పాడి పంటలు

Tuesday, March 27, 2012

సేద్యం ఇక సాధ్యమా?

భారతదేశం మళ్ళీ డెబ్భై, ఎనభై దశకాల్లోకి వెళ్లి పోతోందా? ప్రత్యక్ష పన్నులపై ఆధారపడే ప్రగతిశీల పన్ను విధానం నుంచి, ప్రజలందరికీ భారమయ్యే పరోక్ష పన్నుల విధానం వైపు మళ్ళుతోందా? గతంలో సంక్షేమ పథకాల మాటున గారడీ చేసిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేసింది. ప్రణబ్ కొత్త బడ్జెట్టు, రైతుల సాగు ఖర్చును విపరీతంగా పెంచే ఎరువులు మరింత కరువయ్యేలా, బరువయ్యేలా, సబ్సిడీల తగ్గింపును చేపట్టింది. పన్నులు విపరీతంగా బాదేసింది. http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg
వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి, సరఫరా గొలుసులోని సమస్యలను సరిదిద్దడం, రహదారుల అభివృద్ధి, విమానయానం లాంటి పదాలు వున్నా, సమ్మిళిత అభివృద్ధి లాంటి పదాలు బడ్జెట్టులో మాయం చేసింది. ఆమ్ ఆద్మీ ఊసే లేదు. వృద్ధి ఇంకా కావాలి అని కాకుండా ఉన్న వృద్ధిని కాపాడుకొందాము అని, పైగా దానికి దేశీయ డిమాండు రికవరీ కావాలని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి. వృద్ధి ద్వారా సంపద సృష్టి అనే 21వ శతాబ్ద సిద్ధాంతం మానేసి ఎనభైలలోని దేశీయ డిమాండు పెంపొందించటం అనే దృష్టి మళ్ళీ వచ్చేసిందేమో తేలీదు కానీ పన్నులని ఎడా పెడా పెంచేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద పెను ప్రభావం చూపించే సర్వీస్ పన్నులు పెంచారు. సబ్సిడీ తగ్గిస్తాము అంటూ, ఎరువుల ధరలు పెంచుతామని అన్యాపదేశంగానే చెప్పారు.

ప్రణబ్ బడ్జెట్టులోని లెక్కలు సరికావాలంటే పన్నేతర ఆదాయం 31.96 శాతం పెరగాలి. అంటే మళ్ళీ వేలం పాట (లేక 3 జి, 4 జి) పెట్టుబడుల ఉపసంహరణ లాంటి వాటి మీద ఆధారపడాలి. సబ్సిడీ బిల్లు కనీసం 12 శాతం తగ్గాలి. కానీ ఆహార సబ్సిడీ బిల్లే 30 వేల కోట్లు తినేస్తుంది. ద్రవ్యలోటుని 5.1 శాతానికి తెస్తామని చెప్పారు గానీ అది వీలుకాదని తెలుస్తూనే వుంది. కేల్కర్ కమిటీ ప్రకారం మార్కెట్టు నుంచి అప్పు చేయాలి. ఈ నేపథ్యంలో జీతాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు లాంటి వాటికి కూడా ప్రభుత్వం అప్పు చెయ్యబోతోంది. ఇంత అప్పు, ఇన్ని పన్ను లు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ప్రణబ్ మహాశయుడే చెప్పాలి.

ఎక్సైజ్ పన్ను రాబడి పెరిగింది; సర్వీస్ పన్నులని విపరీతంగా పెంచారు; కానీ ఇంకా మన స్థూల ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగానే వున్నాయి. 2011 సంవత్సరం బడ్జెట్ సమయంలో గొప్పగా తన బడ్జెట్ ఆదాయానికి ఖర్చుకి తేడా -అంటే ద్రవ్యలోటు- కేవలం 4.6 శాతం మాత్రమే అని ప్రకటించారు ప్రణబ్. అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తప్పుబట్టారు. ఎందుకంటే ఆహారం, చమురు, ఎరువుల మీద ఖర్చు 2010 సంవత్సరంలోని లక్షా యాభైవేల కోట్ల కంటే తగ్గించి కేవలం లక్షా ముప్పైనాలుగు వేల కోట్లు మాత్రమే చూపించారు. చమురు, ఎరువులు, ఆహార ఖర్చు పెరుగుతాయే కానీ ఎలా తగ్గుతాయో ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి వస్తే బడ్జెట్‌లో ప్రణబ్ అసలు నిజాన్ని ప్రకటించారు.

పై మూడు పద్దుల కింద అయిన ఖర్చు 2,16,297 కోట్లు. దాదాపు 80 వేల కోట్లు క్రితం సారి తగ్గించి చూపించి అసలు ద్రవ్యలోటు అదుపు లోనే వుందన్నట్టు చూపించారు. క్రితంసారి 5.9 శాతం ఉన్న ద్రవ్యలోటుని ఈ సారి 5.1 శాతానికి తగ్గిస్తానని ప్రణబ్ చెప్పారు. కానీ ఇదెంత అసంబద్ధమంటే పన్నులన్నీ సరిగ్గా వసూలై, సబ్సిడీలు 26 వేల కోట్లు తగ్గిస్తే, ఆహార బిల్లు అమల్లోకి రాకపోతే కూడా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈసారి పన్నుల రూపంలో దాదాపు 44 వేల కోట్లు అదనంగా వడ్డించారని బాధపడుతున్న ప్రజలకి రాబోయే నెలల్లో ఆహారం, ఎరువులు, చమురు మీద పడబోయే అదనపు భారం వివరాలు తలచుకుంటే చెమటలు పట్టక మానవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహార, చమురు, ఎరువుల సబ్సిడీ మీద ప్రభుత్వ ఖర్చు లక్షా తొంభై వేల కోట్లకు పడిపోతుందట! అంటే వాటి ధరలు తగ్గు తాయని కాదు.

ప్రభుత్వ సబ్సిడీని దశల వారీగా తగ్గిస్తూ రెండు శాతానికి పరిమితం చేస్తారని ! పెట్రోలు ఉత్పత్తుల మీద ఈ సంవత్సరం 68, 481 కోట్లు ఖర్చు పెడితే, రాబోయే సంవత్సరంలో దీన్ని 43, 580 కోట్లకి పరిమితం చేశారు. పెట్రో ఉత్పత్తుల డీ రెగ్యులేషన్ పేరుతో వాటి మీద దాదాపు యాభై శాతానికి పైగా పన్నును విధిస్తూనే, పెరిగే ధరలతో తనకు సంబంధం లేదని చెప్తోంది యూపీయే ప్రభుత్వం. అంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు అనే సాకుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం తథ్యం. డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులు బస్సు చార్జీలనించి రైతుల సాగు ధరల వరకు అన్నీ పెరగడం అనివార్యం.
http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg
వ్యవసాయానికి క్రితం సంవత్సరాని కంటే మూడు వేల కోట్లు ఎక్కువిచ్చామని ప్రణబ్ గొప్పగా చెప్పారు. కానీ ఎరువుల మీద క్రితం సంవత్సరం ఇచ్చిన 67, 198 కోట్ల కంటే ఈసారి పదిశాతానికి పైగా తక్కువ ఖర్చు పెడతామని చెప్పారు. మొన్న ఫిబ్రవరిలో నిర్ధారించిన ఎరువుల సబ్సిడీని పరిగణనలోకి తీసుకొంటే డీఏపీ, యూరియా, ఎంబిసీ మొదలగు వాటిపై 60, 974 కోట్లు మాత్రమే వస్తుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ సబ్సిడీ బకాయిలతో కలిపి దాదాపు 93,000 కోట్లకు చేరింది. దాన్ని ఇప్పుడు అరవైవేల కోట్లకు పరిమితం చేయడమంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలను రైతుకు బదిలీ చెయ్యబోతున్నారన్న మాట. రైతులకి ఎరువుల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి.

చమురు రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకొనే ఎరువుల రేట్లు సహజంగానే పెరిగే అవకాశం ఉంది. యూరియా మూడవ వంతు, మిగతా ఎరువులను భారత్ సింహ భాగం దిగుమతి చేసుకొంటున్న నేపథ్యంలో, ఎరువులు మీద సబ్సిడీలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పడం రైతుకు ఆశనిపాతమే. రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరిగితే సాగు ధర ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే సాగుధరకి, మద్దతు ధరకి ఎక్కడా సాపత్యం కుదరక తల్లడిల్లుతున్న రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరగడం రైతుకే కాదు, వినియోగదారులకీ నష్టమే.
http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg
ఇక రైతుని దొంగ దెబ్బ తీయబోయే అతి తీవ్రమైన సమస్య ఆహార సబ్సిడీ పథకం. 2012 కి ఆహార సబ్సిడీ కోసం 75 వేల కోట్లు చూపించారు. ఈ సారి ఆహార సబ్సిడీ పథకం అమలుచేస్తే కావాల్సింది సంవత్సరానికి 1, 02,000 కోట్లు. ఇప్పుడిచ్చినది కాకుండా మిగిలినది ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఈ ప్రభుత్వమే గొప్పగా నియమించిన స్వామినాథన్ కమిటీ అమలు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. బహుశా ఆ సిఫార్సులు అమలు చెయ్యలేమని చెప్పిన శరద్ పవార్ స్ఫూర్తి గాబోలు. రైతులకి రుణాలు అయిదు లక్షల పాతిక వేల కోట్లకు పెంచామని అన్నారు. http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg
కానీ రైతులందరినీ సంస్థాగత రుణాల పరిధిలోకి తేవాలంటే కనీసం పది లక్షల కోట్ల రుణాలు పంపిణీ కావాలి. పైపెచ్చు ఇప్పుడు ప్రకటించిన రుణాలు ఇచ్చేది ప్రభుత్వం కాదు, బ్యాంకులు. వాటి మీద అదుపు లేనప్పుడు ఎన్ని కోట్లు ప్రకటించినా ప్రస్తుతం వున్న 30 శాతం లబ్ధిదారుల కంటే పెరిగే అవకాశమే లేదు. వ్యవసాయ ఉత్పత్తి రేటు 2.5 శాతానికి పడిపోయిన ఈ సమయంలో రైతులు ఆర్థిక మంత్రి వైపు ఆశగా చూసారు. కొన్ని వ్యవసాయ మిషన్లు ఏర్పాటుచేయడం తప్పిస్తే, పంట దిగుబడి పెంచే చర్యలు పెద్దగా కనబడవు.

స్థూలంగా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కావాల్సిన ఫ్రేం వర్కు బడ్జెట్టులో లేదు. పైపెచ్చు రైతు నడ్డి విరిచే సబ్సిడీల తగ్గింపు వంటి చర్యలు వున్నాయి. ఈసారి ప్రణబ్, మన్మోహన్ ఇద్దరూ భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని చెప్తూ వచ్చారు. మన్మోహన్ అయితే మరో అడుగు ముందుకు వేసి సబ్సిడీ బుల్లెట్లు కొరకాల్సిందే అని పోకిరీ టైపులో సెలవిచ్చారు. కానీ ఆయన ఆర్థిక వేత్తగా మరిచిపోయిన దేమిటంటే, తమ ప్రభుత్వం ఆహార సబ్సిడీ అనే ఫక్తు వోటుబ్యాంకు పథకానికి ముప్పై వేల కోట్లకు పైగా సబ్సిడీ ఇవ్వబోతోందని. దానికి లేని ఇబ్బంది రైతులకి ఎరువుల సబ్సిడీ ఇవ్వడంలో ఎందుకు?
http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg
ఈ రైతు వ్యతిరేక చర్యలన్నీ ఒకే ప్రశ్న వేస్తాయి. దేశంలోని 60 శాతం పైగా ఉన్న రైతులకు ఉపయోగపడని డబ్బు, వృద్ధి ఎవరి కోసం? ప్రభుత్వం తన దగ్గర ఉన్న సంపదని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేర్చకుండా, ఉన్న కాస్త సబ్సిడీలను తీసేస్తూ వాళ్ళ మీద ఇంకా పన్నులేస్తూ ఎవరి కోసం పని చేస్తున్నట్టు? http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg
ఇంతటి హ్రస్వ దృష్టినీ, చిత్తశుద్ధి లేమినీ, విధాన రాహిత్యాన్నీ నిలదీయాల్సిన పని, పోరాటం చేయాల్సిన పనీ రాజకీయ పార్టీలది. సాగు ఖర్చులు మూడొందల శాతం పైగా పెరిగి రైతు చితికి పోతూ ఉంటే ప్రతి పక్షంలోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాలక పక్షాలపై ముప్పేట దాడిచేసి రైతుకు ఏదో మేరకు సాంత్వన చేకూర్చాలి. మేధావులెందరో అంటున్నారు గానీ, నిజానికి వ్యవసాయం సంక్షోభంలో లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీలు ఎవరూ సంక్షోభంలో లేరు.

మిల్లర్లు, దళారులూ కూడా సంక్షోభంలో లేరు. ప్రభుత్వ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మరీ ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు మన రైతన్నలు. ఈ రకంగా ఆహార సంక్షోభమూ లేదు. సంక్షోభంలో ఉన్నది రైతులు. రైతు కూలీలు, కౌలు రైతులు. వీరిని గట్టెక్కించే దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలోనూ దీర్ఘకాలిక పోరాటాలలోనూ కలిసికట్టుగా పనిచేయడం రాజకీయ పక్షాల బాధ్యత.
http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg
చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం, రైతు మిత్రులమని చెప్పుకునే చిట్టి పొట్టి పార్టీలు తమ పోరాటం ప్రధాన ప్రతిపక్షం పైన మళ్లిస్తూ ప్రజాగ్రహాన్ని పలుచన చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చీలుస్తూ తాము (పైపైకి మాత్రమే అయినా సరే) వ్యతిరేకించే ప్రజా వ్యతిరేకులకే మేలు చేస్తూ వస్తున్నారు. పైపై మెరుగుల సింబాలిక్ ఉద్యమాలూ, స్వంత డబ్బాలూ కొంత మానుకుని రైతన్న ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టాలి.

- శ్రీశైల్ రెడ్డి పంజుగుల
తెలుగుదేశం వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యులు
- నీలయపాలెం విజయకుమార్
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు

Saturday, March 3, 2012

భూసార పరీక్షకు ఇదే సమయం

భూ భౌతిక, రసాయనిక లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్ని ఎరువులు వాడినా రైతులు ఆశించిన పంట దిగుబడులు పొందలేకపోతున్నారు. రైతులు భూ స్వభావానికి అనువైన పంటలు పండించాలి. అలాగే పంటకు అనుగుణంగా భూ స్వభావాన్ని, భూసార స్థితిని మార్చుకోవాలి. ఈ రెండు విషయాలపై అవగాహన ఏర్పడాలంటే రైతన్నలు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి. అందుకు ఈ వేసవి కాలమే అనువైన సమయం.

భూసార పరీక్ష అంటే...
రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు భౌతిక, రసాయనిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నమూనాలలోని సస్య పోషక పదార్థాల పరిమాణాన్ని లెక్కగడతారు. ఆ తర్వాత వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వేసుకోవాల్సిన ఎరువుల్ని, వాటి మోతాదుల్ని సిఫార్సు చేస్తారు.

మట్టి నమూనా ఎప్పుడు తీయాలి?
పొలంలో పైరు లేకుండా ఉండే వేసవి కాలంలో మట్టి నమూనా తీయడం మంచిది. పంట వేసే ముందు లేదా పైరు కోసిన తర్వా త నమూనాలు తీయవచ్చు. మాగాణి భూముల్లో నీరు పెట్టకముందే నమూనాలు సేకరించాలి. ఎరువులు వేసిన నెల రోజుల తర్వాత మాత్రమే నమూనాలు తీసుకోవాలి. బిందుసేద్య పద్ధతిని అనుసరించే వారు మట్టి పరీక్షలు చేయించి, వాటికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆ పరికరాలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

ఎలా తీయాలి?
పొలానికి ఒక నమూనా సరిపోతుంది. అయితే పొలం మరీ పెద్దదిగా ఉంటే ప్రతి అయిదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు నీటి పారుదల సౌకర్యం, నేల ఏటవాలు, స్వభావం, పంటల సరళి, యాజమాన్య పద్ధతులు వంటి విషయాల్లో తేడా ఉన్నట్లయితే పొలం చిన్నదైనప్పటికీ వేర్వేరు నమూనాలూ సేకరించాల్సిందే.
నమూనాల సేకరణకు ముందు నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు వంటి వాటిని తీసేయాలి. పలుగు/పార ఉపయోగించి మట్టిని సేకరించవచ్చు. ఇంగ్లీషు ‘వి’ ఆకారంలో 6-8 అంగుళాల లోతులో గొయ్యి తవ్వాలి. అందులో పక్కగా అంగుళం మందాన గొయ్యి అడుగు అంచు వరకూ మట్టిని తీయాలి. దీనిని ఉప నమూనా అంటారు. ఇదే విధంగా 8-10 చోట్ల ఉప నమూనాలు సేకరించాలి. వాటిని ఒక శుభ్రమైన బకెట్‌లో వేసి బాగా కలపాలి. తడిగా ఉన్నట్లయితే మట్టిని నీడలో కాగితం లేదా గుడ్డ పైన ఆరబెట్టాలి. ఆ తర్వాత మట్టిలో గడ్డలు ఉంటే వాటిని పగలగొట్టి బాగా కలపాలి.
అనంతరం మెత్తని మట్టిని ఒక పొరగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా విభజించాలి. మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని, మిగిలిన మట్టిని పారేయాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు చేసి అర కిలో మట్టి నమూనా వచ్చే వరకూ వేరు చేయాలి. ఆ తర్వాత నమూనాను శుభ్రమైన చిన్న గుడ్డ సంచి/ప్లాస్టిక్ కవరులో నింపాలి. రైతు పేరు, గ్రామం, భూమి సర్వే నెంబరు, గతంలో వేసిన పంట వివరాలు, నీరు-ఎరువుల యాజమాన్యం, రాబోయే సీజన్‌లో వేయదలచుకున్న పంట, నమూనా సేకరించిన తేదీ తదితర వివరాలన్నీ ఒక మందపాటి కాగితం పైన రాసి ఆ కవరు లోపల పెట్టాలి. అనంతరం స్వయంగా లేదా పోస్ట్ ద్వారా లేదా మండల వ్యవసాయాధికారి ద్వారా భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.

ఎంత లోతు నుంచి తీయాలి?
పొలంలోని మట్టినంతా పరీక్షించడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని మట్టి నమూనాల్ని సేకరించాలి. ఎంత లోతు నుంచి నమూనాను సేకరించాలనేది మనం పండించే పంట, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పైరు పంటలకు ఆరు అంగుళాలు, పండ్ల తోటలకు అయిదు నుంచి ఆరు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి మట్టిని సేకరించాలి. కారు చౌడు, ఆమ్ల నేలలైతే మూడు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి నమూనాలు తీసుకోవాలి.

ఈ భూముల్లో సేకరించొద్దు
మట్టి నమూనాల్ని అప్పుడే ఎరువులు వేసిన పొలం, పెంట కుప్పలు వేసిన స్థలం, నీటిలో వుునిగి ఉన్న ప్రదేశం నుంచి సేకరించకూడదు. గట్లు, చెట్లు, బావులు, రహదారులకు దగ్గరగా నమూనాల్ని తీసుకోకూడదు.

కేంద్రాలు ఎక్కడున్నాయి?
ప్రతి జిల్లా కేంద్రంలోనూ వ్యవసాయశాఖ వారి భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి రెవెన్యూ డివిజన్‌లోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా నమూనాల్ని పరీక్షించి, సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తారు.

ప్రయోజనాలివే
భూసార పరీక్షల ద్వారా భూమిలోని పోషక పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. మీ పొలంలో ఏ పంట వేయవచ్చో, దాని నుంచి ఎంత దిగుబడి సాధించవచ్చో తెలుసుకోవచ్చు. సాగుకు అనువుగా లేని కారు చౌడు, ఆమ్ల భూముల స్థాయిని, ఆ భూముల్ని సాగు యోగ్యంగా వూర్చడానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని తెలుసుకోవచ్చు. మట్టి పరీక్షలో వెల్లడైన అంశాలను బట్టి భూమికి ఏయే ఎరువులు ఎంత మోతాదులో, ఏ రూపంలో వేయాలో తెలుసుకోవచ్చు. ఎరువుల్ని అవసరమైన మోతాదులోనే వాడతాము కనుక వృథా ఖర్చు తగ్గుతుంది. ఈ పరీక్షల వల్ల నేల రంగు, స్వభావం, ఆమ్ల -క్షారాలు, సేంద్రియ కర్బన పరిమాణాల గురించి తెలుసుకోవచ్చు. రైతు కోరితే సూక్ష్మపోషకాల లభ్యత గురించి కూడా తెలియజేస్తారు.

-బెరైడ్డి సింగారెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్,
అగ్రానమిస్ట్, ఖమ్మం, ఫోన్: 9440797854 

చెరకు చెత్తే కదా అని కాల్చేయొద్దు


  చెరకు తోటలు నరికిన తర్వాత చాలా మంది రైతులు చెత్తను కాల్చేస్తుంటారు. అయితే దీనివల్ల వారికి ఎంతో నష్టం జరుగుతోంది. ఎందుకంటే ఈ చెత్త చెరకు పైరు సాగులో పలు రకాలుగా ఉపయోగపడుతుంది. చెరకు చెత్తను కాల్చేయడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలనే కాకుండా భూసారాన్ని, భూ భౌతిక స్వభావాన్ని పెంచే సేంద్రియ పదార్థాన్ని కూడా నష్టపోతున్నాము.కాబట్టి చెరకు చెత్తను పైరులో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై రైతులు అవగాహన కలిగి ఉండడం అవసరం.చెరకు చెత్తలో నార పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కుళ్లబెడితే చివికిన సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది పైరుకు పోషక పదార్థాల్ని అందిస్తుంది. చెరకు చెత్తను మొక్క, పిలక తోటల్లో వేసుకోవచ్చు.
ఎలా కుళ్లబెట్టాలి?

చెరకు చెత్తను కుళ్లబెట్టే శిలీంద్రాలు ఉంటాయి. రెండున్నర ఎకరాల తోటకు మూడు కిలోల శిలీంద్రాలు అవసరమవుతాయి. బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఫిల్టరు మడ్డికి ఈ శిలీంద్ర సముదాయాన్ని కలపాలి. దానిపై పలచగా నీరు చల్లి నీడలో ఉంచాలి. దానిపై గోనె సంచి లేదా వరి గడ్డి కప్పాలి. ఆ తర్వాత శిలీంద్రం వృద్ధి చెందడానికి వారం రోజుల సమయం పడుతుంది. అనంతరం దానిని సాళ్ల మధ్య పరచిన చెరకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఆ సమయంలో కొద్దిపాటి తేమ ఉండాలి.

ఎలా వాడాలి?

పైన తెలిపిన విధంగా అభివృద్ధి చేసిన శిలీంద్ర సముదాయాన్ని మొక్క తోటల్లోనూ, కార్శి తోటల్లోనూ వాడుకోవచ్చు. మొక్క తోటల్లో అయితే ముచ్చెలు నాటిన మూడో రోజున చెరకు చెత్తను పొలంలో పలచగా పరవాలి. ఇందుకోసం ఎకరానికి సువూరు 1.25 టన్నుల చెత్త అవసరమవుతుంది. వర్షాకాలంలో కాలువలు ఎగదోసే సమయంలో 1.25 కిలోల శిలీంద్రం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్‌ను కలిపి ఆ మిశ్రవూన్ని ఎకరం విస్తీర్ణంలో పరచిన చెరకు చెత్తపై చల్లి మట్టితో కప్పాలి. అప్పుడు ఆ చెత్త మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది.

ఇక కార్శి (పిలక) పంట తీసుకునే వారు మొక్క తోటలు నరికిన తర్వాత చెరకు చెత్తను (ఎకరానికి 1.25 టన్నులు) సాళ్లలో వేసి, దానిపై ఎకరానికి 10 కిలోల చొప్పున సూపర్ ఫాస్ఫేట్, ఎనిమిది కిలోల యూరియా, 1.25 కిలోల శిలీంద్రం కలిపి చేనంతా కలిసేలా చల్లాలి.కార్శి మోళ్లకు ఆనుకొని లోతుగా నాగలితో దున్నినట్లయితే మొదళ్ల వద్ద ఉన్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడు కొత్తగా వచ్చే పిలకలు బాగా మొలుస్తాయి. నేలలో వేసిన చెరకు చెత్త కుళ్లి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. మిగిలిపోయిన చెరకు చెత్తను సాళ్ల మధ్య పలచగా పరచుకోవచ్చు.


ఉపయోగాలివే

చెరకు చెత్తను సాళ్లలో పరిచి, కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకుంటే పలు ప్రయోజనాలు చేకూరుతాయి. సాళ్ల మధ్యలో చెరకు చెత్తను కప్పితే తేమ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. వర్షాధారపు చెరకు సాగుకు ఇది ఎంతో ఉపయోగకరం.

సాళ్లలో చెత్తను పరిస్తే నాటిన/కార్శి చేసిన తొలి దశలో కలుపు మొక్కలు మొలవకుండా నివారించవచ్చు. అంతేకాదు... పీక పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. ఎందుకంటే భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.చెరకు చెత్తను కప్పడం వల్ల భూమిలో తేమ చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. వేసవిలో తోటకు సరిగా నీరు పెట్టలేకపోయినప్పటికీ భూమిలో నిల్వ ఉన్న తేమ వల్ల పైరు వడలిపోదు. నీటి తడులు తక్కువగా ఇచ్చినా సరిపోతుంది. చెరకు చెత్తను కాలిస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని సాళ్ల మధ్య పరవడం ద్వారా ఆ కాలుష్యాన్ని నివారించవచ్చు. పాల చౌడు, చౌడు భూముల్లో చెరకు చెత్తను సాళ్లలో పరిచి తేమను కాపాడి, భూమిలోని లవణాల్ని వేర్ల దగ్గరికి రాకుండా చేయడం వల్ల పైరు బలంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తుంది.


చెత్తను నేరుగా...
చెరకు చెత్తను నేరుగా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. టన్ను చెరకు చెత్తను కంపోస్ట్‌గా మార్చాలంటే మీటరు లోతు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల పొడవుతో గొయ్యి తీయాలి. అందులో 15 సెంటీమీటర్ల మందాన చెరకు చెత్త పరిచి, తేమగా ఉండేందుకు నీరు చిలకరించాలి.

దాని పైన పేడ నీటిని చల్లాలి. మళ్లీ దాని పైన కిలో శిలీంద్ర సముదాయం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లాలి. ఆ తర్వాత ఒకటి రెండు సెంటీమీటర్ల మందాన మట్టి కప్పాలి. నాలుగు నెలల్లో చెరకు చెత్త కుళ్లి కంపోస్ట్‌గా మారుతుంది. దానిని నేరుగా పొలంలో వేసుకోవచ్చు. ఇలా పొరలు పొరలుగా చెరకు చెత్తను గోతిలో వేస్తూ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు.


ఈ పోషకాలు లభిస్తాయి

చెరకు చెత్తలో 0.41 శాతం నత్రజని, 0.16 శాతం భాస్వరం, 0.72 శాతం పొటాష్‌తో పాటు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 0.2 నుండి 0.9 శాతం వరకూ ఉంటాయి.
- వలేటి గోపీచంద్
ఎమ్మెస్సీ అగ్రికల్చర్
ఆకాశవాణి, హైదరాబాద్

వేసవి పంటలతో మంచి ఆదాయం!


వేసవి వచ్చేసింది. ఇప్పటికే కూరగాయ ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో వీచే పొడి గాలులు, పెరిగే ఉష్ణోగ్రతలు, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల దిగుబడులు తగ్గి రాబోయే కాలంలో వీ టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న రైతులు ఈ సీజ న్‌లో కూరగాయ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చునని నల్లగొండ ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి సూచిస్తున్నారు. ఆ వివరాలు...

ఈ పంటలు వేసుకోవచ్చు

వేసవిలో తీగ జాతి కూరగాయలైన కాకర, బీర, బెండ, ఆనప, దోస, దొండ, పొట్ల, దుం ప జాతి కూరగాయలైన చేమ, కంద, ముల్లంగితో పాటు టమాటా, ఆకుకూర పంటల్ని వేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో పండించే వంగ, గోరుచిక్కుడు, బెండ, మిరప వంటి పంటల్ని కూడా సాగు చేసుకోవచ్చు. వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారుల సూచనల మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల్ని ఎంపిక చేసుకోవాలి.

ఇలా వేసుకోవాలి

వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉం టాయి. ఎండ వేడికి నారు వడలి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొక్కల్ని సాధ్యమైనంత వరకూ సాయంకాలం వేళ నాటుకోవాలి. విత్తనాలు నేరుగా విత్తేటట్లయితే విత్తిన వెంటనే నీరు కట్టి, ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకూ మూడు నాలుగు రోజులకు ఒకసారి తడి అందించాలి. వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. కనుక విత్తనాల్ని దగ్గర దగ్గరగా వేసుకోవాలి.

టమాటా వేసే వారు వరుసలు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల చొప్పున దూరాన్ని పాటించాలి. ఎకరానికి 250 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. వంగ వేసే వారు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం (ఎకరానికి 350 గ్రాముల విత్తనాలు) ఉండేలా నాటాలి. బెండ వేయాలనుకుంటే 45-20 సెంటీమీటర్లు (ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు), పచ్చి మిరపకు 45-45 సెంటీమీటర్లు (600 గ్రాములు), గోరుచిక్కుడుకు 50-20 సెంటీమీటర్లు (నాలుగు కిలోలు), బీర, దోసకు 100-50 సెంటీమీటర్లు (బీర అయితే రెండు కిలోలు, దోస అయితే 1.5 కిలోలు), కాకరకు 150-50 సెంటీమీటర్ల (రెండు కిలోల విత్తనాలు) దూరాన్ని పాటించాలి. ఆనప వేసే వారు వరుసల మధ్య 300 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 100 సెంటీమీటర్ల దూరం ఉండేలా (ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనాలు) మొక్కలు నాటుకోవాలి.


బిందుసేద్యం-మల్చింగ్ మేలు

వేసవి కూరగాయ పంటలకు బిందుసేద్యం ద్వారా నీరందిస్తే మంచిది. దీనివల్ల ప్రతి రోజూ అవసరమైన మేరకు నీటిని అందించవచ్చు. మామూలు పద్ధతిలో అయితే అయిదు నుండి ఏడు రోజుల వ్యవధి ఇస్తూ నీటి తడులు ఇవ్వాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కూరగాయ పంటల సాళ్లలో ప్లాస్టిక్ షీట్లు కప్పాలి. దీనివల్ల భూమి వేడెక్కదు. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉండదు. డ్రిప్ లాటరల్ పైపుల్ని షీట్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. టమాటా పంటను షేడ్‌నెట్ కింద పండించడం మంచిది.

ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు:
ఫర్టిగేషన్ (నీటిని అందించే పైపుల ద్వారా) పద్ధతిలో ఎరువుల్ని అందిస్తే మొక్కలు క్రమ పద్ధతిలో, ఏపుగా పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో అయితే మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేసినప్పుడు తగినంత నీటిని అందించాల్సి ఉంటుంది. లేకుంటే మొక్కలు మాడిపోతాయి. స్థానిక వ్యవసాయాధికారుల సలహా మేరకు ఎరువులు వేసుకోవాలి.

పూత-పిందె రాలకుండా
...
వేసవి కూరగాయ పంటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే వ్యవసాయాధికారుల సూచనల మేరకు హార్మోన్ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి (ఎకరానికి 200-250 లీటర్ల ద్రావణం) పిచికారీ చేస్తే కాయలు పగలకుండా ఉంటాయి. ఆకులు పల్లాకు రంగులోకి మారితే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

ఉద్యానవన శాఖ సబ్సిడీ

ఉద్యానవన శాఖ వేసవిలో 50 శాతం సబ్సిడీపై రైతు కోరుకున్న బ్రాండెడ్ కంపెనీల విత్తనాల్ని పంపిణీ చేస్తోంది. అలాగే మల్చింగ్‌కు వాడే ప్లాస్టిక్ షీట్ల కొనుగోలుకు కూడా యాభై శాతం సబ్సిడీతో ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందిస్తోంది. తీగ జాతి కూరగాయల సాగుకు ఎకరం భూమిలో పందిళ్లు వేసుకొంటే 50 శాతం సబ్సిడీ కింద 60 వేల రూపాయలు అందిస్తోంది.

చీడపీడల నివారణ కోసం...

వేసవిలో కూరగాయ పంటల్ని వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. పంట కోత దశలో ఉన్నప్పుడు పురుగు మందుల్ని విచక్షణారహితంగా వాడకూడ దు. సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలి. బెండలో ఎర్రనల్లి నివారణకు లీట రు నీటికి అయిదు మిల్లీలీటర్ల చొప్పున డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. వంగ, బెండ పంటల్లో పచ్చదోమ, తెల్లదోమ నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మెటాసిస్టాక్/డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సొర, బీర, దొండ, దోస జాతి కూరగాయల్లో కాయ తొలుచు పురుగుల నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బరిల్ + రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

Gouthamaraju as WUA