిబ్యునల్ సూచించింది.

రాష్ట్రానికి నష్టమిలా...

‘మిగులు’ దిగులే
దిగువ పరీవాహక ప్రాంతంగా మన రాష్ట్రానికి ప్రకృతి పరంగా ఉన్న అననుకూలతను ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. నికర, మిగులు జలాలను కలిపి లెక్కించి మూడు రాష్ట్రాలకు పంచటం వల్ల మన ప్రస్తుత, కొత్త ప్రాజెక్టులకు నీరు దైవాధీనమైంది.

పొరుగు ‘ఎత్తు’తో చిత్తు
ఆలమట్టి ఎత్తు పెంపు వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్.. వాటి అనుబంధ ప్రాజెక్టులకు నీటి లభ్యత గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా కృష్ణా ఆయకట్టు మీద ఆధారపడిన లక్షలాది ఎకరాలకు నీరు అందడం గగనమే.

ఖరీఫ్ హరీ!
ఖరీఫ్ ప్రస్తావన ట్రిబ్యునల్ తీర్పులో లేదు... ఫలితంగా కృష్ణా బేసిన్‌లో మన ఖరీఫ్ పంట ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. తమ ప్రాజెక్టులు నిండేదాకా కర్ణాటక, మహారాష్ట్ర నీరు విడవకపోతే కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ అన్నమాట వినపడదు.

ప్రశ్నార్థకమైన ప్రాజెక్టులు
మిగులు జలాలు పంపిణీ చేయడంతో తెలుగుగంగ, ఎస్‌ఎల్‌బీసీ, గాలేరు-నగరి, హంద్రీనీవా, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ఆశలకు నీళ్లొదిలినట్టే!

కృష్ణా నది జలాలపై మన రాష్ట్రంతో పాటుగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ర్టల మధ్య వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు 1969లో ఆర్‌ఎస్ బచావత్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ 1973లో తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా 2002లో మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. దాంతో 2004 ఏప్రిల్‌లో బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రి బ్యునల్‌లో ఎస్‌పీ శ్రీవాస్తవ, డీకే సేథ్ సభ్యులుగా ఉన్నారు. బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణాజల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ముందు ఆయా రాష్ట్రాలు తమ వాదనల్ని సుదీర్ఘంగా వినిపించాయి.

మన రాష్ట్రం తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది దిపాంకర్ పి గుప్తా వాదించారు. కృష్ణాలో మిగులు జలాలు లేవని, ఒకవేళ కొద్దిగా ఉన్నా.. వాటిని వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ర్టమైన తమకే ఉందని రాష్ట్రం వాదించింది. ఆలమట్టి డ్యాం ఎత్తును పెంచవద్దని కోరింది. అయితే మన వాదనలన్నీ అరణ్య రోదనలే అయ్యాయి. మిగులు జలాలున్నాయని, వాటిని పంచాల్సిందేనని, ఆలమట్టి డ్యాం ఎత్తుకు అనుమతిని ఇవ్వాలన్న కర్ణాటక, మహారాష్ట్ర వాదనల వైపే ట్రిబ్యునల్ మొగ్గుచూపిం ది. నీటి లభ్యతను 75 శాతం నుంచి 65 శాతం మేర లెక్కించింది. మిగులు జలాలున్నాయన్న వాదనతో ఏకీభవిం చింది. ఎగువ రాష్ట్రాలకు మేలు జరిగే తీర్పు వె లువరించింది.

ఇదీ నీటి పంపకం..
బచావత్ అవార్డు ప్రకారం కృష్ణానదిలో (75 శాతం నీటి లభ్యత) 2,060 టీఎంసీల నికర జలాలు, మరో 70 టీఎంసీల రీ జనరేషన్ జలాలు ఉన్నట్టు లెక్క తేల్చారు. అయితే ప్రస్తుత ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని 65 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుంది. 2,578 టీఎంసీల జలం ఉన్నట్టు తేల్చింది. కొత్తగా 163 టీఎంసీల నికర జలం, మరో 285 టీఎంసీల మిగులు (మొత్తం 448 టీఎంసీలు) జలాలు ఉన్నట్టు ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ నీటిని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ లెక్కన ఇప్పటికే ఉన్న కేటాయింపులకు అదనంగా ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్టక్రు 81 టీఎంసీలు కేటాయించారు.

నోట్లో ‘మట్టి’..!
ట్రిబ్యునల్ తీర్పులో మరో ప్రధానాంశం ఆలమట్టి డ్యాం ఎత్తు. ఈ విషయంలో మన రాష్ట్రం తీవ్ర అభ్యంతరాన్ని వెలిబుచ్చింది. డ్యాం ఎత్తు పెంచితే తమకు తీవ్ర నష్టం ఉంటుందని పేర్కొంది. అయితే మన మొరను ట్రిబ్యునల్ ఆలకించలేదు. డ్యాం ఎత్తు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్యాం ఎత్తును 524.256 మీటర్ల వరకు పెంచుకోవచ్చని అనుమతిని ఇచ్చింది. ఈ ఎత్తు పెంపు వల్ల కర్ణాటక అదనంగా మరో 130 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 303 టీఎంసీల నీటిని కర్ణాటక ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. మహారాష్ర్ట ప్రభుత్వానికి కూడా ఈ తీర్పు లాభసాటిగానే ఉంది. ఆ రాష్ర్టం కోరుకుంటున్నట్టుగా కోయినా జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా 92 టీఎంసీలను ఉపయోగించుకుని, ఈ నీటిని అరేబియా సముద్రంలోకి వదిలివేయడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది.

గత ట్రిబ్యునల్ ప్రకారం 25 టీఎంసీలను మాత్రమే ఈ అవసరానికి ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ట్రిబ్యునల్ తీర్పులో చెన్నై మంచినీటి అవసరాలకు ప్రత్యేక నీటి కోటాను ప్రకటించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మూడు రాష్ట్రాలు 3.30 టీఎంసీల చొప్పున, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో 1.70 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. తీర్పు ప్రకారం కోటా మేరకు ఆయా రాష్ట్రాలు నీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా కృష్ణా జల రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ తన తీర్పులో సూచించింది. తుంగభద్ర కుడి కాల్వ నీటి వినియోగానికి సంబంధించి ఆంధ్రా, కర్ణాటక అధికారులతో బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది. కృష్ణానది ఎండిపోయి జీవావరణం దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా వేసవిలో ఆలమట్టి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు 2050 మే 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

మిగులు జలాలంటే..?
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులో... నికర, మిగులు, వరద జలాలు, స్కీం-ఏ, స్కీం-బీ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. వాటి వివరాలు ఇవీ..

నికర జలాలు: కృష్ణా బేసిన్‌లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకొని... బేసిన్‌లో ఏటా అందుబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని గణిస్తారు. ఈ పరిమాణాన్నే నికర జలాలుగా పేర్కొంటారు.
మిగులు జలాలు: విస్తారంగా వర్షాలు పడినప్పుడు.. సాధారణం కంటే ఎక్కువ పరిమాణంలో లభ్యమయ్యే నీటిని మిగులు జలాలుగా వ్యవహరిస్తున్నారు.
వరద జలాలు: వరదలు సంభవించిన సందర్భాల్లో నదుల్లో అధికంగా (నికర, మిగులు జలాల పరిమాణాన్ని మించి) ప్రవహించే నీటిని వరద జలాలుగా పిలుస్తారు.
స్కీం-ఏ: గణించిన నికర జలాలను మూడు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర) కేటాయింపుల ప్రకారం వినియోగించుకోవాలి. మిగులు జలాలను వాడుకొనే స్చేచ్ఛ కింది రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్‌కు) ఉంటుంది. ఇప్పటి వరకు ఇదే విధానాన్ని అనుసరించారు. తాజా తీర్పుతో ఈ విధానం రద్దయింది.
స్కీం-బీ: మిగులు జలాలను మూడు రాష్ట్రాలు నిర్దేశిత నిష్పత్తిలో పంచుకొంటాయి. తగులు (డెఫిసిట్)నూ పంచుకోవడం ఈ విధానం ప్రత్యేకత. ఇప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

కేటాయింపుల్ని ఇలా వాడాలి !
కేటాయించిన నీటిని పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు కొన్ని సూచనలను చేసింది. ఆయా రాష్ట్రాలకు బేసిన్‌ల వారీగా ఎంత నీటిని ఉపయోగించుకోవాలనే విషయాన్ని తీర్పులో స్పష్టం చేసింది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం పాత ట్రిబ్యునల్ కేటాయించిన 2,130 టీఎంసీలు, కొత్తగా కేటాయించిన 448 టీఎంసీల నీటి వాడకడంలో ఈ సూచనలు వర్తిస్తాయని పేర్కొంది.

మహారాష్ట్ర పాటించాల్సిన సూచనలు...: కే-5 బేసిన్ (అప్పర్ బీమా)లో 92.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించరాదు. సాధారణ నీరు ఉండే సంవత్సరంలో 663 టీఎంసీల కంటే ఎక్కువ వాడకూడదు.

కర్ణాటక...: కే-8 బేసిన్‌లో 360 టీఎంసీల కంటే ఎక్కువ వాడకూడదు. ఆలమట్టి ద్వారా 303 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడుకోకూడదు.

ఆంధ్రప్రదేశ్...: సాధారణ సంవత్సరంలో 1,001 టీఎంసీలే వాడుకోవాలి. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు

వర్షాలు సకాలంలో రాకుంటే అంతే..
కృష్ణా బేసిన్‌లో సకాలంలో వర్షాలు రాకపోతే.. మన పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మామూలుగా అయితే ఆలమట్టిలోకి 173 టీఎంసీల నీరు చేరిన వెంటనే కిందకు నీటిని వదలడానికి అవకాశం ఉండేది. అయితే... ప్రస్తుత తీర్పు ద్వారా ఈ డ్యాం ఎత్తు 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచుకోవడానికి కర్ణాటకకు అవకాశం ఏర్పడింది. అదనంగా మరో 130 టీఎంసీల నీటి వినియోగానికి ఆస్కారం ఉంది. అంటే... ఎగువ ప్రాంతంలో కురిసే వర్షం ఆలమట్టిలోకే సరిపోతుంది. కిందకు నీరు రావాలంటే భారీ వర్షాలు కురవాలి. వర్షాలు రాలేని పరిస్థితిలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇబ్బంది తప్పదు. ఇలాంటి పరిస్థితిలో నీటిని సమానంగా ఉపయోగించుకోవడానికి వీలుగా నీటివిడుదలకు సంబంధించి రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఆథారిటీలోని సభ్యుల్ని కేంద్రంతో పాటు మూడు రాష్ట్రాలు నియమించనున్నాయి.

రాష్ట్రాలపై ట్రిబ్యునల్ ఖర్చు
గత ఆరు సంవత్సరాల పాటు ట్రిబ్యునల్ నిర్వహణకు అయిన ఖర్చును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర భరించాలని ట్రిబ్యునల్ ప్రకటించింది. మొత్తం ఖర్చును మూడు రాష్ట్రాలు సమానంగా భరించాలని సూచించింది.

తీర్పు ముఖ్యాంశాలివీ..
* మిగులు జలాలపై ఇన్నాళ్లూ రాష్ట్రానికున్న స్వేచ్ఛకు ఈ తీర్పుతో తెరపడింది.
* నికర జలాలపైనా మన వాదనలకు పూర్తి భిన్నంగా ట్రిబ్యునల్ లెక్కలేసింది.
* పాత బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుంటే ఈ ట్రిబ్యునల్ 65 శాతాన్ని లెక్కలోకి తీసుకుంది.
* ఈ కొత్త లెక్క కారణంగా కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే నికర జలాల పరిమాణాన్ని ఎక్కువగా చూపించారు.
* పాత ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం 2,130 టీఎంసీల నికర జలాలు ఉండగా ఇప్పుడు కొత్త లెక్క కారణంగా అదనంగా మరో 163 టీఎంసీలు కలిపి మొత్తం 2293 టీఎంసీల నికరజలాలున్నట్లు కొత్త ట్రిబ్యునల్ లెక్క తేల్చింది.
* దీంతోపాటు బేసిన్‌లో 285 టీఎంసీల మిగులు జలాలు కూడా ఉన్నట్టు ట్రిబ్యునల్ గుర్తించింది. మొత్తం నీటి లభ్యతను 2,578 టీఎంసీలుగా లెక్కించారు.
* ఈ మొత్తాన్ని బేసిన్‌లోని మూడు రాష్ట్రాలకూ పంపిణీ చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌కు 1,001 టీఎంసీలు (గతంలో 811), కర్ణాటకకు 911 టీఎంసీలు (734), మహారాష్ర్టకు 666 టీఎంసీలు (585) కేటాయించారు.
* కర్ణాటక డిమాండ్ మేరకు ఆలమట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచుకోవటానికి అనుమతించింది. దీనివల్ల కర్ణాటక ఆ డ్యాం ద్వారా 303 టీఎంసీలు(ఇప్పటివరకు 173) ఉపయోగించుకోవచ్చు.
* అసలే బేసిన్‌లో నీటి లభ్యత తగ్గిపోతున్న పరిస్థితిలో ఆలమట్టి ఎత్తు పెంపు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, దీని అనుబంధ ప్రాజెక్టులు, కృష్ణా డెల్టాలపై ఆధార పడ్డ లక్షలాది మంది రైతులకు ఇబ్బందులు తప్పవు.
* మహారాష్ట్ర కోరుతున్నట్టు 92 టీఎంసీల నీటిని కోయ్‌నా విద్యుత్ ప్రాజెక్టు ద్వారా అరేబియా సముద్రంలోకి మళ్లించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* కృష్ణా నీటి వాడకంపై కేంద్రం, మూడు రాష్ట్రాల ప్రతినిధులతో ఒక రె గ్యులేటరీ అథారిటీని సత్వరం ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ సూచించింది.
* తుంగభద్ర ఎడమ కాలువ నీటి వాడకానికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల అధికారులతో బోర్డు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
* చెన్నై తాగు నీటి అవసరాల కోసం మూడు రాష్ట్రాలు సమానంగా నీటిని విడుదల చేయాలని సూచించింది.
* కృష్ణా నది ఎండిపోయి జీవావరణం దెబ్బతినకుండా నదీప్రవాహం ఉండేలా వేసవిలో ఆలమట్టి నుంచి 10 టీఎంసీలు విడుదల చేయాలని తీర్పునిచ్చింది.


పురోభివృద్ధికి శరాఘాతం..
‘ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర పురోభివృద్ధికి శరాఘాతం. జలయజ్ఞం ప్రాజెక్టులు పనికి రాకుండాపోయే ప్రమాదం ఏర్పడింది. మన ఇంజినీర్లు, న్యాయవాదులు సమర్థంగా వాదించలేదని అర్థమవుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం చేయాల్సిన తక్షణ కర్తవ్యం’
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, మాజీ అధ్యక్షుడు ప్రభాకర్

రబీ పంట ఉండదు...
‘తీర్పు నిరాశాజనకంగా ఉంది. ఆలమట్టి ఎత్తు పెంచితే.. ముందు అది నిండాలి.. తర్వాత జూరాల, శ్రీశైలం, సాగర్ నిండితే, అప్పుడు మనం నారుమళ్లు వేసుకోవాలి. ఇదంతా జరగాలంటే అక్టోబరు మొదటి వారం వస్తుంది. అప్పుడు ఖరీఫ్ మొదలు పెడితే ఇక రబీ పంటవేసేదుండదు’’
- చెరుకూరి వీరయ్య, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్

తెలంగాణ వాటా తేల్చాలి
‘1,001 టీఎంసీలో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలి. గతంలో ఉన్న 811 టీఎంసీల్లోనే తెలంగాణకు సరైన వాటా దక్కలేదు. కొత్తగా వస్తున్న 200 టీఎంసీలను తెలంగాణకు ఇస్తారా?లేదా? దాంతో పాటు గతంలో రావలసిన 290 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలి’
- ఆర్.విద్యాసాగర్‌రావు, సీడబ్ల్యూసీ, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్

బాబు వల్లే జల కేటాయింపుల్లో అన్యాయం: పీఆర్పీ
కృష్ణా జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరగడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సగం కారణమని ప్రజారాజ్యం పార్టీ ఆరోపించింది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లలో ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించడంవల్లే ప్రస్తుతం రాష్ట్రానికి కేటాయింపులు తగ్గాయని ఆ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.

రాష్ట్రానికి తీరని అన్యాయం: ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బీజేపీ
కృష్ణా జలాలకేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. సీఎం వెంటనే అఖిలపక్ష భేటీని ఏర్పాటుచేసి, ట్రిబ్యునల్ ఎదుట అభ్యంతరాలను తెలియజేయాలి. ఆలమట్టి ఎత్తును పెంచేందుకు కర్ణాటకకు అనుమతినివ్వడం ద్వారా రాష్ట్ర ప్రజల నోట్లో మట్టికొట్టినట్లు అయ్యింది.

No comments:

Gouthamaraju as WUA