ప్రపంచంలోనే ఖరీదైన చేప 'టూనా'. మన దగ్గర దాన్ని 'తూర' అని పిలుస్తారు. టూనాలను చూస్తే జపనీయులు లొట్టలేస్తారు. అచ్చం వంజరంలా వుంటుంది. కొందరికి అదేమిటో కూడా తెలియదు కాబట్టి సింపుల్‌గా అద్భుతమైన చేప అని చెప్పాల్సి ఉంటుంది. దాని మాంసం మహాద్భుతం. అయితే విదేశాల్లోనే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ. మన టూనాలు జపాన్, అమెరికాలకే ఎగుమతి అవుతాయి. దీనివల్ల భారతదేశానికి ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ఇంత విలువైన టూనా ఎక్కడంటే అక్కడ దొరకదు. విశాఖపట్నం సముద్రతీరంలోనే ఎక్కువగా దొరుకుతోంది.
ఒక్కొక్కసారి అండమాన్, కేరళ, తమిళనాడుల్లోని కొన్నిచోట్ల మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే అంటే- నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది సముద్రంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆ సమయంలోనే జాలర్లు వాటిని వేటాడి పట్టుకుని సొమ్ము చేసుకుంటారు. టూనా నీటిలో ఈదే తీరు, వాటి సంచారం, వేటాడే పద్ధతి, మార్కెట్‌కు చేరవేసే ప్రక్రియ, విక్రయించే పద్ధతి అన్నీ ఆసక్తి కలిగిస్తాయి. జపాన్‌లో గత నెల ఐదవ తేదీన సుజుకీ అనే చేపల సంతలో టూనాలను వేలం వేస్తే- బ్లూఫిన్ అనే ఒక చేప 7.36 లక్షల డాలర్లు పలికింది. మన కరెన్సీలో చెప్పాలంటే...రూ.3.58 కోట్లు. ఖరీదులో టూనాతో సరితూగే చేప మరొకటి లేదు.
ఇది కొత్త జీవరాశి ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇదివరకు ఈ చేపను ప్రత్యేకంగా ఎవరూ వేటాడలేదు. అందుకే వెలుగులోకి రాలేదు. మన సముద్ర జలాల్లో దొరికే టూనాను విదేశీయులే ముందు పసిగట్టారు. వేటాడేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొన్నారు. సముద్రంలో చేపను పట్టి, అటు నుంచి అటే వాళ్ల దేశాలకు తీసుకెళ్లేవారు. దాదాపుగా ఇరవై ఏళ్లపాటు ఇలాగే జరిగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. విదేశీ ట్రాలర్లు వచ్చి మన చేపలను పట్టుకెళుతున్నారని కనిపెట్టిన తర్వాత భారత జాలర్లు దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అవి 'తూరలు' అని తేలింది. ఆ చేపల్ని విదేశీయులు 'టూనా' అని పిలుస్తారని, వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఉందని మనవాళ్లకు అర్థమైంది. కాని టూనా చేపల్ని ఎలా పట్టుకోవాలో తెలియలేదు. ఎందుకంటే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం.
అన్వేషణలో తగిలిన టూనా..
ఇదివరకు పాత పద్ధతులతోనే చేపల్ని పట్టేవారు. కొన్నేళ్ల కిందటి నుంచి సాంకేతిక పద్ధతుల్ని జోడించారు. అందులో 'ట్రాలింగ్' ఒకటి. ట్రాలర్‌కు ముందు రెండు ఆర్టర్ బోట్లు వుంటాయి. అవి సముద్రంలోపలికి వలలను వేసుకుంటూ ముందుకు వెళతాయి. ఆ వలలకు పిల్లలతో సహా రొయ్యలు, చేపలు చిక్కుతాయి. అయితే దీని వల్ల చేపలు బాగానే దొరుకుతున్నా మత్స్య సంపద మొత్తం నాశనమైపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆ విషయాన్నే మత్స్యకారులకు చెప్పారు. మరోవైపు నేలపై రొయ్యలసాగు విస్తరించింది. ఈ రంగం కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో.. మత్స్యకార సంఘం నాయకుడు వైజీకే మూర్తి సముద్రపు చేపలపై ప్రత్యేక అధ్యయనం చేశారు. విశాఖ సముద్ర తీరంలో టూనాలు పుష్కలంగా వున్నాయని, వాటికి ఎక్కడలేని డిమాండ్ ఉందని తెలుసుకున్నారు.
అప్పటికే తైవాన్ జాలర్లు టూనాలను పట్టి సొమ్ము చేసుకుంటున్నారు. టూనాల జాడ కనిపెట్టడం, పట్టుకోవడం, అమ్ముకోవడంలో మెళకువలను అధ్యయనం చేసేందుకు పన్నెండు దేశాలను చుట్టొచ్చారు మూర్తి. సాధారణ ట్రాలర్లతో వేటాడితే భారీ సంఖ్యలో టూనాలను పట్టుకోవడం కష్టమని తెలుసుకున్నారు. టూనాల వేటకు ప్రత్యేక 'లాంగ్‌లైనర్లు' తప్పనిసరని గుర్తించారు. విశాఖపట్నం జాలర్లతో ఆ విషయాన్నే చెప్పారు. జాలర్లకు శిక్షణ ఇప్పించేందుకు శ్రీలంక నుంచి 40 మంది నిపుణులను తీసుకొచ్చారు. అప్పట్లో కేంద్ర వాణిజ్య శాఖా మంత్రిగా వున్న జైరామ్ రమేష్ విషయం అర్థం చేసుకొని సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అలా మొదలైంది విశాఖలో టూనాల వేట.
ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది?
టూనా చేపలది చాలా చిత్రమైన జీవనశైలి. సాధారణ చేపల్లో వుండే 'ఫ్లోటింగ్ బ్లాడర్' దీనికి వుండదు. బ్లాడర్ లేకపోవడం వల్ల నీటిలో తేలేందుకు నిత్యం ఈదుతూ ఉండాల్సొస్తుంది. పొరపాటున ఈత ఆపిందనుకో ఆక్సిజన్ అందక చనిపోతుంది. అందుకే ఈ చేపకు విశ్రాంతి అనేదే ఉండదు. టూనా గంటకు 70కి.మీ. వేగంతో కదులుతుంది. ఒక మాటలో చెప్పాలంటే టూనా వలస జీవి. నిత్యం ఈదడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా వుంటుంది. వేడిని తగ్గించుకోవడానికి చల్లని ప్రాంతాల్లో సంచరిస్తుంది. సుమారు 26 డిగ్రీలు, అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత వున్న నీటిలోనే ఎక్కువగా సంచరిస్తుంది. సముద్రంలో గ్రీన్ ఆల్గేలు అధికంగా వుంటాయి. వాటిలో ఉన్న క్లోరోఫిల్ తినడానికి చిన్నిచిన్న చేపలు వాటి చుట్టూ చేరుతాయి. ఆ చిన్ని చేపలను భోంచేయడానికి టూనా ఆ ప్రదేశానికి వెళుతుంది. అంటే- గ్రీన్ ఆల్గేలు, చిన్నచేపలు, చల్లటి ప్రాంతం.. ఇవన్నీ ఎక్కడుంటే టూనా అక్కడ ఉంటుందని జాలర్లు తెలుసుకున్నారు. డాల్ఫిన్ చేపల్లా టూనా కూడా తెలివైన చేప. అది డాల్ఫిన్లతో సన్నిహితంగా మెలుగుతుంది. అందుకే టూనాలను పట్టుకునేందుకు డాల్ఫిన్లు కూడా ఒక ఆధారమయ్యాయి.
వేట కూడా సపరేటు...
ఏ చేపల్ని వేటాడాలన్నా.. వలలు తప్పనిసరి. అయితే టూనాలకు మామూలు వలలు పనికిరావు. రెండు నుంచి 80కిలోల దాకా బరువుండి, గంటకు 70కి.మీ. వేగంతో కదిలే టూనాల ధాటికి మామూలు వలలు తట్టుకోలేవు. ఒకవేళ వలకు చిక్కినా దాన్ని చించుకుని వెళ్లిపోతాయవి. అందుకని టూనాలను 'హుక్'లతో గేలం వేసి పట్టుకుంటారు. తైవాన్‌లో అయితే టూనాల వేటకు మరింత ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'లాంగ్ లైనర్' అనే ట్రాలర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రాలర్ ఖరీదు కోటి రూపాయలు.
టూనాలపై అధ్యయనం చేసిన వైజీకే మూర్తి ఈ లాంగ్‌లైనర్ల గురించి తెలుసుకున్నాక, వాటిని కొనేందుకు ప్రభుత్వ సాయం కోరారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) దానికి స్పందించి ముందుకొచ్చింది. అయితే కొత్తవి కొనడం కష్టం కాబట్టి అప్పటికే చేపలవేటకు వినియోగిస్తున్న ట్రాలర్లను లాంగ్‌లైనర్లుగా మార్చుకుంటే సాయం చేస్తామంది ఆ సంస్థ. ఆ మేరకు 20 మీటర్ల కంటే తక్కువ పొడవున్న ట్రాలర్ల కన్వర్షన్‌కు రూ.7.5 లక్షలు, అంతకంటే ఎక్కువ పొడవున్న ట్రాలర్లకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. ఇలా మొత్తం 20 ట్రాలర్లు జాలర్లకు అందాయి. వాటిని ఎంపెడా అధ్యక్షుడు మోహన్‌కుమార్ నేతృత్వంలో విశాఖపట్నంలో ప్రారంభించారు. దీంతో టూనాల వేట సులువైంది.
లాంగ్‌లైనర్ అంటే..?
టూనాల వేటకు ఉపయోగించే.. లాంగ్‌లైనర్‌కు అర్థం ఆ పేరులోనే వుంది. పొడవుగా, లైనుగా ఒక తాడును సముద్రంలోకి వేసి, వేలాడదీసిన ప్రత్యేకమైన హుక్కులను వాటికి అమరుస్తారు. పొడవాటి నైలాన్ తాడుకు పది మీటర్లకు ఒకటి చొప్పున ఈ హుక్కులుంటాయి. సముద్రంలో ఈ తాడును 200కి.మీ. పొడవు వరకు విడిచిపెడతారు. హుక్‌లు వంకీలు తిరిగి వుండడం వల్ల అది కూడా ఒక రకమైన సముద్రజీవి అనుకొని.. వాటిని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి టూనాలు. అలా నోటితో కొరకగానే హుక్కుకు చిక్కుకుపోతాయి. దాన్నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. కానీ తప్పించుకోలేవు. ఈ నైలాన్‌తాడును కొందరు జాలర్లు చేతితో ఉపయోగిస్తే, మరికొందరు హైడ్రాలిక్ సిస్టమ్‌తో వాడతారు. ఒక లాంగ్‌లైనర్‌కు పది అంతకంటే ఎక్కువ టూనాలు దొరికినప్పుడు ఆ నైలాన్ తాడును పట్టుకొని లాగడం చాలా కష్టం. ఒక్కో టూనా 20 కిలోలు తూగినా.. ఇరవై టూనాలు కలిస్తే 400కిలోల బరువుంటుంది. అంత బరువును లాగడం ఒకరిద్దరి వల్ల అయ్యే పనికాదు. అందుకని హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగిస్తారు.
రవాణా ప్రత్యేకం...
టూనాను పట్టుకోవడం ఎంత కష్టమో.. మార్కెట్‌కు చేరవేయడం అంతే కష్టం. చేప చర్మం గీసుకుపోకుండా, తాజాదనం తగ్గకుండా వుండే టూనాలకే అధిక ధర పలుకుతుంది. మొదటి రకం టూనాలను 'సష్మీ' గ్రేడ్ అంటారు. ఆ తరువాత రకాన్ని బి-గ్రేడ్‌గా వ్యహరిస్తారు. విదేశీ జాలర్లు టూనాలను పట్టుకున్న వెంటనే ఆ సమాచారాన్ని తమ కొనుగోలుదార్లకు తెలియజేసి, సముద్రం పైకే హెలికాప్టర్లను రప్పించుకుంటారు. నడిసముద్రంలోనే వాటిని జాగ్రత్తగా హెలికాప్టర్‌లోకి ఎక్కించి మార్కెట్‌కు తరలిస్తారు. మన దగ్గర ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు కాబట్టి మనకు దొరికిన వాటిని మిగిలిన చేపలతో పాటు కలిపేసి హార్బర్‌కు తరలించి.. బి- గ్రేడు సరకుగా అమ్ముతారు. ఇలా అమ్మితే జాలర్లకు పెద్దగా గిట్టుబాటు అవ్వదు. తాజా చేపకున్న రేటు ఆలస్యమయ్యేకొద్దీ తగ్గుతుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకునే టూనాలను జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు మన జాలర్లు.
ఎలాగంటే...?
సముద్రంలో టూనాను పట్టుకుంటూనే- 'స్టన్నర్' అనే పరికరంతో ఎల్రక్టిక్ షాక్ ఇస్తారు. దాంతో అది అచేతనంగా మారిపోతుంది. అప్పుడు బోటులోకి చేర్చి వెంట వెంటనే భద్రపరిచే చర్యలు చేపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌తో ఆపరేషన్‌లానే ఐసింగ్ చేస్తారు. ముందుగా తలపైన వుండే సాఫ్ట్‌స్పాట్‌లో రబ్బరు సుత్తితో ఒక దెబ్బ వేస్తారు. అక్కడ రంధ్రం వేసి లోపల వున్న మెదడు మొత్తం తీసేస్తారు. ఆ తరువాత మోనోఫిలమెంట్ లైన్ గాని, స్టీల్‌వైరు గాని స్పైన్‌లోకి పంపిస్తారు. అప్పుడు ఆ చేప న్యూరల్ డెత్‌కు గురవుతుంది. మొప్పల దగ్గరుండే యానస్ నుంచి పేగులు తీసేస్తారు. రక్తాన్ని కూడా లాగేస్తారు. ఎక్కడా చిన్న రక్తపుమరక లేకుండా చేపను శుభ్రపరుస్తారు.
ఇలా చేయడాన్ని గ్రిల్లింగ్ అండ్ గట్టింగ్ అంటారు. చేప శరీరంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు వున్నాయో వాటన్నిట్నీ ఐస్‌పౌడర్‌తో నింపేస్తారు. ప్రత్యేకంగా తయారుచేసిన 'స్లర్' అనే పెద్దతొట్టెలో ఐదు నుంచి ఏడు గంటలపాటు వుంచుతారు. కొద్దిసేపయ్యాక వేరే బాక్సుల్లో ఐసు లేయర్ల మధ్య భద్రపరుస్తారు. ఆ బాక్సుల్ని తీరానికి చేర్చి కొనుగోలుదార్లకు విక్రయిస్తారు. టూనా ఎంత భద్రంగా, తాజాగా వుంటే అంత మంచి ధర లభిస్తుంది. ఏమాత్రం డామేజీ వున్నా రేటు తగ్గిపోతుంది. ఈ పనులన్నీ లాంగ్ లైనర్లతో మాత్రమే చేయడానికి వీలవుతుంది. సాధారణ ట్రాలర్లు, బోట్లలో వెళ్లి టూనాలను వేటాడే జాలర్లకు ఇవన్నీ సాధ్యం కావు.
ఇద్దరే వ్యాపారులు..
విశాఖపట్నం కేంద్రంగా ఇద్దరంటే ఇద్దరే వ్యాపారులు వున్నారు. వారు చెప్పిందే వేదం. టూనాలు హార్బర్‌కు చేరగానే వారి వద్దకు చేరుస్తారు జాలర్లు. వ్యాపారుల దగ్గర ప్రత్యేక నైపుణ్యం కలిగిన గ్రేడర్లు వచ్చి టూనాలను వేరు చేస్తారు. ఇరవై కిలోల కంటే తక్కువ బరువున్నవన్నీ ఒక దగ్గర, అంతకంటే ఎక్కువ బరువున్నవి మరొక చోట చేరుస్తారు. ఆ తరువాత ఒక్కో చేపను పరిశీలిస్తారు. బియ్యం నాణ్యతను పరిశీలించడానికి చిన్నపాటి పరికరాన్ని బస్తాలోకి గుచ్చి ఎలా శాంపిల్ తీస్తారో... ఇక్కడ గ్రేడర్లు కూడా అలాగే చిన్న పరికరాన్ని టూనా శరీరంలోకి గుచ్చి చిన్న మాంసపుముక్కను బయటకు తీస్తారు. దాని రుచి, రంగు, నూనె పరిమాణం, చేప తాజాదనం నిర్ధారించి.. ధరను ఫిక్స్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చేపకు ఎందుకింత డిమాండ్ ఉందంటే వేటిలోనూ లేనంత స్థాయిలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి కనుక.
ధరలో దగా
ప్రస్తుతం విశాఖలో కిలో టూనా ధర రూ.130. అదే చేపను అమెరికా లేదా జపాన్ మార్కెట్లకు తీసుకెళితే రూ.400 వరకు వస్తుంది. కానీ జాలర్లకు సౌకర్యాలు అందుబాటులో లేవు. ఎంత వేగంగా అమ్ముకుంటే అంత ధర వస్తుందని తెలుసు కాబట్టి, త్వరగా విక్రయించాలనే చూస్తారు. మంచిరేటు వచ్చేవరకు ఎదురు చూడడానికి కుదరదు. కాలం గడిచే కొద్దీ నాణ్యత తగ్గిపోతుంది. ఇక్కడే దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువ వేట వచ్చిందని, రేటు పడిపోయిందని అబద్దాలు చెప్పి స్థానిక మత్స్యకారుల నుంచి తక్కువ ధరకు కొని లాభపడుతున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే.. టూనాలను ఎగుమతి చేసేవరకు నిల్వ చేసుకోవడానికి చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి.
దీని కోసం భారతీయ మత్స్యపరిశ్రమల సమాఖ్య తరఫున ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. విశాఖపట్నంలో వున్న హార్బర్‌లోనే కొంత స్థలం కేటాయిస్తే.. అక్కడ చిల్లింగ్ సెంటర్ పెట్టుకుంటామని జాలర్లు కోరుతున్నారు. అయితే ఏకంగా హార్బర్‌నే ఇంకో చోటుకు(భీమిలి సమీపాన మూలకుద్దు) తరలించే యోచన వుండడంతో విశాఖపట్నం పోర్టు వీరి అభ్యర్థనను పట్టించుకోవడం లేదు. స్థలం సమకూర్చుకుంటే... చిల్లింగ్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ఎంపెడా వంటి సంస్థలు అంగీకరించాయి. కానీ స్థలమే దొరకడం లేదు. చిల్లింగ్ సెంటర్ వుంటే.. టూనాలను వచ్చినవి వచ్చినట్టు నిల్వ చేసి, మంచి ధర వున్నప్పుడు మార్కెట్‌కు ఎగుమతి చేసుకునే సౌలభ్యం దొరుకుతుంది. ఇలా చేస్తే.. టూనా జాలర్లకే కాదు, దేశానికే సంపదవుతుంది.
అక్కరకు రాని 'ట్యాగింగ్'
టూనాలను పట్టుకునేందుకు విదేశాల్లో చురుకైన పరిశోధనలు సాగుతున్నాయి. టూనాల సంచారం, గమ్యం, ఏయే మార్గాల్లో వెళుతున్నాయో తెలుసుకోవడానికి 'ట్యాగింగ్ ప్రోగ్రాం' అమలు చేస్తున్నాయి. సముద్రంలో దొరికే పిల్ల టూనాలకు ఒక చిప్‌ను ట్యాగ్ సాయంతో కట్టి, దాని కదలికలను పసిగడతారు. ఎలాంటి వాతావరణంలోకి వెళుతున్నది, ఎంత లోతున సంచరిస్తున్నది తదితర వివరాలు సేకరిస్తారు. ఇటీవల జపాన్‌లో ఒక టూనాకు ట్యాగ్ కడితే... అది మూడు నెలల్లో పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నార్త్‌మెక్సికోలో జాలర్ల వలకు చిక్కింది. మనకూ అలాంటి ప్రోగ్రాం చేయాలని మత్స్యకార సంఘాల నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
టూనాలను ఎగరేసుకుపోతున్నారు
* కేంద్రంలో మత్స్యపరిశ్రమకు ప్రత్యేక శాఖ లేదు. దేశంలో అరవై లక్షలకు పైగా జాలర్లు వున్నా.. విదేశీ మారకద్రవ్యం భారీగా ఆర్జించే వీరి సంక్షేమానికి విధానాల రూపకల్పన అంతా వ్యవసాయ శాఖ కిందే జరుగుతోంది. దీన్ని మత్స్యకార సంఘాల నాయకులు నిరసిస్తున్నారు.
* కొందరు స్వార్థపరుల కారణంగా భారత సముద్రజలాల్లో చేపలను వేటాడేందుకు విదేశీ నౌకలకు అనుమతులు (లెటర్ ఆఫ్ పర్మిషన్- ఎల్ఓపీ) ఇస్తున్నారనేది జాలర్ల ప్రధాన వాదన. వారి అధునాతన ట్రాలర్లు సంపద మొత్తాన్ని కొల్లగొట్టుకుపోతున్నాయని, వారి ముందు తాము నిలువలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో మురారీ కమిటీ సిఫార్సు మేరకు 1996-2001 మధ్యన విదేశీ ట్రాలర్లను నిషేధించారు. అయినా వారు దొంగతనంగా వచ్చి టూనాలను వేటాడి తీసుకుపోయేవారు. ఇప్పుడు మళ్లీ వంద విదేశీ ట్రాలర్లకు అనుమతి ఇచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని ఐదువందలకు పైగా ట్రాలర్లను తెచ్చి.. విలువైన టూనాలను ఎగరేసుకుపోతున్నారు.
* టూనాలు ఎలాంటి వాతావరణంలో వుంటాయనేది తెలిసినా, కరెక్టుగా ఎక్కడ సంచరిస్తున్నాయో తెలిస్తే.. వాటిని వేటాడడం చాలా సులువు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఉపగ్రహ సాయంతో సేకరించిన సమాచారాన్ని విదేశీ నౌకలకు అమ్ముకుంటోంది. దాంతో వారు టూనాలను సులువుగా పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్ (ఇండియా నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్) చేపలవేటకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తోంది. టూనాలకు సంబంధించిన సమాచారం ప్రత్యేకంగా ఇవ్వాల్సి ఉంది.
ప్రత్యేక రాయితీ ఇవ్వాలి - వైజేకే మూర్తి, అధ్యక్షుడు, మత్స్యపరిశ్రమల సమాఖ్య
త్వరలో విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ విమానాలు నడపడానికి ముందుకు వస్తున్నందున, వాటి ద్వారా టూనాలను ఎగుమతి చేసుకోవడానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. అలాగే సముద్రంలో దొరికిన టూనాలను వెంటనే చిల్లింగ్ సెంటర్‌కు లేదంటే తీరానికి చేర్చడానికి మదర్‌బోట్లు రెండు మూడు మంజూరు చేయాలి. ఇవి సముద్రంలో తిరుగుతూ, ట్రాలర్లకు చిక్కిన టూనాలను వెంటవెంటనే ఒడ్డుకు చేర్చి మార్కెట్‌లో విక్రయించి, ఎక్కువ ధరను రాబట్టగలుగుతాయి.
మన సముద్రజలాల్లో ఎల్లోఫిన్ (మొప్పలు పసుపురంగులో వుంటాయి), బిగ్ ఐ (కళ్లు పెద్దవి వుంటాయి), స్కిప్‌జాక్ (చారలు వుంటాయి) అనే మూడు రకాలు దొరుకుతాయి. బ్లూఫిన్ అనే రకం అత్యంత విలువైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంతరించే పోయే దశలో వుంది. అందుకని వీటిని జపాన్, అమెరికా దేశాల్లో పెంచుతున్నారు. ఈ టూనా చేపలు మూడు మీటర్ల పొడవుండి 700కిలోల బరువుదాకా పెరుగుతాయి.
- యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం