పాడి పంటలు

Sunday, November 28, 2010

అమెరికాలో రైతే లేడు

  తిండి తిప్పలు
అవసరం లేకపోయినా అధికంగా పండించడం అలవాటు చేసుకున్న అమెరికా ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉంది. అలా ఉత్పత్తి చేసిన వాటిని మిగతా దేశాల్లో స్థానికంగా ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుకన్నా తక్కువ ధరకే ఎగుమతి చేస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆహారవస్తువుల ధరలు తగ్గితే దాని వల్ల అమెరికా రైతులు నష్టపోకుండా మళ్లీ వారికి రకరకాల సబ్సిడీలు కల్పిస్తారు. దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రైతులు మాత్రం నష్టపోతున్నారు.

నిజానికి అమెరికాలో వ్యవసాయం చేస్తున్నవాళ్లని రైతులనలేం. రైతులందరినీ ఎప్పుడో పొలాల నుంచి వెళ్లగొట్టేశారు వాళ్లు. అక్కడ ఇప్పుడు మహా అయితే రెండు శాతం మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారేమో. మిగతా వాళ్లందరూ బహుళ జాతి కంపెనీల వాళ్లు. విత్తనాలు మొదలుకుని రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉత్పత్తి చేయడమే కాక ఆ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయడం నుంచి అంతర్జాతీయ వ్యాపారం దాకా అన్నీ బహుళజాతి కంపెనీల వాళ్లే చేస్తున్నారు. అమెరికన్ ఎన్నికల్ని, రాజకీయ నాయకుల్ని శాసిస్తూ తమ వ్యాపారాలకి ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సబ్సిడీలు అందేలా చేసుకుంటారు. అంతే కాదు.. ఇతర దేశాల ప్రభుత్వాలు తమ వ్యవసాయదారులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా చేయమని అమెరికన్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తారు. అవసరమైన వరకు ఉత్పత్తి చేసుకునే బదులు ఈ కంపెనీలన్నీ అమెరికాలో ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచాలని సూచిస్తూ ఉంటాయి.

ఇక ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి విషయానికొస్తే రెండూ ఎక్కువగా అమెరికా, యూరోపియన్ దేశాల నిధులతోటే నడుస్తుంటాయి. అందుకే స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు తెలిపి తద్వారా అమెరికా, యూరప్‌లలో పండిన పంటలకి ఇతర దేశాల్లో మార్కెట్ కల్పిస్తాయి. మనలాంటి దేశాలకి ఈ స్వేచ్ఛా వాణిజ్యం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే మనం ఉత్పత్తి చేసేది మనకే సరిపోదు. దీనితో పాటు ఇతర దేశాలు తమ రైతులకు ఇచ్చే సబ్సిడీల్లో కోత విధించాలని, వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించాలని సలహా ఇస్తాయి ఆ దేశాలు. మనలాంటి దేశాలు ఆ పని చేస్తే రైతులపై ఉత్పత్తి భారం పెరుగుతుంది తప్ప మార్కెట్లో ధరలు మాత్రం పెరగవు. ఎందుకంటే అంతకన్నా తక్కువ రేటుకి మార్కెట్లో అమెరికా, యూరప్ నుండి ఉత్పత్తులు వచ్చిపడుతున్నాయి కదా. మన దేశంలో రసాయన వ్యవసాయం ఎప్పట్నుంచి మొదలైందో చూద్దాం.

దేశ జనాభాకి సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి 1950ల్లో మనదేశం 'గ్రో మోర్ ఫుడ్' ప్రచారం మొదలుపెట్టింది. అందుకని వ్యవసాయ భూమిని పెంచే పనిలో పడింది. దానితోపాటు అమెరికా నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రపంచ యుద్ధకాలం నుంచి అమలులో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను మన దేశంలో 60వ దశకంలో కొంత విస్తరించారు. ధాన్యాన్ని రైతులనుండి కొనుగోలు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందేలా చేశారు. అలా చేయడం వల్ల రైతులకి ముందుగా నిర్ణయించిన ధర లభించడమే కాక సామాన్యులకు సబ్సిడీ ధరలకు ఆ ధాన్యం తప్పనిసరిగా అందేది.

1960ల్లో మన దేశంలో మొదలైన హరిత విప్లవంలో భాగంగా వరి, గోధుమ పంటల్లో కొత్తకొత్త రకాలను ప్రవేశపెట్టారు. అయితే వాటికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తోడయితేనే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి ఎంత పెరిగినా దాంతోపాటు దేశ జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. కొంతకాలానికి రసాయన ఎరువుల వాడకం వల్ల నేలలో సారం తగ్గిపోయింది. దాన్ని పూడ్చడానికి మరింత ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడాల్సి వచ్చింది. అంతేకాదు, వాటి వాడకం వల్ల నీరు, నేల, గాలి అన్నీ కలుషితమవడం మొదలైంది. ఆ తర్వాత కాలంలో హైబ్రిడ్ విత్తనాల వాడకంతోపాటు కలుపు నివారణకి కూడా రసాయనమందుల వాడకం ప్రారంభమైంది. ఇప్పుడు బిటి కాటన్ వచ్చేసింది. మరెన్నో బిటి కూరగాయలు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే ధర ఎక్కువగా ఉండే కొన్ని పంటలకి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులు ఆ పంటలవైపు మొగ్గుచూప సాగారు. వాటిని పండించడానికి భూగర్భజలంపై ఎక్కువగా ఆధారపడసాగారు. ఆరుతడి పంటలు పండించడం తగ్గిపోయింది. దానివల్ల పప్పుధాన్యాల సాగు, నూనెగింజల ఉత్పత్తీ తగ్గిపోయాయి, వాటి ధరలు పెరిగాయి.

మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరినపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలు మన దేశంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందుకే అందులో చేరితే మన ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకోవచ్చని మనపై అంతర్జాతీయంగా వత్తిడి పెరిగింది. అయితే మనం చేరిన కొంతకాలానికే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగొచ్చాయి. అక్కడ ధరలు తగ్గడంతో స్థానికంగా కూడా తగ్గించాల్సి వచ్చింది. దాని ప్రభావం రైతులపై పడింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. నష్టాల్ని పూడ్చుకునే ఆర్థికసామర్ధ్యం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో ఎంతోమంది దాన్ని వదిలేస్తున్నారు కాబట్టి ఆహారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, ఇంకా చాలా దేశాల్లో రైతులది ఇదే పరిస్థితి. ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్నా దానికి తగ్గట్టుగా ధరలు మాత్రం పెరగడం లేదు. రైతులు కోరుకునేదల్లా ఒక్కటే. తాము పండించే పంటలకి తగిన ధర ఉండాలని, ఆదాయం రావాలని. అది కోరుకోవడం కూడా తప్పేనా?

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Tuesday, November 23, 2010

తిండి తిప్పలు * అమెరికా పొలానికి గువానో బలం

అమెరికాలో రసాయనాల వాడకం చిత్రంగా మొదలైంది. అదెలాగో తెలుసుకోవాలంటే దక్షిణ అమెరికా ఖండానికి వెళ్లాల్సిందే. 1800ల నాటి సంగతి. అప్పట్లో 80 శాతం అమెరికన్లకి వ్యవసాయమే జీవనాధారం. అంతేకాదు ఆ దేశ ఆదాయంలో 75 శాతం వ్యవసాయం నుండే వచ్చేది. వ్యవసాయం కోసం అడవుల్ని నరికేసి, పశువుల ఎరువు వాడుతూ, పంటమార్పిడి పద్ధతులు పాటిస్తూ, బానిసల శ్రమపై ఆధారపడి... అమెరికాలో వ్యవసాయం సాగేది. పండించిన దాంట్లో ఎక్కువ శాతం యూరప్‌కి ఎగుమతి అయ్యేది. కొంతకాలానికి అక్కడి నేలల్లో సారం అనూహ్యంగా పడిపోయింది. ఇదిలా ఉండగా 1804లో జర్మనీకి చెందిన వృక్షశాస్త్రవేత్త అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ దక్షిణ అమెరికా నుండి గువానో అనే పదార్థాన్ని తీసుకొచ్చాడు. గువానో అంటే ఏమిటి?

ఇప్పటి పెరూ తీరంలో వాన్ హంబోల్ట్ కొన్ని ద్వీపాల్ని గమనించాడు. ఆ ద్వీపాలపై వేలయేళ్ల నుండి సముద్రపక్షులు నివాసముండడంతో వాటి రెట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. వాటినే గువానోలు అంటారు. అక్కడి స్థానికులు ఆ ద్వీపాల్లోని పక్షులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా రెట్టని తీసుకుని పంటలకి ఎరువుగా వాడేవారు. అది నత్రజని అధికంగా కలిగిన పదార్థం కాబట్టి దానివల్ల పంటలు బాగా పండేవి. ఆ విషయం హంబోల్ట్ ద్వారా మిగతా ప్రపంచానికి తెలిసింది. అంతే... వెంటనే గువానో కోసం రష్ మొదలైంది. 1851 నాటికల్లా 66 వేల టన్నుల గువానో ఉత్తర అమెరికాకి తరలి వెళ్లింది. పెరూ తీరంలోని 94 ద్వీపాలను అమెరికా తన అధీనంలోకి తెచ్చుకుంటూ 1856లో ఒక చట్టమే చేసింది. దాన్ని అమెరికాకి తరలించడానికి చైనా నుండి బానిసల్ని తీసుకొచ్చారు. అంతేకాదు, స్థానిక పెరువియన్ ఇండియన్లను బం«ధించి వారిచేత రోజుకి 20 గంటల పైనే పని చేయించేవారు. వారికి ఎలాంటి కూలి ఇచ్చేవారు కాదు. అలా పని చేస్తున్న చాలామంది గువానో గుట్ట చెరియలు విరిగిపడి చనిపోయారు కూడా. ఆ బానిస బతుకు బతకలేక కొందరు సముద్రంలో దూకి ప్రాణాలు వదిలారు.

1870 నాటికి గువానో కొండలు పూర్తిగా తరిగిపోయాయి. అయితే సత్వర ఫలితాన్నిచ్చే ఎరువులకి డిమాండ్ పెరగడంతో జాన్ బెన్నెట్ లావెస్ అనే ఆయన సూపర్ ఫాస్ఫేట్‌ను తయారు చేశాడు. 19వ శతాబ్దాంతానికి అలాంటి మరెన్నో ఎరువులు తయారు చేయడం, అమ్మడం ఎక్కువైంది. 1909లో జర్మనీకి చెందిన రసాయనశాస్త్రవేత్తలు హేబర్, బోస్ కృత్రిమంగా నత్రజని ఎరువుని తయారుచేసే విధానాన్ని కనుగొన్నారు. నైట్రోజన్ నుంచి తయారు చేసే నైట్రిక్ ఆక్సైడ్‌ను పేలుడు పదార్థాల్లో కూడా వాడతారు. డ్యూపాంట్ లాంటి అమెరికన్ కంపెనీలు దాన్ని ఓ పక్క పేలుడు పదార్థాల తయారీలో వాడుతూ, మరోపక్క దాంతో రసాయన ఎరువులు తయారు చేశాయి. ఆ విధంగా రసాయన ఎరువుల పరిశ్రమ ఉద్భవించింది. ఆ ఎరువుల్లో వాడే రసాయనాలే హిట్లర్ కాలంనాటి జర్మనీలో విషవాయువులుగా కూడా ఉపయోగ పడ్డాయి. అంతేకాదు ఆ రోజుల్లోనే క్రిమిసంహారక మందులు తయారు చేసే కంపెనీలు ఫార్మాస్యూటికల్ కంపెనీలుగా కూడా ఎదిగాయి.

ఉదాహరణకి మోన్‌శాంటో కంపెనీ 1901లో సాచరిన్ తయారు చేయడం మొదలు పెట్టింది. హార్మోన్‌లను ప్రభావితం చేసే క్యాన్సర్ కారకాలయిన పిసిబి, ఏజెంట్ ఆరెంజ్‌లను ఉత్పత్తి చేసింది. ఏజెంట్ ఆరెంజ్‌ను వియత్నాం యుద్ధ సమయంలో పొలాలు, అడవులను నాశనం చెయ్యడానికి ఉపయోగించారు. ఆ తర్వాత మోన్‌శాంటో 1970ల్లో కలుపుమొక్కల నివారణ మందులను, 1980ల్లో జన్యుమార్పిడి విత్తనాల్ని తయారుచేసింది. 1990ల్లో ఈ కంపెనీ జంతువులు త్వరగా ఎదగడానికి వాడే హార్మోన్‌ను విరివిగా ప్రమోట్ చేసింది. "ఆ కంపెనీ వ్యాపారంలో వేసిన ప్రతి అడుగువల్లా వినాశనమే జరిగింది. అయినా ఆ కంపెనీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది'' అని ఆర్గానిక్ మేనిఫెస్టోలో మారియా రొడేల్ పేర్కొన్నారు.

కృత్రిమ ఎరువులు నిస్సారమైన భూముల దిగుబడిని పెంచినా వాటి వాడకం మరిన్ని రసాయనాల వాడకానికి దారి తీసింది. క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిపోయింది. వ్యవసాయ ఖర్చు పెరిగిపోవడంతో చిన్న రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఇదే అదునుగా పెద్దపెద్ద కంపెనీలు రంగప్రవేశం చేసి వారి నుండి పొలాల్ని కొనుగోలు చేశాయి. ఫలితంగా అమెరికాలో స్వతంత్ర వ్యవసాయదారులు అంతరించిపోయారు. కార్పొరేట్ వ్యవసాయ సంస్థలు మాత్రమే మిగిలాయి. ఇప్పటికీ అమెరికాలో వ్యవసాయదారులంటే ఆ సంస్థలే.

సువిశాలమైన కమతాలు, భారీ యంత్రాలు ఎలా వచ్చాయి? అడవులను నరకడం ద్వారా అమెరికాలో విశాలమైన కమతాలు ఏర్పడ్డాయి. అక్కడ పొలాలెక్కువై వాటిలో పని చేయడానికి జనం కొరత భారీగా ఏర్పడింది. అందుకే ఆఫ్రికా నుండి నల్లజాతీయుల్ని బానిసలుగా తీసుకొచ్చారు. తర్వాత బ్రిటన్, అమెరికాలలో వచ్చిన పారిశ్రామిక, రసాయన విప్లవాల ఫలితంగా కొత్తకొత్త యంత్రాలు పుట్టుకొచ్చాయి. వాటి వినియోగం పెరిగి పనివాళ్ల అవసరం కొంతవరకు తగ్గింది. 1960ల్లో చమురు నిలవల్ని గుర్తించడం, వాటిని వెలికితీయడం ఎక్కువైంది. చమురు చౌకగా దొరకడంతో అమెరికా, యూరప్‌లలో వ్యవసాయానికి భారీ యంత్రాల వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. అమెరికన్ పొలం సగటు వైశాల్యం నాలుగొందల ఎకరాల పైమాటే. అదే ఇండియాలో అయితే 3.3 ఎకరాలు.

అమెరికా ఎప్పుడూ తక్కువ జనాభా కలిగిన విశాల దేశమే. ఆ విశాలమైన పొలాల్లో పండే పంట అక్కడి ప్రజలకి అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ. అందుకే వాళ్లు పండించిన దాన్ని మొదట్నుండీ భారీ మొత్తంలో ఎగుమతి చేసేవారు. అయితే 1930ల నాటి ఆర్థికమాంద్యం దెబ్బకి ప్రజల కొనుగోలు స్థాయి బాగా తగ్గిపోయింది. అయినా అమెరికాలో ఉత్పత్తి మాత్రం తగ్గలేదు. అమెరికా ప్రభుత్వం దీనికో పరిష్కారాన్ని సూచించింది. డిమాండ్‌కు తగ్గట్టే తక్కువ పండించమని రైతులకు చెప్పి అలా తక్కువ పండించడం వల్ల వల్ల వారు నష్టపోకుండా వారికి డబ్బు చెల్లించింది. ఎందుకంటే... ఎక్కువ పండిస్తే సరుకు ఎక్కువై ధర తగ్గించాలి. కానీ వాళ్లు తక్కువ పండించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా ఉత్పత్తుల ధరలు తగ్గకుండా నియంత్రించవచ్చు. ఈ పాలసీలో భాగంగా ఒక్క 1933లోనే మాంసం కోసం పెంచుతున్న 60లక్షల పందిపిల్లల్ని చంపేశారు.

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in, 99897 98493

Gouthamaraju as WUA