Sunday, September 9, 2012
Saturday, August 11, 2012
బడుగుల B-School
బడా వ్యాపారవేత్తలకు పనికొచ్చే బిజినెస్ స్కూళ్లు నగరానికొకటి ఉన్నాయి. కాని, చిరు వ్యాపారుల్ని, నిరుపేదల్ని పైకి తెచ్చే స్కూళ్లు? అలాంటివి కూడా ఉంటాయా అనుకుంటున్నారా! ఎక్కువ లేవు కాని ఒకటైతే ఉంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా మహ్‌సవడ్‌లో ఉంది ఓ బడుగుల బి-స్కూల్. మహిళల కోసమే నెలకొల్పిన దాని పేరు 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్'. మేదర్లు, వడ్రంగులు, కమ్మర్లు, కుమ్మర్లు, తోపుడుబండ్ల, పూల అంగళ్ల, కూరగాయల వ్యాపారులు.. వీళ్లే అక్కడ విద్యార్థులు.
వనిత, MDBS.
ఎంబీబీఎస్ గురించి తెలుసు, ఎంబీఏ సంగతీ తెలుసు. మరి, ఈ కొత్త కోర్సు గురించి ఎప్పుడూ వినలేదే? ఎక్కడుంది..? అనే ముందు వనిత గురించి నాలుగు ముక్కలు. ఒకప్పుడు ఆమె కోళ్లఫారం యజమాని. ఒక రోజు ఉన్నట్లుండి వైరస్ సోకింది. కోళ్లన్నీ రాత్రికి రాత్రే చనిపోయాయి. అప్పుల్లో చిక్కుకున్న వనితకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ఆ సమయంలో కూలిపోయిన తన కుటుంబాన్ని తిరిగి నిలబెట్టింది ఎండిబిఎస్ చదువు. కోర్సు పూర్తయ్యాక బ్యాంకులో రుణం తీసుకుని.. డిస్పోజబుల్ (వాడి పారేసే) కప్పులు, ప్లేట్లను ఉత్పత్తిచేసే యూనిట్‌ను ప్రారంభించింది. ఇప్పుడు తన దగ్గర 12 యంత్రాలు, పది మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ మధ్యన ప్రధాని మన్మోహన్సింగ్ చేతుల మీదుగా అవార్డును సైతం అందుకుందీ వనిత. ఆమె చదువుకున్నది ఏ ఖరీదైన బిజినెస్ స్కూల్లోనో కాదు. కేవలం రూ.25 ఫీజు చెల్లించి 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్'లో చదివిందంతే.
మనకు తెలిసిన బి-స్కూల్ అంటే.. సువిశాలమైన క్యాంపస్. హంగూఆర్భాటం. సూటుబూటు. లక్షల్లో ఫీజులు. క్యాంపస్ ఇంటర్వ్యూలు. భారీ వేతన ప్యాకేజీలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనికుల్ని మరింత ధనికులుగా తీర్చిదిద్దేది. కంపెనీలను లాభాల బాటపట్టించే ఉద్యోగులను ఉత్పత్తిచేసేది. కాని, "సారె తిప్పినా బండి నడవని కుమ్మరికి, బడిసె పట్టుకున్నా బతకలేని వడ్రంగికి, ఎన్ని బుట్టలల్లినా కాసింత బువ్వ తినలేని మేదరికి.. బతుకు పాఠాలు బోధించే బడులను ఎందుకు స్థాపించలేకపోతున్నాం..'' అనుకుంది ఒక మహిళ. ఆమె పేరు చేత్నా గలా సిన్హా.
కరువుకు పరిష్కారం..
ముంబయికి చెందిన సిన్హా అందరూ నడిచే దారిలో నడవరు. ఆమెది ఎప్పుడూ భిన్నమైన మార్గం. అభివృద్ధి అంటే పైనున్న వాళ్లను మరింత పైకి తీసుకెళ్లడం కాదు. అట్టడుగునున్న గ్రామీణపేదల్ని పైకి తీసుకురావడం. అలాగే కనుమరుగైపోతున్న వృత్తులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం.. అనుకుంది ఆమె. మహారాష్ట్రలోని సతారా, షోలాపూర్, సంగ్లి, రాయ్‌గడ్, రత్నగిరి, కొల్హాపూర్ కరువు ప్రాంతాలు. ప్రతి పల్లెలోనూ సగానికి పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలే నివసిస్తుంటారు. అరకొర నీళ్లున్న చోట చెరకు, జొన్న, మొక్కజొన్న పండితే పండినట్లు. లేకపోతే గడ్డి కూడా మిగలదు. రైతుల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఇక కూలీల అగచాట్లు చెప్పనక్కర్లేదు.
విషయం తెలుసుకున్న చేత్నా గలా సిన్హా 'మాన్' తాలూకాకు వెళ్లింది. ప్రజల బాధలు అర్థం చేసుకుంది. కేవలం మహిళల కోసం 'మాన్ దేశీ ఫౌండేషన్'ను నెలకొల్పింది. దీని కిందే 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్', 'మాన్ దేశీ మహిళా బ్యాంక్'లను ఏర్పాటు చేశారామె. ఇప్పుడా బ్యాంకులో 1.14 లక్షల సభ్యులు ఉన్నారు. చిరు వ్యాపారులు, నిరుపేదలు ఆ బిజినెస్ స్కూల్లో నైపుణ్యాలను నేర్చుకుంటారు. బ్యాంకులో రుణాలు తీసుకుని.. ఉపాధి పొందుతారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడు.. వారికి సంఘంలో గౌరవం లభిస్తుంది. నాణ్యమైన జీవితంతోపాటు పిల్లలకు చదువులు అబ్బుతాయి. స్థూలంగా మాన్ దేశీ ఫిలాసఫీ ఇదే!
దిశదిశలా స్ఫూర్తి..
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బి- స్కూళ్లకు పాఠ్యాంశాలను రూపొందించడం కంటే.. మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌కు పాఠ్యప్రణాళిక తయారు చేయడం చాలా కష్టం. ఇందులో విద్యార్థులంతా దినకూలీలు, గాజులు అమ్ముకునేవారు, వడ్రంగులు, మేదర్లు, దర్జీలు, తాపీమేస్త్రీలు, బడి మానేసిన పిల్లలు. అందులోనూ అందరూ ఒక వయస్కులు కాదు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య వాళ్లు. మూడోవంతు మందికి వేలిముద్రలు వేయడం ఒక్కటే తెలుసు. "బ్యాంకు అకౌంట్లు, లోన్లు, చెక్కులు, డిడిలు వంటి చిన్న చిన్న విషయాలను అర్థమయ్యేలా చెప్పడం ఒక పెద్ద సవాలు. రకరకాల ప్రయోగాలతో బోధించినా ఫలితం లేకపోయేసరికి.. పల్లెల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న జానపద గాథలు, నాటకాల ద్వారా ఆర్థిక పాఠాల్ని చెప్పాం. పరిస్థితి కొంత వరకు మెరుగుపడింది..'' అన్నారు స్కూల్ టీచర్లు.
మాన్ దేశీ స్కూల్ పాతిక కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి రెండు రోజుల నుంచి మూడు మాసాల కాలవ్యవధి ఉంటుంది. ప్రత్యేక కోర్సులకైతే ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. రూ.25 నుంచి రూ.1200 మధ్యన ఫీజులు ఉంటాయి. ఫైనాన్షియల్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, డ్రెస్ డిజైనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్.. వంటి కోర్సుల్లో తర్ఫీదు ఇస్తారు. ఉదాహరణకు - బుట్టలల్లే వ్యాపారి మార్కెట్‌ను ఎలా విస్తరించుకోవచ్చు? ఇనుపసామాన్లు రిపేరు చేసే నిపుణుడికి మరమ్మతు పరికరాలు ఎక్కడ దొరుకుతాయి? ముడిసరుకుల్ని ఎప్పుడు కొనాలి? వినియోగదారులతో ఎలా మాట్లాడాలి? బ్యాంకుల్ని ఎలా సంప్రదించాలి? అప్పులు, రుణాలు, వడ్డీలు, బీమా, పింఛను, సబ్సిడీలు.. ఇలా ఒక్కటేమిటి? ఆర్థికంతో ముడిపడిన ప్రతి అంశాన్నీ పాఠంగా చెబుతారు. ఈ విషయాలన్నీ అవగాహన లేకే.. చిరువ్యాపారులు రాణించలేకపోతున్నారంటుంది మాన్ దేశీ సంస్థ. వ్యాపారంలో నైపుణ్యం లేని వారికి కూడా శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. కోర్సు పూర్తయిన వెంటనే కచ్చితంగా ఉపాధి దొరికే కోర్సులకే ప్రాధాన్యం ఉంటుంది.
మాన్ దేశీ స్కూల్ గురించి ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఏల్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్మెంట్, డ్యూక్, చికాగో యూనివర్శిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల్ని ఇక్కడికి పంపించి అధ్యయనం చేయిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా మాన్ దేశీ గురించి ఆసక్తి చూపించారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు తనను కలవమని చేత్నా గలా సిన్హాకు ఆహ్వానం పంపించారు. ముంబయికి వెళ్లిన చేత్నా ఒబాను కలిసి.. మాన్ దేశీ గురించి వివరించారు. "ప్రపంచంలోనే బడుగుల కోసం ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ ఇదొక్కటే. ఇలాంటి స్కూళ్ల వల్ల పేదరికానికి పరిష్కారం దొరుకుతుంది.
వృత్తుల్ని నాశనం కాకుండా కాపాడుకోవచ్చు..'' అంటూ 'ద బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్' ప్రశంసించింది. ప్రస్తుతం పేరున్న అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లన్నీ మాన్ దేశీ స్కూల్‌కు నిధులను, బోధనా సహాయాన్ని అందిస్తున్నాయి. హెచ్ఎస్బిసి, యాక్సెంచర్, ఎస్ఐడిబిఐ, నబార్డ్ వంటి సంస్థలు తోడ్పాటునివ్వడం వారికి కలిసొచ్చింది. ఇప్పటివరకు 30 వేల మంది మాన్ దేశీ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. వీరిలో డెభ్బైశాతం మంది చిరువ్యాపారాలను విజయవంతంగా చేసుకుంటున్నారు. వీరందరికీ ఆర్థిక అక్షరాస్యత పెరగడమే కాకుండా.. జీవితం పట్ల ఆత్మవిశ్వాసం ఏర్పడిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రయోగాల పాఠశాల..
మాన్ దేశీ స్కూలు ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. సాధారణ కోర్సులతో సరిపెట్టుకోకుండా.. ప్రత్యేక కోర్సులను డిజైన్ చేస్తోంది. అలాంటి కొత్త కోర్సుల్లో ఒకటి 'బ్రాండెడ్ దేశీ ఎంబీఏ'. ఇందులో బ్రాండింగ్, అడ్వర్టైజింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లలో తర్ఫీదునిస్తారు. అమెరికాకు చెందిన యాక్సియోన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కోర్సుకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంత చేస్తున్నా.. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులకు ఈ బిజినెస్ స్కూల్లో చదువుకునే అవకాశం దొరకడం లేదు. అందుకే, చేత్నా గలా సిన్హాకు కొత్త ఆలోచన తట్టింది. అదే 'మొబైల్ బిజినెస్ స్కూల్'. ఈ కార్యక్రమానికి మాన్ దేశీ ఉద్యోగిని అని పేరుపెట్టారు. బస్సులోపల చక్కటి తరగతి గదిని ముచ్చటగా డిజైన్ చేశారు.
ఇది బ్యాటరీతో ఎనిమిది గంటల సేపు పనిచేస్తుంది. కంప్యూటర్లు, బ్లాక్‌బోర్డులు, వీడియోతెరలు అన్నీ ఉన్నాయి ఇందులో. "వాళ్లు మా దగ్గరికి రావడం కష్టమైతే, మేమే వాళ్ల దగ్గరికి వెళ్లాలన్నది మా ఆలోచన. దాని ఫలితమే ఈ మొబైల్ స్కూల్. ఇప్పటి వరకు బస్సులోనే తొమ్మిది వేల మందికి చదువుకునే అవకాశం కల్పించాం...'' అని చెప్పారు మాన్ దేశీ నిర్వాహకులు. తొలిదశలో కర్ణాటకలోని హుబ్లీలో మాత్రమే మొబైల్ స్కూల్‌ను నడుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. "నేను ఇంట్లో కుట్టు పని చేస్తాను. ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేటర్‌గా శిక్షణ తీసుకుంటున్నాను. మా ఊర్లో కరెంటు బిల్లులు చెల్లించే షాపును పెట్టాలనుకుంటున్నాను. అందుకు సరిపడా సామర్థ్యం వచ్చిందిప్పుడు నాకు'' అని చెప్పింది పాతికేళ్ల భూమిక సారె.
లోకల్ రేడియో..
మాన్ దేశీ ఫౌండేషన్ పాపులారిటీ కారణంగానే ఈ స్కూలుకు కూడా ఇంత పేరు వచ్చింది. ఎందుకంటే ఈ ఫౌండేషన్ గత పదిహేనేళ్లుగా మహారాష్ట్రలోని కరువు జిల్లాల్లో మహిళాభివృద్ధి కోసం ఎంతగానో పనిచేస్తోంది. విద్య, వైద్యం, ఆర్థిక అక్షరాస్యత, పర్యావరణం, స్వయం సహాయక బృందాల గురించిన చైతన్యం తీసుకొస్తోంది. అది పేదల్ని మేల్కొలిపేందుకు 'మాన్ దేశీ తరంగ్' అనే కమ్యూనిటీ రేడియోను నెలకొల్పింది. చుట్టుపక్కల పల్లెల్లో ఈ రేడియో కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. నాటకాలు, కథల రూపంలో పౌష్టికాహారం, అంటురోగాలు, అక్షరాస్యత పట్ల నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులైన ఎయిడ్స్ గురించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రసారాల్లో గ్రామీణులను కూడా భాగస్వాములను చేస్తోంది రేడియో. ఓటరుకార్డు ఎలా తీసుకోవాలి? బియ్యం కార్డు ఎక్కడ పొందవచ్చు? పండ్లు, కూరగాయల్ని ఎలా పండించుకోవచ్చు? వారసత్వ ఆస్తుల్లో మహిళలకు ఎందుకు వాటా దక్కడం లేదు? ఇలాంటి కార్యక్రమాలతోపాటు.. మాన్ దేశీ బిజినెస్ స్కూల్ కోర్సుల వివరాలు, ప్రవేశ సమాచారాన్ని కూడా ప్రసారం చేస్తుంటారు.
పల్లె వెలుగులు..
మాన్ దేశీ ఫౌండేషన్ పదుల సంఖ్యలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తోంది. 'మాన్ దేశీ ఛాంపియన్స్' పేరుతో గ్రామీణ క్రీడాకారులకూ ప్రోత్సాహమిస్తోంది. ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్‌లకు కావాల్సిన పరికరాల్ని, దుస్తుల్ని సమకూరుస్తున్నారు నిర్వాహకులు. "గ్రామాలతో మాకు విస్తృతంగా సంబంధాలు ఉండడం వల్ల.. బడి మానేసిన పిల్లలందరూ మా బిజినెస్ స్కూల్లో చేరగలుగుతున్నారు'' అంటున్నారు సంస్థ ప్రధాన కార్య నిర్వహణాధికారిణి వనితాషిండే.
ఒకసారి ఆస్మా తంబోలి అనే అమ్మాయి వాళ్ల ఆఫీసుకు వచ్చింది. తనకు ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తే చేస్తానంది. "ఇంత చిన్న వయసులోనే నీకెందుకు ఉద్యోగం'' అని ప్రశ్నించారు సంస్థ ప్రతినిధులు. "ఊరి నుంచి బడికి వెళ్లాలంటే చాలా దూరం. సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడిగితే బడి మానేయమన్నారు'' అని సమాధానం ఇచ్చింది. ఉద్యోగంలో చేరితే వచ్చే జీతంతో సైకిల్ కొనుక్కుని బడికి వెళ్లాలన్నది ఆ అమ్మాయి ఆలోచన. ఆ అమ్మాయి అనుభవాన్నే స్ఫూర్తిగా తీసుకుంది మాన్ దేశీ సంస్థ. 'ఫ్రీడం రైడర్' పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిరుపేద పిల్లలకు వడ్డీలేని రుణాలతో సైకిళ్లను పంపిణీ చేసింది. దీనివల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది.
మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. దానికొక మార్గం కనిపెట్టింది మాన్ దేశీ. ఎండకు, వానకు గంటల తరబడి కూర్చోవడం వల్లే.. అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు నిర్ధ్దారించారు. చిరువ్యాపారులు పనిదినాలను కోల్పోవడం వల్ల అప్పులు పెరిగిపోతాయి కదా. కొంత ఆలోచించాక మార్కెట్లోని ప్రతి చిరువ్యాపారికి పెద్ద గొడుగును అందించే 'అంబ్రెల్లా ప్రోగ్రామ్'ను ప్రవేశపెట్టింది మాన్ దేశీ. వాళ్లు ఆశించిన ఫలితాలే వచ్చాయి.
చిన్నకారు రైతుల్ని గట్టెక్కించేందుకు ఉచిత భూసార పరీక్షలు, పశు వైద్యం, పాడి పోషణ మొదలైన సదుపాయాల్ని కూడా కల్పిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో పాలడైరీలను కూడా ఏర్పాటు చేశారు.
"మాన్ దేశీ బ్యాంకు, మాన్ దేశీ స్కూలు ఇవి రెండూ మాకు రెండు కళ్లులాంటివి. నాకు బాల్యవివాహం అయింది. భర్త చనిపోయాడు. స్కూల్లో చేరాక.. కొత్త జీవితం మొదలైంది. గతంలో నాకైతే నోట్లను లెక్కపెట్టడం కూడా చాతనయ్యేది కాదు. ఇప్పుడు ఎంత మొత్తానికి ఎంత వడ్డీ అవుతుందో నోటికి చెప్పేస్తున్నా...'' అంటోంది లక్ష్మీ షీలర్. మాన్ దేశీలో చదువుకున్న మరో గ్రాడ్యుయేట్ నందిని లోహర్. ఆమె గోండవ్‌లె కర్మరాజ్ గుడి దగ్గర దేవుని పటాలు అమ్ముతుంటుంది. ఒకప్పుడు భవిష్యత్తు ప్రణాళిక ఉండేదే కాదు. "పండుగలు, ఊరేగింపులు, జాతర్లప్పుడు.. గుడికి భక్తుల సందడి చాలా ఎక్కువ. కాని, నా చేతిలో రూపాయి ఉండేది కాదు. డిమాండ్‌కు తగినట్లు పటాలను పెట్టలేకపోయేదాన్ని. స్కూల్లో చేరా ముందే ముడిసరుకును ముందే ఎందుకు కొనాలో అర్థమైంది. అందుకే సీజన్ రాక ముందే కలప ఫ్రేములు, గ్లాసు, కటింగ్ పరికరాలు, పోస్టర్లు కొనుక్కొచ్చి దాస్తాను. సీజన్ వచ్చేనాటికి పటాలు తయారుచేసి ఉంచడంతో లాభాలు పెరిగాయ్..'' అంటూ చెప్పుకొచ్చింది నందిని.
రైతులకు కూడా చేయూతనిస్తోందీ సంస్థ. ఈ ఏడాది మన రాష్ట్రంలోలాగే మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవడం లేదు. సతారా ప్రాంతంలో కరువు వల్ల పాడి పశువుల్ని అమ్మేసుకోవాల్సి వస్తోందని మాన్ దేశీ స్కూల్లో చేరిన నిరుపేదలు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లు వెంటనే స్పందించి ఉచిత పశు సంరక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పరిసర గ్రామాల ప్రజలు పశువుల్ని, మేకల్ని తోలుకొస్తే వాటికి గడ్డి, దాణాతోపాటు రైతులకు ఉచిత భోజన వసతులు కల్పించారు. దీంతో రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ శిబిరాన్ని సందర్శించారు. వర్షాలు జోరందుకునే వరకు శిబిరాన్ని కొనసాగించనున్నట్లు మాన్ దేశీ ప్రకటించింది.
వారెన్ బఫెట్ ఆసక్తి...
"మాన్ దేశీ బిజినెస్ స్కూల్లో బోధించే ఆర్థిక పాఠాలు ఏ పుస్తకాల్లోనూ కనిపించవు. నిరుపేదల జీవితాలను అధ్యయనం చేసి తయారుచేసినవి ఇవి. ఉదాహరణకు మీకొక విషయం చెబుతాను.. భారతదేశంలో మగవాళ్లకు తాగుడు అలవాటు ఎక్కువ. నిరుపేదల్లో ఇది మరీ ఎక్కువ. మగవాళ్ల తాగుడు వల్ల తీవ్రంగా నష్టపోతున్నది ఆడవాళ్లే! రోజూ కూలికి వెళ్లి వందో రెండొందలో ఇంటికి తీసుకొస్తే.. దాని కోసం మగవాళ్లు కూచుక్కూర్చుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు సెంటిమెంటును వాడుకున్నాం. ఇంట్లో దాచుకున్న డబ్బుల్ని లాక్కెళ్లడం చాలా సులువు. అదే, భార్య మెడలో వేసుకున్న బంగారు గొలుసులనో, చేతులకు తొడుక్కున్న గాజులనో తీసుకెళ్లడం కొంత వరకు కష్టం. అలా చేసిన మగవాళ్లను మా సమాజం గౌరవించదు. అందుకే, ఆడవాళ్లందరూ అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకున్నాక బంగారాన్ని కొనమని ప్రోత్సహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. సమస్య చాలా వరకు తగ్గింది..''
చేత్నా గలా సిన్హా ప్రసంగం పూర్తి కాకముందే.. ఓ పెద్దాయన లేచి నిల్చుని చప్పట్లు కొట్టాడు. ఇదొక మంచి ఆర్థికపాఠం అన్నారు. ఆయన ఎవరో కాదు ప్రపంచంలోనే అపర కుబేరుడైన వారెన్ బఫెట్. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమెరికాకు ఆహ్వానిస్తే.. చేత్నా అమెరికాకు వెళ్లింది. ఆ సమావేశానికి బిల్‌గేట్స్, వారెన్ బఫెట్‌లాంటి హేమాహేమీలంతా హాజరయ్యారు. ఆమె ప్రసంగానికి ఎంతోమంది దాతలు స్పందించారు. బడుగుల బిజినెస్ స్కూల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మా వృత్తికి గౌరవం తీసుకొచ్చాను..
బుట్టలు అల్లే మేదరి వృత్తి మాది. మాన్ దేశీ బిజినెస్ స్కూల్లో చేరేవరకు వ్యాపార కిటుకులు నాకు పెద్దగా తెలియవు. కోర్సు పూర్తయ్యాక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుంది. ఇదివరకు అప్పటికప్పుడు వెదురు తెచ్చుకుని బుట్టలు అల్లి అమ్ముకునేదాన్ని. మార్కెట్ గిరాకీ కూడా తెలిసేది కాదు. గతంలో మధ్యవర్తుల నుంచి వెదురు కొనడం వల్ల గిట్టుబాటయ్యేది కాదు. ఇప్పుడు రైతుల నుంచే నేరుగా కొంటున్నాను. మా ఊరి నుంచి ముంబయికి 270 కిలోమీటర్లు. బుట్టల్ని ముంబయి తీసికెళ్లి అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేశాను. దీన్నే వ్యాపార పరిభాషలో బిజినెస్ ప్లానింగ్ అంటారట. ఆ విషయాన్ని స్కూల్లో చెప్పార్లెండి.
ముంబయిలోని పండ్లు, కూరగాయల వ్యాపారులతో సంప్రదింపులు జరిపాను. రెగ్యులర్‌గా బుట్టల్ని కొనేందుకు వారు ఒప్పుకోవడంతో నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు బుట్టలు కొనేవాళ్లే లేరని దిగులుపడేదాన్ని. ఇప్పుడు ఎంత పని చేస్తే అంత మార్కెట్ ఉందని అర్థమైంది. బస్సు ఎక్కాలంటేనే భయపడే నేను ఇప్పుడు సెల్ఫోన్లో వ్యాపారులతో మాట్లాడుతున్నాను. చెక్కుల మీద సంతకాలు చేస్తున్నాను. నెలకు ఒకసారి నేనొక్కదాన్నే ముంబయికి వెళ్లి వస్తున్నాను. ఒకప్పుడు నన్ను ఊర్లో వాళ్లు పేరు పెట్టి పిలిచేవాళ్లే కాదు. ఇప్పుడు 'మాలన్‌గారు' అంటున్నారు. నాద్వారా మా వృత్తికి కూడా గౌరవం పెరిగినందుకు సంతోషంగా ఉంది.
- మాలన్, మేదరి వృత్తి
* సండే డెస్క్, Andhra Jyothy
Labels:
Agriculture,
Farmer,
gouthamaraju,
India,
women,
గౌతమరాజు,
వ్యవసాయం
Sunday, June 3, 2012
మామిడి రా'రాజులు'
ఇన్నాళ్లూ మండుటెండల్లో వేపుకుతిన్న వేసవి.. మరికొన్ని రోజుల్లో వెళ్లిపోతోంది. వేసవి ఎండల్ని భరించిన అందరికీ మధురమైన జ్ఞాపకం ఏదైనా ఉందా అంటే .. అది మామిడి మాధుర్యం అనే చెప్పవచ్చు. పండ్ల రుచుల్ని ఆస్వాదించిన వాళ్లకే కాదు. మామిడిని సాగు చేస్తున్న రాజుల కుటుంబాలకూ ఇదే అనుభవాన్ని మిగిల్చి వెళుతోంది ఈ వేసవి. మామిడి సాగులో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. పరువు కోసం పంట పండించే ఈ సామాజిక వర్గం విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో వేలాది ఎకరాల మామిడి తోటల్ని సాగు చేస్తోంది. తరతరాల వారసత్వ సంపదగా భావిస్తోంది. దేశంలోనే అరుదైన మామిడి రకాల్ని పండించి.. ప్రధాన నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతుల్ని చేస్తోంది.
రాజుల మామిడి సాగుపైనే ఈ స్టోరీ..
పండ్లలో రారాజు?
మధురఫలం, అదేనండీ మామిడి.
మరి, మామిడిని పండించడంలో మారాజులు ఎవరు?
ఇంకెవరు? విజయనగరం రాజులు.
రాజులు రాజ్యాలను కోల్పోయినా.. మామిడితోటల మీద మమకారాన్ని ఇప్పటికీ వదులుకోవడం లేదు.
విజయనగరం, బొబ్బిలి ఒకప్పటి రాజుల సంస్థానాలు. ఇప్పుడవి లేవు కాని, వాళ్ల అడుగుజాడల్లో మొలకెత్తిన విలాసమైన మామిడితోటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. తోటల సాగులో నష్టమొచ్చినా, కష్టమొచ్చినా.. రాజదర్పం ఊరికే ఉండనిస్తుందా? అప్పులు చేసైనా సరే, ఆస్తులు కరిగిపోయినా సరే.. పచ్చటి తోటలు కళకళలాడాల్సిందేనంటున్నారు రాజులు. తోటల్లోనే రాజప్రాసాదాలు నిర్మించి (గెస్ట్‌హౌస్‌లు) మామిడిని పండించడం వీరి సంప్రదాయం. ఈ సంస్కృతి పాతకాలం రాజుల నుంచే వచ్చినా ఇప్పటికీ కొనసాగుతోంది. తాతతండ్రుల నుంచి వచ్చిన మామిడి తోటలంటే ప్రతి రాజు కుటుంబానికీ మహా ప్రీతి.
విజయనగరంలో అప్పటి రాజవంశీయులైన పీవీజీ రాజు మొదలుకొని ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్‌గజపతి రాజుల వరకు మామిడితోటల సాగును వారసత్వ సంపదగా భావిస్తున్నారు. బొబ్బిలి సంస్థాన పాలకులైనవెలమదొర రాజారావు బహుదూర్ రంగారావు కుటుంబం మామిడి తోటలకు పెట్టింది పేరు. ఈ రెండు కుటుంబాల రాజవంశీయులతోనే మామిడితోపుల సాగుకు బాటలు పడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో 15 వేల హెక్టార్లను రాజుల సామాజికవర్గమే సాగు చేస్తున్నది.
మామిడిపంటల మీద రాజులకు ఎప్పటి నుంచో మోజుంది. బొబ్బిలి సంస్థానంలో ఒకటైన రాజాం (శ్రీకాకుళం) కోట పరిసరాల్లో 'గుర్రాం' అనే ఒక రకం మామిడి చెట్టు ఉండేదట. ఆ చెట్టు పండ్లు రాలిన వెంటనే బొబ్బిలి రాజావారికి అందజేయడానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసేవారట. అలనాడు రాజుల మనసుదోచిన ఆ మామిడి పండ్లకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. ఒకప్పటి తీపిగుర్తుగా గుర్రాం రకం మామిడితోటల్ని వెలమదొరలు ఈనాటికీ వందలాది ఎకరాల్లో సాగు చేస్తుండటం విశేషం. బొబ్బిలి వెలమదొర సాలా వెంకట మురళి కృష్ణ వంద ఎకరాల్లో 30 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. అత్యంత నాణ్యమైన 'కేసరి' రకానికి 2009లో రాష్ట్రస్థాయి ప్ర«థమ బహుమతి దక్కింది. అమ్రపాలి, నీలిమ రకాలకు కూడా ఆ తరువాతి సంవత్సరం మరో అవార్డు లభించింది. విజయనగరం, బొబ్బిలిలోని మామిడితోటల మాధుర్యం.. ఢిల్లీని కూడా తాకింది. సీజన్ వచ్చిందంటే చాలు.. రాజధాని నుంచి మామిడి వ్యాపారులు ఉత్తరాంధ్రకు పరిగెత్తుకొస్తారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేస్తున్నారు.
తోటలే బంగారం...
రాజుల మామిడికి దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ రావడం వెనుక తరాల శ్రమ దాగుంది. లాభాల కోసం రాజులు వ్యవసాయం చేయరు. నిష్టతో ప్రతిష్ట కోసం పంట పండిస్తారు. చదువు సంధ్యలకంటే మామిడితోటల పెంపకంపైనే ఎక్కువ శ్రధ్ధ కనబరుస్తారు. మొక్కలు నాటిన రోజు నుంచి పెరిగి పెద్దయి, కాపుకొచ్చే వరకు వారి కంటి మీద కును కుండదు. నిజానికి ఈ ప్రాంతంలో మామి డికంటే.. సరు గుడు తోటల సాగే బాగా గిట్టుబాటు అవుతుంది. కాని రాజులు మామిడిని కాదని మరో పంటను సాగు చేసేందుకు ఇష్ట పడరు. "ఎకరా సరుగుడు తోటకు ఎంత లేదన్నా రూ.60 నుంచి రూ.70 వేలు ఆదాయం వస్తుంది.
కాని ఇవి భూగర్భజలాలను హరిస్తాయి. అందుకే మా కుటుంబాలకు మామిడి తోటలంటేనే ప్రాణం. మామిడి పర్యా వరణానికి మేలు చేస్తుంది. పది మందికి తియ్యటి ఫలాల్ని అందించామన్న సంతృప్తిని మిగిలిస్తుంది. అందుకే దిగుబడి ఎంత వచ్చినా వెనుకంజ వసే ప్రసక్తే లేదు'' అంటు న్నారు రాజులు. మధ్య తరగతి కుటుం బాలు ఎంత బంగారం ఉంటే అంత భద్రత ఉన్నట్లు భావిస్తారు. రాజులు కుటుంబాల్లో అలా కాదు. పెళ్లిళ్లతో బంధు త్వాల్ని కలుపు కోవాలన్నా, ఎన్ని ఎకరాల మామిడి తోటలు ఉన్నాయో? చూశాకే ఇంట్లో మేళ తాళాలు మోగుతాయి. ఆడ పిల్లలకు బంగారానికి బదులు మామిడితోటల్ని కట్నంగా రాసిస్తా రంటే.. వాటికున్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడ ఎక్కువ సాగు..?
ఆలమండ, భీమాలి, జొన్నవలస, గంట్యాడ, డెంకాడ, కొత్త వలసలలో వేలాది ఎకరాల మామిడి తోటల్ని రాజులే సాగు చేస్తున్నారు. పార్వతీపురం డివిజన్లోని బొబ్బిలి పరిధిలో వెలమదొరల తోటలు ఉన్నాయి. మామిడి మొక్కల నర్సరీలను కూడా రాజులే పెంచుతున్నారు. ఎల్.కోటలోని భీమాలి రాజుల నర్సరీలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా పేరొందిన మేలైన మామిడి రకాల మొక్కలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. విజయనగరం, బొబ్బిలి రాజులు సాగు చేస్తున్నన్ని మామిడి రకాలు మరెక్కడా సాగు కావడం లేదు. వ్యాపార అవసరాల కోసం వేసిన దేశవాళీ, హైబ్రీడ్, నార్త్ ఇండియా, సౌత్ఇండియాలతో కలిపి 50 మామిడి రకాలను సాగు చేస్తున్నారు. బంగినపల్లి, సువర్ణరేక, పనుకులు, చిన్నరసం, పెద్దరసం, చెరుకురసం, బారామతి (పునాస మామిడి), కోలంగోవ, హిమామ్ పసంద్, దసేరీ, లంగడా, నీలం, మల్లిక, ఆమ్రపాలి, కేసర్, సఫేదా, సుయా, నీలుద్దీన్, నీలిషాన్, జహంగీర్, స్వర్ణ జహంగీర్, పెద్ద సువర్ణరేక, పోలిపిల్లి సువర్ణరేక, పానకాలు, ఆల్ఫాన్సో వంటి రకాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
'మార్చి'కొస్తే మంచిది...
ఇక్కడి వాతావరణానికి సరిపోయే పనుకు మామిడి, రాజు మామిడి రకాలను మొట్టమొదట విజయనగరంలో సాగుచేసింది రాజులే. అయితే సువర్ణరేక, బంగినపల్లి రకాల మాదిరిగానే ఇవి కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు దిగుబడి రాకపోవడంతో రైతులకు ఇబ్బందులొస్తున్నాయి. అందుకే, మార్చిలోపు పంట చేతికొచ్చే కొత్త రకాల కోసం అన్వేషిస్తున్నారు. మార్చి తరువాత ఏప్రిల్‌లో విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటకు నష్టం వాటిల్లుతోందని రాజుల అభిప్రాయం. మార్చిలోపు పంట చేతికొస్తే, వాతావరణ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అందుకే ఇలాంటి రకాల కోసం పరిశోధించాలని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు (ఐఏఆర్ఐ) జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోషియేషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మధ్య ఐఏఆర్ఐ పరిశోధనల్లో వెలువడిన కొత్త రకాలు.. పూసాప్రతిపా, పూసా ఫాస్ట్, పూసా లాలీమాలు కూడా మార్చి తర్వాతే దిగుబడిని ఇస్తున్నాయి.
మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు విజయనగరం జిల్లా నుంచి కేవలం మామిడి వ్యాపార ఎగుమతుల వల్లే.. ఈస్ట్‌కోస్టు రైల్వేకు రూ.5 కోట్లు రాబడి వస్తుంది. రైల్వే వ్యాగన్ల ద్వారా విజయనగరం నుంచి న్యూఢిల్లీకి మామిడి పండ్లు ఎగుమతి అవుతాయి. ఏడాది ముందుగానే ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి రైతులకు పెట్టుబడులు ఇచ్చి మరీ మామిడి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క ఢిల్లీయే కాకుండా, కోల్‌కతా, ఒడిశ్సాలకూ విజయనగరం నుంచే మామిడి పండ్లు వెళుతున్నాయి. ఈ ఏడాది ఒక్క ఢిల్లీకి మాత్రమే 40 వ్యాగన్ల సరుకు ఎగుమతయ్యింది. ఢిల్లీకి సరుకు చేరాక.. అట్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు మామిడి వెళుతోంది.
మింగేస్తోన్న రియల్ఎస్టేట్..?
రింగురోడ్లు, సెజ్‌లు, అణువిద్యుత్ ఫ్యాక్టరీలు.. ఇవన్నీ సేద్యపు భూముల్ని మింగేస్తున్నట్లే.. రియల్ఎస్టేట్ దెబ్బకు మామిడితోపులు కూడా మాయమైపోతున్నాయి. తరాల నుంచి కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడితోటలు రకరకాల సమస్యల వల్ల కనుమరుగైపోవడం ఈ ప్రాంతవాసుల్ని కలచి వేస్తోంది.
కొత్తవలసలోని గులిపల్లి దగ్గరున్న మిస్సమ్మ మామిడి తోటలంటే చుట్టుపట్టు పల్లెల్లో పెద్ద పేరుండేది. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలు ఇప్పుడు కనిపించడం లేదు. వన్నెపాలెంలో వందేళ్ల వయసున్న 300 ఎకరాల మామిడి తోటలు ఉండేవి. దిగుబడి తగ్గిపోవడంతో.. మామిడి చెట్లను తొలగించి లే అవుట్లను వేశారు. ఈ తోటలన్నీ ఒకప్పుడు రాజులవే! ఎన్ని సంక్షోభాలు ఎదురయినా.. మామిడితోటల పెంపకంపై వారి ఆసక్తి మాత్రం చావడం లేదు. అందుకే, భూముల్ని అమ్మేసినా.. మరో ప్రాంతంలో భూముల్ని కొనుగోలు చేసి, కొత్త తోటల్ని సాగు చేస్తున్నారు.
ఒక్కొక్క రైతుదీ ఒక్కో కథ..
విజయనగరవాసి మునగపాటి సీతారామరాజు కుటుంబానికి వందేళ్లుగా మామిడితోటలే జీవనాధారం. తాత నారాయణరాజు నుంచి తండ్రి రామ్మూర్తిరాజుకు మామిడితోట వారసత్వంగా వచ్చింది. "నాకు నా చిన్నతనం నుంచే మామిడితోటలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందుకే, ఆ తోటల్ని విడిచి నేను పెద్ద చదువులు కూడా చదువుకోలేక పోయాను. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లకు మంచి చదువులు అబ్బలేదు. మామిడితోటల మీదే ఆసక్తి ఏర్పడింది..'' అన్నారు సీతారామ రాజు. ప్రస్తుతం జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన విజయనగరం లాంటి జిల్లాలో వరి పంట తరువాత రైతుకు ఆదాయాన్నిచ్చే మేలైన పంటలు ఏవీ లేవంటారు. జిల్లాలో జనుము, వేరుశనగ సాగు పూర్తిగా అంతరిం చింది.
అందుకే, పల్లపు భూముల్లోనూ మామిడిని పండిస్తు న్నారు. ఇక్కడ మామిడిసాగు కుటుంబ ప్రతిష్టకు సంబంధించినది కూడా. దాని కోసం ఏమైనా చేస్తాం అంటారు కొత్తవలస రైతు దండు నరశింహరాజు లాంటి వాళ్లు. మొక్కలు పెంచే సమయంలో నీళ్లు లేకపోతే.. రెండ్రోజులకు ఓసారి స్వయంగా నీళ్లు పోసి పోషించుకున్నారాయన. మామిడి ఎగుమతి గురించి మాట్లాడుతూ "పెద్ద మార్కెట్లకు ఒకేసారి అన్ని ప్రాంతాల నుంచి మామిడి ఎగుమతి అవుతోంది. దీంతో మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుంది..'' అన్నారు రాజు. నలభై ఎకరాల్లో మామిడి తోటను సాగుచేస్తున్న నరశింహ రాజు ఏడాదికి పెట్టుబడి కిందే రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది భారమైనా మారే ఆలోచన చేయడం లేదు. "ఇంత పెట్టు బడిపెట్టి నష్టపోయే బదులు మరో పంట వేసుకోవచ్చు కదా'' అని తోటి రైతులు చెప్పినా రాజుకు మామిడిని వదిలే ఉద్దేశ్యం లేదిప్పుడు. ఎందుకంటే, ఆయనకు మామిడి తోటలతో 60 ఏళ్ల అనుబంధం ఉంది. తోటల సమీపంలోనే రూ.30లక్షలతో అతిథి గృహాన్ని నిర్మించుకుని సంతోషంగా జీవిస్తున్నారు శివరామరాజు కుటుంబీకులు.
మామిడి రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య దళారీ వ్యవస్థ. దీన్ని తగ్గిస్తే రాజుల మామిడితోటలు ఇంత వేగంగా కరిగిపోవంటున్నారు లక్కవరపుకోట మండలం భీమాలికి చెందిన రైతు ముదునూరు జోగి జగన్నాథరాజు. మామిడిని సాగు చేయడంలో ఈ కుటుంబానికి ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఎకరాల్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నది. "దళారీల వల్ల మాలాంటి కౌలు రైతులకు నష్టాలే మిగులుతున్నాయి..'' అని ఆవేదన వ్యక్తం చేశారాయన. రాజుకు చెందిన ఇద్దరు కొడుకులు కూడా మామిడి సాగు మీదే జీవనం సాగిస్తున్నారు.
నర్సరీలను పెంచుతూ..
ఏ పరిశోధనశాలలో కొత్తరకం మామిడి మొక్కను ఉత్పత్తి చేసినా.. విజయనగరం, బొబ్బిలికి రావాల్సిందే. అందుకే, నర్సరీలను సైతం ఇక్కడి రైతులే నిర్వహిస్తున్నారు. బంగినపల్లి, కోలంగోవ, పణు మామిడి రకాల మొక్కలు నర్సరీల్లో దొరుకుతున్నాయి. "మేము నర్సరీలను పెంచుతున్నాం. అయితే, ఇక్కడ వస్తున్న ఇబ్బందల్లా ఎగుమతులకు అవసరమైన మౌళిక సదుపాయాలు లేకపోవడం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి యార్డులను ఏర్పాటు చేస్తే మంచిది. రైతులే నేరుగా పంటల్ని తెచ్చి అమ్ముకుంటారు. ఇప్పటికే విజయవాడ, రాజమండ్రిలలో ఈ పద్ధతి అమలవుతోంది'' అంటున్నారు భీమాలికి చెందిన కమ్మెళ్ల కృష్ణంరాజు.
మామిడి సాగులో తరిస్తున్న రాజుల కుటుంబాలు.. వ్యాపార అవసరాలకే పంట పండించరు. తోటల్లోకి కొన్ని మధురమైన మామిడి చెట్లను సొంతానికి కూడా పెంచుకుంటారు. బంధువులు, స్నేహితులకు ప్రతి సీజన్లోనూ మామిడి పండ్లను అభిమానంతో బహుమానంగా పంపించడం అలవాటు. "సేద్యంలో దిగుబడి అనేది శ్రమకు దక్కే ప్రతిఫలం. ఆ ఫలితాన్ని పదిమందితో పంచుకుంటే గొప్ప సంతృప్తి కలుగుతుంది. అందుకే, మాకు మామిడి వాణిజ్య పంటే కాదు. అనుబంధాల్ని మరింత మధురం చేసే పంట'' అంటూ తరిస్తున్నారు రాజు కుటుంబాల్లోని మామిడి రైతులు.
మాది వందేళ్ల తీపి బంధం
మామిడి తోటలతో మా కుటుంబానికి వందేళ్ల అనుబంధం అల్లుకుంది. ముత్తాతల నుంచి తోటల పెంపకం, వ్యాపారం చేస్తున్నాము. మా నాన్నగారి తరం వరకు మామిడి సాగుతోపాటు వ్యాపారమూ లాభసాటిగానే ఉండేది. ఇప్పుడు భారంగా మారింది. రైతులు, వ్యాపారులు ఇద్దరూ సంతోషంగా లేరు.
ప్రస్తుతం భీమాలిలో నర్సరీని పెంచుతున్నాం. రైతులకు మొక్కల్ని సరఫరా చేసి.. బతుకుతున్నాం. ఇన్నాళ్లూ మామిడి తోటలే మమ్మల్ని బతికించాయి. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కదాని.. మరో పని చేయడానికి సిద్ధంగా లేము. రాజుల కుటుంబాల్లో ఎంత నిరుపేదలైనా కూలి పని చేయడానికి ఇష్టపడరు. అందుకే, ఈ బాధలు పడుతున్నాం.
- ముదునూరు గోపాలకృష్ణ, బలిగట్టం
30 రకాలను సాగు చేస్తున్నాం
దేశంలో దొరికే మామిడి రకాలన్నీ మా తోటలో పండించాలన్నదే మా ఆశయం. ప్రస్తుతం వందెకరాల భూమిలో 30 రకాల మామిడి చెట్లను పెంచుతున్నాం. మామిడి సాగులో మా కుటుంబానికి వందేళ్ల అనుభవం ఉంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హైబ్రిడ్, స్థానిక రకాలు మంచి దిగుబడినే ఇస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం సువర్ణరేక, బంగినపల్లి, కోలంగోవ, కలెక్టరు రకాలను పండిస్తాం. ఇంటికి, బంధుమిత్రులకు నార్త్ ఇండియా రకాలైన దశరి, అయినా, లాంగరా, సఫేదా, కేసరి, మాల్టా, మాల్గోవా, రత్నా, అల్పాన్జో రకాలను వేశాము. కేసరి రకానికి 2009లో రాష్ట్రస్థాయి మామిడి పోటీలో ప్రథమ బహుమతి దక్కింది. సౌత్ ఇండియా మామిడి రకాలైన నీలిమా, ఆమ్రపాలి, రకాలకు 2010లో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. స్థానిక రకాలైన బొబ్బిలి పీచు, మెట్టవలస, ఫిరంగి లడ్డూ, గుర్రాం, కృష్ణపసందు, స్వర్ణ సింధూ, జలాలు కూడా మధురంగా ఉంటాయి. మెట్టవలసపీచు, బొబ్బిలి పీచులనే మామిడి రకాల్లో.. 70 పండ్ల ధర రూ.7000 పలికింది.
కౌలు భూమి తగ్గింది...
ఒకప్పుడు వందల ఎకరాల్ని తీసుకుని కౌలుకు సాగు చేశాం. ఇప్పుడు కౌలుకు వ్యవసాయం చేస్తే ఏమీ మిగలడం లేదు. మామిడితోటలున్న భూములు కూడా తగ్గిపోయాయి. ఉన్నంతలో తక్కువ విస్తీర్ణంలో అయినా.. సొంతంగా సేద్యం చేస్తున్నాం. ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అది కూలీల సమస్య. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంతో అన్ని గ్రామాల్లోనూ కూలీల కొరత ఏర్పడింది. అక్కడక్కడ దొరికే కూలీలు కూలీ రేట్లు పేంచేశారు. వస్తున్న దిగుబడికి, పెడుతున్న పెట్టుబడికి సరిపోవడం లేదు. అన్ని పంటల్లాగే మామిడికీ ఇవే కష్టాలొచ్చాయి. వీటన్నిటికి తోడు దళారులు మమ్మల్ని తినేస్తున్నారు.
- ఎం.వెంకట సత్యనారాయణరాజు, కొత్తవలస
రైతులు మారాలి..
మారుతున్న కాలానికి అను గుణంగా మామిడి రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం లేదు. అలా చేస్తే మరింత దిగుబడి పెరుగుతుంది. వందలాది ఎకరాల్లో తోటలు సాగుచేసినప్పుడు ఎకరానికి మరో ఎకరానికి కొంత దూరం ఉండాలి. చెట్లు సంఖ్య పెరగాలనే ఆశతో రైతులు ఇలాంటి పద్ధతుల్ని అమలు చేయడం లేదు. దీనివల్ల మామిడి కోతలప్పుడు.. కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దిగుబడి అమ్మకాల్లో కూడా రైతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే ఢిల్లీ, ముంబయి వ్యాపారులకు పంటను అమ్మేస్తున్నారు. సీజన్లో పెరిగే ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. అందుకే, రైతులే పంట ఉత్పత్తుల్ని నేరుగా అమ్ముకునే పరిస్థితి రావాలి.
- రహీమ్, ఉద్యానవన శాఖాధికారి, విజయనగరం

by
* బిర్లంగి ఉమామహేశ్వరరావు,
విజయనగరం
విజయనగరం
Labels:
Andhra Pradesh,
Farmer,
gouthamaraju,
mango,
Rythu,
గౌతమరాజు,
రైతు,
రైతు సమస్యలు
Sunday, May 13, 2012
నయా (ఈస్ట్) ఇండియా కంపెనీలు!
మన రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండే భూమి ఎకరం ఖరీదు ఎంత ఉంటుంది?
ఏ లెక్కలో తీసుకున్నా సగటున 10 లక్షలైనా ఉంటుంది.
కాని ఒక ఎకరం భూమిని కొంటే చాలదు. నాణ్యమైన విత్తనాలు వేయాలి. శక్తిమంతమైన ఎరువులు చల్లాలి. అదృష్టం బావుండి పంట బాగా పండితే కోత కోయటానికి ఎక్కువ మంది కూలీలను పెట్టాలి. వీటికి తోడుగా- నీరు, విద్యుత్‌లు వాడుకున్నందుకు పైకం చెల్లించాలి. ఇంత చేసిన తర్వాత కూడా పంటకు సరైన రేటు రాకపోవచ్చు. అంటే లక్షల ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తే వచ్చేది నష్టమే. ఇదీ మన దేశంలో రైతుల పరిస్థితి.
అదే పదిలక్ష రూపాయలకు ఒక పదమూడు వేల ఎకరాల భూమి వస్తే? పైగా అది మంచి భూసారమున్న భూమైతే? ఆ భూమి కొనటానికి ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇస్తే? దానిలో పండిన పంటను ఎగుమతి చేస్తే ? ఆ ఎగుమతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే?
బాబ్బాబు.. అలాంటి అవకాశం ఎక్కడుందో చెప్పు. అప్పోసొప్పో చేసి వ్యవసాయం చేసుకు బతికేస్తాం అంటున్నారా? మీరు ఈ కొత్త తరహా వ్యవసాయానికి ట్రై చేయచ్చు కాని- మీ కన్నా ముందు దాదాపు ఎనభై కంపెనీలు ఈ రకమైన వ్యవసాయంలో ఇప్పటికే దాదాపు 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేసాయి.
ఇప్పటిదాకా ఆ విషయం మనకు ఎందుకు తెలియలేదంటే.. ఈ భూమంతా ఆఫ్రికాలోని ఇథియోపియా, కెన్యా, మడగాస్కర్, సెనగల్, మొజాంబిక్ మొదలైన దేశాల్లో ఉంది. చైనా, ఉత్తర కొరియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన కంపెనీలతో పోటీ పడి మన వాళ్లు ఆఫ్రికాలో వ్యవసాయ భూములను లక్షల ఎకరాల చొప్పున లీజుకు తీసుకుంటున్నారు. అయితే మన వాళ్లు కుదుర్చుకుంటున్న ఒప్పందాల వల్ల తాము చాలా నష్టపోతున్నామని ఆయా దేశాల్లో నివసించే స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీలొచ్చి తమ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని, తమ హక్కులను హరిస్తున్నాయని ఆందోళనలకు దిగుతున్నారు. గతంలో బ్రిటన్ మాదిరిగా భారత్ కూడా సామ్రాజ్యవాద ధోరణిని అనుసరిస్తోందని దుయ్యబడుతున్నారు. ఇంత సువిశాల భారతదేశం వదలి మన కంపెనీలు వ్యవసాయం కోసం ఇతర ఖండాలకు ఎందుకు వెళ్తున్నాయి? దాని వెనకున్న కారణాలేమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే 2008 సంవత్సరంలోకి ఒక్కసారి తిరిగి చూడాలి. 2008.. చాలా అగ్రరాజ్యాలు మరచిపోవాలనుకునే సంవత్సరం.
ఆర్థిక మాంద్యంతో పాటు ఆహారపు కొరత కూడా ఆ ఏడాది ప్రపంచంలో అనేక దేశాలను వణికించింది. ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని దేశాలూ ఆహారపు కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండు ప్రపంచయుద్ధం తర్వాత అంత ఆహారపు కొరత ఏర్పడటం అదే మొదటిసారి. దీనికి రెండు ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తి తగ్గిపోవటం. రెండోది- సాగు భూమిలో ఎక్కువ శాతం సోయా, ఆయిల్ సీడ్స్ వంటి పంటలను పండించటం. ఆహార కొరత రావటంతో అమెరికా, రష్యా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఆహారపు ఉత్పత్తులను ఎగుమతి చేసే అర్జెంటీనా, వియత్నాం వంటి దేశాలు తమ ఎగుమతులపై నిషేధం విధించాయి. దీనితో తొలిసారి ధనిక దేశాలకు కేవలం డబ్బు ఉంటే చాలదని అర్థమయింది. దీనితో అవి ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రచించటం మొదలుపెట్టాయి.
ఈ వ్యూహంలో ప్రధానమైనది- ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల్లో ఖాళీగా ఉన్న భూములను వ్యవసాయయోగ్యంగా చేయటం. అక్కడ తామే పొలాలను లీజుకు తీసుకుని పంటలు పండించి, ఆ పంటలను తమ తమ దేశాలకు దిగుమతి చేసుకోవటం. అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న ఆఫ్రికా దేశాలకు ఇది ఒక అవకాశం. ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న ధనిక దేశాలకు ఇదొక అవసరం. ఆఫ్రికాలో ఇలాంటి వాణిజ్య అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు భారత్, చైనా, సౌదీ అరేబియా, కువైట్, ఉత్తర కొరియాలు గ్రహించి వెంటనే రంగంలోకి దిగాయి. వివిధ దేశాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని భూములను లీజుకు తీసుకోవటం మొదలుపెట్టాయి. ప్రపంచబ్యాంకు నివేదికల ప్రకారం 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికాలో 4.5 కోట్ల హెక్టార్ల భూమిని విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో కొంత దూకుడుతో వ్యవహరిస్తున్న భారత్ కంపెనీలు మిగిలిన వారి కన్నా ఒక అడుగు ముందే ఉన్నాయి.
ఆఫ్రికాలో ఉన్న అవకాశాలను చేజిక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదిపాయి. దీనికి మన ప్రభుత్వం కూడా సహకరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, కాన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ మొదలైనవి ఆఫ్రికాలో వాణిజ్య అవకాశాలకు సంబంధించిన ప్రాజెక్టు నివేదికలను తయారుచేశాయి. అనేక బృందాలను ఆ దేశాలకు తీసుకువెళ్లాయి. ఇదంతా ఒక ఎత్తయితే, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఈ కంపెనీలకు రుణాలను ఇవ్వటానికి అంగీకరించటం మరొక ఎత్తు. దీనితో 80 కంపెనీలు ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలతో లక్షల ఎకరాల లీజుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ భూములను సాగులోకి తేవటానికి అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు, వ్యవసాయ టెక్నాలజీ కొనుగోలుకు ఎక్సిమ్ బ్యాంక్ ఈ రుణాలను అందిస్తోంది. ఉదాహరణకు ఇథియోపియాలో ప్రారంభించిన టెన్‌డాహో షుగర్ ప్రాజెక్టుకు ఎక్సిమ్ బ్యాంకు 64 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేసింది. 1.75 శాతం వడ్డీతో, 20 ఏళ్ల కాల పరిమితితో ఎక్సిమ్ బ్యాంకు ఇచ్చే ఈ రుణాలు అనేక కంపెనీలను ఆకర్షించాయి.
మనకవసరమా?
దేశంలో ఉన్న మొత్తం సాగుభూమినే ఉపయోగించుకోలేని మనకు ఆఫ్రికా భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేయటం అవసరమా అనే ప్రశ్న తలెత్తటం సహజమే. దీని గురించి చర్చించే ముందు మన వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని సత్యాలను తెలుసుకోవాలి. 1970లలో హరిత విప్లవం వచ్చిన తర్వాత మన దేశంలో వ్యవసాయోత్పత్తి బాగా పెరిగింది. సాగుభూమి కూడా బాగా పెరిగింది. కాని 1990ల తర్వాత మన దేశంలో వ్యవసాయోత్పత్తి తగ్గుతూ వస్తోంది. నూనె, పప్పు దినుసులు వంటి నిత్యావసరాల విషయంలో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతూ వచ్చింది. దీనితో వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వస్తోంది.
ఉదాహరణకు 2008లో 54 లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటే 2009లో 74 లక్షల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మనం చమురు తర్వాత ఎక్కువగా ఖర్చు పెట్టేది వంట నూనెలపైనే! ఇలాంటి ఉదాహరణనే మరొక దానిని చూద్దాం. మన పౌష్టికాహారానికి అత్యంత కీలకమైన పప్పు దినుసుల ఉత్పత్తి 2011-12 ఆర్థిక సంవత్సరంలో 15.73 మిలియన్ టన్నులు ఉంటుందని ప్రభుత్వ అంచనా. అయితే పప్పు దినుసుల డిమాండ్ 19.91 మిలియన్ టన్నుల దాకా ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు నాలుగు మిలియన్ టన్నుల పప్పు దినుసులను మనం దిగుమతి చేసుకోవాల్సిందే.
అంతే కాకుండా 2020 నాటికి ఆహార ధాన్యాల డిమాండ్ 25 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా. ప్రస్తుతం మన ఉత్పత్తి 23 కోట్ల టన్నులే. అంటే ప్రస్తుతం మనకు బొటాబొటిగా సరిపోతున్న ఆహారధాన్యాల ఉత్పత్తి, మరో ఎనిమిదేళ్ల తర్వాత సరిపోదు. ఏ విధంగా చూసినా, అప్పటికి మన దేశంలో రెండు కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశం లేదనేది నిపుణుల అంచనా. దీనితో దీర్ఘకాలిక ఆహార భద్రతకు ఆఫ్రికా దేశాలలో వ్యవసాయం ఒక మంచి అవకాశంగా ప్రభుత్వం కూడా భావించింది. అంతే కాకుండా ఆ దేశాల్లో నీటి కొరత లేకపోవటం, మనతో పోల్చుకుంటే వ్యవసాయోత్పత్తికి తక్కువ ఖర్చు కావటం మొదలైన అంశాలు కూడా ఇటు ప్రభుత్వాన్ని, అటు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
"ఆఫ్రికాలో వ్యవసాయోత్పత్తికి అయ్యే ఖర్చు భారత్‌తో పోలిస్తే సగం ఉంటుంది. మందులు, ఎరువులు తక్కువగా వాడచ్చు. లేబర్ చాలా తక్కువ ధరకు దొరుకుతారు. ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది'' అంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన లక్కీ గ్రూప్‌కు చెందిన ఎస్.ఎన్. పాండే. ప్రభుత్వం ఆహార భద్రత, ఆహార ధాన్యాల ఉత్పత్తి కోణం నుంచి ఈ సమస్యను చూస్తుంటే కంపెనీలేమో అక్కడి అనుకూలతలు, ఇక్కడి అననుకూలతలను బేరీజు వేసుకుంటున్నాయి. మన దగ్గర ఉన్న ఇబ్బందులు కమతాలు చిన్నవిగా ఉండటం, వాటికి పెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా మార్చటానికి ప్రయత్నిస్తే అనేక ప్రభుత్వ నిబంధనలు అడ్డం రావటం, ఆహారోత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం మొదలైన కారణాలను ఈ కంపెనీలు చూపిస్తున్నాయి.
స్థానిక ఆందోళనలు..
అయితే తమ దేశాలలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు తమ గురించి పట్టించుకోవటం లేదని చాలా ఆఫ్రికన్ దేశాల్లో అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి ఆందోళనలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇథియోపియాను చెప్పుకోవచ్చు. ఇథియోపియాలో అడవులు ఎక్కువ. చాలామందికి ఆ అడవులే జీవనాధారం. పశువులకు మేత, జలాశయాలలో ను, నదులలోను ఉండే నీళ్లు వారికి చాలా ముఖ్యమైన అంశాలు. ఇథియోపియా ప్రభు త్వం ఇచ్చిన లీజుల వల్ల లక్షల హెక్టార్ల అడవులు ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. అడవులను నరికి ప్లాంటేషన్లను ఏర్పాటు చేయాలనేది ఈ కంపెనీల ఉద్దేశం. తమను నిర్వాసితులు చేస్తున్నారని, తమకు ఉపాధి కల్పించటం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ము ఖ్యంగా బోకో, గంబేలా ప్రాం తాల్లో భారతీయ కంపెనీల చేతుల్లో లక్షల హెక్టార్ల భూములున్నాయి. ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాక మూడు లక్షల మంది నిర్వాసితులయ్యారని ఒక అంచనా.
వీరిలో కేవలం 20 వేల మందికే కంపెనీలు ఉపాధి కల్పించాయి. ఫలితంగా స్థానికుల ఆందోళనలు మరింతగా పెరిగాయి. భారత్‌కు చెందిన వేదాంత హార్వెస్ట్ ప్లాంటేషన్స్ కంపెనీ కారణంగా గంబేలాలో మజాంగిర్ అనే తెగ ప్రజలు పూర్తిగా నిర్వాసితులయ్యారు. దీనితో వారు సాలిడారిటీ మూమెంట్ ఫర్ ఎ న్యూ ఇథియోపియా అనే (ఖికూఉ) స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆందోళనలు చేపట్టారు. ఈ సంస్థ చెప్పినదాని ప్రకారం కంపెనీలతో ప్రభుత్వం ఏమేం ఒప్పందాలు చేసుకుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. వేదాంత హార్వెస్ట్ ప్లాంటేషన్స్‌కు సంబంధించిన వ్యవహారం ఆ దేశా«ధ్యక్షుడు గిర్మా వోల్డి గియోర్గిస్ దాకా వెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ఎన్విరాన్మెంట్ ప్రొటక్షన్ అథారిటీ ఆఫ్ ఇథియోపియా (ఈపీఏఈ) ఈ లీజుపై విచారణ జరిపింది. ఈ ప్రాజెక్టును వెంటనే ఆపుచేయాలని ఆదేశించింది.
అయితే ఇథియోపియాలో రాజకీయ అస్థిరత ఎక్కువ. అధ్యక్షుడి ఆదేశాలను పట్టించుకొనే రాష్ట్రాలు తక్కువే. అందుకే స్థానిక గవర్నర్ వేదాంత హార్వెస్ట్‌కు ఇచ్చిన లీజు మరో 50 ఏళ్లు కొనసాగుతుందని ప్రకటించాడు. "ఇథియోపియాలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలా మూడు వేల ఎకరాల భూమిని ఏ ఢిల్లీలోనో, ఇంగ్లాండ్‌లోనో, వాషింగ్టన్‌లోనో లీజుకు ఇమ్మనండి చూద్దాం. అక్కడ ఇంత ఉదారంగా ఇవ్వటానికి కుదరనప్పుడు ఇథియోపియాలో మాత్రం ఎందుకు అలా జరగాలి?'' అని ఎస్ఎంఎన్ఈకి చెందిన ఒబెంగ్ మెథో ప్రశ్నిస్తున్నారు. ఇథియోపియాలో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయింది. చివరికి ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి 12 కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేశారు. వీటిలో ఐదు మన దేశానికి చెందినవే.
మన ఒప్పందాల టైపే!
మన వాటితో సహా 12 కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే- అక్కడి ప్రభుత్వం ఎంత ఉదారంగా భూమిని ధారాదత్తం చేసిందో అర్థమవుతుంది. ఈ ఒప్పందంలో ఇథియోపియా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. కాని కంపెనీలు పర్యావరణానికి హాని కల్గిస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని ఎవరు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. ఏఏ సంస్థలకు ఆ బాధ్యత ఉందనే విషయాన్ని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఒక వేళ ఈ కంపెనీలు పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి పెనాల్టీలను చెల్లించాలనే విషయం కూడా ఒప్పందాలలో లేదు. ఒప్పందాల ప్రకారం కంపెనీలు తమ వద్ద ఉన్న నీటి వనరులను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. వాటిపై డ్యామ్‌లు కట్టుకోవచ్చు. భూగర్భ జలాలను వెలికితీయటానికి బోర్లు వేసుకోవచ్చు. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టవచ్చు.
అయితే ఈ నీటి వనరులను వాడుకున్నందుకు స్థానిక ప్రజలకు ఎంత చెల్లించాలి? ప్రభుత్వానికి ఏదైనా చెల్లించాలా లేదా అనే విషయం మాత్రం ఒప్పందాలలో లేదు. ఒప్పందాలలో లేవు కాబట్టి కంపెనీలు సహజంగానే ఎటువంటి రుసుమూ చెల్లించవు. కంపెనీలు లీజుకి తీసుకున్న భూములున్న ప్రాంతాలలో స్థానిక ప్రజలకు విద్యుత్ సౌకర్యాలు, ఆరోగ్య సదుపాయాలు, పిల్లల విద్య కోసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఒప్పందంలో ఇవి కేవలం కంపెనీలలో పనిచేసే వారికి మాత్రమేనా? లేక మొత్తం ఆ ప్రాంతవాసులందరి అభివృద్ధికా? అనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. అంత కన్నా దారుణమైన విషయమేమిటంటే- కంపెనీలలో పనిచేసే కూలీలకు ఇవ్వాల్సిన దిన వేతనాల గురించి ఈ ఒప్పందాలలో ప్రస్తావనే లేదు. కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించి- కొత్త వ్యవసాయ టెక్నాలజీలను ప్రవేశపెడితే, సంప్రదాయబద్ధంగా అక్కడ వ్యవసాయం చేస్తున్న రైతుల పరిస్థితి ఏమిటి? కంపెనీలు వారికి ఏ విధంగా సహాయపడాలనే విషయం గురించి కూడా ఒప్పందాలలో లేదు.
ఇథియోపియాతోనే కాదు, మిగిలిన ఆఫ్రికా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా ఈ విధంగానే ఉన్నాయని ఆయా దేశాల్లో పోరాడుతున్న ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఆఫ్రికా దేశాలు ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల భవిష్యత్తులో ఎన్నో విపత్తులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. " ఈ కంపెనీలు ఎలాంటి వ్యవసాయ పద్ధతులను అక్కడ ప్రవేశపెడతాయనే విషయంపై ఒప్పందాలలో స్పష్టత లేదు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో రైతులు ఎరువులు ఎక్కువగా వాడలేదు. ఈ కంపెనీలు ఎక్కువ ఎరువులు వాడుతాయనుకుందాం. తమకు అనువైన విత్తనాలను ఉపయోగిస్తాయనుకుందాం. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా ఎటువంటి అడ్డు అదుపు లేకుండా భూగర్భ జలాలను ఉపయోగిస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పటికే అనేక ఆసియా దేశాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి'' అంటున్నారు ప్రపంచ బ్యాంకు నిపుణుడు డాక్టర్ డి. బయ్యర్‌లీ.
వారి హితం కోసమే!
కంపెనీలు మాత్రం ఈ విమర్శలన్నింటినీ తిప్పి కొడుతున్నాయి. "వ్యవసాయం కోసం మాత్రమే మనం అక్కడికి వెళుతున్నాం. కొందరు స్థానికులు వ్యతిరేకించటం సహజమే. మన దగ్గర డిమాండ్, సరఫరా మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు బియ్యాన్నే తీసుకుందాం. ప్రభుత్వం బాసుమతి తప్ప మిగిలిన వెరైటీల బియ్యం ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. అయితే మన కంపెనీలు ఆఫ్రికా దేశాల్లో బియ్యాన్ని పండించి దాన్ని ఎగుమతి చేశారనుకుందాం. అప్పుడు వారికి లాభాలు వస్తాయి. కేవలం బియ్యం మాత్రమే కాదు. అనేక రకాల వాణిజ్య పంటలు మనకు అనవసరం. వాటిని అక్కడ పండించి ఇక్కడకు దిగుమతి చేసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి'' అంటారు ఎస్‌బ్యాంక్‌కు చెందిన రాజు పూసపాటి. తాము స్థానికులకు ఎటువంటి అన్యాయం చేయటం లేదని, వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని కూడా కంపెనీలు చెబుతున్నాయి.
" మేము అన్ని చట్టాలను గౌరవిస్తున్నాం. ప్రస్తుతం ఇథియోపియాలో ఉన్న కూలీలకు 8 బిర్‌లు( స్థానిక కరెన్సీ. మన రూపాయల్లో 24.44) వేతనం ఇస్తున్నాం. 20 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా కంపెనీ ఉన్న ప్రాంతంలో ఒక హాస్పటల్, సినిమా హాల్, స్కూల్ నిర్మిస్తాం..'' అంటున్నారు కరుటూరి గ్లోబల్ అనే కంపెనీకి చెందిన శ్రీరామకృష్ణ. అయితే ఒక సినిమా హాల్ కట్టించటం లేదా ఆసుపత్రి కట్టించటంతో కంపెనీలకు ఉండే బాధ్యత తీరిపోదు. ఆ ప్రాంత ప్రజల సంస్కృతిని, వ్యవసాయ పద్ధతులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి దాకా ఉన్న పరిస్థితులను చూస్తే కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడదు. ఇక మీదటనైనా ఆందోళనలు పెరగకుండా చూసేందుకు అవసరమైన చర్యలన్నీ ఈ కంపెనీలు తీసుకుంటాయని ఆశిద్దాం.
స్థూలంగా చూస్తే..
* 2008లో వచ్చిన ఆహార కొరత వల్ల ఆఫ్రికా దేశాల్లో ఉన్న భూమిపై విదేశీ కంపెనీల దృష్టి పడింది. ఆ తర్వాత ఏడాదిలో ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో ఉన్న 4.5 కోట్ల హెక్టార్ల భూమిని విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. వీటిలో మన దేశానికి సంబంధించిన 80 కంపెనీలు కూడా ఉన్నాయి.
* ప్రస్తుతం అనేక దేశాల్లో ఆహార ధాన్యాల ఎగుమతులపై నిషేధం కొనసాగుతోంది. 2010లో రష్యా కూడా ఈ ఎగుమతులపై నిషేధం విధించింది. మన దేశం కొన్ని ఆహారధాన్యాల ఎగుమతిపై నిషేధం విధించింది.
* మన కంపెనీలు ఆఫ్రికాలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనే విషయంపై రిక్ రైడిన్ అనే సామాజిక పరిశోధకుడు ఇండియాస్ రోల్ ఇన్ న్యూ గ్లోబల్ ఫార్మ్‌ల్యాండ్ గ్రాబ్ అనే ఒక పత్రాన్ని తయారుచేశారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
* ఆహార కొరత ఉంది కాబట్టి సాగు భూమిని పెంచాలనే వాదన సరికాదనేది కొందరు నిపుణుల అభిప్రాయం. 'దీనికి సంబంధించి రోగనిర్ధారణ కాని చికిత్స కాని చాలా తప్పు. పేద దేశాల్లో ఆకలి ఎక్కువగా ఉండడం, పౌష్టికాహార విలువలు సరిగ్గా లేకపోవటం ఆహార ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల కాదు. పేదరికం, అసమతుల్యమైన పంపిణీ విధానాల వల్ల ఈ తరహా కరువులు ఏర్పడుతున్నాయి'' అని నిపుణులు వాదిస్తున్నారు.
* మన దేశంలో సగటు కమతం 1.5 ఎకరాలు మాత్రమే. పైపెచ్చుఆహార ధాన్యాలను పండిస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువ. అందువల్ల చాలా మంది రైతులు వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతోంది.
- సివిఎల్ఎన్ ప్రసాద్
Labels:
Africa,
Agriculture,
Farmer,
gouthamaraju,
గౌతమరాజు,
తిండి తిప్పలు,
రైతు,
వ్యవసాయం
Wednesday, May 2, 2012
సేద్యానికి 3 మూర్తుల తోడ్పాటు
గడచిన పదేళ్లలో బియ్యం ధర మూడింతలైంది. పప్పులూ కొండెక్కి కూచున్నాయి.
అంతగా ధరలు పెరిగినప్పుడు వాటిని పండించే రైతులు ఈ పదేళ్లలో
లక్షాధికారులై ఉండాలి కదా. అలా జరగకపోగా వాళ్ల స్థితిగతులు నానాటికీ
తీసికట్టుగా ఎందుకు తయారవుతున్నట్టు? ప్రతిరోజూ వార్తల్లో రైతు ఆత్మహత్యల
సంఖ్య ఎందుకు పెరుగుతున్నట్టు? ఇలా ఆలోచించి వ్యవసాయాన్ని లాభసాటి ఉపాధిగా
తయారుచెయ్యడానికి కంకణం కట్టుకున్నారు ముగ్గురు యువకులు. మూడేళ్ల క్రితం
వాళ్లు స్థాపించిన 'గ్రీన్‌బేసిక్స్' సంస్థ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో
వందల ఎకరాల్లో సిరుల పంటలు పండిస్తోంది. రైతులకు ఆలంబనగా ఉంటోంది.
ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి రమణబాబు, ప్రేమ్‌సాగర్‌రాజు, ఒడిశాకు చెందిన మదన్మోహన్ - ముగ్గురూ వ్యవసాయంలో పట్టభద్రులే. ముగ్గురివీ గ్రామీణ నేపథ్యాలే కావడంతో, వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండగలా చెయ్యాలనే ఆలోచన వారికి ముందునుంచీ ఉండేది. అనుకోకుండా ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో విద్యార్థులుగా కలిసిన వీరు 'విత్తనాల చల్లడం మొదలు కోతల వరకు' రైతుకు సాంకేతిక సాయం అందేలా ఒక వినూత్నమైన వ్యాపార ఆలోచనను కాగితాలమీదికెక్కించారు. దీని ద్వారా ఆదాయం పొందుతూనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటయ్యేలా చేస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన 'ఐడియా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్' పోటీల్లో జాతీయ స్థాయి విజేతగా నిలవడంతో అది బాగా ప్రాచుర్యం పొందింది. ఐదేళ్ల క్రితం సంగతిది. రెండేళ్ల హోమ్‌వర్క్ తర్వాత అదే 'గ్రీన్‌బేసిక్స్' సంస్థగా ప్రాణం పోసుకుంది.
సేవ చేస్తాం, విస్తరిస్తాం
పాతిక లక్షల పెట్టుబడితో నోటి మాటే ప్రచారంగా పొలం పనుల్లోకి దిగింది 'గ్రీన్ బేసిక్స్'. రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి వాటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల సాయంతో వాటిని పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా రైతులకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను లాభసాటిగా అమ్ముకొనే పద్ధతులనూ సూచిస్తుంది. "వ్యవసాయాన్ని వ్యవస్థీకృత పరిశ్రమగా రూపొందించాలి.
ప్రతి రైతూ అందులో భాగస్వామి కావాలి, అందుబాటులో ఉన్న వనరులనే మరింత సమర్థంగా ఉపయోగించుకుంటూ అధిక దిగుబడులను, లాభాలను పొందాలి. ఇదే మా గ్రీన్ బేసిక్స్ దృక్పథం. రైతు సమస్యలకు సమగ్రమైన పరిష్కారాలను రూపొందించడమే మా లక్ష్యం'' అంటున్నారు వ్యవస్థాపకుల్లో ఒకరైన రమణబాబు. ప్రస్తుతానికి గ్రీన్‌బేసిక్స్ సేవలు మన రాష్ట్రంలో వరి పండించే రైతులకే పరిమితం. వీరి సేవల వల్ల రైతులకు విత్తనాల కోసం పడిగాపులు పడటం, కూలీల కోసం ఎదురుచూడటమనే బాధలు తప్పుతున్నాయి.
దిగుబడిలో ఇరవై శాతం దాకా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటి వరకూ గ్రీన్‌బేసిక్స్ దాదాపు ఐదొందల ఎకరాల్లో 300 మంది రైతులతో కలిసి పనిచేసింది. 2500 మంది రైతులకు మేలురకం విత్తనాల ఉత్పత్తిలో శిక్షణనిచ్చింది. నలభై గ్రామాల్లో నాబార్డ్ నెలకొల్పిన రైతు క్లబ్బులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకునేలా తర్ఫీదిచ్చింది. వచ్చే సీజన్లో మరింతమంది రైతులకు అందుబాటులో ఉండటానికి ఈ బృందం కృషి చేస్తోంది.
పేదల ఉపాధా - పెద్దల హాబీనా?
విమర్శలను పక్కకు పెట్టి వాస్తవాలను పరిశీలిస్తే, ఇప్పటి తరాలకు సైతం మట్టి పట్ల అనుబంధం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలోనో, మరోచోటో చేరి, మంచి సంపాదన మొదలవగానే వ్యవసాయ భూమి కొద్దిగానైనా కొనుక్కోవాలని ఆశపడుతున్న యువత బోలెడుమంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు సైతం పుట్టినూరికి దగ్గరగా పంటపొలాలు కొనుగోలు చేస్తున్నారు. దీనికి భిన్నంగా గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల్లో పుట్టిపెరుగుతున్నవారు మాత్రం పొలం పనికి సిద్ధంగా లేరు. వ్యవసాయం పట్ల వారిలో ఆసక్తి లేదు.
ఆరుగాలం కష్టిస్తే శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుందనే భరోసా లేదు. "ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇదిలాగే కొనసాగుతూ పోతే మన దేశంలో వ్యవసాయం అధిక శాతం ప్రజల జీవనోపాధిగా కాకుండా సంపన్న వర్గాల హాబీగా అయిపోతుంది. యువత నడుంకట్టి పొలం పనుల్లో దిగకపోతే తిండి దొరకని రోజులు దగ్గర్లోనే ఉన్నాయి...'' అని ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గ్రీన్ బేసిక్స్ బృందం "సంప్రదాయ విధానాలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తేనే వ్యవసాయం గిట్టుబాటవుతుంది, లాభాల పంటను పండిస్తుంది'' అని ధైర్యం చెబుతున్నారు. వాళ్ల కృషి ఫలితాలు శ్రీకాకుళం జిల్లాలో వందల ఎకరాల్లో కనిపిస్తున్నాయి.
కొండంత కష్టం - అదే ఇష్టం
"ఆహారోత్పత్తిలో ఎదురవబోతున్న విపత్కర పరిస్థితుల గురించి ఎవరికీ అవగాహన ఉండటం లేదు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటం లేదు. ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేవు. ఇవన్నీ కలిసి వ్యవసాయ రంగాన్ని ప్రమాదకర మైన పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా మేలుకోకపోతే వినాశనం తప్పదు...'' అని కాసింత సీరియస్‌గానే చెబుతున్న రమణబాబు ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అగ్రిబిజినెస్ వంటి అంశాలమీద క్లాసులు కూడా బోధిస్తుంటారు.
"పాఠాలైతే సులువుగా చెప్పొచ్చుగానీ, ఆచరణలో అవన్నీ ఎంత కష్టమో నాకు స్వయంగా తెలుసు. చిన్న కమతాల మీద ఆధార పడి వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం లోని కష్టం మాటల్లో చెప్పలేనిది'' అంటున్నాడీ యువకుడు. ఆ కష్టాన్ని సులువు చెయ్యడాన్ని ఇష్టంగా స్వీకరించిన 'గ్రీన్‌బేసిక్స్' వంటి బృందాలు మరిన్ని తయారయితే రైతులకు అంతకంటే ఆనందకరమైన విషయం ఇంకేముంటుంది?
"రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి వాటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల సాయంతో వాటిని పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా రైతులకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను లాభసాటిగా అమ్ముకొనే పద్ధతులనూ సూచిస్తుంది.''
|
|||||||||||
|
|
||||||||||||||||||||||
|
|
|||||
|
|||||
|
|
||||||||
|
|
||||||||||||||||||||||
|
Subscribe to:
Posts (Atom)