పాడి పంటలు

Sunday, November 20, 2011

కృషి * ఎడారి పండ్ల తోట

'కృషితో నాస్తి దుర్భిక్షం' అని ఊరికే అనలేదు పెద్దలు. కృషి ఉంటే ఎడారి కూడా సస్యశ్యామలం అవుతుంది. ఎందుకూ పనికి రాని భూముల్లో కూడా బంగారం పండించవచ్చు. 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మండిపోయే ఎడారిలో సైతం పండ్లతోటను పెంచారు చోగలాల్ సోని. తను పడిన కష్టాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..


"నా పేరు 'చోగలాల్ సోని'. రాజస్థాన్‌లోని థార్ ఎడారి పక్కనే ఉంటుంది మా ఊరు. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే ప్రాణం. బార్మర్ అనే పట్టణంలో 1971 నుంచి 81 వరకు చిన్న క్లర్కుగా పనిచేశాను. పెద్ద జీతం వచ్చేది కాదు. అందులోనూ ముందు నుంచీ ఆర్థికంగా ఏమంత ఉన్నోళ్లం కాదు. ఉద్యోగం వదిలాక కంసాలి అవతారం ఎత్తాను. ఆడవాళ్ల ఆభరణాల్ని కళాత్మకంగా చేయడం నేర్చుకున్నాను. కొన్నేళ్లకు చుట్టుపక్కల ఊర్లలో నాకు మంచి పేరే వచ్చింది. చేతినిండా పని ఉండటంతో కొద్దోగొప్పో దాచుకోవడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే నాకు సేద్యం మీద ఆసక్తి ఏర్పడింది. అయితే, మేమున్న ప్రాంతంలో అన్నీ ఎడారి భూములే ఉంటాయి. ఇక్కడ ఇంచుమించు 54 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి ఎక్కువైనప్పుడు చెట్లు కూడా మాడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మా పల్లెల్లో వ్యవసాయం లాభసాటి కాదు. అయినాసరే, ఏదో ఒక రోజు ఇవే భూముల్లో పంటలు పండించాలనుకున్నాను.


దారి పొడవునా ఇసుకే..
జైసల్మీర్‌కు దగ్గర్లోనే రోడ్డుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో భూమి కొన్నాను. ఆ భూమి నిజానికి సారవంతమైనది కాదు. ఎటు చూసినా ఇసుకమేటలు. పొలం దగ్గరికి వెళ్లాలంటేనే ఆపసోపాలు పడాలి. దారిపొడవునా మోకాలులోతు ఇసుక ఉంటుంది. మోటర్‌బైక్‌ను తోసుకుంటూ వెళ్లాల్సిందే. 'అలాంటి భూమిని ఏం చేస్తావ్?' అన్నారంతా. అయినా నేను వాళ్ల మాటలు వినలేదు. నేను దాచుకున్న సొమ్ముకుతోడు మరికొంత అప్పులు చేసి 112 బిగాల (సుమారు 70 ఎకరాలు) భూమిని కొనుగోలు చేశాను. మాది ఎడారి ప్రాంతం కాబట్టి ఒయాసిస్సులు దగ్గరగా ఉంటేనే పంటలు పండుతాయి. మా భూమికి కొంత దూరంలో ఒయాసిస్సు ఉంది కాని మా పొలాల దాకా రావు ఆ నీళ్లు.


ఎప్పటికైనా వర్షాలు వస్తే బోర్లు వెయ్యొచ్చన్న ధైర్యంతో పండ్ల తోట పెంచాలనుకున్నాను. నాకు ఇదివరకు వ్యవసాయం మీద అవగాహన లేదు. తోటి రైతులను చూసే నేర్చుకున్నాను. నిమ్మ, ఇండియన్ బెర్రీ, బాదం, ఉసిరి, మామిడి, సీతాఫలం, రుద్రాక్ష మొక్కలను తీసుకొచ్చి పొలంలో నాటాను. ట్యాంకుల్లో నీళ్లు తీసుకెళ్లి ఒక్కో మొక్క కు పోసి వాటిని పెంచి పెద్ద చేశాను. రోజూ మెయిన్ రోడ్డు వరకు మోటారు బైక్‌లో వెళ్లి.. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు బండిని తోసుకుంటూ తోటలోకి వెళ్లేవాణ్ణి. వ్యవసాయం మీద ఇష్టంతోనే ఆ కష్టాన్ని భరించాను.


రాలిన ఆకులతో..
ట్యాంకులతో నీటిని తోలడం అంత సులువు కాదని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. అప్పుడే మా ప్రాంతానికి భయంకరమైన కరువు కూడా వచ్చింది. ఇక, చేసేది లేక బోర్లు వేయించి, బావులు తవ్వించాను. అరకొర నీళ్లతోనే తోటను సాగుచేశాను. రసాయన ఎరువులు ఎక్కువగా వాడలేదు. మేకల ఎరువునే వేశాను. రాలిన చెట్ల ఆకులతో పాదుల్ని కప్పేశాను. చెట్టు మొదళ్లు ఎండకు మాడిపోకుండా అవే కాపాడాయి. నాకు తెలిసిన చిన్న చిన్న టెక్నిక్‌లతోనే చెట్లను కాపాడుకుంటూ వచ్చాను. పండ్ల తోటలు బాగానే కాశాయి. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది కాని పక్షులతోనే పెద్ద సమస్య. అందుకే చెట్టు కు కాసిన ఒక్కోకాయనీ కాపాడుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయినా తినేటపుడు వాటి తియ్యదనానికి పడిన కష్టాలన్నీ మర్చిపోయాను.


ఆత్మీయతా మధురం..
ఎడారి పండ్ల మాధుర్యాన్ని నేనొక్కణ్ణే కాదు, తోటి దోస్తులు కూడా రుచి చూడాలి కదా..! అందుకే, సీజన్‌లో కాసే పండ్లను దగ్గర్లోని స్నేహితులకు, జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీలకు బహుమతిగా పంపిస్తుంటాను. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదన్న ఎడారి భూమిని ఇప్పుడు చాలామంది కొనేందుకు ముందుకొస్తున్నారు. ఎంతలేదన్నా 20 కోట్ల వరకు విలువ పలుకుతోంది నా పొలం. కాని నేను డబ్బుకు ఆశపడి భూమిని అమ్ముకోలేను. ఈ వయసులో నాకు డబ్బు ఎందుకు..? పొద్దున, సాయంత్రం తోటకు వెళ్లి హాయిగా గడుపుతుంటే.. ఈ జీవితానికి ఇక చాలనిపిస్తుంది.

No comments:

Gouthamaraju as WUA