పాడి పంటలు

Sunday, May 13, 2012

నయా (ఈస్ట్) ఇండియా కంపెనీలు!



మన రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండే భూమి ఎకరం ఖరీదు ఎంత ఉంటుంది?
ఏ లెక్కలో తీసుకున్నా సగటున 10 లక్షలైనా ఉంటుంది.
కాని ఒక ఎకరం భూమిని కొంటే చాలదు. నాణ్యమైన విత్తనాలు వేయాలి. శక్తిమంతమైన ఎరువులు చల్లాలి. అదృష్టం బావుండి పంట బాగా పండితే కోత కోయటానికి ఎక్కువ మంది కూలీలను పెట్టాలి. వీటికి తోడుగా- నీరు, విద్యుత్‌లు వాడుకున్నందుకు పైకం చెల్లించాలి. ఇంత చేసిన తర్వాత కూడా పంటకు సరైన రేటు రాకపోవచ్చు. అంటే లక్షల ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తే వచ్చేది నష్టమే. ఇదీ మన దేశంలో రైతుల పరిస్థితి.
అదే పదిలక్ష రూపాయలకు ఒక పదమూడు వేల ఎకరాల భూమి వస్తే? పైగా అది మంచి భూసారమున్న భూమైతే? ఆ భూమి కొనటానికి ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇస్తే? దానిలో పండిన పంటను ఎగుమతి చేస్తే ? ఆ ఎగుమతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే?
బాబ్బాబు.. అలాంటి అవకాశం ఎక్కడుందో చెప్పు. అప్పోసొప్పో చేసి వ్యవసాయం చేసుకు బతికేస్తాం అంటున్నారా? మీరు ఈ కొత్త తరహా వ్యవసాయానికి ట్రై చేయచ్చు కాని- మీ కన్నా ముందు దాదాపు ఎనభై కంపెనీలు ఈ రకమైన వ్యవసాయంలో ఇప్పటికే దాదాపు 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేసాయి.



ఇప్పటిదాకా ఆ విషయం మనకు ఎందుకు తెలియలేదంటే.. ఈ భూమంతా ఆఫ్రికాలోని ఇథియోపియా, కెన్యా, మడగాస్కర్, సెనగల్, మొజాంబిక్ మొదలైన దేశాల్లో ఉంది. చైనా, ఉత్తర కొరియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన కంపెనీలతో పోటీ పడి మన వాళ్లు ఆఫ్రికాలో వ్యవసాయ భూములను లక్షల ఎకరాల చొప్పున లీజుకు తీసుకుంటున్నారు. అయితే మన వాళ్లు కుదుర్చుకుంటున్న ఒప్పందాల వల్ల తాము చాలా నష్టపోతున్నామని ఆయా దేశాల్లో నివసించే స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీలొచ్చి తమ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని, తమ హక్కులను హరిస్తున్నాయని ఆందోళనలకు దిగుతున్నారు. గతంలో బ్రిటన్ మాదిరిగా భారత్ కూడా సామ్రాజ్యవాద ధోరణిని అనుసరిస్తోందని దుయ్యబడుతున్నారు. ఇంత సువిశాల భారతదేశం వదలి మన కంపెనీలు వ్యవసాయం కోసం ఇతర ఖండాలకు ఎందుకు వెళ్తున్నాయి? దాని వెనకున్న కారణాలేమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే 2008 సంవత్సరంలోకి ఒక్కసారి తిరిగి చూడాలి. 2008.. చాలా అగ్రరాజ్యాలు మరచిపోవాలనుకునే సంవత్సరం.

ఆర్థిక మాంద్యంతో పాటు ఆహారపు కొరత కూడా ఆ ఏడాది ప్రపంచంలో అనేక దేశాలను వణికించింది. ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని దేశాలూ ఆహారపు కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండు ప్రపంచయుద్ధం తర్వాత అంత ఆహారపు కొరత ఏర్పడటం అదే మొదటిసారి. దీనికి రెండు ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తి తగ్గిపోవటం. రెండోది- సాగు భూమిలో ఎక్కువ శాతం సోయా, ఆయిల్ సీడ్స్ వంటి పంటలను పండించటం. ఆహార కొరత రావటంతో అమెరికా, రష్యా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఆహారపు ఉత్పత్తులను ఎగుమతి చేసే అర్జెంటీనా, వియత్నాం వంటి దేశాలు తమ ఎగుమతులపై నిషేధం విధించాయి. దీనితో తొలిసారి ధనిక దేశాలకు కేవలం డబ్బు ఉంటే చాలదని అర్థమయింది. దీనితో అవి ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రచించటం మొదలుపెట్టాయి.

ఈ వ్యూహంలో ప్రధానమైనది- ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల్లో ఖాళీగా ఉన్న భూములను వ్యవసాయయోగ్యంగా చేయటం. అక్కడ తామే పొలాలను లీజుకు తీసుకుని పంటలు పండించి, ఆ పంటలను తమ తమ దేశాలకు దిగుమతి చేసుకోవటం. అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న ఆఫ్రికా దేశాలకు ఇది ఒక అవకాశం. ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న ధనిక దేశాలకు ఇదొక అవసరం. ఆఫ్రికాలో ఇలాంటి వాణిజ్య అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు భారత్, చైనా, సౌదీ అరేబియా, కువైట్, ఉత్తర కొరియాలు గ్రహించి వెంటనే రంగంలోకి దిగాయి. వివిధ దేశాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని భూములను లీజుకు తీసుకోవటం మొదలుపెట్టాయి. ప్రపంచబ్యాంకు నివేదికల ప్రకారం 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికాలో 4.5 కోట్ల హెక్టార్ల భూమిని విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో కొంత దూకుడుతో వ్యవహరిస్తున్న భారత్ కంపెనీలు మిగిలిన వారి కన్నా ఒక అడుగు ముందే ఉన్నాయి.

ఆఫ్రికాలో ఉన్న అవకాశాలను చేజిక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదిపాయి. దీనికి మన ప్రభుత్వం కూడా సహకరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, కాన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ మొదలైనవి ఆఫ్రికాలో వాణిజ్య అవకాశాలకు సంబంధించిన ప్రాజెక్టు నివేదికలను తయారుచేశాయి. అనేక బృందాలను ఆ దేశాలకు తీసుకువెళ్లాయి. ఇదంతా ఒక ఎత్తయితే, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఈ కంపెనీలకు రుణాలను ఇవ్వటానికి అంగీకరించటం మరొక ఎత్తు. దీనితో 80 కంపెనీలు ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలతో లక్షల ఎకరాల లీజుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ భూములను సాగులోకి తేవటానికి అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు, వ్యవసాయ టెక్నాలజీ కొనుగోలుకు ఎక్సిమ్ బ్యాంక్ ఈ రుణాలను అందిస్తోంది. ఉదాహరణకు ఇథియోపియాలో ప్రారంభించిన టెన్‌డాహో షుగర్ ప్రాజెక్టుకు ఎక్సిమ్ బ్యాంకు 64 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేసింది. 1.75 శాతం వడ్డీతో, 20 ఏళ్ల కాల పరిమితితో ఎక్సిమ్ బ్యాంకు ఇచ్చే ఈ రుణాలు అనేక కంపెనీలను ఆకర్షించాయి.

మనకవసరమా?

దేశంలో ఉన్న మొత్తం సాగుభూమినే ఉపయోగించుకోలేని మనకు ఆఫ్రికా భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేయటం అవసరమా అనే ప్రశ్న తలెత్తటం సహజమే. దీని గురించి చర్చించే ముందు మన వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని సత్యాలను తెలుసుకోవాలి. 1970లలో హరిత విప్లవం వచ్చిన తర్వాత మన దేశంలో వ్యవసాయోత్పత్తి బాగా పెరిగింది. సాగుభూమి కూడా బాగా పెరిగింది. కాని 1990ల తర్వాత మన దేశంలో వ్యవసాయోత్పత్తి తగ్గుతూ వస్తోంది. నూనె, పప్పు దినుసులు వంటి నిత్యావసరాల విషయంలో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతూ వచ్చింది. దీనితో వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వస్తోంది.

ఉదాహరణకు 2008లో 54 లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటే 2009లో 74 లక్షల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మనం చమురు తర్వాత ఎక్కువగా ఖర్చు పెట్టేది వంట నూనెలపైనే! ఇలాంటి ఉదాహరణనే మరొక దానిని చూద్దాం. మన పౌష్టికాహారానికి అత్యంత కీలకమైన పప్పు దినుసుల ఉత్పత్తి 2011-12 ఆర్థిక సంవత్సరంలో 15.73 మిలియన్ టన్నులు ఉంటుందని ప్రభుత్వ అంచనా. అయితే పప్పు దినుసుల డిమాండ్ 19.91 మిలియన్ టన్నుల దాకా ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు నాలుగు మిలియన్ టన్నుల పప్పు దినుసులను మనం దిగుమతి చేసుకోవాల్సిందే.

అంతే కాకుండా 2020 నాటికి ఆహార ధాన్యాల డిమాండ్ 25 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా. ప్రస్తుతం మన ఉత్పత్తి 23 కోట్ల టన్నులే. అంటే ప్రస్తుతం మనకు బొటాబొటిగా సరిపోతున్న ఆహారధాన్యాల ఉత్పత్తి, మరో ఎనిమిదేళ్ల తర్వాత సరిపోదు. ఏ విధంగా చూసినా, అప్పటికి మన దేశంలో రెండు కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశం లేదనేది నిపుణుల అంచనా. దీనితో దీర్ఘకాలిక ఆహార భద్రతకు ఆఫ్రికా దేశాలలో వ్యవసాయం ఒక మంచి అవకాశంగా ప్రభుత్వం కూడా భావించింది. అంతే కాకుండా ఆ దేశాల్లో నీటి కొరత లేకపోవటం, మనతో పోల్చుకుంటే వ్యవసాయోత్పత్తికి తక్కువ ఖర్చు కావటం మొదలైన అంశాలు కూడా ఇటు ప్రభుత్వాన్ని, అటు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.

"ఆఫ్రికాలో వ్యవసాయోత్పత్తికి అయ్యే ఖర్చు భారత్‌తో పోలిస్తే సగం ఉంటుంది. మందులు, ఎరువులు తక్కువగా వాడచ్చు. లేబర్ చాలా తక్కువ ధరకు దొరుకుతారు. ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది'' అంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన లక్కీ గ్రూప్‌కు చెందిన ఎస్.ఎన్. పాండే. ప్రభుత్వం ఆహార భద్రత, ఆహార ధాన్యాల ఉత్పత్తి కోణం నుంచి ఈ సమస్యను చూస్తుంటే కంపెనీలేమో అక్కడి అనుకూలతలు, ఇక్కడి అననుకూలతలను బేరీజు వేసుకుంటున్నాయి. మన దగ్గర ఉన్న ఇబ్బందులు కమతాలు చిన్నవిగా ఉండటం, వాటికి పెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా మార్చటానికి ప్రయత్నిస్తే అనేక ప్రభుత్వ నిబంధనలు అడ్డం రావటం, ఆహారోత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం మొదలైన కారణాలను ఈ కంపెనీలు చూపిస్తున్నాయి.

స్థానిక ఆందోళనలు..

అయితే తమ దేశాలలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు తమ గురించి పట్టించుకోవటం లేదని చాలా ఆఫ్రికన్ దేశాల్లో అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి ఆందోళనలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇథియోపియాను చెప్పుకోవచ్చు. ఇథియోపియాలో అడవులు ఎక్కువ. చాలామందికి ఆ అడవులే జీవనాధారం. పశువులకు మేత, జలాశయాలలో ను, నదులలోను ఉండే నీళ్లు వారికి చాలా ముఖ్యమైన అంశాలు. ఇథియోపియా ప్రభు త్వం ఇచ్చిన లీజుల వల్ల లక్షల హెక్టార్ల అడవులు ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. అడవులను నరికి ప్లాంటేషన్లను ఏర్పాటు చేయాలనేది ఈ కంపెనీల ఉద్దేశం. తమను నిర్వాసితులు చేస్తున్నారని, తమకు ఉపాధి కల్పించటం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ము ఖ్యంగా బోకో, గంబేలా ప్రాం తాల్లో భారతీయ కంపెనీల చేతుల్లో లక్షల హెక్టార్ల భూములున్నాయి. ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాక మూడు లక్షల మంది నిర్వాసితులయ్యారని ఒక అంచనా.

వీరిలో కేవలం 20 వేల మందికే కంపెనీలు ఉపాధి కల్పించాయి. ఫలితంగా స్థానికుల ఆందోళనలు మరింతగా పెరిగాయి. భారత్‌కు చెందిన వేదాంత హార్వెస్ట్ ప్లాంటేషన్స్ కంపెనీ కారణంగా గంబేలాలో మజాంగిర్ అనే తెగ ప్రజలు పూర్తిగా నిర్వాసితులయ్యారు. దీనితో వారు సాలిడారిటీ మూమెంట్ ఫర్ ఎ న్యూ ఇథియోపియా అనే (ఖికూఉ) స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆందోళనలు చేపట్టారు. ఈ సంస్థ చెప్పినదాని ప్రకారం కంపెనీలతో ప్రభుత్వం ఏమేం ఒప్పందాలు చేసుకుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. వేదాంత హార్వెస్ట్ ప్లాంటేషన్స్‌కు సంబంధించిన వ్యవహారం ఆ దేశా«ధ్యక్షుడు గిర్మా వోల్డి గియోర్గిస్ దాకా వెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ఎన్విరాన్‌మెంట్ ప్రొటక్షన్ అథారిటీ ఆఫ్ ఇథియోపియా (ఈపీఏఈ) ఈ లీజుపై విచారణ జరిపింది. ఈ ప్రాజెక్టును వెంటనే ఆపుచేయాలని ఆదేశించింది.

అయితే ఇథియోపియాలో రాజకీయ అస్థిరత ఎక్కువ. అధ్యక్షుడి ఆదేశాలను పట్టించుకొనే రాష్ట్రాలు తక్కువే. అందుకే స్థానిక గవర్నర్ వేదాంత హార్వెస్ట్‌కు ఇచ్చిన లీజు మరో 50 ఏళ్లు కొనసాగుతుందని ప్రకటించాడు. "ఇథియోపియాలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలా మూడు వేల ఎకరాల భూమిని ఏ ఢిల్లీలోనో, ఇంగ్లాండ్‌లోనో, వాషింగ్టన్‌లోనో లీజుకు ఇమ్మనండి చూద్దాం. అక్కడ ఇంత ఉదారంగా ఇవ్వటానికి కుదరనప్పుడు ఇథియోపియాలో మాత్రం ఎందుకు అలా జరగాలి?'' అని ఎస్ఎంఎన్ఈకి చెందిన ఒబెంగ్ మెథో ప్రశ్నిస్తున్నారు. ఇథియోపియాలో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయింది. చివరికి ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి 12 కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేశారు. వీటిలో ఐదు మన దేశానికి చెందినవే.

మన ఒప్పందాల టైపే!

మన వాటితో సహా 12 కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే- అక్కడి ప్రభుత్వం ఎంత ఉదారంగా భూమిని ధారాదత్తం చేసిందో అర్థమవుతుంది. ఈ ఒప్పందంలో ఇథియోపియా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. కాని కంపెనీలు పర్యావరణానికి హాని కల్గిస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని ఎవరు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. ఏఏ సంస్థలకు ఆ బాధ్యత ఉందనే విషయాన్ని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఒక వేళ ఈ కంపెనీలు పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి పెనాల్టీలను చెల్లించాలనే విషయం కూడా ఒప్పందాలలో లేదు. ఒప్పందాల ప్రకారం కంపెనీలు తమ వద్ద ఉన్న నీటి వనరులను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. వాటిపై డ్యామ్‌లు కట్టుకోవచ్చు. భూగర్భ జలాలను వెలికితీయటానికి బోర్లు వేసుకోవచ్చు. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టవచ్చు.

అయితే ఈ నీటి వనరులను వాడుకున్నందుకు స్థానిక ప్రజలకు ఎంత చెల్లించాలి? ప్రభుత్వానికి ఏదైనా చెల్లించాలా లేదా అనే విషయం మాత్రం ఒప్పందాలలో లేదు. ఒప్పందాలలో లేవు కాబట్టి కంపెనీలు సహజంగానే ఎటువంటి రుసుమూ చెల్లించవు. కంపెనీలు లీజుకి తీసుకున్న భూములున్న ప్రాంతాలలో స్థానిక ప్రజలకు విద్యుత్ సౌకర్యాలు, ఆరోగ్య సదుపాయాలు, పిల్లల విద్య కోసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఒప్పందంలో ఇవి కేవలం కంపెనీలలో పనిచేసే వారికి మాత్రమేనా? లేక మొత్తం ఆ ప్రాంతవాసులందరి అభివృద్ధికా? అనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. అంత కన్నా దారుణమైన విషయమేమిటంటే- కంపెనీలలో పనిచేసే కూలీలకు ఇవ్వాల్సిన దిన వేతనాల గురించి ఈ ఒప్పందాలలో ప్రస్తావనే లేదు. కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించి- కొత్త వ్యవసాయ టెక్నాలజీలను ప్రవేశపెడితే, సంప్రదాయబద్ధంగా అక్కడ వ్యవసాయం చేస్తున్న రైతుల పరిస్థితి ఏమిటి? కంపెనీలు వారికి ఏ విధంగా సహాయపడాలనే విషయం గురించి కూడా ఒప్పందాలలో లేదు.

ఇథియోపియాతోనే కాదు, మిగిలిన ఆఫ్రికా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా ఈ విధంగానే ఉన్నాయని ఆయా దేశాల్లో పోరాడుతున్న ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఆఫ్రికా దేశాలు ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల భవిష్యత్తులో ఎన్నో విపత్తులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. " ఈ కంపెనీలు ఎలాంటి వ్యవసాయ పద్ధతులను అక్కడ ప్రవేశపెడతాయనే విషయంపై ఒప్పందాలలో స్పష్టత లేదు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో రైతులు ఎరువులు ఎక్కువగా వాడలేదు. ఈ కంపెనీలు ఎక్కువ ఎరువులు వాడుతాయనుకుందాం. తమకు అనువైన విత్తనాలను ఉపయోగిస్తాయనుకుందాం. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా ఎటువంటి అడ్డు అదుపు లేకుండా భూగర్భ జలాలను ఉపయోగిస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పటికే అనేక ఆసియా దేశాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి'' అంటున్నారు ప్రపంచ బ్యాంకు నిపుణుడు డాక్టర్ డి. బయ్యర్‌లీ.

వారి హితం కోసమే!

కంపెనీలు మాత్రం ఈ విమర్శలన్నింటినీ తిప్పి కొడుతున్నాయి. "వ్యవసాయం కోసం మాత్రమే మనం అక్కడికి వెళుతున్నాం. కొందరు స్థానికులు వ్యతిరేకించటం సహజమే. మన దగ్గర డిమాండ్, సరఫరా మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు బియ్యాన్నే తీసుకుందాం. ప్రభుత్వం బాసుమతి తప్ప మిగిలిన వెరైటీల బియ్యం ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. అయితే మన కంపెనీలు ఆఫ్రికా దేశాల్లో బియ్యాన్ని పండించి దాన్ని ఎగుమతి చేశారనుకుందాం. అప్పుడు వారికి లాభాలు వస్తాయి. కేవలం బియ్యం మాత్రమే కాదు. అనేక రకాల వాణిజ్య పంటలు మనకు అనవసరం. వాటిని అక్కడ పండించి ఇక్కడకు దిగుమతి చేసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి'' అంటారు ఎస్‌బ్యాంక్‌కు చెందిన రాజు పూసపాటి. తాము స్థానికులకు ఎటువంటి అన్యాయం చేయటం లేదని, వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని కూడా కంపెనీలు చెబుతున్నాయి.

" మేము అన్ని చట్టాలను గౌరవిస్తున్నాం. ప్రస్తుతం ఇథియోపియాలో ఉన్న కూలీలకు 8 బిర్‌లు( స్థానిక కరెన్సీ. మన రూపాయల్లో 24.44) వేతనం ఇస్తున్నాం. 20 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా కంపెనీ ఉన్న ప్రాంతంలో ఒక హాస్పటల్, సినిమా హాల్, స్కూల్ నిర్మిస్తాం..'' అంటున్నారు కరుటూరి గ్లోబల్ అనే కంపెనీకి చెందిన శ్రీరామకృష్ణ. అయితే ఒక సినిమా హాల్ కట్టించటం లేదా ఆసుపత్రి కట్టించటంతో కంపెనీలకు ఉండే బాధ్యత తీరిపోదు. ఆ ప్రాంత ప్రజల సంస్కృతిని, వ్యవసాయ పద్ధతులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి దాకా ఉన్న పరిస్థితులను చూస్తే కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడదు. ఇక మీదటనైనా ఆందోళనలు పెరగకుండా చూసేందుకు అవసరమైన చర్యలన్నీ ఈ కంపెనీలు తీసుకుంటాయని ఆశిద్దాం.

స్థూలంగా చూస్తే..

* 2008లో వచ్చిన ఆహార కొరత వల్ల ఆఫ్రికా దేశాల్లో ఉన్న భూమిపై విదేశీ కంపెనీల దృష్టి పడింది. ఆ తర్వాత ఏడాదిలో ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో ఉన్న 4.5 కోట్ల హెక్టార్ల భూమిని విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. వీటిలో మన దేశానికి సంబంధించిన 80 కంపెనీలు కూడా ఉన్నాయి.
* ప్రస్తుతం అనేక దేశాల్లో ఆహార ధాన్యాల ఎగుమతులపై నిషేధం కొనసాగుతోంది. 2010లో రష్యా కూడా ఈ ఎగుమతులపై నిషేధం విధించింది. మన దేశం కొన్ని ఆహారధాన్యాల ఎగుమతిపై నిషేధం విధించింది.
* మన కంపెనీలు ఆఫ్రికాలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనే విషయంపై రిక్ రైడిన్ అనే సామాజిక పరిశోధకుడు ఇండియాస్ రోల్ ఇన్ న్యూ గ్లోబల్ ఫార్మ్‌ల్యాండ్ గ్రాబ్ అనే ఒక పత్రాన్ని తయారుచేశారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
* ఆహార కొరత ఉంది కాబట్టి సాగు భూమిని పెంచాలనే వాదన సరికాదనేది కొందరు నిపుణుల అభిప్రాయం. 'దీనికి సంబంధించి రోగనిర్ధారణ కాని చికిత్స కాని చాలా తప్పు. పేద దేశాల్లో ఆకలి ఎక్కువగా ఉండడం, పౌష్టికాహార విలువలు సరిగ్గా లేకపోవటం ఆహార ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల కాదు. పేదరికం, అసమతుల్యమైన పంపిణీ విధానాల వల్ల ఈ తరహా కరువులు ఏర్పడుతున్నాయి'' అని నిపుణులు వాదిస్తున్నారు.
* మన దేశంలో సగటు కమతం 1.5 ఎకరాలు మాత్రమే. పైపెచ్చుఆహార ధాన్యాలను పండిస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువ. అందువల్ల చాలా మంది రైతులు వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతోంది. 

-  సివిఎల్ఎన్ ప్రసాద్

No comments:

Gouthamaraju as WUA