పాడి పంటలు

Monday, December 5, 2011

గ్రీన్ వండర్ రెడ్డి

 





















ఎడారిని తలపించే ఇసుక దిబ్బల్లో 76 ఏళ్ల వరదారెడ్డి తీర్చిదిద్దిన పచ్చని అద్భుతాన్ని మీకు చూపించా  లంటే  కెమెరాలు పనికిరావు. గూగుల్ ఎర్త్‌లోనే చూడాలి. నెల్లూరు జిల్లాలో బకింగ్‌హామ్ కాలువకీ సముద్రానికీ మధ్యలో ఉండే సిద్ధవరం కుగ్రామంలో 1934లో పుట్టిన దువ్వూరి వరదారెడ్డి ఒక వనసృష్టికర్త. ఐదు కిలోమీటర్ల దారి పొడవునా పరచుకున్నఆ గ్రీన్‌హెవెన్‌కు ఇప్పుడు కోస్టర్ కారిడార్ సెజ్ సునామీ పొంచి ఉంది.

వరదారెడ్డి పుట్టిన సిద్ధవరం గ్రామమంతా ఇసుక తిన్నెలమయం. మహా అంటే మూడొందల గడపలుంటాయి ఆ ఊళ్లో. ఊరికి మూడు పక్కలా 15 కిలోమీటర్ల వరకు ఇసుక మేటలుండి ఎడారిలా కనిపిస్తుంది. పదకొండోతరగతి వరకూ చదివిన వరదారెడ్డి నలభయ్యో యేట తన తల్లికి జబ్బు చేసినపుడు మద్రాస్‌లోని రాయపేట ఆస్పత్రిలో ఆమెను చేర్పించాడు.ఆ సమయంలో రోజూ సమీపంలోని ఎగ్మూర్ లైబ్రరీకి వెళుతూ యాదృచ్ఛికంగా వృక్షశాస్త్ర పుస్తకాలు చదివాడు.

వాటిని చదువుతున్నంత సేపూ తన ఊరే వరదారెడ్డి కళ్లలో మెదిలేది. మద్రాసు నుంచి ఊరికి తిరిగొచ్చిన తర్వాత చుట్ట పక్కల ఊళ్లలో తెలిసిన వాళ్లను అడిగి జీడిమామిడి, వేప, కానుగ, సుబాబుల్, మర్రి వంటి మొక్కల్ని తెప్పించి వర్షాకాలం మొదలయ్యే ముందు ఇసుక నేలలో గుంటలు తవ్వి ప్రత్యేకంగా తాను తయారు చేసిన పేడ ఎరువుపోసి వాటిని నాటేవాడు. అలా నిర్విరామంగా వేలాది మొక్కలు నాటాడు. ఇప్పటికీ నాటుతూనే ఉంటాడు. మరణించే దాకా నాటుతూనే ఉంటానంటాడు. ప్రతీదాన్ని లెక్కించి చేసే వలసవాద బుర్రతో ఇప్పటిదాకా ఎన్ని మొక్కలు నాటి ఉంటారనే ప్రశ్న వేస్తే నవ్వి ఊరుకుంటాడు.

****

అలా... బ్రహ్మజెముళ్ల ఎడారిని పచ్చని చెట్ల బృందావనంలా మార్చిన 76 ఏళ్ల వరదారెడ్డిని కదిలిస్తే చిన్నపిల్లాడిలా చెట్ల గురించి కథలు కథలుగా చెబుతాడు. ఇసుక నేలల్లో తక్కువ నీటితో అతి తక్కువ ఎరువుతో చెట్లనెలా సాకాలో విపులంగా చెబుతాడు. ఏ రకం మొక్క పక్కన ఏ రకం మొక్కనాటాలో, నారు పోయడమెలానో రకరకాల మెలకువల్ని నిర్విరామంగా చెబుతూ 'చెట్టూ పసిబిడ్డా వొకటే గదబ్బయ్యా!!' అంటూ వున్నట్టుండి మౌనం వహిస్తాడు.

****

సిద్ధవరం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో 'కనుపూరు' అనే ఊరుంది. ఇసుక దిబ్బల మధ్య ఈ రెండు ఊర్లకు దారి ఉంది. యానాదులు, రైతులు, అందరూ ఈ దారిలో రోజూ నడుస్తుంటారు. ఎండాకాలం అయితే కాళ్లు బొబ్బలెక్కాల్సిందే. ఏటా జరిగే కనుపూరు ముత్యాలమ్మ జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలమంది వస్తారు. నాలుగు కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దారికి రెండు వైపులా చెట్లు నాటాడు వరదారెడ్డి.

ఆరేళ్ల క్రితం వేకువజామున మూడు గంటలకే నిద్రలేచి ఎనిమిది గంటల వరకూ గుంటలు తవ్వి ఎరువుపోసి రెండు సంవత్సరాల పాటు రెక్కల కష్టం చేసి ఇసుక పర్రల్లో ఆకుపచ్చని వనాన్ని సాధ్యం చేసి చూపాడు. మొదట్లో వరదారెడ్డి చేసే ఈ పని చూసి కొందరు 'రెడ్డి భూమంతా ఆక్రమించేదానికి ప్లానేశాడ్రా' అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్లు మిగతా వాళ్లు కూడా ఆ చెట్ల చల్లటి నీడ అంచున అలవోగ్గా నాలుగు కిలో మీటర్లు నడిచివెళ్తున్నారు. వరదారెడ్డి బహు పుణ్యాత్ముడయ్యా అని మెచ్చుకుంటూ...

****

సిద్ధవరం సమీపంలో ఏడువందల నేరేడు చెట్లను కూడా వరదారెడ్డి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు. ఈ నేరేడు వనంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఒక దశలో అంతరించిపోతున్నందుకు ఈ పురాతన పూర్వకాల వనాన్ని తన శ్రమతో ఇప్పటికీ అస్తిత్వంలో ఉంచాడు వరదారెడ్డి.

****

వరదారెడ్డిని చూసి జనాలు కూడా చెట్లు నాటడం ప్రారంభించారు. వీరి కోసం జీడిమామిడి, నేరేడు, వేప మొక్కలను నారుపోసి ఆ మొక్కల్ని ఉచితంగా పంచుతున్నాడు. ఇంకా చుట్టుపక్కల నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి తను నాటడమే కాకుండా, అడిగిన వారికీ, అడగని వారికీ, ఇంటింటికీ ఉచితంగా పంచుతాడు. తను నాటిన చెట్లను ఎవరైనా పేదలు వంట చెరకు కోసం నరికినా నొచ్చుకోకుండా అక్కడ మరో చెట్టును నాటుతాడు. వ్యక్తి శ్రమ సమిష్టి శ్రమగా సందపదగా మార్చడమెలాగో వరదారెడ్డి చేసి చూపించాడు . గత 36 సంవత్సరాలుగా ఇసుకలో నాటిన చెట్లను సరంక్షించడానికి వరదారెడ్డి కనీసం 70 టన్నుల పేడను వినియోగించి ఉంటాడు. ఎడారిలాలాంటి ఇసుక తిన్నెల మధ్య సహజంగా పెరిగే బ్రహ్మజెముడు, బొలిజ, తంగేడు వంటి చెట్లకు ఇబ్బంది లేకుండా ఈ మొక్కలు నాటుతాడు.

****

ఇప్పటివరకు ఇంగ్లీషు మందులు వాడలేదనే వరదారెడ్డి తన చిన్న ఫిలిప్స్ రేడియో ద్వారా బయటి ప్రపంచ విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు పిల్లనగ్రోవి ఊదుతాడు. అది తనకెంతో తృప్తినిస్తుందంటాడు. మొలకో తువ్వాలు చుట్టుకొని ఆరుబయట నిలబడితే వొంటికి తగిలే దక్షిణపు గాలి మార్మిక స్పర్శే తన జీవన చోదక శక్తి అంటాడు.


****

గ్రామదేవత అంకమ్మతల్లి వీరభక్తుడైన ఇంతటి నిర్భయుడు కూడా ఈ మధ్య కొంచెం జంకాడు -తను నాలుగు కిలోమీటర్ల మేర నాటిన చెట్లబాటను కోస్టల్ కారిడార్‌లో భాగంగా ప్రభుత్వం సెజ్‌లకిచ్చేస్తుందని తెలిసి. దాన్ని సెజ్ నుంచి మినహాయించమని జిల్లాకలెక్టర్‌కు ఒక అర్జీకూడా రాశాడు.


****

యింత పని నేనొక్కడినే ఎలా చేస్తాను? ఇదంతా నా భార్య అనసూయమ్మ,అన్నదమ్ముల బిడ్డలూ, రైతులూ, స్నేహితులూ, సేవాజనులు అందరి ద్వారా ఆ సర్వేశ్వరుడే జరిపిస్తున్నాడని సర్వకర్మలనూ ఆయనకర్పిస్తాడు వరదారెడ్డి.


*****

తన యవ్వన ప్రాయంలో అందరిలాగే వరదారెడ్డి కూడా ఉద్యోగానికో, వ్యాపారానికో, విదేశాలకో వెళ్లిపోయి ఉంటే సిద్ధవరం గతి ఏమయ్యి ఉండేదో


* శ్రమయేవ జయతే


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరు వారి దివ్యసముఖమునకు,
అయ్యా! 
మాగ్రామ నడిబొడ్డున వెలసియున్న దివ్యమంగళమూర్తిగా ప్రసిద్ధిగొన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయము నుంచి కళల కల్పవల్లి అంకాళమ్మ దేవాలయము మీదుగా జనజాగరణ తల్లి చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామము నందు వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ దేవాలయము వరకు ఉన్న బాటలకు ఇరువైపులా ఐదు కిలోమీటర్లు మా కుటుంబము చెట్లను పెంచినాము. కాగా ఇప్పుడు ప్రభుత్వం వారు సెజ్‌కు కేటాయించు క్రమంలో ఆ బాటను మినహాయించి సదరు గ్రామములకు సౌకర్యము గావించగలరని కోరుచున్నాము. గమనిక: ఈ మార్గము పర్యాటక, పరిక్రమ, పర్యావరణ వరముగా ప్రసిద్ధి పొంది ఉన్నది.
ఇట్లు,
దువ్వూరు వరదారెడ్డి.
సిద్ధవరం గ్రామం, 
కోటమండల,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

No comments:

Gouthamaraju as WUA