పాడి పంటలు

Wednesday, July 6, 2011

నేల మంచిదైతేనే పంట ‘ పండుతుంది. ’


రాష్ట్రంలో అనేక రకాల నేలలు ఉన్నాయి. అయితే వీటిలో పంటలు పండించడానికి అనువైన సారవంతమైన భూములు కొన్ని మాత్రమే. చాలా మంది రైతులకు ఏ పంటకు ఏ భూమి అనువైనదన్న విషయంపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో తమ భూమికి అనువుగా లేని పంటల్ని సాగు చేస్తూ నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ భూమిలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు పొందవచ్చో కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.హరీష్ కుమార్ శర్మ సూచిస్తున్నారు. ఆ వివరాలు...

సారవంతమై ఉండాలి

పంట బాగా పండాలంటే భూమి సారవంతమై ఉండాలి. రసాయన ఎరువులు వేస్తే ఏ భూమిలో అయినా పంట పండుతుందని రైతులు అపోహ పడుతుంటారు. రసాయన ఎరువులు వేసుకుంటూ పోతే కొన్నేళ్ల పాటు పంట పండే మాట నిజమే అయినా తర్వాతి కాలంలో ఆ భూములు నిస్సారంగా మారతాయి. మనం వేసే ఎరువులు పూర్తి స్థాయిలో ఫలితం ఇవ్వాలంటే భూమి సారవంతమై ఉండాల్సిందే. అంతేకాదు... దాని భౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే భూమిలో వేసిన ఏ ఎరువునైనా మొక్క సమర్థవంతంగా గ్రహిస్తుంది. నాణ్యమైన, అధిక దిగుబడులు అందిస్తుంది.

ఏం చేయాలి?

సాగు భూముల్లో సారం పెరగాలంటే సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, చెరకు మడ్డి, వర్మి కంపోస్ట్‌ను విరివిగా వాడాలి. దీనివల్ల నేల గుల్ల బారుతుంది. దానికి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. మొక్కల ఎదుగుదలకు దోహదపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. అలాగే మొక్కలకు అవసరమైన కొన్ని పోషక పదార్థాలు కూడా అందుతాయి.

పొలం నుండి మురుగు నీరు బయటికి పోయే సౌకర్యం లేకపోతే భూమి భౌతిక, రసాయునిక పరిస్థితి (ఆరోగ్యం) దెబ్బ తింటుంది. వ్యవసాయ భూముల్లో నీరు బాగా నిలిచిపోతే వరి మినహా మిగిలిన పంటలు తట్టుకోలేవు. పంట చేలో నీరు నిలిస్తే మొక్కల ఆకులు పసుపుపచ్చగా, ఎర్రగా మారి గిడసబారతాయి. నీరు నిలిచిన కొద్దీ వ్యవసాయ భూములు చౌడు భూములుగా మారతాయి. అందువల్ల పంట చేలో మురుగు నీటి పారుదల సదుపాయం తప్పనిసరిగా ఉండాలి.


సమస్యాత్మక భూములను దారికి తేవాలంటే...

రాష్ట్రంలో 8.6 లక్షల ఎకరాలు ఉప్పు, చౌడు భూములే. ఉప్పు నేలల్ని తెల్ల చౌడు నేలలని, చౌడు నేలల్ని నల్ల చౌడు లేదా క్షార భూములని పిలుస్తారు. ఈ భూముల్ని దారికి తేవాలంటే ముందుగా నేలను చదును చేయాలి. చదును చేసేటప్పుడు భూమి కొంచెం వాలుగా ఉండేలా చేస్తే మురుగు నీరు సులభంగా బయటికి పోతుంది. నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వేర్వేరుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత భూమిని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి. పొలం చుట్టూ ఎత్తయిన కట్టలు కట్టాలి. మడుల్లో మంచి నీటినే నింపాలి. ఆ నీటిని నాలుగైదు రోజులు నిల్వ ఉంచాలి. ఎండ వేడిమికి ఇంకిపోగా మిగిలిన నీటిని బయటికి పంపాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే నేలలో చౌడు తీవ్రత తగ్గుతుంది. ఉదజని సూచికను బట్టి భూమిలో జిప్సమ్ వేసి దున్నాలి. నీరు పెట్టి వారం రోజుల పాటు అలాగే ఉంచాలి.

వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూమి నుం డి కాల్షియం, పొటాషియం, సోడియం లవణాలు వరద నీటిలో కలిసి కొట్టుకుపోతాయి. నీటిలో అంతగా కరగని అల్యూమినియం, సిలికాన్, ఇనుము అవశేషాలు ఆక్సైడ్ లేదా సిలికేట్ రూపంలో భూమిలోనే ఉండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ నేలలు ఆమ్ల నేలలుగా మారతాయి. ఈ భూముల నుండి కొన్ని రకాల విష పదార్థాలు విడుదల కావడంతో మొక్కలు సరిగా పెరగవు. ఈ పరిస్థితిని నివారించాలంటే ముందుగా పొలాన్ని కలియదున్ని ఆ తర్వాత పొలం అంతటా సమానంగా పడేలా సున్నం పొడిని వెదజల్లి మరోసారి దున్నాలి. సేంద్రియ ఎరువులు వేయడానికి నాలుగైదు వారాల ముందు సున్నం చల్లాలి. ఆమ్ల గుణమున్న నేలల్లో అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ వంటి రసాయన ఎరువులు వేయకూడదు.


వ్యవసాయ భూముల్లో నీటిలో కరిగే లవణాలు అధికంగా ఉన్నట్లరుతే మొక్కలు పోషకాలను, నీటిని తగినంతగా తీసుకోలేవు. ఈ సమస్యను నివారించాలంటే ముందుగా పొలాన్ని బాగా దమ్ము చేయాలి. మురుగు నీటిని బయటికి పంపాలి. ఈ విధంగా నాలుగైదు సార్లు చేస్తే భూమిలో లవణాల్ని పరిమిత స్థాయికి తేవచ్చు.


ఏ పంటకు ఏ భూమి అనుకూలం?


వరిని అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయొచ్చు. కానీ మురుగు నీరు బయటికి పోయే వసతి ఉన్న బరువు నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరుతడి పంటలతో పోలిస్తే వరికి చౌడు నేలలు కొంత మేర అనుకూలమే. మొక్కజొన్నను ఇసుక, రేగడి, గరప నేలల్లో సాగు చేయొచ్చు. ఎర్ర గరప నేలలు, లోతైన మధ్య రకపు రేగడి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నీరు ఎక్కువగా నిలిచే ఒండ్రు నేలలు, బరువు నేలలు పనికిరావు. పేలాల మొక్కజొన్న రకాల్ని తేలికపాటి ఇసుక భూముల్లో వేసుకోవచ్చు. జొన్నను నల్ల నేలల్లో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది. తేలికపాటి ఎర్ర నేలల్లో కూడా పండించవచ్చు.


కందిని నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్ర రేగడి, ఎర్ర చల్కా భూముల్లో సాగు చేయొచ్చు. నల్ల రేగడి నేలల్లో మురుగు నీరు బయటికి పోయే వసతి ఉంటే కంది వేయొచ్చు. చౌడు నేలలు, నీరు ఎక్కువగా నిలిచే నేలలు పనికిరావు. మినుము, సోయా చిక్కుడును నీరు ఇంకే, తేవును నిల్వ చేసుకునే భూముల్లో సాగు చేయొచ్చు. మురుగు నీటి పారుదల వసతి ఉన్న ఎర్ర, నల్ల నేలల్లో కూడా వేసుకోవచ్చు.


వేరుశనగ సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. చల్కా భూముల్లో కూడా పండించవచ్చు. నువ్వుల సాగుకు తేమను నిలుపుకునే, మురుగు నీరు నిలువని తేలికైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆముదాన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నీరు ఇంకిపోయే తేలిక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి.

పత్తిని వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో సాగు చేయొచ్చు. వర్షాధారపు పత్తికి తేలికపాటి ఎర్ర నేలలు అనువైనవి కావు. నీటి పారుదల కింద తేలికైన ఎర్ర నేలలు, బరువైన నల్ల నేలల్లో వేసుకోవచ్చు.

No comments:

Gouthamaraju as WUA