పాడి పంటలు

Saturday, March 3, 2012

భూసార పరీక్షకు ఇదే సమయం

భూ భౌతిక, రసాయనిక లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్ని ఎరువులు వాడినా రైతులు ఆశించిన పంట దిగుబడులు పొందలేకపోతున్నారు. రైతులు భూ స్వభావానికి అనువైన పంటలు పండించాలి. అలాగే పంటకు అనుగుణంగా భూ స్వభావాన్ని, భూసార స్థితిని మార్చుకోవాలి. ఈ రెండు విషయాలపై అవగాహన ఏర్పడాలంటే రైతన్నలు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి. అందుకు ఈ వేసవి కాలమే అనువైన సమయం.

భూసార పరీక్ష అంటే...
రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు భౌతిక, రసాయనిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నమూనాలలోని సస్య పోషక పదార్థాల పరిమాణాన్ని లెక్కగడతారు. ఆ తర్వాత వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వేసుకోవాల్సిన ఎరువుల్ని, వాటి మోతాదుల్ని సిఫార్సు చేస్తారు.

మట్టి నమూనా ఎప్పుడు తీయాలి?
పొలంలో పైరు లేకుండా ఉండే వేసవి కాలంలో మట్టి నమూనా తీయడం మంచిది. పంట వేసే ముందు లేదా పైరు కోసిన తర్వా త నమూనాలు తీయవచ్చు. మాగాణి భూముల్లో నీరు పెట్టకముందే నమూనాలు సేకరించాలి. ఎరువులు వేసిన నెల రోజుల తర్వాత మాత్రమే నమూనాలు తీసుకోవాలి. బిందుసేద్య పద్ధతిని అనుసరించే వారు మట్టి పరీక్షలు చేయించి, వాటికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆ పరికరాలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

ఎలా తీయాలి?
పొలానికి ఒక నమూనా సరిపోతుంది. అయితే పొలం మరీ పెద్దదిగా ఉంటే ప్రతి అయిదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు నీటి పారుదల సౌకర్యం, నేల ఏటవాలు, స్వభావం, పంటల సరళి, యాజమాన్య పద్ధతులు వంటి విషయాల్లో తేడా ఉన్నట్లయితే పొలం చిన్నదైనప్పటికీ వేర్వేరు నమూనాలూ సేకరించాల్సిందే.
నమూనాల సేకరణకు ముందు నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు వంటి వాటిని తీసేయాలి. పలుగు/పార ఉపయోగించి మట్టిని సేకరించవచ్చు. ఇంగ్లీషు ‘వి’ ఆకారంలో 6-8 అంగుళాల లోతులో గొయ్యి తవ్వాలి. అందులో పక్కగా అంగుళం మందాన గొయ్యి అడుగు అంచు వరకూ మట్టిని తీయాలి. దీనిని ఉప నమూనా అంటారు. ఇదే విధంగా 8-10 చోట్ల ఉప నమూనాలు సేకరించాలి. వాటిని ఒక శుభ్రమైన బకెట్‌లో వేసి బాగా కలపాలి. తడిగా ఉన్నట్లయితే మట్టిని నీడలో కాగితం లేదా గుడ్డ పైన ఆరబెట్టాలి. ఆ తర్వాత మట్టిలో గడ్డలు ఉంటే వాటిని పగలగొట్టి బాగా కలపాలి.
అనంతరం మెత్తని మట్టిని ఒక పొరగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా విభజించాలి. మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని, మిగిలిన మట్టిని పారేయాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు చేసి అర కిలో మట్టి నమూనా వచ్చే వరకూ వేరు చేయాలి. ఆ తర్వాత నమూనాను శుభ్రమైన చిన్న గుడ్డ సంచి/ప్లాస్టిక్ కవరులో నింపాలి. రైతు పేరు, గ్రామం, భూమి సర్వే నెంబరు, గతంలో వేసిన పంట వివరాలు, నీరు-ఎరువుల యాజమాన్యం, రాబోయే సీజన్‌లో వేయదలచుకున్న పంట, నమూనా సేకరించిన తేదీ తదితర వివరాలన్నీ ఒక మందపాటి కాగితం పైన రాసి ఆ కవరు లోపల పెట్టాలి. అనంతరం స్వయంగా లేదా పోస్ట్ ద్వారా లేదా మండల వ్యవసాయాధికారి ద్వారా భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.

ఎంత లోతు నుంచి తీయాలి?
పొలంలోని మట్టినంతా పరీక్షించడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని మట్టి నమూనాల్ని సేకరించాలి. ఎంత లోతు నుంచి నమూనాను సేకరించాలనేది మనం పండించే పంట, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పైరు పంటలకు ఆరు అంగుళాలు, పండ్ల తోటలకు అయిదు నుంచి ఆరు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి మట్టిని సేకరించాలి. కారు చౌడు, ఆమ్ల నేలలైతే మూడు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి నమూనాలు తీసుకోవాలి.

ఈ భూముల్లో సేకరించొద్దు
మట్టి నమూనాల్ని అప్పుడే ఎరువులు వేసిన పొలం, పెంట కుప్పలు వేసిన స్థలం, నీటిలో వుునిగి ఉన్న ప్రదేశం నుంచి సేకరించకూడదు. గట్లు, చెట్లు, బావులు, రహదారులకు దగ్గరగా నమూనాల్ని తీసుకోకూడదు.

కేంద్రాలు ఎక్కడున్నాయి?
ప్రతి జిల్లా కేంద్రంలోనూ వ్యవసాయశాఖ వారి భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి రెవెన్యూ డివిజన్‌లోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా నమూనాల్ని పరీక్షించి, సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తారు.

ప్రయోజనాలివే
భూసార పరీక్షల ద్వారా భూమిలోని పోషక పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. మీ పొలంలో ఏ పంట వేయవచ్చో, దాని నుంచి ఎంత దిగుబడి సాధించవచ్చో తెలుసుకోవచ్చు. సాగుకు అనువుగా లేని కారు చౌడు, ఆమ్ల భూముల స్థాయిని, ఆ భూముల్ని సాగు యోగ్యంగా వూర్చడానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని తెలుసుకోవచ్చు. మట్టి పరీక్షలో వెల్లడైన అంశాలను బట్టి భూమికి ఏయే ఎరువులు ఎంత మోతాదులో, ఏ రూపంలో వేయాలో తెలుసుకోవచ్చు. ఎరువుల్ని అవసరమైన మోతాదులోనే వాడతాము కనుక వృథా ఖర్చు తగ్గుతుంది. ఈ పరీక్షల వల్ల నేల రంగు, స్వభావం, ఆమ్ల -క్షారాలు, సేంద్రియ కర్బన పరిమాణాల గురించి తెలుసుకోవచ్చు. రైతు కోరితే సూక్ష్మపోషకాల లభ్యత గురించి కూడా తెలియజేస్తారు.

-బెరైడ్డి సింగారెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్,
అగ్రానమిస్ట్, ఖమ్మం, ఫోన్: 9440797854 

No comments:

Gouthamaraju as WUA