పాడి పంటలు

Tuesday, December 14, 2010

తిండి తిప్పలు * పండిద్దునా... కొనుక్కుందునా ?

ఆహారం పండిద్దునా .........
లేక కొనుక్కుందునా?
మా ఊరయిన చిత్తూరు జిల్లా వెంకటాపురంలో రైతులు ఈ విధంగా మాట్లాడుకుంటారు... "మా కుటుంబ అవసరాలకు ఏటా ఎన్ని వేరుశనగలు కావాలి... మహా అయితే ఒక గోతాము చట్నీకి, రెండు మూడు గోతాలు వంట నూనెకి. దానికోసం ఇంత కష్టపడి పండించడం ఎందుకు? సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టాలి మన వద్ద లేకపోతే వడ్డీకి అప్పు చెయ్యాలి. పొలంలో పని చేయడానికి కూలి వాళ్లు దొరకాలి. అంతా చేసి పంట చేతికి వచ్చేనాటికి ధరలు పడిపోవచ్చు. అదే జరిగితే మిగిలేది అప్పులే. అందుకే దాని బదులు పొలాన్ని మామిడి తోట కిందకు మార్చేసి మనకి కావాల్సిన వేరుశనగల్ని కొనుక్కుంటే నయం కాదా?''

ఇదే రకమైన వాదన మిరప, కూరగాయలు, పాల విషయంలో కూడా వినపడుతుంది. ఎన్ని మిరపకాయలు కావాలి? ఐదు కిలోలో, పది కిలోలో. దాని కోసం పండించే బదులు కొనుక్కుంటే సరిపోతుంది. పాలెన్ని కావాలి? రోజుకి అర లీటరో లీటరో. టీకి, పెరుగుకి లేదా మజ్జిగకి. దాని కోసం ఆవుల్ని పెంచడం, గడ్డి కోసుకొచ్చి వేయడం, వాటికి దాణా కోసం వేరుశనగ చెక్కను కొనడం, అవి జబ్బు పడితే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లడం... ఎందుకీ గోలంతా? ఇదే విధంగా కూరగాయలు... దుక్కి దున్నాలి, సాళ్లు తోలాలి. క్రమం తప్పకుండా నీరు పెట్టుకోవాలి, కలుపు తీస్తుండాలి, పురుగు మందులు కొట్టాలి, ముదరక ముందే కాయలు కోసి మార్కెట్టుకు పంపాలి. ఇంత కష్టపడితే గిట్టుబాటు ధర రాకపోవచ్చు... ఎందుకొచ్చిన తలనొప్పి.

కొనుక్కుంటే సరిపోతుంది. కూరల ధరలు ఎక్కువుంటే ఆకు కూరలతో సరిపెట్టుకోవచ్చు. అవీ లేకపోతే మునగాకుతో ముగించవచ్చు. లేదా చింతపులుసు, చట్నీ, రసంతో కానిచ్చేయొచ్చు. ఇలా ఆలోచించడం వల్లే రైతులు వర్షాధార పంటలు, ముఖ్యంగా మెట్ట పంటలైన తృణ ధాన్యాలు, పప్పు గింజలు, నూనె గింజలు, కూరగాయలు పండించడానికి ముందుకు రావడం లేదు. పశువుల పెంపకం పట్ల వారికి ఆసక్తి మరీ తగ్గిపోతోంది. పంట భూములన్నిటిని తోటల కిందకు మార్చేసి హాయిగా సేద తీరుతున్నారు. మా ఊళ్లో అయితే ఇంతకు ముందు వేరుశనగలు, పప్పులు, నూనె గింజలు పండిన నేలల్లో ఇప్పుడు మామిడి పండ్లు పండుతున్నాయి. మరి పప్పు, ధాన్యం బదులు రోజూ మామిడి పండ్లనే తినగలమా? పంటభూమి ఉన్న రైతులంతా ఇట్లాగే ఆలోచిస్తే ఆహార పంటలనెవరు పండిస్తారు? ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటే అంటవా మరి? కాని రైతులిట్లా ఎందుకు చేస్తున్నారు?

సాగు ఖర్చులు పెరుగుతున్నాయి, చేతికొచ్చే డబ్బులు తగ్గుతున్నాయి. పంట ఉంటే ధర ఉండదు.. ధర ఉంటే పంట ఉండదు. ఏడాది కేడాదికి పెరుగుతున్న నష్టాలను చూసి రైతులు ఆ పంటలకి దణ్ణం పెడుతున్నారు. కొబ్బరి తోటల విషయంలో నా సొంత అనుభవమే చెపుతాను. గత ఇరవై సంవత్సరాల నుంచీ వాటి ధర ఒక్కో కాయకి రూ. 2 నుండి రూ. 3 పలుకుతోంది. అంతకు మించి ఒక్క పైసా పెరగలేదు. అందుకే చిత్తూరు జిల్లాలో కొబ్బరి రైతులు చెట్లు కొట్టేసే యోచనలో ఉన్నారు. ఆ పంటకేమో ఎక్కువ నీళ్లు కావాలి. నీటి మట్టమేమో తగ్గుతూ పోతోంది. అదే విధంగా ఇరవై ఏళ్లలో పాల ధర లీటరు రూ4 నుండి రూ16కి పెరిగింది. అయితే మేతగా వాడే వేరుశనగ చెక్క ధర అదే కాలంలో కిలోకి రూ4 నుండి రూ26కు పెరిగింది.

వరికి, గోధుమకు తప్పించి మిగతా వేటికీ ఖచ్చితమైన మద్దతు ధర లభించట్లేదు. ప్రతి సంవత్సరం రైతు మొదట్లో రుతుపవనాలతోను చివర్లో మార్కెట్టుతోను జూదమాడినట్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎందుకు చేయాలి? ఈ మధ్యన కొత్త అంశం వచ్చి చేరింది. పోయిన దశకంలో గ్రామాలలో మూడు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే... డ్వాక్రా, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయ రోజ్‌గార్ యోజన. డ్వాక్రా పుణ్యమా అని భూమి లేని మహిళా రైతులకు రుణ సదుపాయం లభిస్తోంది. దాంతో పశువుల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలతో వారికి బతుకుతెరువు దొరుకుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పుణ్యమా అని దారిద్య్రరేఖకి దిగువనున్న కుటుంబాలకు పదిరోజులకు సరిపడా ధాన్యం రెండురూపాయలకు కేజీ చొప్పున లభిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పుణ్యమా అని పనివాళ్ల జేబుల్లో డబ్బు కదలాడుతున్నది.

దాంతో వ్యవసాయం పట్ల, పని పట్ల వారి ఆలోచనలు అభిప్రాయాలు మారిపోయాయి. వారమంతా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పనికి వెళ్లని రోజు తమ సొంత పని చేసుకుంటున్నారు. అది వారి స్వీయ ఉపాధి వ్యాపారం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాల్లో కూలి రేట్లు పెరిగి వ్యవసాయం ఖర్చు పెరిగిపోయింది. దీని వల్ల ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూలీల వలస కొంతమేర తగ్గిపోయిందేమో కాని, గ్రామాల నుండి పట్టణాలకి వలస మాత్రం తగ్గలేదు. ఎందుకంటే పట్టణాల్లో కూలి ఎక్కువగా లభిస్తుంది కనుక.

ఈ రకంగా నిరంతరాయంగా పట్టణాలకు వలస వెళ్లటం మూలాన గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడుతున్నది. మా గ్రామాల్లో ఈ సీజనల్ వలసలు శాశ్వత వలసలకు దారి తీశాయి. ఉపాధి హామీ పథకం చాలా వరకు లోపభూయిష్టంగా ఉంటుంది. నిర్వహణలో చాలా అవినీతి చోటు చేసుకుంటుంది. దీనివల్ల నష్టపోయే వాళ్లూ, లాభపడేవాళ్లు కూడా వ్యవసాయ కూలీలే. ఎలాగంటే... ఇందులోని మస్టర్ రోల్స్ (కూలీల వివరాలు) అన్నీ ఉత్తుత్తివే. పని చేసిన వాళ్లకంటే ఎక్కువమందిని చూపించి ఆ డబ్బు తీసుకోవడం సాధారణం. పని కొలతలు కూడా ఉత్తుత్తివే. అసలు జరిగిన దానికంటే ఎక్కువ పని జరిగినట్టుగా చూపించటం మామూలయిపోయింది. కూలీలకు కూడా ఇదంతా అలవాటైపోయింది. దీనివల్ల ఒక రైతు పర్యవేక్షణలో పని చేయటానికి వాళ్లు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం ఇచ్చినంత వేతనం రైతు కూడా ఇవ్వాలనుకుంటున్నారు వాళ్లు. ఫలితంగా కూలీ రేట్లు రైతులకు మోయలేని భారమయ్యాయి. దీని ప్రభావం వారిపై ఎలా ఉందో వచ్చేవారం తెలుసుకుందాం.

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

No comments:

Gouthamaraju as WUA