పాడి పంటలు

Saturday, August 11, 2012

బడుగుల B-School


బడా వ్యాపారవేత్తలకు పనికొచ్చే బిజినెస్ స్కూళ్లు నగరానికొకటి ఉన్నాయి. కాని, చిరు వ్యాపారుల్ని, నిరుపేదల్ని పైకి తెచ్చే స్కూళ్లు? అలాంటివి కూడా ఉంటాయా అనుకుంటున్నారా! ఎక్కువ లేవు కాని ఒకటైతే ఉంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా మహ్‌సవడ్‌లో ఉంది ఓ బడుగుల బి-స్కూల్. మహిళల కోసమే నెలకొల్పిన దాని పేరు 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్'. మేదర్లు, వడ్రంగులు, కమ్మర్లు, కుమ్మర్లు, తోపుడుబండ్ల, పూల అంగళ్ల, కూరగాయల వ్యాపారులు.. వీళ్లే అక్కడ విద్యార్థులు.


వనిత, MDBS.

ఎంబీబీఎస్ గురించి తెలుసు, ఎంబీఏ సంగతీ తెలుసు. మరి, ఈ కొత్త కోర్సు గురించి ఎప్పుడూ వినలేదే? ఎక్కడుంది..? అనే ముందు వనిత గురించి నాలుగు ముక్కలు. ఒకప్పుడు ఆమె కోళ్లఫారం యజమాని. ఒక రోజు ఉన్నట్లుండి వైరస్ సోకింది. కోళ్లన్నీ రాత్రికి రాత్రే చనిపోయాయి. అప్పుల్లో చిక్కుకున్న వనితకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ఆ సమయంలో కూలిపోయిన తన కుటుంబాన్ని తిరిగి నిలబెట్టింది ఎండిబిఎస్ చదువు. కోర్సు పూర్తయ్యాక బ్యాంకులో రుణం తీసుకుని.. డిస్పోజబుల్ (వాడి పారేసే) కప్పులు, ప్లేట్లను ఉత్పత్తిచేసే యూనిట్‌ను ప్రారంభించింది. ఇప్పుడు తన దగ్గర 12 యంత్రాలు, పది మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ మధ్యన ప్రధాని మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా అవార్డును సైతం అందుకుందీ వనిత. ఆమె చదువుకున్నది ఏ ఖరీదైన బిజినెస్ స్కూల్‌లోనో కాదు. కేవలం రూ.25 ఫీజు చెల్లించి 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్'లో చదివిందంతే.

మనకు తెలిసిన బి-స్కూల్ అంటే.. సువిశాలమైన క్యాంపస్. హంగూఆర్భాటం. సూటుబూటు. లక్షల్లో ఫీజులు. క్యాంపస్ ఇంటర్వ్యూలు. భారీ వేతన ప్యాకేజీలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనికుల్ని మరింత ధనికులుగా తీర్చిదిద్దేది. కంపెనీలను లాభాల బాటపట్టించే ఉద్యోగులను ఉత్పత్తిచేసేది. కాని, "సారె తిప్పినా బండి నడవని కుమ్మరికి, బడిసె పట్టుకున్నా బతకలేని వడ్రంగికి, ఎన్ని బుట్టలల్లినా కాసింత బువ్వ తినలేని మేదరికి.. బతుకు పాఠాలు బోధించే బడులను ఎందుకు స్థాపించలేకపోతున్నాం..'' అనుకుంది ఒక మహిళ. ఆమె పేరు చేత్నా గలా సిన్హా.

కరువుకు పరిష్కారం..

ముంబయికి చెందిన సిన్హా అందరూ నడిచే దారిలో నడవరు. ఆమెది ఎప్పుడూ భిన్నమైన మార్గం. అభివృద్ధి అంటే పైనున్న వాళ్లను మరింత పైకి తీసుకెళ్లడం కాదు. అట్టడుగునున్న గ్రామీణపేదల్ని పైకి తీసుకురావడం. అలాగే కనుమరుగైపోతున్న వృత్తులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం.. అనుకుంది ఆమె. మహారాష్ట్రలోని సతారా, షోలాపూర్, సంగ్లి, రాయ్‌గడ్, రత్నగిరి, కొల్హాపూర్ కరువు ప్రాంతాలు. ప్రతి పల్లెలోనూ సగానికి పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలే నివసిస్తుంటారు. అరకొర నీళ్లున్న చోట చెరకు, జొన్న, మొక్కజొన్న పండితే పండినట్లు. లేకపోతే గడ్డి కూడా మిగలదు. రైతుల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఇక కూలీల అగచాట్లు చెప్పనక్కర్లేదు.

విషయం తెలుసుకున్న చేత్నా గలా సిన్హా 'మాన్' తాలూకాకు వెళ్లింది. ప్రజల బాధలు అర్థం చేసుకుంది. కేవలం మహిళల కోసం 'మాన్ దేశీ ఫౌండేషన్'ను నెలకొల్పింది. దీని కిందే 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్', 'మాన్ దేశీ మహిళా బ్యాంక్'లను ఏర్పాటు చేశారామె. ఇప్పుడా బ్యాంకులో 1.14 లక్షల సభ్యులు ఉన్నారు. చిరు వ్యాపారులు, నిరుపేదలు ఆ బిజినెస్ స్కూల్లో నైపుణ్యాలను నేర్చుకుంటారు. బ్యాంకులో రుణాలు తీసుకుని.. ఉపాధి పొందుతారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడు.. వారికి సంఘంలో గౌరవం లభిస్తుంది. నాణ్యమైన జీవితంతోపాటు పిల్లలకు చదువులు అబ్బుతాయి. స్థూలంగా మాన్ దేశీ ఫిలాసఫీ ఇదే!

దిశదిశలా స్ఫూర్తి..

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బి- స్కూళ్లకు పాఠ్యాంశాలను రూపొందించడం కంటే.. మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌కు పాఠ్యప్రణాళిక తయారు చేయడం చాలా కష్టం. ఇందులో విద్యార్థులంతా దినకూలీలు, గాజులు అమ్ముకునేవారు, వడ్రంగులు, మేదర్లు, దర్జీలు, తాపీమేస్త్రీలు, బడి మానేసిన పిల్లలు. అందులోనూ అందరూ ఒక వయస్కులు కాదు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య వాళ్లు. మూడోవంతు మందికి వేలిముద్రలు వేయడం ఒక్కటే తెలుసు. "బ్యాంకు అకౌంట్లు, లోన్లు, చెక్కులు, డిడిలు వంటి చిన్న చిన్న విషయాలను అర్థమయ్యేలా చెప్పడం ఒక పెద్ద సవాలు. రకరకాల ప్రయోగాలతో బోధించినా ఫలితం లేకపోయేసరికి.. పల్లెల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న జానపద గాథలు, నాటకాల ద్వారా ఆర్థిక పాఠాల్ని చెప్పాం. పరిస్థితి కొంత వరకు మెరుగుపడింది..'' అన్నారు స్కూల్ టీచర్లు.

మాన్ దేశీ స్కూల్ పాతిక కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి రెండు రోజుల నుంచి మూడు మాసాల కాలవ్యవధి ఉంటుంది. ప్రత్యేక కోర్సులకైతే ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. రూ.25 నుంచి రూ.1200 మధ్యన ఫీజులు ఉంటాయి. ఫైనాన్షియల్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, వొకేషనల్ ట్రైనింగ్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, డ్రెస్ డిజైనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్షన్.. వంటి కోర్సుల్లో తర్ఫీదు ఇస్తారు. ఉదాహరణకు - బుట్టలల్లే వ్యాపారి మార్కెట్‌ను ఎలా విస్తరించుకోవచ్చు? ఇనుపసామాన్లు రిపేరు చేసే నిపుణుడికి మరమ్మతు పరికరాలు ఎక్కడ దొరుకుతాయి? ముడిసరుకుల్ని ఎప్పుడు కొనాలి? వినియోగదారులతో ఎలా మాట్లాడాలి? బ్యాంకుల్ని ఎలా సంప్రదించాలి? అప్పులు, రుణాలు, వడ్డీలు, బీమా, పింఛను, సబ్సిడీలు.. ఇలా ఒక్కటేమిటి? ఆర్థికంతో ముడిపడిన ప్రతి అంశాన్నీ పాఠంగా చెబుతారు. ఈ విషయాలన్నీ అవగాహన లేకే.. చిరువ్యాపారులు రాణించలేకపోతున్నారంటుంది మాన్ దేశీ సంస్థ. వ్యాపారంలో నైపుణ్యం లేని వారికి కూడా శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. కోర్సు పూర్తయిన వెంటనే కచ్చితంగా ఉపాధి దొరికే కోర్సులకే ప్రాధాన్యం ఉంటుంది.

మాన్ దేశీ స్కూల్ గురించి ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఏల్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్, డ్యూక్, చికాగో యూనివర్శిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల్ని ఇక్కడికి పంపించి అధ్యయనం చేయిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా మాన్ దేశీ గురించి ఆసక్తి చూపించారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు తనను కలవమని చేత్నా గలా సిన్హాకు ఆహ్వానం పంపించారు. ముంబయికి వెళ్లిన చేత్నా ఒబాను కలిసి.. మాన్ దేశీ గురించి వివరించారు. "ప్రపంచంలోనే బడుగుల కోసం ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ ఇదొక్కటే. ఇలాంటి స్కూళ్ల వల్ల పేదరికానికి పరిష్కారం దొరుకుతుంది.

వృత్తుల్ని నాశనం కాకుండా కాపాడుకోవచ్చు..'' అంటూ 'ద బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్' ప్రశంసించింది. ప్రస్తుతం పేరున్న అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లన్నీ మాన్ దేశీ స్కూల్‌కు నిధులను, బోధనా సహాయాన్ని అందిస్తున్నాయి. హెచ్ఎస్‌బిసి, యాక్సెంచర్, ఎస్ఐడిబిఐ, నబార్డ్ వంటి సంస్థలు తోడ్పాటునివ్వడం వారికి కలిసొచ్చింది. ఇప్పటివరకు 30 వేల మంది మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. వీరిలో డెభ్బైశాతం మంది చిరువ్యాపారాలను విజయవంతంగా చేసుకుంటున్నారు. వీరందరికీ ఆర్థిక అక్షరాస్యత పెరగడమే కాకుండా.. జీవితం పట్ల ఆత్మవిశ్వాసం ఏర్పడిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రయోగాల పాఠశాల..

మాన్ దేశీ స్కూలు ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. సాధారణ కోర్సులతో సరిపెట్టుకోకుండా.. ప్రత్యేక కోర్సులను డిజైన్ చేస్తోంది. అలాంటి కొత్త కోర్సుల్లో ఒకటి 'బ్రాండెడ్ దేశీ ఎంబీఏ'. ఇందులో బ్రాండింగ్, అడ్వర్‌టైజింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లలో తర్ఫీదునిస్తారు. అమెరికాకు చెందిన యాక్సియోన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కోర్సుకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంత చేస్తున్నా.. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులకు ఈ బిజినెస్ స్కూల్‌లో చదువుకునే అవకాశం దొరకడం లేదు. అందుకే, చేత్నా గలా సిన్హాకు కొత్త ఆలోచన తట్టింది. అదే 'మొబైల్ బిజినెస్ స్కూల్'. ఈ కార్యక్రమానికి మాన్ దేశీ ఉద్యోగిని అని పేరుపెట్టారు. బస్సులోపల చక్కటి తరగతి గదిని ముచ్చటగా డిజైన్ చేశారు.

ఇది బ్యాటరీతో ఎనిమిది గంటల సేపు పనిచేస్తుంది. కంప్యూటర్లు, బ్లాక్‌బోర్డులు, వీడియోతెరలు అన్నీ ఉన్నాయి ఇందులో. "వాళ్లు మా దగ్గరికి రావడం కష్టమైతే, మేమే వాళ్ల దగ్గరికి వెళ్లాలన్నది మా ఆలోచన. దాని ఫలితమే ఈ మొబైల్ స్కూల్. ఇప్పటి వరకు బస్సులోనే తొమ్మిది వేల మందికి చదువుకునే అవకాశం కల్పించాం...'' అని చెప్పారు మాన్ దేశీ నిర్వాహకులు. తొలిదశలో కర్ణాటకలోని హుబ్లీలో మాత్రమే మొబైల్ స్కూల్‌ను నడుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. "నేను ఇంట్లో కుట్టు పని చేస్తాను. ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేటర్‌గా శిక్షణ తీసుకుంటున్నాను. మా ఊర్లో కరెంటు బిల్లులు చెల్లించే షాపును పెట్టాలనుకుంటున్నాను. అందుకు సరిపడా సామర్థ్యం వచ్చిందిప్పుడు నాకు'' అని చెప్పింది పాతికేళ్ల భూమిక సారె.

లోకల్ రేడియో..

మాన్ దేశీ ఫౌండేషన్ పాపులారిటీ కారణంగానే ఈ స్కూలుకు కూడా ఇంత పేరు వచ్చింది. ఎందుకంటే ఈ ఫౌండేషన్ గత పదిహేనేళ్లుగా మహారాష్ట్రలోని కరువు జిల్లాల్లో మహిళాభివృద్ధి కోసం ఎంతగానో పనిచేస్తోంది. విద్య, వైద్యం, ఆర్థిక అక్షరాస్యత, పర్యావరణం, స్వయం సహాయక బృందాల గురించిన చైతన్యం తీసుకొస్తోంది. అది పేదల్ని మేల్కొలిపేందుకు 'మాన్ దేశీ తరంగ్' అనే కమ్యూనిటీ రేడియోను నెలకొల్పింది. చుట్టుపక్కల పల్లెల్లో ఈ రేడియో కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. నాటకాలు, కథల రూపంలో పౌష్టికాహారం, అంటురోగాలు, అక్షరాస్యత పట్ల నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులైన ఎయిడ్స్ గురించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రసారాల్లో గ్రామీణులను కూడా భాగస్వాములను చేస్తోంది రేడియో. ఓటరుకార్డు ఎలా తీసుకోవాలి? బియ్యం కార్డు ఎక్కడ పొందవచ్చు? పండ్లు, కూరగాయల్ని ఎలా పండించుకోవచ్చు? వారసత్వ ఆస్తుల్లో మహిళలకు ఎందుకు వాటా దక్కడం లేదు? ఇలాంటి కార్యక్రమాలతోపాటు.. మాన్ దేశీ బిజినెస్ స్కూల్ కోర్సుల వివరాలు, ప్రవేశ సమాచారాన్ని కూడా ప్రసారం చేస్తుంటారు.

పల్లె వెలుగులు..

మాన్ దేశీ ఫౌండేషన్ పదుల సంఖ్యలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తోంది. 'మాన్ దేశీ ఛాంపియన్స్' పేరుతో గ్రామీణ క్రీడాకారులకూ ప్రోత్సాహమిస్తోంది. ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్‌లకు కావాల్సిన పరికరాల్ని, దుస్తుల్ని సమకూరుస్తున్నారు నిర్వాహకులు. "గ్రామాలతో మాకు విస్తృతంగా సంబంధాలు ఉండడం వల్ల.. బడి మానేసిన పిల్లలందరూ మా బిజినెస్ స్కూల్‌లో చేరగలుగుతున్నారు'' అంటున్నారు సంస్థ ప్రధాన కార్య నిర్వహణాధికారిణి వనితాషిండే.

ఒకసారి ఆస్మా తంబోలి అనే అమ్మాయి వాళ్ల ఆఫీసుకు వచ్చింది. తనకు ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తే చేస్తానంది. "ఇంత చిన్న వయసులోనే నీకెందుకు ఉద్యోగం'' అని ప్రశ్నించారు సంస్థ ప్రతినిధులు. "ఊరి నుంచి బడికి వెళ్లాలంటే చాలా దూరం. సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడిగితే బడి మానేయమన్నారు'' అని సమాధానం ఇచ్చింది. ఉద్యోగంలో చేరితే వచ్చే జీతంతో సైకిల్ కొనుక్కుని బడికి వెళ్లాలన్నది ఆ అమ్మాయి ఆలోచన. ఆ అమ్మాయి అనుభవాన్నే స్ఫూర్తిగా తీసుకుంది మాన్ దేశీ సంస్థ. 'ఫ్రీడం రైడర్' పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిరుపేద పిల్లలకు వడ్డీలేని రుణాలతో సైకిళ్లను పంపిణీ చేసింది. దీనివల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది.

మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. దానికొక మార్గం కనిపెట్టింది మాన్ దేశీ. ఎండకు, వానకు గంటల తరబడి కూర్చోవడం వల్లే.. అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు నిర్ధ్దారించారు. చిరువ్యాపారులు పనిదినాలను కోల్పోవడం వల్ల అప్పులు పెరిగిపోతాయి కదా. కొంత ఆలోచించాక మార్కెట్‌లోని ప్రతి చిరువ్యాపారికి పెద్ద గొడుగును అందించే 'అంబ్రెల్లా ప్రోగ్రామ్'ను ప్రవేశపెట్టింది మాన్ దేశీ. వాళ్లు ఆశించిన ఫలితాలే వచ్చాయి.

చిన్నకారు రైతుల్ని గట్టెక్కించేందుకు ఉచిత భూసార పరీక్షలు, పశు వైద్యం, పాడి పోషణ మొదలైన సదుపాయాల్ని కూడా కల్పిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో పాలడైరీలను కూడా ఏర్పాటు చేశారు.
"మాన్ దేశీ బ్యాంకు, మాన్ దేశీ స్కూలు ఇవి రెండూ మాకు రెండు కళ్లులాంటివి. నాకు బాల్యవివాహం అయింది. భర్త చనిపోయాడు. స్కూల్‌లో చేరాక.. కొత్త జీవితం మొదలైంది. గతంలో నాకైతే నోట్లను లెక్కపెట్టడం కూడా చాతనయ్యేది కాదు. ఇప్పుడు ఎంత మొత్తానికి ఎంత వడ్డీ అవుతుందో నోటికి చెప్పేస్తున్నా...'' అంటోంది లక్ష్మీ షీలర్. మాన్ దేశీలో చదువుకున్న మరో గ్రాడ్యుయేట్ నందిని లోహర్. ఆమె గోండవ్‌లె కర్మరాజ్ గుడి దగ్గర దేవుని పటాలు అమ్ముతుంటుంది. ఒకప్పుడు భవిష్యత్తు ప్రణాళిక ఉండేదే కాదు. "పండుగలు, ఊరేగింపులు, జాతర్లప్పుడు.. గుడికి భక్తుల సందడి చాలా ఎక్కువ. కాని, నా చేతిలో రూపాయి ఉండేది కాదు. డిమాండ్‌కు తగినట్లు పటాలను పెట్టలేకపోయేదాన్ని. స్కూల్‌లో చేరా ముందే ముడిసరుకును ముందే ఎందుకు కొనాలో అర్థమైంది. అందుకే సీజన్ రాక ముందే కలప ఫ్రేములు, గ్లాసు, కటింగ్ పరికరాలు, పోస్టర్లు కొనుక్కొచ్చి దాస్తాను. సీజన్ వచ్చేనాటికి పటాలు తయారుచేసి ఉంచడంతో లాభాలు పెరిగాయ్..'' అంటూ చెప్పుకొచ్చింది నందిని.

రైతులకు కూడా చేయూతనిస్తోందీ సంస్థ. ఈ ఏడాది మన రాష్ట్రంలోలాగే మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవడం లేదు. సతారా ప్రాంతంలో కరువు వల్ల పాడి పశువుల్ని అమ్మేసుకోవాల్సి వస్తోందని మాన్ దేశీ స్కూల్‌లో చేరిన నిరుపేదలు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లు వెంటనే స్పందించి ఉచిత పశు సంరక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పరిసర గ్రామాల ప్రజలు పశువుల్ని, మేకల్ని తోలుకొస్తే వాటికి గడ్డి, దాణాతోపాటు రైతులకు ఉచిత భోజన వసతులు కల్పించారు. దీంతో రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ శిబిరాన్ని సందర్శించారు. వర్షాలు జోరందుకునే వరకు శిబిరాన్ని కొనసాగించనున్నట్లు మాన్ దేశీ ప్రకటించింది.

వారెన్ బఫెట్ ఆసక్తి...

"మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌లో బోధించే ఆర్థిక పాఠాలు ఏ పుస్తకాల్లోనూ కనిపించవు. నిరుపేదల జీవితాలను అధ్యయనం చేసి తయారుచేసినవి ఇవి. ఉదాహరణకు మీకొక విషయం చెబుతాను.. భారతదేశంలో మగవాళ్లకు తాగుడు అలవాటు ఎక్కువ. నిరుపేదల్లో ఇది మరీ ఎక్కువ. మగవాళ్ల తాగుడు వల్ల తీవ్రంగా నష్టపోతున్నది ఆడవాళ్లే! రోజూ కూలికి వెళ్లి వందో రెండొందలో ఇంటికి తీసుకొస్తే.. దాని కోసం మగవాళ్లు కూచుక్కూర్చుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు సెంటిమెంటును వాడుకున్నాం. ఇంట్లో దాచుకున్న డబ్బుల్ని లాక్కెళ్లడం చాలా సులువు. అదే, భార్య మెడలో వేసుకున్న బంగారు గొలుసులనో, చేతులకు తొడుక్కున్న గాజులనో తీసుకెళ్లడం కొంత వరకు కష్టం. అలా చేసిన మగవాళ్లను మా సమాజం గౌరవించదు. అందుకే, ఆడవాళ్లందరూ అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకున్నాక బంగారాన్ని కొనమని ప్రోత్సహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. సమస్య చాలా వరకు తగ్గింది..''

చేత్నా గలా సిన్హా ప్రసంగం పూర్తి కాకముందే.. ఓ పెద్దాయన లేచి నిల్చుని చప్పట్లు కొట్టాడు. ఇదొక మంచి ఆర్థికపాఠం అన్నారు. ఆయన ఎవరో కాదు ప్రపంచంలోనే అపర కుబేరుడైన వారెన్ బఫెట్. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమెరికాకు ఆహ్వానిస్తే.. చేత్నా అమెరికాకు వెళ్లింది. ఆ సమావేశానికి బిల్‌గేట్స్, వారెన్ బఫెట్‌లాంటి హేమాహేమీలంతా హాజరయ్యారు. ఆమె ప్రసంగానికి ఎంతోమంది దాతలు స్పందించారు. బడుగుల బిజినెస్ స్కూల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మా వృత్తికి గౌరవం తీసుకొచ్చాను..

బుట్టలు అల్లే మేదరి వృత్తి మాది. మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌లో చేరేవరకు వ్యాపార కిటుకులు నాకు పెద్దగా తెలియవు. కోర్సు పూర్తయ్యాక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుంది. ఇదివరకు అప్పటికప్పుడు వెదురు తెచ్చుకుని బుట్టలు అల్లి అమ్ముకునేదాన్ని. మార్కెట్ గిరాకీ కూడా తెలిసేది కాదు. గతంలో మధ్యవర్తుల నుంచి వెదురు కొనడం వల్ల గిట్టుబాటయ్యేది కాదు. ఇప్పుడు రైతుల నుంచే నేరుగా కొంటున్నాను. మా ఊరి నుంచి ముంబయికి 270 కిలోమీటర్లు. బుట్టల్ని ముంబయి తీసికెళ్లి అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేశాను. దీన్నే వ్యాపార పరిభాషలో బిజినెస్ ప్లానింగ్ అంటారట. ఆ విషయాన్ని స్కూల్‌లో చెప్పార్లెండి.

ముంబయిలోని పండ్లు, కూరగాయల వ్యాపారులతో సంప్రదింపులు జరిపాను. రెగ్యులర్‌గా బుట్టల్ని కొనేందుకు వారు ఒప్పుకోవడంతో నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు బుట్టలు కొనేవాళ్లే లేరని దిగులుపడేదాన్ని. ఇప్పుడు ఎంత పని చేస్తే అంత మార్కెట్ ఉందని అర్థమైంది. బస్సు ఎక్కాలంటేనే భయపడే నేను ఇప్పుడు సెల్‌ఫోన్‌లో వ్యాపారులతో మాట్లాడుతున్నాను. చెక్కుల మీద సంతకాలు చేస్తున్నాను. నెలకు ఒకసారి నేనొక్కదాన్నే ముంబయికి వెళ్లి వస్తున్నాను. ఒకప్పుడు నన్ను ఊర్లో వాళ్లు పేరు పెట్టి పిలిచేవాళ్లే కాదు. ఇప్పుడు 'మాలన్‌గారు' అంటున్నారు. నాద్వారా మా వృత్తికి కూడా గౌరవం పెరిగినందుకు సంతోషంగా ఉంది.
- మాలన్, మేదరి వృత్తి


* సండే డెస్క్, Andhra Jyothy

1 comment:

Saayam said...

Good work. Keep it up

Gouthamaraju as WUA