అరటి పండు ఒక మధుర ఫలం. కానీ ఆ మాధుర్యం రైతుకు అందుతోందా?... లేదనే చెబుతున్నారు చాలా మంది రైతులు. దీనికి కారణాలు అనేకం. గెల దశలో రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సైతం మార్కెటింగ్ సమయంలో పెద్ద నష్టాల్నే కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరటి చెట్లలో గెల వేసినప్పటి నుండి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరటి పిలకలు నాటిన తర్వాత సుమారు తొమ్మిది నెలలకు గెలలు వేస్తాయి. ఆ తర్వాత రెండు నుండి మూడు నెలలకు కోతకు వస్తాయి. ఈ మూడు నెలల కాలంలో చెట్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కో చెట్టుకు 20-30 కిలోల బరువుండే ఒక్కో గెలే వస్తుంది. బరువు కారణంగా గెల ఉన్న వైపుకే చెట్టు వాలి ఉంటుంది. ఇలాంటి చెట్లు చిన్నపాటి గాలులు వీచినా నేలకు ఒరుగుతాయి. నేలకొరిగిన చెట్లకు ఉన్న గెలలు పక్వానికి రావు. వీటిని మార్కెట్‌లో అమ్మడం కష్టం. అంటే నేల మీదకు ఎన్ని చెట్లు ఒరిగిపోతే రైతు అన్ని గెలలు నష్టపోయినట్లే. చెట్టు వాలుతున్నట్లు గమనించగానే వెంటనే పోట్లు (సపోర్టు కర్రలు) పెడితే నష్టాన్ని నివారించొచ్చు. వీటిని గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో పెట్టాలి. ఆ పోట్లు గెలకు తాకకుండా వాలుగా ఉండాలి. లేకుంటే కాయలకు రాపిడి జరిగి మచ్చలు ఏర్పడతాయి. అలాంటి కాయల్ని కొనడానికి ఎవరూ ఇష్టపడరు. మార్కెట్ అవసరాల మేరకు... అరటి కాయలు పిందె దశలో ఉన్నప్పుడు పచ్చాలుగా (నాలుగు పక్షాలుగా లేదా పలకలుగా) ఉంటాయి. పిందెలు లావు పెరుగుతున్న కొద్దీ పచ్చాలు తగ్గుతూ వస్తాయి. పూర్తిగా పక్వానికి వచ్చిన అరటి కాయలు గుండ్రంగా తయారై బాగా బలిష్టంగా ఉంటాయి. ఈ దశ దాటితే కాయలు చిట్లిపోతాయి. అందువల్ల మార్కెట్ అవసరాన్ని బట్టి గెలల్ని వివిధ దశల్లో కోయాల్సి ఉంటుంది. ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికైతే 80 శాతం పక్వానికి రాగానే గెలల్ని కోయాలి. పూర్తిగా పక్వానికి వచ్చిన గెలల్ని సుదూర ప్రాంతానికి ఎగుమతి చేస్తే అవి మధ్యలోనే పూర్తిగా పండిపోతాయి. స్థానిక మార్కెట్లకు సరఫరా చేసేట్లయితే పూర్తిగా పక్వానికి వచ్చిన గెలల్ని మాత్రమే కోయాలి. ఎందుకంటే ఈ గెలలు 80 శాతం పక్వానికి వచ్చిన గెలల కంటే అయిదారు కిలోలు ఎక్కువ బరువు తూగుతాయి. సాధారణంగా మనం నాటే అరటి రకాన్ని బట్టి గెల వేసిన 75-100 రోజుల్లో కోతకు వస్తుంది. అంతకంటే ముందే గెలల్ని కోసినట్లయితే బరువు తక్కువ తూగి రైతుకు నష్టం జరుగుతుంది. అలాగని ఎక్కువ రోజులు ఉంచితే కాయలు చిట్లిపోవడం, మాగిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, గెలల పక్వ దశల్ని దృష్టిలో ఉంచుకుని కోయాలి. ఎలా కోయాలి? అరటి గెలల్ని కోయడానికి రైతులు కొడవళ్లను వాడుతుంటారు. ఇవి చిన్నవిగా ఉండి, ఎక్కువ వంపు తిరిగి ఉండడం వల్ల గెలను కోసేటప్పుడు కాయలకు గాట్లు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల గెలల్ని కోయడానికి పొడవైన, చివరలో కొద్దిగా వంపు తిరిగిన ప్రత్యేకమైన కత్తులు వాడాలి. వీటిని ఉపయోగించడం చాలా సులభం. గెలలు కూడా దెబ్బతినవు. గెలల్ని కోసే కొడవళ్లు తుప్పు పట్టకుండా చూసుకోవాలి. తుప్పు పట్టిన కొడవళ్లతో కోసినట్లయితే గెలలకు శిలీంధ్రాలు ఆశించి త్వరగా పాడైపోతాయి. శిలీంధ్రాలు ఆశించిన గెలల్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించరు. గెలలు కోసేటప్పుడు ఆరు నుండి తొమ్మిది అంగుళాల మేరకు కాడ ఉంచాలి. గెలలు ఎక్కువ బరువు ఉంటాయి కాబట్టి వాటిని కింద పడకుండా... అంటే ఒక వ్యక్తి పట్టుకుని ఉంటే మరో వ్యక్తి జాగ్రత్తగా కోయాలి. పొరపాటున గెల కింద పడితే కాయలన్నీ పగిలి పోతాయి. కాబట్టి అనుభవజ్ఞులైన వారితో కోయించాలి. సాధారణంగా చెట్టు నుండి గెలల్ని కోయగానే నేల మీద పెడుతుంటారు. అలా చేస్తే కింద ఉన్న మట్టి, పుల్లలు వంటివి అంటుకొని కాయలకు జీరలు పడి నునుపుదనం కోల్పోతాయి. గెలను కోసే ముందే అరటి ఆకు లేదా గోనె సంచి పరిచి దానిపై గెలని పెట్టాలి. కోసిన గెలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో ఉంచకూడదు. అలా చేస్తే కాయల లోపల ఉష్ణోగ్రత పెరిగి తొందరగా మెత్తబడతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందువల్ల గెలల్ని చెట్టు నీడన లేదా కొట్టంలో ఉంచాలి. కోసిన గెలల్ని ఒక దాని పైన మరో దాన్ని ఉంచకుండా విడివిడిగానే ఉంచాలి. ఒక దాని పైన మరొక గెల ఉంచితే అడుగు భాగంలో నేలకు ఆనుకుని ఉన్న కాయలు పై బరువు కారణంగా దెబ్బ తింటాయి. గెలను కోసిన తర్వాత కాడ నుండి స్రవించే ద్రవం కాయల పైన పడకుండా చూడాలి. ఈ ద్రవం కాయల మీద పడితే ఎండిపోయిన తర్వాత బంక లాగా నల్లటి చారలు ఏర్పడతాయి. అవి చూడడానికి అసహ్యంగా కన్పిస్తాయి. అందుకే ద్రవం పూర్తిగా కారిన తర్వాతే గెలల్ని రవాణా చేయాలి. కోసిన గెలల్ని తోట నుండి బయటికి తరలించేటప్పుడు ఇంకా కోయని చెట్లకు ఉన్న గెలల్ని తాకకుండా చూడాలి. తాకితే వాటి సహజ పాలిషింగ్ పోయే అవకాశముంది. పాలిషింగ్ పోయిన భాగాల్లో మాగిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గెలల్ని మార్కెట్‌కు తరలించేటప్పుడు వాటికి ఆకులు చుట్టి రవాణా చేయాలి. దీనివల్ల కాయలపై ఒత్తిడి తగ్గుతుంది. రవాణాలో జరిగే నష్టాన్ని నివారించవచ్చు. గెలల్ని కాకుండా కాయల్ని హస్తాలుగా విడదీసి శుద్ధి చేసి పెట్టెల్లో పెట్టి రవాణా చేయడం మంచిది. పెట్టెల్లో రవాణా చేసిన అరటి కాయల్ని ‘ఏసీ’ల్లో మాగపెట్టడం సులభం. ప్రస్తుతం అరటి కాయల్ని ఏసీలో మగ్గపెట్టడానికి కిలోకు 1.40 రూపాయలు ఖర్చవుతుంది. ఒక్కో హస్తానికి 12-15 కాయలు ఉండే విధంగా గెల నుండి కాయల్ని కోసి వేరు చేయాలి. వేరు చేసిన హస్తాల్ని నీటిలో శుభ్రపరచాలి. దీనివల్ల కాయలకు అంటిన దుమ్మూ ధూళి పోయి శుభ్రంగా, ఆకర్షణీయంగా కన్పిస్తాయి. శుభ్రపరచడానికి వాడే నీటిలో లీటరుకు 0.5 గ్రాముల చొప్పున బావిస్టిన్ కలిపితే కాయల్ని శిలీంధ్రాలు ఆశించవు. ఈ సూచనలన్నీ పాటిస్తే రైతులు అరటి సాగులోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. అరటి సాగులో నా అనుభవాలనే ఇక్కడ పొందుపరిచాను. - ఎం.వి.రమేష్ కుమార్ రెడ్డి |
Saturday, May 7, 2011
రైతుకు అరటి మాధుర్యం అందాలంటే...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment