పాడి పంటలు

Sunday, April 15, 2012

కలిమి తెచ్చే కరివేపాకు

రైతులు కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కొన్ని రకాల వాణిజ్య పంటల్ని సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి పంటల్లో కరివేపాకు ఒకటి. ఈ పంట నమ్మకమైన దిగుబడుల్ని, ఆదాయాన్ని అందిస్తుంది. కరివేపాకు తోటలో పప్పుధాన్యాలు, ఆకుకూరల్ని అంతరపంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. కరివేపాకును నీటి పారుదల కింద, నీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ఇది బహు వార్షిక కూరగాయ పంట. కరివేపాకు మొక్కలకు అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అతి తక్కువగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకూ అనువైన వాతావరణంగా చెప్పొచ్చు.

నేలలు-రకాలు

కరివేపాకు పైరు అధిక నీటిని తట్టుకోలేదు. అందువల్ల పొలంలో మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పనిసరి. ఏ మాత్రం తేమ నిలవని తేలికపాటి గరప నేలలు, నీరు నిలిచే నల్లరేగడి నేలలు ఈ పంటకు పనికిరావు. దీని సాగుకు ఎర్ర గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. కరివేపాకు సాగుకు డీడబ్ల్యూడీ-1, 2 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు రకాలూ మంచి సువాసన కలిగి ఉంటాయి. డీడబ్ల్యూడీ-1లో నూనె శాతం 5.22%, డీడబ్ల్యూడీ-2లో 4.09%ఉంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం చలిని తట్టుకోలేదు. శీతాకాలంలో పైరు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఇక డీడబ్ల్యూడీ-2 రకం చలి తీవ్రతను కొంత వరకూ తట్టుకుంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది.

ఎలా సాగు చేయాలి?

కరివేపాకు సాగుకు జూన్ నుంచి ఆగస్ట్ వరకూ అనుకూలంగా ఉంటుంది. కరివేపాకు పంటను ఎక్కువగా విత్తనం ద్వారా సాగు చేస్తారు. కొందరు రైతులు ముందుగా నారు పోసి మొక్కలు పెరిగాక ప్రధాన పొలంలో నాటు తారు. ఈ పద్ధతిలో కరివేపాకును సాగు చేయాలనుకుంటే ముందుగా చిన్న చిన్న పాలిథిన్ సంచుల్లో ఇసుక, మట్టి, బాగా చివికిన పశువుల ఎరువును 1:1:1 నిష్పత్తిలో వేయాలి. వాటిలో విత్తనాలు వేసి మొక్కల్ని పెంచాలి. సంచుల్లోని మట్టిపై రోజుకు రెండుసార్లు నీళ్లు చల్లుతూ ఉండాలి. విత్తనాలు మొలకెత్తడానికి మూడు నాలుగు వారాల సమయం పడుతుంది. మూడు నెలల వయసున్న మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఇక నేరుగా విత్తనాలు విత్తే వారు ముందుగా పొలాన్ని లోతుగా దున్నాలి. చివరి దుక్కిలో ఎకరానికి 10-12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఆ తర్వాత గుంటక తోలి భూమిని చదును చేయాలి. తర్వాత సాళ్లలో విత్తుకోవాలి లేదా విత్తనాలు పొలం అంతటా సమానంగా పడేలా వెదజల్లాలి. విత్తనం కోసం చెట్ల నుంచి సేకరించిన పండ్లను మర్నాడే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తితే మొలక శాతం తగ్గుతుంది. ఎకరానికి 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు విత్తిన తర్వాత గుంటక తోలి నీరు పెట్టాలి.


పెద్ద మొక్కల చుట్టూ వచ్చే పిలకల్ని తీసి కూడా నాటుకోవచ్చు. ఇందుకోసం తల్లి మొక్క దగ్గర వేరు నుంచి వచ్చే పిలకల్ని వేరుతో సహా తీసి వెంటనే నాటాలి. అయితే ఈ పద్ధతిలో కరివేపాకు సాగు చేయాలనుకుంటే వర్షాకాలంలో మాత్రమే మొక్కలు నాటాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.


తోటలో మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులు వేస్తూ ఉండాలి.


కోత - ఆ తర్వాత

విత్తనాలు విత్తిన 9-10 నెలలకు పంట కోతకు వస్తుంది. అయితే మొదటి కోతలో కరివేపాకు దిగుబడి, ఆదాయం చాలా తక్కువగా ఉంటాయి. ఎకరానికి 800 నుంచి వెయ్యి కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరంలో ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది. అనంతరం ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మూడో సంవత్సరంలో ఎకరానికి 8-10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది.

కరివేపాకు కోసిన తర్వాత ప్రతిసారీ పొలంలోని కలుపు మొక్కల్ని తొలగించాలి. పైన తెలిపిన విధంగా నత్రజని, మ్యురేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి నీరు పెట్టాలి. డ్రిప్ ద్వారా సాగు చేసినట్లయితే పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు, ఎరువులు అందించవచ్చు. తద్వారా దిగుబడుల్ని 15-20 శాతం పెంచుకోవచ్చు.

జయంత్ రెడ్డి, బీఎస్సీ అగ్రికల్చర్
హైదరాబాద్

ఈ చీడపీడలతో జాగ్రత్త

కరివేపాకు పంటను గొంగళి పురుగులు, పొలుసు పురుగులు, ఆకుమచ్చ తెగులు ఎక్కువగా నష్టపరుస్తాయి. గొంగళి పురుగులు ఆకుల్ని తింటాయి. వీటి నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. పొలుసు పురుగులు కాండం పైన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్క పెరుగుదల తగ్గుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున డైమిథోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మందు పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత ఆకులు కోయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి.

బిందుసేద్యంతో చెరకు సాగు


 
 
 
 
 
 
 
 
 
 
 
వేసవి ఉష్ణోగ్రతలు చెరకు పైరు ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయి. ఎందుకంటే అత్యధిక-అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని, ఎండ తీవ్రతను, వడగాడ్పుల్ని చెరకు పైరు తట్టుకోలేదు. ముఖ్యంగా లేత తోటలు ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేసిన చెరకు తోటలు ప్రస్తుతం పిలకలు తొడిగి, పెరిగే దశలో ఉన్నాయి. ఈ నెల నుంచి జూన్ వరకూ ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. గాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందుసేద్య పద్ధతి ద్వారా భూమిలో తేమను కాపాడుకుంటూ, చెరకు పైరును రక్షించుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో...

బిందుసేద్యం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలోని చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు నాలుగు ఎకరాల్లో ఈ పైరును సాగు చేయొచ్చు. వేసవిలో రైతులు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న విష యం తెలిసిందే. రోజుకు ఆరేడు గంటలు మాత్ర మే కరెంట్ అందుబాటులో ఉంటోంది. అయితే బిందుసేద్య పద్ధతిని అనుసరించే రైతులు విద్యుత్ కోతల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఆ ఆరేడు గంటల సమయంలోనే కనీసం నాలుగైదు ఎకరాల తోటకు నీరు అందించవచ్చు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్న దిగులే అవసరం లేదు. ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడు ఆటోమేటిక్ పరికరం సాయంతో ఏ ఇబ్బందీ లేకుండా తోటకు నీరు అందించవచ్చు. పైగా నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా మనిషి అవసరం ఉండదు. మామూలు పద్ధతిలో రాత్రి సమయంలో తోటకు నీరు పెట్టేటప్పుడు పాములు, ఇతర విష పురుగుల వల్ల ప్రాణహాని ఉంటుంది. బిందుసేద్య పద్ధతిలో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు.


బిందుసేద్య పద్ధతి వల్ల ఒనగూడే మరో ప్రయోజనమేమంటే కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. తద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చు. భూమికి ఎక్కువ నీరు అందుతోందన్న ఆందోళన అవసరం లేదు. మొక్కలకు క్రమ పద్ధతిలో సరిపడినంత నీరు మాత్రమే అందుతుంది. పైగా తోట అంతటికీ సమానంగా అందుతుంది. భూమి చౌడు బార దు. ధాతు లోపాలు తలెత్తవు. మొక్కలు ఆరోగ్యవంతంగా, ఏపుగా, క్రమ పద్ధతిలో పెరుగుతాయి. చీడపీడల తాకిడి తగ్గుతుంది. దీనివల్ల నాణ్యమైన పంటను పొందవచ్చు. రస నాణ్యత కూడా బాగా ఉంటుంది. కూలీలు, సస్యరక్షణపై పెట్టే ఖర్చు కలిసొస్తుంది. దిగుబడి 40-50 శాతం పెరుగుతుంది. బిందుసేద్య పద్ధతిలో చెరకు తోటలో అంతర పంటలు కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. బిందుసేద్య పద్ధతి ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాల్ని మొక్కలకు సరైన మోతాదులో సమానంగా అందించవచ్చు. తద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలపై పెట్టే అనవసరపు ఖర్చును నియంత్రించుకోవచ్చు. ఇసుక నేలలు, గుట్టలు... అంటే ఎగుడు దిగుడుగా ఉండే భూముల్ని చదును చేయాల్సిన అవసరం లేకుండానే తోట వేసుకోవచ్చు. చదును చేయడానికి వీలులేని భూముల్లో కూడా బిందుసేద్యం ద్వారా చెరకు సాగు చేయవచ్చు.


ప్రోత్సాహం-దిగుబడులు

చెరకు సాగులో బిందుసేద్యాన్ని ప్రోత్సహిం చేందుకు పలు చక్కెర కర్మాగారాలు రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నాయి. దీనివల్ల బిందుసేద్యంపై చెరకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది రైతులు బిందుసేద్య పద్ధతిలో చెరకు సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మం డలం పోతవరం గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం మొక్క తోటలో ఎకరానికి సగటున 70 టన్నులు, పిలక తోటలో 69.4 టన్నుల దిగుబడి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దాసరి వెంకటాచలం ఎకరానికి సగటున 70 టన్నుల దిగుబడి పొందారు. వీరిద్దరూ ఇటీవలే ఉగాది పురస్కారాలు కూడా అందుకున్నారు.

బి.హనుమంతరెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్

అగ్రానమిస్ట్, రాజమండ్రి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

జంట సాళ్ల పద్ధతిలో చెరకు ముచ్చెలు నాటినట్లయితే లేటరల్ పైపుల అవసరం తక్కువగా ఉంటుంది. దీనివల్ల డ్రిప్పులపై పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. సాళ్ల మధ్య నాలుగు లేదా ఐదు అడుగుల దూరాన్ని పాటించిన వారు లేదా సాధారణ పద్ధతిలో (సాళ్ల మధ్య మూడు అడుగుల దూరం) ముచ్చెలు నాటిన వారు కూడా బిందుసేద్య పద్ధతిని అనుసరించవచ్చు. బావులు, చెరువులు వంటి నీటి వనరుల ద్వారా చెరకు సాగు చేసే వారు ప్రతి 15 రోజులకు ఒకసారి సిస్టమ్ ఫిల్టర్లను శుభ్రపరచుకోవాలి. ఫర్టిగేషన్ (పైపుల ద్వారా పైరుకు ఎరువులు అందించడం) తర్వాత 10 నిమిషాల పాటు లేటరల్ పైపుల ద్వారా మంచినీటిని పారించాలి. పంటను కోసిన తర్వాత యాసిడ్ (33%) ట్రీట్‌మెంట్‌తో పైపుల్ని శుభ్రపరచాలి. మొక్కల దగ్గర పీడనాన్ని పరీక్షించాలి.

Monday, April 2, 2012

‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ * ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్


ప్రకృతి వ్యవసాయమే మిన్న
 

ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్యే కాదని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే అంశంపై రెడ్‌హిల్స్‌లో సోమవారం రైతులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. 

సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయన్నారు. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరమన్నారు. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే.. భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చన్నారు. 

ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదని, దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయని పాలేకర్ వివరించారు.

శిబిరంలో వ్యవసాయ శాఖ కమిషనర్
వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి పాలేకర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఆయనతో చర్చించారు. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు తన విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మం ది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని పాలేకర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

మామిడి, సపోట పండిస్తున్నాను...
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ 150 ఎకరాల్లో మామిడి, సపోట వంటి అనేక పంట లు పండిస్తున్నాను. రెండేళ్లుగా మా పొలంలో పురుగుల మందు చల్లలేదు. ఎరువులు వేయలేదు. ‘జీవామృతం’ వాడుతున్నాను. రుచికరమైన దిగుబడి వస్తోంది. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతరపంటల ద్వారా ఆదాయం వస్తోంది.
- తిప్పేస్వామి, రాయదుర్గం, అనంతపురం జిల్లా

ఇథియోపియాలోనూ....
ఏడేళ్ల క్రితం పాలేకర్ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. అనేక అవార్డులు పొందాను. ఇథి యోపియా దేశానికి వెళ్లి గులాబీలు, కూరగాయలు, మొక్కజొన్న, చెరకు వంటి పంటలను పండిస్తున్నాను. కబేళాకు వెళుతున్న నాటు ఆవులను కొని సాగు ప్రారంభిం చాను. ఇథి యోపియాలో ‘బురానా’ జాతి ఆవు పేడ, మూత్రంతో కూడిన జీవామృతం అద్భుత ఫలితాలనిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలకు బదులు రైతుకో ఆవు ఇస్తే మేలు జరుగుతుంది.
- జీవీ రాజు, ఎస్‌ఆర్ కండ్రిక, వైఎస్సార్ జిల్లా




దేశవాళి ఆవులే మేలు


  దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్‌బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...


  దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.


  జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..

వేచూర్


కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.

శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.


కాసరగడ్


కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.

మాల్వీ

http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.

పుంగనూరు ఆవులు

http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.

వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 దేని ప్రత్యేకత దానిదే
గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని.

కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...


మన రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, కేరళలోని వేచూర్, కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.


పాల దిగుబడి స్థిరంగా ఉండదు

కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు, నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్, ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు. వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని ప్రదర్శిస్తాయి.

పనిలో దిట్ట
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.

మైసూర్ రాజుల కాలం నుంచి...

మైసూర్ రాజుల కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్ సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు) భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి.

దక్షిణాది ఆవులకు మాతృ జాతి

దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్‌ను మాతృ జాతిగా చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది. దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి కలిగి ఉంటుంది.

రవాణాకూ ఉపయోగపడతాయి

ఖిలారీ జాతి ఆవులు వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ, తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా ఉపయోగపడతాయి.

ప్రతికూల వాతావరణంలోనూ...

పొలం పనులకు, రవాణాకు కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు, మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు.

పాడికి పనికిరావు

తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది. పొట్ట చిన్నదిగా ఉంటుంది.

ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
 

Gouthamaraju as WUA