పాడి పంటలు

Monday, May 16, 2011

రైతు హైకూ * గ్రంథపు చెక్క

 
నేల ప్రసవించి
మొలకలు పులకలు
ముంగారు పైరు

విరగ గాచిన

గంపలు గంపలు
రైతు కలలు


 





 సంతల నిండా
ఆశపడిన కళ్లు
రైతు శ్రమలు

అమ్ముడు పోదు

యింటికీ చేరదు
రైతు కష్టం



శ్రమ ఫలాలు
చెల్లని చిల్లిగవ్వలు
ఉక్రోషం పాలు

రైతు బతుకు
పంటలో తాలు
దిబ్బలపాలు


- జి. వెంకట కృష్ణ
(‘కొన్ని రంగులు ఒక పద్యం’ నుంచి)

Saturday, May 7, 2011

రైతుకు అరటి మాధుర్యం అందాలంటే...

అరటి పండు ఒక మధుర ఫలం. కానీ ఆ మాధుర్యం రైతుకు అందుతోందా?... లేదనే చెబుతున్నారు చాలా మంది రైతులు. దీనికి కారణాలు అనేకం. గెల దశలో రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సైతం మార్కెటింగ్ సమయంలో పెద్ద నష్టాల్నే కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరటి చెట్లలో గెల వేసినప్పటి నుండి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అరటి పిలకలు నాటిన తర్వాత సుమారు తొమ్మిది నెలలకు గెలలు వేస్తాయి. ఆ తర్వాత రెండు నుండి మూడు నెలలకు కోతకు వస్తాయి. ఈ మూడు నెలల కాలంలో చెట్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కో చెట్టుకు 20-30 కిలోల బరువుండే ఒక్కో గెలే వస్తుంది. బరువు కారణంగా గెల ఉన్న వైపుకే చెట్టు వాలి ఉంటుంది. ఇలాంటి చెట్లు చిన్నపాటి గాలులు వీచినా నేలకు ఒరుగుతాయి. నేలకొరిగిన చెట్లకు ఉన్న గెలలు పక్వానికి రావు. వీటిని మార్కెట్‌లో అమ్మడం కష్టం. అంటే నేల మీదకు ఎన్ని చెట్లు ఒరిగిపోతే రైతు అన్ని గెలలు నష్టపోయినట్లే. చెట్టు వాలుతున్నట్లు గమనించగానే వెంటనే పోట్లు (సపోర్టు కర్రలు) పెడితే నష్టాన్ని నివారించొచ్చు. వీటిని గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో పెట్టాలి. ఆ పోట్లు గెలకు తాకకుండా వాలుగా ఉండాలి. లేకుంటే కాయలకు రాపిడి జరిగి మచ్చలు ఏర్పడతాయి. అలాంటి కాయల్ని కొనడానికి ఎవరూ ఇష్టపడరు.

మార్కెట్ అవసరాల మేరకు...

అరటి కాయలు పిందె దశలో ఉన్నప్పుడు పచ్చాలుగా (నాలుగు పక్షాలుగా లేదా పలకలుగా) ఉంటాయి. పిందెలు లావు పెరుగుతున్న కొద్దీ పచ్చాలు తగ్గుతూ వస్తాయి. పూర్తిగా పక్వానికి వచ్చిన అరటి కాయలు గుండ్రంగా తయారై బాగా బలిష్టంగా ఉంటాయి. ఈ దశ దాటితే కాయలు చిట్లిపోతాయి. అందువల్ల మార్కెట్ అవసరాన్ని బట్టి గెలల్ని వివిధ దశల్లో కోయాల్సి ఉంటుంది. ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికైతే 80 శాతం పక్వానికి రాగానే గెలల్ని కోయాలి.

పూర్తిగా పక్వానికి వచ్చిన గెలల్ని సుదూర ప్రాంతానికి ఎగుమతి చేస్తే అవి మధ్యలోనే పూర్తిగా పండిపోతాయి. స్థానిక మార్కెట్లకు సరఫరా చేసేట్లయితే పూర్తిగా పక్వానికి వచ్చిన గెలల్ని మాత్రమే కోయాలి. ఎందుకంటే ఈ గెలలు 80 శాతం పక్వానికి వచ్చిన గెలల కంటే అయిదారు కిలోలు ఎక్కువ బరువు తూగుతాయి. సాధారణంగా మనం నాటే అరటి రకాన్ని బట్టి గెల వేసిన 75-100 రోజుల్లో కోతకు వస్తుంది. అంతకంటే ముందే గెలల్ని కోసినట్లయితే బరువు తక్కువ తూగి రైతుకు నష్టం జరుగుతుంది. అలాగని ఎక్కువ రోజులు ఉంచితే కాయలు చిట్లిపోవడం, మాగిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, గెలల పక్వ దశల్ని దృష్టిలో ఉంచుకుని కోయాలి.


ఎలా కోయాలి?

అరటి గెలల్ని కోయడానికి రైతులు కొడవళ్లను వాడుతుంటారు. ఇవి చిన్నవిగా ఉండి, ఎక్కువ వంపు తిరిగి ఉండడం వల్ల గెలను కోసేటప్పుడు కాయలకు గాట్లు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల గెలల్ని కోయడానికి పొడవైన, చివరలో కొద్దిగా వంపు తిరిగిన ప్రత్యేకమైన కత్తులు వాడాలి. వీటిని ఉపయోగించడం చాలా సులభం. గెలలు కూడా దెబ్బతినవు. గెలల్ని కోసే కొడవళ్లు తుప్పు పట్టకుండా చూసుకోవాలి. తుప్పు పట్టిన కొడవళ్లతో కోసినట్లయితే గెలలకు శిలీంధ్రాలు ఆశించి త్వరగా పాడైపోతాయి. శిలీంధ్రాలు ఆశించిన గెలల్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించరు.

గెలలు కోసేటప్పుడు ఆరు నుండి తొమ్మిది అంగుళాల మేరకు కాడ ఉంచాలి. గెలలు ఎక్కువ బరువు ఉంటాయి కాబట్టి వాటిని కింద పడకుండా... అంటే ఒక వ్యక్తి పట్టుకుని ఉంటే మరో వ్యక్తి జాగ్రత్తగా కోయాలి. పొరపాటున గెల కింద పడితే కాయలన్నీ పగిలి పోతాయి. కాబట్టి అనుభవజ్ఞులైన వారితో కోయించాలి. సాధారణంగా చెట్టు నుండి గెలల్ని కోయగానే నేల మీద పెడుతుంటారు. అలా చేస్తే కింద ఉన్న మట్టి, పుల్లలు వంటివి అంటుకొని కాయలకు జీరలు పడి నునుపుదనం కోల్పోతాయి. గెలను కోసే ముందే అరటి ఆకు లేదా గోనె సంచి పరిచి దానిపై గెలని పెట్టాలి. కోసిన గెలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో ఉంచకూడదు. అలా చేస్తే కాయల లోపల ఉష్ణోగ్రత పెరిగి తొందరగా మెత్తబడతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందువల్ల గెలల్ని చెట్టు నీడన లేదా కొట్టంలో ఉంచాలి.


కోసిన గెలల్ని ఒక దాని పైన మరో దాన్ని ఉంచకుండా విడివిడిగానే ఉంచాలి. ఒక దాని పైన మరొక గెల ఉంచితే అడుగు భాగంలో నేలకు ఆనుకుని ఉన్న కాయలు పై బరువు కారణంగా దెబ్బ తింటాయి. గెలను కోసిన తర్వాత కాడ నుండి స్రవించే ద్రవం కాయల పైన పడకుండా చూడాలి. ఈ ద్రవం కాయల మీద పడితే ఎండిపోయిన తర్వాత బంక లాగా నల్లటి చారలు ఏర్పడతాయి. అవి చూడడానికి అసహ్యంగా కన్పిస్తాయి. అందుకే ద్రవం పూర్తిగా కారిన తర్వాతే గెలల్ని రవాణా చేయాలి. కోసిన గెలల్ని తోట నుండి బయటికి తరలించేటప్పుడు ఇంకా కోయని చెట్లకు ఉన్న గెలల్ని తాకకుండా చూడాలి. తాకితే వాటి సహజ పాలిషింగ్ పోయే అవకాశముంది.


పాలిషింగ్ పోయిన భాగాల్లో మాగిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గెలల్ని మార్కెట్‌కు తరలించేటప్పుడు వాటికి ఆకులు చుట్టి రవాణా చేయాలి. దీనివల్ల కాయలపై ఒత్తిడి తగ్గుతుంది. రవాణాలో జరిగే నష్టాన్ని నివారించవచ్చు. గెలల్ని కాకుండా కాయల్ని హస్తాలుగా విడదీసి శుద్ధి చేసి పెట్టెల్లో పెట్టి రవాణా చేయడం మంచిది. పెట్టెల్లో రవాణా చేసిన అరటి కాయల్ని ‘ఏసీ’ల్లో మాగపెట్టడం సులభం. ప్రస్తుతం అరటి కాయల్ని ఏసీలో మగ్గపెట్టడానికి కిలోకు 1.40 రూపాయలు ఖర్చవుతుంది. ఒక్కో హస్తానికి 12-15 కాయలు ఉండే విధంగా గెల నుండి కాయల్ని కోసి వేరు చేయాలి. వేరు చేసిన హస్తాల్ని నీటిలో శుభ్రపరచాలి. దీనివల్ల కాయలకు అంటిన దుమ్మూ ధూళి పోయి శుభ్రంగా, ఆకర్షణీయంగా కన్పిస్తాయి. శుభ్రపరచడానికి వాడే నీటిలో లీటరుకు 0.5 గ్రాముల చొప్పున బావిస్టిన్ కలిపితే కాయల్ని శిలీంధ్రాలు ఆశించవు. ఈ సూచనలన్నీ పాటిస్తే రైతులు అరటి సాగులోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. అరటి సాగులో నా అనుభవాలనే ఇక్కడ పొందుపరిచాను.


- ఎం.వి.రమేష్ కుమార్ రెడ్డి

Monday, May 2, 2011

రైతు డ్వాక్రాలే వ్యవ'సాయమ'వుతాయి

నానాటికీ పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, తగ్గుతున్న పంట ధరలు రైతన్నలను అప్పులపాలు చేసి ఆత్మహత్యల వైపు నెట్టడం చాలదన్నట్టు వ్యవసాయ రంగానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. పొలాల్లో పని చేయడానికి కూలీలు దొరకకపోవడమే ఆ సమస్య. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లే కూలీలు దొరక్కుండా పోతున్నారని, ఆ పథకాన్ని తీసేస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. కాని నిజానికి ఎప్పుడో రావాల్సిన పథకం అది.

స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్లకు గాని అది అమలుకు నోచుకోలేదు. ఆ పథకంతో వ్యవసాయ కూలీలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే కూలీ రేట్లు పెరిగినా ఆర్థికమాంద్యం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు ఆ పెరిగిన కూలీ రేట్లను తినేస్తున్నాయి. అందుకే ఈ సమస్యని లోతుగా పరిశీలించి, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయట పడేసే సరైన పరిష్కార మార్గాల కోసం మనందరం కృషి చేయాలి.


గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడడానికి భారీ సంఖ్యలో కూలీలు పల్లెల్నుంచి పట్టణాలకి, నగరాలకి వలస పోవడం మొదటి కారణం. ఉపాధి హామీ పథకం పుణ్యమా అని కూలి రేట్లు పెరిగి కూలీలు వారానికి ఏడు రోజులూ చాకిరి చేయాల్సిన అవసరం లేకుండా పోవడం రెండో కారణం. ఈ పథకం వచ్చాక చాలామంది కూలీలు వారానికి మూడు, నాలుగు రోజులు పని చేసి మిగతా రోజుల్లో సొంత పనులు చేసుకుంటున్నారు. పైగా వాళ్లిచ్చే కూలి రేట్ల వల్ల రైతు కూలీల సామాజిక స్థాయి గతంతో పోలిస్తే కాస్త మెరుగైంది. ఫలితంగా ఒకప్పుడు కూలీలకి రైతుల పట్ల ఉన్న 'విధేయత' తగ్గింది. కొన్ని రకాల పనులు చేయడానికి కూలీలు అసలు ఇష్టపడడం లేదు, పైగా పని విషయంలో కూలీలదే పై మాట అవుతోంది. ఇదివరకట్లా కూలీలు సమయానికి రావట్లేదు.

(చాలా ప్రాంతాల్లో రైతులే కూలీలను ట్రాక్టర్లు, ఆటోలలో పొలాలకు తరలించి పని పూర్తయ్యాక మళ్లీ వాళ్లని ఇళ్లకి చేర్చాల్సి వస్తోంది). కూలి డబ్బుల కోసం వేచి చూసే ఓపిక పోయింది. పని పూర్తయిన వెంటనే కావాలంటున్నారు. ఇలాంటివే మరెన్నో కారణాలు. ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరగడం మూలంగా అది కూలీల పని విధానాన్ని, నీతిగా పని చేసే అలవాటుని దెబ్బతీసింది. ఆ ప్రభావం వాళ్లు రైతుల వద్ద చేసే పని మీద కూడా పడింది. అందుకే ఇప్పుడు కూలీలు ఐదారు గంటలే పని చేసి ఎనిమిది గంటల పనికిచ్చే కూలిని ఆశిస్తున్నారు. వీటన్నిటి వల్ల ఇప్పుడు రైతులు, కూలీల మధ్య సంబంధాలు చెడిపోయాయి.
అసలీ పరిస్థితి ఎలా వచ్చింది? ఆంధ్రప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే- ప్రభుత్వ విధానాలు, పథకాలు, మెరుగైన విద్య, నగరాల్లో ఆర్థికాభివృద్ధి, దళితులలో ప్రశ్నించే నైజం పెరగడం.. వీటన్నిటి వల్లే.

1. ప్రభుత్వ విధానాలు, పథకాలు :


అ: ఎన్‌టిఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం 1980ల నుంచి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కేంద్రప్రభుత్వ 'ఆహార భద్రత బిల్లు'తో దీనికి ఇంకా బలం చేకూరింది.
ఆ: జీవితంలో ఏనాడూ బ్యాంకు గడప తొక్కుతామని అనుకోని పేద మహిళలు డ్వాక్రా కారణంగా నేడు పైసాపైసా కూడబెట్టుకుని వాటిని బ్యాం కుల్లో దాచుకుంటున్నారు. బ్యాంకులిచ్చే రుణంతో కాస్తో కూస్తో పొలం కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, పచ్చళ్ల తయారీ, గేదెలు మేపుకోవడం లాంటి చిరు వ్యాపారాలకి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకుంటున్నారు.
ఇ: ఉపాధి హామీ పథకం వలన మెరుగైన కూలి పొందగలుగుతున్నారు. అన్నిటి కన్నా ముఖ్యంగా ఈ పథకం సాధించిన విజయం ఏమిటంటే.. గ్రామాల్లో అన్ని పనులకూ కూలి రేట్లు పెరిగాయి. గతంలో కూలి రేట్లను రైతులు నిర్ణయించేవారు, అలాంటిది ఇప్పుడు వాళ్ల చేత పని చేయించుకోవాలంటే కూలి రేట్లు పెంచక తప్పదని వాళ్లు గ్రహించారు.

2. మన దేశం సాధించిన ఆర్థిక పురోగతి ఫలితంగా విద్యావకాశాలు పెరిగాయి. విద్యపై అవగాహన, ఆసక్తి రెండూ పెరిగాయి. పట్టణాలు, నగరాలలో మెరుగైన ఆదాయ అవకాశాల కోసం జనం భారీగా తరలిపోతున్నారు. పేదరికం వల్ల నగరాలకు వెళ్తున్న కూలీల వలసలను ఉపాధి హామీ పథకం ఆపగలిగినా మెరుగైన అవకాశాల కోసం గ్రామాల్ని విడిచి వెళ్లడం మాత్రం కొనసాగుతూనే ఉంది. దీని వల్ల గ్రామాల్లో పని చేసే వారి సంఖ్య తగ్గింది. చదువుకున్న యువత విషయంలో ఇది మరీ నిజం. కూలి విషయం అటుంచితే తమ సొంత పొలంలో కూడా పని చేయడానికి ముందుకు రావట్లేదు వాళ్లు. స్కూలుతోనే చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టిన కుర్రకారు కూడా పొలం పని బదులు పట్నం వెళ్లి ఏదో ఒక పని చేసుకుందాం అనుకుంటున్నారు. పట్నాల్లో పని దొరుకుతుందా లేదా, దొరికినా తగిన కూలి వస్తుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా అందరూ పట్నం వైపే చూస్తున్నారు.

3. సామాజిక ఉద్యమాల ప్రభావం వల్ల, రాజకీయ అవగాహన పెరగడం వల్ల, ప్రజాస్వామిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం వల్ల అట్టడుగు కులాల్లో ఆత్మగౌరవం పెరిగింది. అగ్రకులాలతో తామూ సమానమే అన్న భావన వారిలో వచ్చేసింది.
వీటన్నిటి మూలంగానే పైన పేర్కొన్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి రైతులందరూ తమకు తోచిన పద్ధతిలో ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటిలో ముఖ్యమైన పరిష్కారమార్గం కూలీలు పెద్దగా అవసరం లేని చెట్ల తోటల పెంపకం వైపు మొగ్గు చూపుతూ ఆహార పంటల సాగును వదిలేస్తున్నారు. కూలీలకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలను నాటే యంత్రం(డ్రమ్ సీడర్), కలుపు యంత్రం, నూర్పిడి యంత్రం, పాలు పితికే యంత్రం.. ఇలా ఎన్నో యంత్రాలను సమకూర్చుకుంటున్నారు.

వ్యవసాయం చెయ్యాల్సింది మనుషులా యంత్రాలా?

యంత్రాలు అన్ని పొలం పనులూ చెయ్యలేవు. మనకే కాదు పశ్చిమ దేశాల్లో కూడా అటువంటివి లేవు. ఒక వేళ ఉన్నా సరే వ్యవసాయానికి మనుషులు అవసరమే కాని వారు వ్యవసాయానికి భారమైతే కారు. పొలం పనికి మానవ శక్తి, శ్రమ, పరిశీలన తప్పనిసరి.

ఈ మాట ఎందుకు అనాల్సొస్తోందంటే...


వ్యవసాయం అంటేనే మానవులు మాత్రమే చేయగలిగిన పని. మన చుట్టూ ఉన్న అనేక రకాలయిన చెట్లు, మొక్కలు, అడవుల నుంచి మనకు అవసరమైన వాటిని ఎంపిక చేసుకుని వాటిని పెంచే క్రమంలోనే వ్యవసాయం వృద్ధి చెందింది. వాటి వాటి లక్షణాలను బట్టి, మన అవసరాన్ని బట్టి వాటిని పెంచుకుంటూ వచ్చాం. శతాబ్దాల కాలంలో వాటిలో నుంచి కొన్నిటిని ఎంపిక చేసి వాటిని పండిస్తున్నాం. అలా ఇప్పుడు ఎన్నో రకాల పంటలు, మరెన్నో వెరైటీలను సృష్టించగలిగాము.

తగిన వనరులుంటే రైతులు ఇప్పటికీ కొత్త కొత్త పంటలు పండించడానికి, వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతారని నా సొంత అనుభవంతోటి చెబుతున్నాను. ప్రతి పైరు, ప్రతి సీజన్, ప్రతి సంవత్సరం రైతుకు ఒక సవాలు, ఒక అనుభవమే. ఈ ఆటలో రైతు ఎంత అప్రమత్తంగా ఉంటే ఫలితాలు అంత బాగా వస్తాయి. అందుకే పెద్ద పెద్ద కమతాల కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తేనే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలొస్తాయి. మానవ పరిశ్రమ ఉన్నప్పుడే పంటల్లో వైవిధ్యం, నాణ్యత పెరుగుతాయి.

అక్కడ కంపెనీల చేతులోకి...


ప్రకృతితో మనిషి ఆడే ఈ ఆటలో ఈ మధ్య శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అగ్రిబిజినెస్ వ్యాపారులూ ప్రవేశించారు. చూడబోతే హఠాత్తుగా వాళ్లు వ్యవసాయాన్ని హైజాక్ చేసినట్లనిపిస్తోంది. అమెరికా, యూరప్‌లలో కూడా ఇదే జరిగింది. రైతుని పొలాల నుంచి బయటకి నెట్టేసి పెద్ద పెద్ద యంత్రాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల సాయంతో వ్యాపారులు యాభై అరవై ఏళ్ల నుంచి వ్యవసాయ సామ్రాజ్యాల్ని నిర్మించారు. అందుకే ఆ దేశాల్లో ఇప్పుడు 2 నుంచి 3 శాతం జనాభా మాత్రమే రైతులు. అదే మన దేశంలో 60 శాతం దాకా వ్యవసాయంపై ఆధారపడి బతికే వారే. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరిగి, కార్పొరేట్ సాగు మొదలైతే మన దేశ రైతులు కూడా పొలాల్లో నుంచి గెంటేయబడతారు. వారికి జీవనోపాధే కరువవుతుంది. పశ్చిమ దేశాల్లో అదే జరిగింది. ఆ దేశాలన్నీ తమ తప్పును ఇప్పుడు తెలుసుకుంటున్నాయి. కనుమరుగైన రైతులను మళ్లీ వ్యవసాయంలోకి తీసుకురావాలనుకుంటున్నాయి. ఎందుకో తెలుసా?

పారిశ్రామిక వ్యవసాయం వల్ల సాగులో వైవిధ్యం తగ్గిపోయి ఎన్నో పంటలు అంతరించి పోయాయి. అమెరికానే ఉదాహరణగా తీసుకుంటే ఆ దేశంలో ఒకప్పుడు యాభై రకాల యాపిల్స్ పండించే వారు. కాని ఇప్పుడు కేవలం నాలుగైదు రకాలు మాత్రమే మిగిలాయి. ముందు చెప్పుకున్నట్టు మన దేశంలో రెండు వేల రకాల వంకాయలు పండుతాయి. ఏదయినా ఒక ప్రాంతం నుంచి ఓ వంద కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్పకుండా కొత్త వెరైటీ వంకాయల్ని చూడొచ్చు. అదే పరిశ్రమలు వ్యవసాయం చేస్తే, వందల ఎకరాల్లో ఒకే ఒక వెరైటీని పండిస్తారు. అలా చేయడం వల్ల కొంత కాలానికి మిగతా వెరైటీలన్నీ ఈ భూమి మీద నుంచి అంతరించి పోతాయి. అందుకే వ్యవసాయంలో రైతు ప్రమేయం ఉండాలి. కాని పారిశ్రామిక వ్యవసాయం వస్తే రైతుల చేతి నుంచి పొలాలు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయి కాబట్టి ఆ వ్యవసాయంలో రైతు ప్రమేయం అసాధ్యం.

రైతులు, కూలీలు వ్యవసాయంవదిలి పోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదే నేటి సమస్య. వ్యవసాయం చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉండేలా మన వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. వాళ్లు వ్యవసాయంలో కొనసాగడాన్ని అసాధ్యం చేయకుండా చూసుకోవాలి.

పరస్పర సహకారం అవసరం


వ్యవసాయాన్ని రైతులు, కూలీలే చేయాలని, యంత్రాలు, రసాయనాలు కాదు అని గనక మనం అనుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో రైతులు, కూలీల మధ్య పరస్పర సహకారం అవసరం. పొలం పని కొన్ని సీజన్‌లలో ఎక్కువగా ఉంటుంది. నాట్లు, కలుపులు, కోతలు, నూర్పిళ్లు లాంటి సమయాల్లో ఎక్కువమంది కూలీలు అవసరమవుతారు. మామూలుగా కూలీల అవసరం లేకుండా తమ పొలం పని తామే చేసుకునే చిన్నకారు రైతులకు కూడా ఆ సమయాల్లో కూలీల అవసరమవుతారు. కొన్ని పనుల్లో యంత్రాలు, రసాయనాలు కొంతవరకు ఉపకరించినా రైతులకు, కూలీలకు మధ్య పరస్పర సహకారం ఉన్నప్పుడే పనులు సాఫీగా అవుతాయి. ఆ కూలీలు తోటి రైతులు కావచ్చు, లేదా భూమి లేని వ్యవసాయ కూలీలు కావచ్చు. ఇద్దరి మధ్య సహకారం ఉండి పని సక్రమంగా చేసినపుడే మంచి దిగుబడి సాధ్యమవుతుంది.

వ్యవసాయంలో ఉత్పత్తి సంబంధాలను పునస్సమీక్షించి, పునర్నిర్వచించడం నేటి తక్షణ అవసరం. ఎందుకంటే ఇదివరకట్లా వ్యవసాయం చేయడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. గతంలో సాగు భూమి ఎక్కువగా అగ్రకులాలకు చెందిన కొందరు భూస్వాముల చేతుల్లోనే ఉండేది. వారి దగ్గరి నుంచి పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసే వాళ్లంతా కింది కులాల వాళ్లే ఉండేవారు. దళితుల్లో దాదాపు అందరూ భూమి లేని కూలీలే కాబట్టి వారి చేత భూస్వాములు, కౌలు రైతులు పని చేయించుకుని చాలీ చాలని కూలి మాత్రమే ఇచ్చేవారు.

రైతులు అప్పుల పాలయ్యారు


ఇప్పుడు కాలం మారిపోయింది. రకరకాల చట్టాలొచ్చాయి. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా ఆ చట్టాల వల్ల ఎంతో కొంత ప్రయోజనమైతే చేకూరింది. వాటితో పాటు పైన పేర్కొన్న పథకాలు కూలీల స్థితిగతుల్లో చెప్పుకోతగ్గ మార్పులే తేగలిగాయి. దళితులు కూడా ఎంతో కొంత భూమిని సంపాదించుకోగలిగారిప్పుడు. ఉపాధి హామీ పథకం వల్ల కూలి రేట్లు పెరిగాయి. కాని అదే సమయంలో రైతుల ఆర్థిక స్థితి క్షీణించింది. వ్యవసాయ ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. వీటన్నిటి ప్రభావమే రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోంది. రైతులకు ఇదివరకెప్పుడూ ఇంతటి గడ్డుకాలం ఎదురు కాలేదు.

దళిత రైతులతో పాటు చిన్న రైతులందరూ కష్టాల ఊబిలో కూరుకుపోయి వ్యవసాయాన్ని కొనసాగించే పరిస్థితుల్లో లేరు. అయితే ఏమిటి అంటారా? ముందు చెప్పుకున్నట్లుగా రైతులు గనక సాగు చేయలేకపోతే యంత్రాలు, పెద్దపెద్ద కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. పశ్చిమ దేశాల్లో జరిగిందే ఇక్కడా జరుగుతుంది. తామే వేసుకున్న ఏ పీటముడుల నుంచయితే పశ్చిమ దేశాలు బయట పడడానికి ప్రయత్నిస్తున్నాయో ఆ ముడుల్నే మనం వేసుకున్న వాళ్లమవుతాం. అంతే కాదు, వ్యవసాయంపై ఆధారపడిన కోట్ల మంది జనాభాకి నగరాలు పని కల్పించ లేవు. వ్యవసాయ ఆధార ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించి అది నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టాలి తప్ప మనకు మరో మార్గం లేదు.

కమీషన్లు కంటితుడుపుకే...


రైతులకు లాభాలను పెంచే దిశగా ఎన్నో సిఫార్సులు ముందుకొచ్చాయి. జాతీయ రైతు సంక్షేమ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంక్షేమ కమిషన్ వీటిలో ముఖ్యమైనవి. రైతు సంఘాలు, పౌర సంఘాలు మెరుగైన పథకాల కోసం ఉద్యమిస్తూనే ఉన్నాయి. దిగుబడులకు కనీస మద్దతు ధర పెంచాలని, నష్ట పరిహారం చెల్లించాలని, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని వాళ్లు కోరుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమకు తోచినపుడు ఏవో కొన్ని డిమాండ్లపైనే స్పందిస్తున్నాయి. ఇదంతా గమనిస్తుంటే వ్యవసాయం రైతుల చేతుల్లో కన్నా కంపెనీల చేతుల్లోకి వెళ్తేనే మంచిదని ప్రభుత్వాలు భావిస్త్తున్నాయేమో అనే సందేహం కలుగుతుంది.

మిగతా రంగాల్లో మాదిరిగానే వ్యవసాయంలోకి కూడా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. 'దున్నే వాడిదే భూమి' అనే నినాదాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు 'దున్నే స్తోమత (సాగుకి మూల ధనం) ఉన్న వాడిదే భూమి'గా మార్చేశాయి. రైతులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వాలు గనక వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచితే వినియోగదారులపై భారం పెరిగి నిరసనలు మొదలవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో వ్యవసాయాన్ని కొనసాగించడానికి రైతులేం చేయాలి? మామూలుగా అందరూ చేసే సూచనలు ఇవి- విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు ఇతరత్రా వ్యయాన్ని తగ్గించుకోవాలి. ఉత్పత్తి, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం ద్వారా లాభాలు గడించాలి. కాని ఇదంతా జరగాలన్నా రైతులకు, కూలీలకు మధ్య ఉత్పత్తి సంబంధాలు సక్రమంగా ఉండాలి. అదే నేటి సమస్య. వ్యవసాయ పనులు సాఫీగా సాగేలా ఈ సంబంధాలను ఎలా పునర్నిర్వచించుకోవాలో చూద్దాం.

ఆ రెండూ పాటించాలి


మొదటిది... కూలీలతో తమ సమస్యల్ని రాజకీయ నాయకులు గాని, ప్రభుత్వోద్యోగులు గాని పరిష్కరించలేరని రైతులు గుర్తించాలి. తామే ప్రయత్నించి వాటిని పరిష్కరించుకోవాలని గుర్తించాలి. చిన్న సన్నకారు రైతులు తమ అగ్రకుల, వర్గ డాంబికాలను వదిలిపెట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని నిందించే బదులు కూలీలతో సఖ్యంగా ఉండడానికి ముందుకు రావాలి. రైతులు ఒకప్పుడు కూలీలను తక్కువగా చూసి వారి శ్రమకి తక్కువ విలువ ఇచ్చేవారని గుర్తించాలి. తక్కువ కూలికి ఎక్కువ పని చేయాల్సిన భారం వారిమీద ఉండేదని, సామాజికంగా కూడా వారిని హీనంగా చూసే వారని గుర్తుంచుకోవాలి. వీటనిట్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు రైతులు పనివాళ్లకి తగిన కూలి చెల్లించడానికి సిద్ధపడాలి.

కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదు కాని చేసే పని సరిగా చెయ్యాలని కూలీలు కూడా తెలుసుకోవాలి. ఇచ్చే స్తోమత ఉన్నప్పుడే రైతులు పని వాళ్లకు ఎక్కువ కూలి ఇవ్వగలరని గమనించాలి. రాబడి తగ్గి, ఖర్చులు పెరిగిపోవడం వల్ల రైతులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దళిత కూలీలు చిన్న కారు రైతులుగా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్లూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. నిజానికి కూలీలకు ఇదంతా తెలియనిది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత తెలుసు కదా. రైతులు, కూలీలు ఇద్దరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంలోకి అడుగుపెడితే ఇద్దరికీ బతుకు తెరువు కరువై వలస పోవాల్సి వస్తుంది. అందుకే ఇద్దరూ కలిసి మెరుగైన కూలి రేట్లు, ధరలు, సామాజిక భద్రత... మొత్తం వ్యవసాయానికే మెరుగైన ఆదాయం కోసం పోరాడాలి.

రెండోది.. చిన్న సన్నకారు రైతులు ఏకమై స్వయం సహాయక బృందాలుగా ఏర్పడాలి. కూలిరేట్లు, సాగు నీరు, విద్యుత్తు, పంటల, అమ్మకాలు వగైరా అన్ని విషయాల పైన చర్చించుకునే బృందాలుగా ఉండాలి. ఈ బృం దాలు కూలి సహకార బృందాలు కావచ్చు, సాగునీటి సహకార బృందాలు కావచ్చు, అమ్మకాల సహకార బృందం కావచ్చు, అవన్నీ కలిసిన బృందం కావచ్చు. ఐదుగురు రైతులు, ఐదుగురు కూలీలు, పదిమంది మహిళలతో ఒక బృందం ఏర్పడిందనుకుందాం. రైతులకు అవసరమైనపుడు కూలీలు దొరికే విధంగా, పని వాళ్లకేమో చేసిన పనికి తగిన కూలి లభించే విధంగా, మహిళలకు తాము చేయదగిన పనులలో వారిని మాత్రమే తీసుకునే విధంగా ఒక ఒప్పందానికి వస్తే ఎలా ఉంటుంది? ఆచరణ సాధ్య మే అనిపిస్తుందా? ఈ దిశగా పయనించే అవకాశం ఏమైనా ఉందంటారా?

డ్వాక్రా బాటలో...


డ్వాక్రా బృందాలే ఈ ఆలోచనకు స్ఫూర్తి. పైసా కూడబెట్టలేని వాళ్లు డ్వాక్రా పుణ్యమా అని ఇప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోగలుగుతున్నారు. అదే విధంగా చిన్న రైతులు కూడా పరస్పర సహకారంతో వ్యవసాయాన్ని లాభదాయకం చేయొచ్చు. ఇక్కడ ఎన్‌జీవోల పాత్ర ముఖ్యం. ప్రభుత్వం డ్వాక్రాను ప్రవేశ పెట్టడానికి ముందే ఎన్‌జీవోలు మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశాయి. అలాంటి సృజనాత్మక, నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలు ఇలాంటి ప్రణాళికతో రైతు బృందాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నించాయి. అయితే అది విజయవంతం కాకపోవడానికి ఆ ఆలోచన రైతులలో పుట్టింది కాకపోవడం ఒక కారణమైతే దానిలో లోపాలుండడం రెండో కారణం.

ఇప్పటికైనా రైతులు ఒక్కటై ముందుకొచ్చి తమ ఉత్పత్తి సంబంధాల్ని పునర్నిర్మించుకోకపోతే కార్పొరేట్ వ్యవసాయ సునామీలో అందరూ కొట్టుకుపోవాల్సి వస్తుందని, చిన్న సన్నకారు రైతులు తమ భూమి, ఉపాధి రెండూ పోగొట్టుకోవాల్సి వస్తుందని గుర్తించాలి. ఓ వైపు పశ్చిమ దేశాలు పారిశ్రామిక వ్యవసాయ దుష్ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలా అని తలలు పట్టుకుంటుండగా మనం కూడా అదే బాటలో నడవడం హాస్యాస్పదం కదూ!

కూలీలు ఏమనుకుంటున్నారంటే..

ఉపాధే హాయిగా వుంది : అంజమ్మబాయి, బుజ్జిబాయి, ఖాశంభీ


పొద్దునెళ్లి సాయంత్రం దాకా చచ్చేలా పనిచేసినా వంద రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వరు. దీనికి తోడు ఆసాములతో పోట్లాటలు వుండనే వుంటాయి. అదే ఉపాధి పనికెళ్తే రోజుకి 121 రూపాయలొస్తాయి. మిగతా సదుపాయాలతో కలుపుకొని రోజుకు రూ. 140 నుండి 150 దాకా ముడుతుంది. కూలి డబ్బు నేరుగా అకౌంట్‌లో పడిపోతుంది. పనికి ఐదు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లాల్సొస్తే చార్జీకి మరో పది రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిల భూమి అభివృద్ధి పథకాన్ని ఈ ఉపాధి పనుల్లో కలపడం వల్ల మా భూముల్ని మేమే బాగు చేసుకొనటమే కాకుండా చేసిన పనికి కూలి కూడా పొందుతున్నాం. కాబట్టే ఎస్‌సి, ఎస్‌టిలమందరం వ్యవసాయ పనులను కాదని కొన్నాళ్లుగా ఉపాధి పనికే పోతున్నాం. ఉదయం 8 గంటలకు పనికి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వెళ్లేందుకు అధికారులు అంగీకరిస్తున్నారు. అందుకే మాకు పని పెద్ద కష్టమనిపించడం లేదు. ఇప్పుడు ఉపాధి పనిలో వేసవి భృతి కూడా అదనంగా ఇస్తున్నారు.

సంఘంగా ఏర్పడితేనే న్యాయం జరుగుతుంది : రాముడు, కారంపూడి


నేను చిన్నప్పటి నుండి కూలి పనికి వెళుతూనే వున్నాను. ఇప్పుడంటే ఉపాధి పని రాబట్టి కూలి రేటు కాస్త పెరిగింది కానీ అంతకు మునుపు రోజుకు 30 రూపాయలు ఇవ్వటమే గగనంగా ఉండేది. రైతుకు ఎంతొచ్చినా కూలోడికి ఇచ్చేది మాత్రం అంతే అన్నట్టుగా వుండేది. కూలి రేట్లు పెరగాలంటే ఏళ్లకేళ్లు పడుతుంది. వ్యవసాయ కూలీలను గ్రూపులుగా ఏర్పాటుచేస్తే మంచిదే. కూలి రేటు పెంచే విషయంలో మాలో ఐకమత్యం లేకపోవటం వల్ల ఇబ్బందవుతుంది. సంఘాలుగా ఏర్పడి పనికెళ్లడం మొదలుపెడితే కూలికి తగ్గట్టుగానే పనిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే కూలోడి శ్రమ దోపిడీకి గురవుతూనే వుంటుంది. అందుకే ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకొని కూలీలను గ్రూపులుగా ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలి.

* ఉమాశంకరి, విస్సా కిరణ్‌కుమార్ , పిడుగురాళ్ల
రచయితల సెల్ : 99897 98493, 97017 05743

Gouthamaraju as WUA