పాడి పంటలు

Friday, February 4, 2011

‘ ప్రగతి ’లో సహజ సేద్యం!


ప్రత్యేక మడుల్లో ఆదర్శప్రాయంగా
సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగు
ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), పంచగవ్య,
వేపనూనెతో పచ్చని కూరల పెంపకం
ఇటుకలు, చెక్క ముక్కలు, పెంకులతో
విభిన్నంగా మడుల తయారీ
కూరగాయల సహజ సేద్యం గురించి ఒక్క రోజులో తెలుసుకోవచ్చు!


ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మడుల్లో సహజమైన పద్ధతుల్లో ఆకుకూరలతోపాటు ఏ రకం కూరగాయలైనా ఆరోగ్యదాయకంగా పెంచుకోవచ్చని ప్రగతి రిసార్ట్స్ నిరూపిస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ వేలాది జాతుల ఔషధ మొక్కలు, చెట్లతో కూడి జీవవైవిధ్యంతో పచ్చగా అలరారుతోంది.


ప్రగతి సీఎండీ డాక్టర్ జీబీకే రావు, సీనియర్ వృక్ష శాస్తవ్రేత్త డాక్టర్ ఎస్వీ రామారావు పర్యవేక్షణలో దాదాపు 15 రకాల ఆకుకూరలు, కూరగాయలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మడుల్లో ముచ్చటగా పెంచుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహం పైన నాలుగేళ్లుగా కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్న జీబీకే రావు ఇటీవల తన రిసార్ట్స్‌లోనూ ప్రారంభించారు. హార్టికల్చర్ ఎక్స్‌పోలో ‘ప్రగతి’ ఇటీవల రెండు అవార్డులు దక్కించుకుంది.

ప్రత్యేకతలెన్నో...

ప్రగతి కిచెన్ గార్డెన్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. మట్టి ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, చెక్క ముక్కలు, పగిలిన పెంకులు, విరిగిన నాపరాళ్లు, విరిగిన టైల్స్ వంటి అందుబాటులో ఉన్న సామగ్రిని వినియోగించి తక్కువ ఖర్చుతో మడులను ఏర్పాటు చేయడం భలే బాగుంది.

ప్రత్యేకంగా తయారుచేసుకున్న ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), వర్మీ కంపోస్ట్, ఎరమ్రట్టితో కూడిన ప్రత్యేక మట్టి మిశ్రమం.. పంచగవ్య (15 రోజులకోసారి.. 3 శాతం పంచగవ్యను 97 శాతం నీటిలో కలిపి), వేప నూనె (నెలకోసారి.. 5 మిల్లీలీటర్ల వేపనూనెను లీటరు నీటిలో కలిపి) వంటి సహజ సస్య రక్షణ ఉత్పత్తులతోనే ఈ మడుల్లో సాగు చేస్తుండడం విశేషం. ప్రత్యేక మట్టి మిశ్రమం వాడుతున్నందున పంట దిగుబడి సాధారణ నేలలో కన్నా ఎక్కువగా వస్తున్నాయి.


మడుల్లో అధిక దిగుబడి

ఒక్కో టమాటా మొక్క సాధారణంగా 45 రోజులపాటు కాయలు కాస్తుంది. ప్రత్యేక మడిలో పోషకాలు నేలలోకన్నా బాగా అందుతాయి. కాబట్టి 60 రోజుల పాటు కాయలు కాస్తుందని, ఒక్కో మొక్క 20 నుంచి 25 కిలోల దిగుబడినిస్తుందని డాక్టర్ రామారావు ‘ఇంటి పంట’ ప్రతినిధితో చెప్పారు. టమాటా మొక్కలను రెండు అడుగులకో మొక్కను నాటాలన్నారు. ప్రత్యేక మడిలో వాడే మట్టి మిశ్రమం మొక్కకు వేళ్లు బాగా ఏర్పడేందుకు సాయపడుతుందని, పోషకాలు పుష్కలంగా అందడం వల్ల చక్కటి దిగుబడి ఇస్తుందని ఆయన తెలిపారు. మడులు ఏర్పాటుచేసుకున్న మొదటి పంట దిగుబడి అంతబాగా రాదని, లోపాలు సరిదిద్దుకుంటే ఆ తర్వాత నుంచి మంచి దిగుబడి తీయవచ్చన్నారు. అన్నిటికీ మించి అత్యంత ఆరోగ్యదాయకమైన, రుచికరమైన పంటలను ఇలా పెంచుకోవచ్చన్నారు. సహజాహారం ప్రాధాన్యం తెలుసుకున్న వారికి ఇంటి దగ్గర మడులలో, కుండీల్లో సాగుచేయడం సులువేనని రామారావు చెప్పారు. సందేహాలున్న వారు తనకు ఫోన్ చేయవచ్చని డాక్టర్ రామారావు (99484 39329) తెలిపారు.

ఒక్క రోజు శిక్షణ చాలు!
అందరూ తమ కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో కనీసం 50 శాతం మేరకైనా ఇంటిపట్టున పండించుకోవాలని డాక్టర్ జీబీకే రావు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరడంతో పాటు, కూరగాయల రవాణాకు వాడే ఇంధనం ఆదాతో పర్యావరణపరంగా దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. కిచెన్ గార్డెనింగ్‌పై తమ రిసార్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ హార్టికల్చరిస్ట్ ప్రవీణ్‌ను *  91601 75197 నంబరులో సంప్రదించవచ్చన్నారు. కనీసం పది మంది అడిగితే ఏ రోజైనా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.

సహజ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి

ప్రభుత్వం సహజ సేద్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ రావు అన్నారు. రసాయనిక సేద్యాన్ని భారీ సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ప్రపంచం యావత్తూ ఆదరిస్తున్న సహజ సేద్యాన్ని, దీనిపై పరిశోధనను విస్మరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఏ పార్కులోనో, ఖాళీ స్థలమో కేటాయించి ప్రోత్సహిస్తే శిక్షణ కేంద్రాలు నెలకొల్పడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రైవేటు సంస్థలను సైతం ప్రభుత్వం తగురీతిలో ప్రోత్సహించాలన్నారు.

Gouthamaraju as WUA