ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాధారణ ధరల సూచీ (జనరల్ ప్రైస్ ఇండెక్స్) తక్కువగానే ఉన్నా, ద్రవ్యోల్బణం సైతం 1-2 శాతం మాత్రమే ఉన్నా ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 20 శాతం పెరిగినట్టు పోయిన ఏడాది ఆర్ధిక నివేదికలు చెపుతున్నాయి (బిజినెస్‌లైన్ 23, ఫిబ్రవరి 2010. సి. పి. చంద్రశేఖర్, జయతి ఘోష్).
ఆహార ధరలు పెరగటం ఇండియాలో మరీ కొత్తేమీ కాదు. కాని నాకు బాగా గుర్తు- గతంలో తిండిగింజల ధరలు పెరిగినప్పుడు ఒకటో రెండో నిరసనలు వినపడేవి. సామాజిక స్ఫూర్తి కలిగిన ప్రమీల దండావతే లాంటి వాళ్ల నిరసనలో లేదా వర్షాలు వచ్చో ధరలను తాత్కలికంగానైనా తగ్గించేవి. తరువాత షరామామూలే. కాని ప్రస్తుతం ధరలు ఏమాత్రం తగ్గేట్టుగా కనపడటం లేదు. అవి అలాగే నిలిచిపోయేలా ఉన్నాయి. నేనుండే కుగ్రామం వెంకట్రామపురంలో కూడా కూరగాయల ధరలు కిలో రూ.20-30 పలుకుతున్నాయి. వరి, గోధుమలు గవర్నమెంటు గోడౌన్లలో నిండి ఉన్నా కూడా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇట్లా ధరలు పెరగటానికి కారణం గోడౌన్ల లోని ధాన్యం ప్రజలకి చేరవేయడంలో ప్రభుత్వం విఫలమవ్వటమే ననిపిస్తుంది.
రెండేళ్ల క్రితం పెసరపప్పు ధర కిలో రూ.37 ఉండగా ప్రస్తుతం అది రూ. 88. ఈ రెండేళ్లలో కందిపప్పు ధర 71 శాతం పెరిగింది. 2008లో మినప్పప్పు ధర కిలో రూ. 40 ఉండగా ఇప్పుడు రూ.80 కి చేరింది. పంచదార ధర కూడా అంతే, 2008లో కిలో రూ. 17 కు లభిస్తే ఇప్పుడు రూ.38 కి చేరింది. పాలు కూడా ప్రియమైపోతున్నాయి. పాల ధరలు 21 శాతం పెరిగిపోయాయి. కూరగాయల ధరలు 4 శాతం, పండ్ల ధర 13 శాతం పెరిగాయి (ఇండియాటుడే 23 ఆగస్టు 2010).
ఇప్పుడు చెప్పండి... అన్నం తిందామా లేక సున్నం తిందామా? సున్నమే చవకేమో. ఆహార ధాన్యాల ధరలు ఇలా పెరగటానికి కారణాలేమిటి? చమురు ధరలు పెరగటమే ఆహార ధాన్యాల ధరలు పెరగటానికి ప్రధాన కారణంగా చూపుతుంది ప్రభుత్వం. నిజమే, పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు ఆహారధరలకు ఆజ్యం పోసినట్లయింది. కాని ఆహార ధరల పెరుగుదల ఇంకా అనేక మౌలిక అంశాలతో ముడిపడి ఉన్నది. మొదటిది ఆహార ధాన్యాల దిగుబడి తగ్గడం.. అందునా పప్పులు, నూనెగింజల పంటల దిగుబడి తగ్గటం. వాటిని విదేశాల నుండి దిగుమతి చేసుకోవటం ద్వారా కొరతను తగ్గించారు. అయితే వరి, గోధుమ పంటల దిగుబడి కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు పెరగట్లేదు. నిజానికి స్వాతంత్య్రం వచ్చాక మన తలసరి ధాన్యాల లభ్యత తగ్గింది. ఎందుకు? ఎందుకంటే జనాభా పెరుగుతున్నదే కాని వ్యవసాయ భూమి విస్తరణలో గాని సగటు ఎకరా దిగుబడిలో గాని పెరుగుదల లేదు.
గత 15 ఏళ్లలో సాగులోకి వచ్చిన భూమిని ఒక్కసారి గమనిస్తే... 1995-96లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం సాగుభూమి సుమారు 100 లక్షల హెక్టార్లు. అందులో నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి 36-46 లక్షల హెక్టార్లు. ఒకటి కంటే ఎక్కువ పంటలు పండే భూమి ఈ పదిహేనేళ్లలో 40 నుంచి 60 శాతానికి పెరిగింది. అంటే ఓ పక్క నీటిపారుదలపైఆధారపడే సాగు పెరుగుతోంది. దాంతోపాటు వ్యవసాయం చేయకుండా పడావ్ (బీడు) పెట్టిన భూమీ పెరుగుతోంది. 1955-56లో 7లక్షల హెక్టార్లున్న పడావ్ భూమి 2000-01లో 14 లక్షల హెక్టార్లకు, 2008-09 నాటికి 26 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇంతకూ ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయి?
రైతులు చెప్పేదేమిటంటే నీళ్లుంటేనే పంటలకు భరోసా ఉంటుంది. కాబట్టి రైతులు నీటిపారుదల వ్యవసాయాన్నే చేస్తామంటున్నారు. నీటిపారుదల సౌకర్యం లేని, వర్షాధారిత భూముల్లో వ్యవసాయం చేయటం వల్ల రాబడి పెద్దగా ఉండడం లేదు కాబట్టి ఆ భూములను వదిలేస్తున్నారు. ఫలితంగా బీడు భూములు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్లయితే ఈ బీళ్లను తోటల కిందకు మార్చేస్తున్నారు. వాటిలో మామిడి (టెక్నికల్‌గా ఆహార పంటే అయినా ఇవి సంవత్సరానికి ఒకేసారి, అదీ కొన్ని రోజులు మాత్రమే కాస్తాయి కదా. దీని బదులు పప్పులు, నూనెగింజలు కనక వేసినట్లయితే సంవత్సరమంతా తినొచ్చు), జీడి మామిడి, కొబ్బరి, సుబాబుల్, యూకలిప్టస్ మొదలైన తోటలు పెంచుతున్నారు. ఒకసారి చెట్లను పెంచాక ఇక ఆ భూముల్లో మరేరకమైన ధాన్యాలను కానీ, చిరుధాన్యాలను కానీ, పప్పుధాన్యాలను కానీ, నూనె గింజలను కానీ, మరే ఇతర రోజువారీ పంటలను కానీ పండించడానికి వీలు కాదు. ప్రభుత్వం కూడా ఈ రకమైన 'క్యాష్ క్రాప్స్'నే పండించమని రైతుల్ని ప్రోత్సహిస్తోంది. ఆహార పంటల సాగుతో పోలిస్తే పత్తి లాంటి వ్యాపార పంటలు, మామిడి, సుబాబుల్ లాంటి తోటలు పెంచడంలో ఎటువంటి చికాకులు, తలనొప్పులు ఉండవు. అందుకే రైతులు ఆ పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.
దీనంతటి ఫలితమే ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల.
- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493
umanarendranath@yahoo.co.in,
99897 98493
No comments:
Post a Comment