పాడి పంటలు

Monday, January 31, 2011

వలస బతుకుల్లో తులసి కాంతులు * మార్పు తెచ్చిన తులసి సాగు...* మహిళలు సాగించిన తులసి విప్లవం

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్ప మరేమీ ఉండేవి కావు. పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్‌ లేవు.సరైన పోషకాహారం లేదు. భర్తలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఆదాయం అంతంత మాత్రమే. ఈ దృశ్యం ఒక దశాబ్దం కిందటిది. పదేళ్ళు గిర్రున తిరిగేసరికి ఇప్పుడక్కడ అంతా ఆనందమే.ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు, అన్ని రకాల వసతులతో కూడుకున్న ఆ గ్రామాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. సుమారు 300మంది మహిళలు సాగించిన తులసి విప్లవం వారి జీవితాలనే మార్చేసింది.

tulasi1 
1998.. ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌ జిల్లాలో ఉన్న మహిళ లు అంతవరకు తమ గ్రామంలో చేస్తున్న వ్యవసాయంలో సమూలమార్పులు తీసుకు రావడానికి నడుం బిగించారు. తద్వా రా తమ జీవితాలతో పాటు తమ కుటుంబాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకో వాలని సంకల్పించారు. వీరంతా వలస జీవితం గడిపే కార్మికుల భార్యలు. వారంతా కుటుంబ సభ్యులను ఊరిలోనే వదిలేసి ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళుతుంటారు. అనే క ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తుంటారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో మాత్రమే సొంత గ్రామానికి వచ్చి పనులు చేసుకుంటారు.

అలా ఓసారి అందరూ కలిసినప్పుడు వచ్చిన ఆలోచనే తులసి పెంపకం. తులసిలో అనేక ఆర్గానిక్‌ పదార్థాలు ఉన్నాయి. అందుకే దాని పెం పకం ద్వారా తమ కుటుంబాలను బాగుచేసుకోవాలని నిర్ణయించారు. తులసి పెంప కానికి సంబంధించి అన్ని రకాల విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే అందు లోకిి అడుగు పెట్టారు. ఇందుకు సాయం చేసేందుకు ఒక కార్పొరేట్‌ సంస్థ ముందుకు వచ్చింది.వారి లక్ష్యం ముందు వారు పడిన శ్రమ చాలా చిన్నది గా మారిపోవడంతో ఇప్పుడు వారి ఆనందానికి ఆకాశమే హద్ద యింది.

మార్పు తెచ్చిన తులసి సాగు...
Tulsi2 
ఇప్పుడు వారి కుటుంబాలు వల స వెళ్లకుండా ఊరిలోనే వ్యవసా యపనులు చూసుకుంటూ హా యిగా జీవిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు విజయం సాధించారు. ప్రస్తుతం వారు లక్నోలో ఉన్న ఆర్గానిక్‌ ఇండియా అనే మల్టీ నేషనల్‌ కంపెనీ కోసం ఆర్గానిక్‌ తులసిని ఉత్పత్తి చేస్తున్నారు. ఆ ర్గానిక్‌ ఇండియా సంస్థ తులసి ఉత్పత్తికి అజమ్‌ఘర్‌ను ఎన్నుకోవడానికి ప్రధానకారణం అక్కడి భూములు తులసి పండించడానికి అనుకూలంగా ఉండడం తో పాటు ఆ జిల్లా అన్ని రకాలుగా అభివృ ద్ధి చెందే అవకాశాలు ఉండడమే.

40 సంవత్సరాల విమలమౌర్య అజమ్‌ ఘర్‌ జిల్లాలోని బిజౌరా గ్రామానికి చెందిం ది. గత 10 సంవత్సరాలుగా ఆర్గానిక్‌ తు లసిని పండిస్తున్నారు. ఈ తులసితో ఆర్గా నిక్‌ టీలు, ఆరోగ్యానికి ఉపయోగపడే వివి ధరకాల మందులు తయారు చేస్తున్నారు. మొదట తులసి పండించడం ప్రారంభిం చింది వివులనే. ఆర్గానిక్‌ ఇండియా నుంచి మొదటి అవకాశాన్ని వినియోగించుకున్న ది కూడా ఆమె.తనతోపాటు మరి కొంత మంది మిహళలతో కలసి తులసి పండించ డం ప్రారంభించారు. 35 సంవత్సరాల బీను విశ్వకర్మ కమెన్‌ పూర్‌ గ్రామానికి చెందినవారు. నలుగురు పిల్లలు.

tulasi 
‘కుటుంబాన్ని పోషించడమే చాలా కష్టంగా వున్న సమయంలో మేము తులసి పెంపకం మొదలు పెట్టిన తర్వాత దానితో మా అనుబంధం ఎంతగానో పెరిగింది. గతంలో మేము చేసిన వ్యవసాయానికి భిన్నంగా తులసి పెంప కం మొదలెట్టాం. కంపెనీ నిర్దేశించిన మార్గదర్శ కాలను అనుసరించే తులసిని పండిస్తాము.మొదట మేము చేయగలమా? అనుకున్నాము. కానీ తులసి పండించడానికి ప్రత్యేక పద్ధతులు వినియోగించాల్సిన అవసరం లేదని సాధారణ పంటల మాదిరే పండించ వచ్చని నిరూ పణ అయిన తర్వాత మా మీద మాకు విశ్వాసం పెరిగింది’ అని ఆమె చెబుతున్నారు.

అందరూ విజేతలే..
జిల్లాలోని మహిళలను ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తాయి. ఆర్గానిక్‌ ఇండి యా కంపెనీ ఇక్కడి గ్రామస్తులకు తులసి పం డించడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పింది. పెట్టుబడి పెట్టడానికి కూ డా ముందుకు వచ్చింది. అయితే వారి గ్రామా లు అభివృద్ధి చెందిన తర్వాత సంస్థ పెట్టుబడి సంస్థకు ఇచ్చేలా ఒక ఒప్పందం కుదుర్చు కుంది. ఇప్పుడు జిల్లాలోని వివిధ గ్రామాల్లో సుమారు 300 మంది మహిళలు తులసి సా గు మీదే అధారపడి ఉన్నారు. సుమారు 2వేల ఎకరాల్లో తులసి సాగవుతుంది. జులై, ఆగస్టు లో తులసిని విత్తితే నవంబర్‌ వరకు కోతకు వస్తుంది. కనీసం 2వేల టన్నుల వరకు ఇక్కడ ఉత్పత్తి సాగిస్తున్నారు. కిలో ఒక్కింటికి రూ. 100 చొప్పున కంపెనీ రైతులకు చెల్లిస్తోంది.

Tulsi3 
తులసి సాగు తర్వాత పది సంవత్సరాల క్రితం ఉన్న గ్రామాలకు ఇప్పుడున్న గ్రామాల కు చాలా తేడా వచ్చింది. గ్రామాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి.ప్రత్యేకంగా అల్లో పతి, ఆయుర్వేదిక్‌ ఆసుపత్రులు, వైద్యులు ఉన్నారు. గ్రామస్తులకు వారు ఉచిత వైద్యం అందిస్తారు. రోగులకు అవసరమైన మందులు అందజేయడంతో పాటు, హెర్బ ల్‌ ఉత్పత్తులను అందిస్తారు. శానిటేషన్‌ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది.వారి ఇళ్ళ ల్లో టాయ్‌లెట్ల నిర్మాణానికి కూడా సంస్థ సహకరించింది. బ్యాంకింగ్‌ సంస్థలు ఉన్నా యి. రైతులు పండించిన పంటకు సంబంధిం చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ యా బ్యాంకుల్లో నేరుగా వారి ఖాతాలో జమా అయ్యేలా ఆర్గానిక్‌ ఇండియా ఏర్పాట్లు చేసింది.

వెల్లివిరిసిన గ్రామీణ వికాసం....
ఆయా గ్రామాల్లో సామాజిక పరిస్థితులు కూడా అంతంత మాత్రం గానే ఉండేవి. బిజౌరా, కమెన్‌పూర్‌ గ్రామాల్లో 1999లో 63 శాతం స్కూల్‌ డ్రాపౌవుట్స్‌ ఉండేవారు. ఇప్పుడది 29 శాతానికి తగ్గింది. విమల, బీను వంటి రైతుల పిల్లలు స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి డాక్టర్‌ను కలవాలంటే వారం ముందే పేరు నమోదు చేయించుకోవాలి. వైద్యులు ప్రతి రోజు రెండు పూటల వైద్య సేవలు అందిస్తారు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. తులసి సాగు, కోత సమయంలో మగవారు వారి భార్యలకు సహాకారం అందిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని పంటలు..
ఈ వ్యవసాయ పద్ధతిని ప్రవేశ పెట్టడంలో ఆర్గానిక్‌ ఇండియా అం తర్జాతీయ సిఇఓ కృష్ణగుప్తా కృషి కూడా ఎక్కువే అని చెప్పా లి. అక్కడి మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆయ న చేసిన ప్రయత్నం విజయవం తమైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వారితో గోధమ, పప్పుధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు, పుష్పాలు సాగు చేయించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.చేేయూతనందిస్తే ఎంతటి కార్యానై్ననా అవలీలగా పూర్తి చేయగలమని ఈ మహి ళామణులు నిరూపించారు. తక్కువ కాలంలోనే వారి కుటుంబాలతో పాటు గ్రామా న్ని అభివృద్ధి చేసుకున్నారు.

Friday, January 28, 2011

పల్లె పచ్చని కూరగాయలు

పెరట్లో సేంద్రియ కూరగాయల పెంపకం...
ఇంటి ల్లిపాదికీ బాగు బాగు
తీగ జాతి కూరగాయల సాగుకు ఇదే అదను
ఆకుకూరలు, టమాటా, వంగ..
ఏ కాలంలోనైనా చక్కగా ఎదుగుతాయి
ప్రత్యేక మడుల్లో అధిక దిగుబడులు సాధ్యం


శీతాకాలం వెళ్లిపోతోంది. ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో ఇళ్ల దగ్గర కాస్తో కూస్తో పెరటి స్థలం ఉంటుంది. పెద్దగా ఖాళీ స్థలం లేకపోయినా ఐదూ పది గజాల స్థలమైనా ప్రతి ఇంటి ముందో, వెనుకో, పక్కనో ఉంటుంది. ఈ కాస్త జాగాలో ఏం పండిస్తాంలే అననుకోకుండా.. కాస్త మనసు పెట్టి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, అనేక రకాల కూరగాయలు పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చు.

రాబోయే రోజుల్లో ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ఇంటిల్లిపాదీ తినడానికి ఈ రోజే పని ప్రారంభించడం ఉత్తమం. ఒకవైపు కూరగాయల్లో విష రసాయనాల అవశేషాలు, మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న ధరలు... ఏ విధంగా చూసుకున్నా.. ఉన్నంత స్థలంలో కొన్ని రకాలైనా ఇంటి పట్టున పండించుకోవడం ఉత్తమం కదండీ....!

పశువుల నుంచి రక్షణ అవసరం
గ్రామాల్లో ఇళ్ల దగ్గర ఎంతో కొంత ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పశువులు మొక్కల్ని బతకనివ్వవు. ప్రహరీ లోపలైతే ఫర్వాలేదు. కనీసం ముళ్ల కంచె అయినా గట్టిగా కట్టుకొని మొక్కలు పెంచడానికి శ్రీరారం చుట్టాలి. పల్లెల్లో మొక్కలకు పశువులే కాదు.. కోళ్ల బెడద కూడా ఎక్కువే. ఇతరులవే కాదు మనకూ కోళ్లుంటాయి. వాటిని తిరగకుండా కట్టడి చేసుకుంటే తప్ప మొక్కలు ఎక్కిరావు.
ప్రణాళికతో ఏడాది పొడవునా పెరటి కూరగాయలు
అన్ని కూరగాయలు, ఆకుకూరలూ ఒకే రోజు విత్తుకోకూడదు. ఇప్పుడు గుప్పెడు గింజలు, వారం పది రోజులు గడిచాక మరికొన్ని గింజలు.. అలా విడతల వారీగా చల్లుకోవాలి. ప్రతి వారం ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలంటే ఇలాంటి ఉపాయం అవసరమే. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతోపాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం పెంచుకోవచ్చు.

ఏ ఏ రకాల సాగుకు తగిన సీజన్ ఇది?
ఆకుకూరలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా చక్కగా పెరుగుతాయి. పాలకూర, చుక్కకూర.. తదితర ఆకుకూరలు మూడు, నాలుగు వారాల్లో కోతకు వస్తాయి. మొక్కలను కత్తిరిస్తే మళ్లీ పిలకలు వేస్తాయి. కత్తిరించిన తర్వాత మట్టిని గుల్ల చేసి చారెడు కంపోస్టు చల్లి నీరుపోస్తే చాలు. పిలకలు పెరిగాక కోసుకొని.. మళ్లీ విత్తనాలు చల్లుకోవాలి. మెంతి మొక్కల్ని మూడుసార్ల వరకూ కత్తిరించుకోవచ్చు. గోంగూర మొక్క నుంచి ఆకుల్ని కోసుకోవాలి. పూత, పిందె వచ్చేంత కోసుకుంటూ ఉండొచ్చు. మొక్క బచ్చలి మాత్రం 45 రోజులకు కోతకు వస్తుంది.

పందిళ్లతో అధిక దిగుబడులు
పెరటి తోటల్లో తీగజాతి మొక్కల పెంపకానికి ఇది చక్కటి సీజన్. బీర, పొట్ల, కాకర, దోస తీగలను చక్కగా పందిళ్లు వేసి పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. భారీగా పందిళ్లు అక్కర్లేదు. ఇంట్లో వాళ్లే తీరిక ఉన్నప్పుడు నాలుగు పురికొసలో, ఇనుప తీగలో కట్టి వాటిపైకి మొక్కల్ని పాకిస్తే చాలు. కొంచెం ఆసరా ఇస్తే చాలు. ఇంటి మీదకో, పందిరి మీదకో అల్లుకొని చక్కని దిగుబడినిస్తాయి. తీగ బచ్చలి వేసుకుంటే ఏడాది పొడవునా ఆకుకూర అందుబాటులో ఉంటుంది. దొండ పాదు నాటుకుంటే మూడేళ్ల వరకూ దిగుబడి ఇస్తూనే ఉంటుంది.

బెండకూ ఈ సీజన్ భేష్
బెండ సాగుకూ ఇది మంచి సీజన్. రెండు నెలల్లో కాపుకొస్తుంది. ఒకటిన్నర నెలలు కాస్తుంది. ఇంట్లో ఎందరు ఉంటారనే దాన్ని బట్టి ఎన్ని మొక్కలు వేసుకోవాలో చూసుకోవాలి. గోరుచిక్కుడు, మొక్కజొన్న.. టమాటా, వంగ వంటి పంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. బీర విత్తనం నాటిన నెలన్నర, రెండు నెలల్లో కాయలు కోతకు వస్తాయి.

పొట్ల తీగను పందిరిపైకి పాకిస్తే మంచి దిగుబడి వస్తుంది. కాయలు వంకరైపోకుండా రాయి కట్టాలి. వంగ మూడు నెలల్లో కాపుకొస్తుంది. 6 నెలల వరకూ కాపు ఉంటుంది. తర్వాత చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి.. కొంచెం కంపోస్టు వేస్తే.. మళ్లీ ఏపుగా పెరిగి కాపుకొస్తుంది. ఏడాదికిపైగా వంకాయలకు ఢోకా ఉండదు. వంగకే పురుగుల బెడద ఎక్కువ. ఏ రెమ్మకు తెగులు వచ్చినా అక్కడికి తుంచేసి నాశనం చేయడం అవసరం. టమాటా మొక్క వేసిన 2 నెలల్లో కాపుకొస్తుంది. రెండు నెలల పాటు కాయలు ఇస్తుంది.

సేంద్రియ ఆహారమే ఆరోగ్యం
రసాయనాలు వాడకుండా పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యం, కమ్మటి రుచి కూడా. ఖాళీ ఉంది కదా అని గొయ్యి తీసి ఆ మట్టి ఎలా ఉన్నా విత్తనం వేస్తే సరిగ్గా పెరగకపోవచ్చు. అందుకే... మట్టి, పశువుల ఎరువు, వర్మి కంపోస్టు లేదా ఇంటి వద్ద తయారుచేసుకున్న ఆకుల ఎరువు(లీఫీ మౌల్డ్) కలిపి ప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న మిశ్రమం వాడితే ఫలితం బావుంటుంది. ఈ మట్టి మిశ్రమంతో ప్రత్యేకంగామడులను తయారుచేసుకొని కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటే మామూలుగా కన్నా 3 నుంచి 5 రెట్లు అధిక దిగుబడి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఎరమ్రట్టి వాడితే ఇసుక కలపనక్కర్లేదు
కొన్ని ప్రాంతాల్లో నల్లమట్టి, మరికొన్ని ప్రాంతాల్లో ఎరమ్రట్టి ఉంటుంది. నల్లమట్టికి త్వరగా గట్టిపడి పిడచకట్టుకుపోయే స్వభావం ఉంది. దీనివల్ల మొక్కలు బాగా పెరగవు. అందుకని ఎరమ్రట్టి వాడితే మంచిది. నల్లమట్టే వాడాల్సి వస్తే కంపోస్టు, పశువుల ఎరువు వంటి వాటితోపాటు ఇసుకను కూడా కలపడం మంచిది. ఎరమ్రట్టి రెండుపాళ్లలో మిగతా సేంద్రియ ఎరువులు ఒక్కోపాళ్లలో కలిపి మొక్కలు పెంచొచ్చు. నల్లమట్టి అయితే ఒక పాలు కలిపితే మంచిది.
వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు తగినంత దొరక్కపోతే మట్టి, కంపోస్టు సమపాళ్లలో వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే... 65 శాతం మట్టి, మిగతా భాగం సేంద్రియ ఎరువులు కలిపి వాడొచ్చు. వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, మాగిన కొబ్బరి పొట్టు సాధ్యమైనంత కలుపుకుంటే మొక్కలను చీడపీడలు అంతగా ఆశించకుండా ఉంటాయి. ఇవి మొక్కలకు బలం కూడా. కొబ్బరి పొట్టు వల్ల వేళ్లు అధికంగా ఏర్పడడానికి వీలవుతుంది. మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా కొబ్బరి పొట్టు చూస్తుంది. మట్టిని పక్కన పెట్టి కేవలం ఆకుల ఎరువు లేదా శుద్ధిచేసిన కొబ్బరి పొట్టునే వాడుతూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మట్టిలోకన్నా అనేక రెట్లు ఎక్కువ దిగుబడి తీస్తున్నారు కూడా.

ప్రత్యేక మడులు...

ఇటుకలు మూడు వరుసలు పేర్చి లేదా చెక్క ముక్కలు చుట్టూ కట్టి మధ్యలో మట్టి మిశ్రమం పోసి ప్రత్యేక మడిని సిద్ధం చేయొచ్చు. అడుగున ఇటుకలు పరిచి.. దాని పైన కొంచెం మట్టి పోసి.. అక్కడక్కడా బెజ్జాలు(ఎక్కువైన నీరు కిందికి పోవడానికి) పెట్టిన పాలిథిన్ షీట్ పరిచి.. ఆపైన ఇటుకలు మూడు వరుసలు పేర్చి మట్టి మిశ్రమం పోస్తే.. పెరటి స్థలంలో ప్రత్యేక మడి సిద్ధమైనట్టే. వర్షం పడినా మడి కింద నేల చెదిరిపోకుండా ఉండడానికి, కలుపు పెద్దగా రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నారు.

ఆకుల రసాలు, కషాయాలతో చీడపీడలకు చెక్
కూరగాయ మొక్కలు, ఆకుకూరలకు చీడపీడలు రాకుండా, ఏవైనా పురుగు సోకినా.. ఆకుల రసాలనో, కషాయాలనో వాడొచ్చు. వేప నూనెను సైతం వాడొచ్చనిహైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ అధ్యక్షుడు, ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డి ‘ఇంటి పంట’తో చెప్పారు. ఈ కషాయాలను ఎవరికి వారు ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చని తెలిపారు. వేప ఆకులు, శీతాఫల ఆకులు, వావిలి ఆకులను మెత్తగా నూరి, రసం తీసి, వడపోసిన తర్వాత.. అంతకు 20 రెట్లు నీటిలో కలిపి పెరటి మొక్కలపై చల్లుకోవచ్చన్నారు. ఈ ఆకులను ఉడకబెట్టి కషాయాన్నయినా చల్లవచ్చన్నారు. ఈ ఆకుల వాసన ఘాటుగా ఉంటుంది. రసం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే చాలు. వేపకాయల రసం కూడా వాడొచ్చన్నారు. పచ్చిమిరప కాయలను గాని లేదా వెల్లుల్లిని గాని దంచి... కిరోసిన్‌లో ఒక రాత్రి నానబెట్టి తర్వాత నీటిలో కలిపి మొక్కలపై చల్లవచ్చన్నారు. చీడపీడలు ఆశించక ముందే 15 రోజులకోసారి వీటిని చల్లవచ్చని అంటూ.. పురుగుల గుడ్లు ఉన్నా నశిస్తాయన్నారు. ఈ రసాల వాసనకు చీడపీడలు పెరటి తోటల దరిదాపులకు కూడా రావన్నారు.

సంప్రదించవచ్చు..
ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డికి పెరటి తోటలు, పండ్ల తోటల సాగులో మంచి అనుభవం ఉంది. 57 ఏళ్లుగా ఉచిత సేవలందిస్తున్న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ’తో ఆయనకు ముప్పయ్యేళ్లుగా అనుబంధం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉద్యాన మిషన్‌కు అనుబంధంగా ఉన్న సాంకేతిక సలహా బృందం(టీఎస్‌జీ)లో ఆయన సభ్యులు. పట్నమైనా పల్లెలైనా ఇంటి పట్టున కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారు సందేహాలేమైనా ఉంటే 92461 08262 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు.

Thursday, January 13, 2011

ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా...!?

 రాత్రనకా పగలనకా శ్రమించి, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకొని పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించకపోతే... రైతన్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే ఆ గ్రామ రైతులకు అలాంటి ఇబ్బంది ఏదీ ఎదురవదు. వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేయండంటూ వ్యాపారుల చుట్టూ తిరగడం వారి ఇంటా వంటా లేదు. వారికి తెలిసిం దల్లా ... నాణ్యమైన పంటలు పండించడం, వాటిని తామే మార్కెట్ చేసుకోవడం. ఎప్పటికప్పుడు మార్కెట్ పోకడల్ని గమనిస్తూ వాటికి అనుగుణంగా పంటలు సాగు చేయడం, వ్యాపారులనే తమ చుట్టూ తిప్పించుకోవడం వీరికి ‘సాగు’తో పెట్టిన విద్య.

అందుకే ఆ గ్రామ రైతులు వ్యవసాయంలో సిరులు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘వ్యవసాయం చేస్తే ఏం లాభ ం... మట్టి బుక్కడం... మట్టి కక్కడం తప్ప’ అన్న నానుడిని చెరిపేసి ‘మట్టి పిసికి... సిరులు పండించడం’ అని తిరగరాస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ వాసులు.


సమష్టి సేద్యం, మార్కెటింగ్‌లో మెలకువలు ఈ గ్రామానికి రాష్టవ్య్రాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంకాపూర్ గ్రామంలోకి వెళితే మనకు ఇంద్రభవనాన్ని తలదన్నే ఇళ్లు, ఖరీదైన కార్లు ఎన్నో దర్శనమిస్తాయి. కేవలం వ్యవసాయంతోనే ఆ ఆస్తుల్ని సముపార్జించుకున్నారంటే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాల్సిందే! పది వేల లోపు జనాభా ఉన్న ఈ గ్రామంలో మూడు వందలకు పైగా ఖరీదైన కార్లు ఉన్నాయంటేనే పరిస్థితి అర్థమవుతుంది. పొలానికి కారులో వెళ్లి పనులు ముగించుకొని వచ్చే స్థాయికి ఇక్కడి రైతులు ఎదిగారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం.


ఇది రాజన్న చలువే...

అంకాపూర్ అభివృద్ధి ప్రస్థానం 70వ దశకంలోనే ప్రారంభమైంది. సంకర జాతి విత్తనాలతో పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్న విషయాన్ని అర్థం చేసుకొన్న అప్పటి గ్రామ సర్పంచ్ రాజన్న గ్రామానికి హైబ్రిడ్ విత్తనాల్ని పరిచయం చేశారు. 1976లో అప్పటి వ్యవసాయాధికారి శ్యాంసుందర్ అంకాపూర్‌ను మోడల్ గ్రామంగా ఎంపిక చేసి సజ్జ పంట సాగు చేయించారు. ఎకరానికి 12 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు లాభాలు చవి చూశారు. దీంతో వారంతా వ్యవసాయంపై మక్కువ పెంచుకొన్నారు.

అప్పటి నుండి గ్రామ స్వరూపమే మారిపోయింది. 1977లో అక్కడ ఆంధ్రా బ్యాంక్ శాఖను ఏర్పాటు చేశారు. వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బుతో గ్రామానికి చెందిన 56 మంది అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 15 కుటుంబాలు స్థిరపడ్డాయి.


పసుపు పంట చేతికి రాగానే ఇక్కడి రైతులు కొత్త మోడల్ కార్లను కొనుగోలు చేస్తారంటే అతిశయోక్తి కాదు. దిగుబడులు చేతికి వచ్చే సమయంలో కార్ల కంపెనీలు గ్రామంలో మేళా నిర్వహించడం, ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం చూస్తే పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది.


డిమాండ్‌ను పసిగట్టి...

అంకాపూర్ వాసులు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. ఉత్తర భారతదేశంలో ఎర్ర జొన్నలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన అంకాపూర్ రైతులు ఎరజ్రొన్న విత్తనోత్పత్తి వైపు అడుగులు వేశారు. అయితే కేవలం ఒకరిద్దరు వేస్తే ఫలితం ఉండదని భావించి ఎక్కువ మంది కలిసి సమష్టి వ్యవసాయం సాగించాలని నిర్ణయించారు. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ పటిష్టంగా ఉండటంతో రైతుల ఆలోచన కార్యరూపం దాల్చింది.
పక్కపక్కన ఉన్న పొలాల్లో వేర్వేరు రకాల విత్తనాలు వేస్తే గాలి, కీటకాల ద్వారా పుప్పొడి పక్క పొలాల్లోకి చేరి విత్తనాలు కల్తీ అయి నాణ్యత లోపిస్తుందనే ఉద్దేశంతో అందరూ ఒకే రకం విత్తనాలు సాగు చేస్తున్నారు. నిజాంసాగర్ జలాలు విడుదల చేసిన వెంటనే కాలువ నుండి విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని పంప్ చేసి చెరువు నింపుకుంటారు.


ప్రాసెసింగ్‌పై దృష్టి

కేవలం పంటల సాగు పైనే దృష్టి సారిస్తే పెద్దగా లాభం ఉండబోదని గ్రహించిన రైతులు గ్రామ శివారులో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించారు. ప్రస్తుతం గ్రామంలో 29 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. పంటను విక్రయించడానికి వ్యాపారుల చుట్టూ తిరగడమేమిటి? వారినే మన చుట్టూ తిరిగేలా చేద్దామన్న ఆలోచన వచ్చిందే తడవుగా మార్కెట్ యార్డు నిర్మించుకున్నారు. దీని ద్వారా ప్రస్తుతం రోజూ సగటున పది లక్షల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. చుట్టు పక్కల గ్రామాల రైతులు కూడా అంకాపూర్ మార్కెట్ యార్డు ద్వారానే తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన పసుపును మహారాష్టల్రోని సాంఘ్లీ మార్కెట్‌కు ఎగుమతి చేస్తారు.

గ్రామ రైతులు ఎక్కువగా పసుపు, ఎర్ర జొన్న, కూరగాయలు సాగు చేస్తారు. పైరు వేసేటప్పుడే రైతులు తమ పంటల అమ్మకానికి సంబంధించి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటారు. అలా చేయడం వల్ల వారికి గిట్టుబాటు ధర లభిస్తోంది. అందరు రైతుల మాదిరిగానే తామూ పంటలు పండిస్తున్నామని, అయితే కలసికట్టుగా ఉండడం, పంటల ఉత్పత్తిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుండడంతో మంచి ఆదాయం పొందుతున్నామని సర్పంచ్ పెర్కిట్ రవి తెలిపారు. మరి మనందరం ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా?


కొత్తిమీరతో లక్షల ఆదాయం!


అంకాపూర్‌లో పండించిన కూరగాయలు గుం టూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. అంకాపూర్ మార్కెట్‌కు సరుకు రావడమే తరువాయి... కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉండటం రైతులకు కలిసొస్తోంది. అంకాపూర్‌లో కొత్తిమీర సాగుతో లక్షల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు. ఎకరం భూమిలో కొత్తిమీర వేసి 45 రోజుల్లో లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారు.

రాష్టవ్య్రాప్తంగా రైతులు కూరగాయలు పండిస్తున్నప్పటికీ పంటను మార్కెటింగ్ చేసుకోవడం, ఎగుమతి చేసే విధానం తెలియక నష్టాలు చవిచూస్తున్నారు. మార్కెటింగ్‌లో మెలకువలు నేర్చిన అంకాపూర్ వాసుల్ని ఆదర్శంగా తీసుకుంటే వ్యవసాయం పండుగే అవుతుంది మరి. అక్కడి రైతుల నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 

వి.అమృతరావు

పాడి - పంట * పుష్టికరమైన మేతతో ఎన్నో లాభాలు!

పాడి పశువులకు పుష్టికరమైన, నాణ్యమైన మేత అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఈతకు, ఈతకు మధ్య దూరం తగ్గి ఎక్కువ ఈతలు వస్తాయి. దీనివల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని అమలాపురం పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి.లక్ష్మణస్వామి తెలిపారు.పాడి పశువుల్లో విటమిన్-ఎ, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషక పదార్థాల లోపాల వల్ల పునరుత్పత్తి సామర్థ్యం పడిపోతుంది. పోషకాల లోపాలు లేకుండా చూస్తే పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు, పునరుత్పత్తికి సంబంధించిన జబ్బులు రాకుండా నివారించవచ్చు. చాలా మంది రైతులు వర్షాకాలం, చలికాలంలో పచ్చిమేతలు, వేసవిలో ఎండుమేతలు దాణాగా అందిస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. పచ్చిమేత ఎక్కువగా దొరికే కాలంలో దానిని పాతర (సైలేజ్) వేసి నిల్వ చేసుకోవాలి.

అన్ని కాలాల్లోనూ పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఒక్కో పశువుకు ఎనిమిది కిలోల వరిగడ్డి లేదా ఎండు చొప్ప (జొన్న, మొక్కజొన్న), ఎనిమిది కిలోల లెగ్యూమ్ జాతి పచ్చిమేత (పిల్లిపెసర, అలసంద, గోరుచిక్కుడు), 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు (జొన్న, మొక్కజొన్న, ఇంకా ఇతర బహు వార్షిక పశుగ్రాసాలు) ఇచ్చినట్లయితే దానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా ఇవ్వాలి. ఈ విధంగా పోషణ చేపడితే సకాలంలో పశువులు ఎదకు వస్తాయి. ఈనిన తర్వాత మూడు నెలల లోపు పశువు ఎదకు వచ్చేటట్లు చూసి 13 నెలల్లో ఒక ఈత ఈనేటట్లు జాగ్రత్త పడాలి. అలా చేస్తే పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. పాడి పరిశ్రమ లాభదాయకంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన పశువులు తమ జీవిత కాలంలో 8-10 సార్లు గర్భం దాల్చే అవకాశం ఉంది.

గొడ్డుమోతు సమస్యలు

పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు మూడు కారణాలు ఉన్నాయి. సకాలంలో ఎదకు రాకపోవడం, పశువులకు గర్భకోశ వ్యాధులు ఉండటం, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనిని నివారించాలంటే పాడి రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు ఈనిన తర్వాత 60-90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువుల్ని సకాలంలో పశు వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలి. ప్రతి రోజూ ఎద లక్షణాల్ని పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. సకాలంలో చూడి పరీక్షలు చేయించాలి. కట్టు నిలవని పశువులకు పశు వైద్యాధికారితో ప్రత్యేక చికిత్స చేయించాలి. ఈనే సమయంలో పాకలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి. పుష్టికరమైన పచ్చిమేత వెయ్యాలి. లేకుంటే ‘ఎ’ విటమిన్ ఇంజక్షన్ ఇవ్వాలి. దాణాలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ మిశ్రమం తగు పాళ్లలో అందించాలి.

దూడల్ని ఎదగనీయండి

యుక్త వయసు రాని దూడల్ని కృత్రిమంగా పొర్లించి చూడి కట్టించే పనిని ఇటీవల కొందరు రైతులు గొప్పగా భావిస్తున్నారు. అయితే అశాస్ర్తీయమైన ఇటువంటి సంప్రదాయం పశువుల ఉనికికే ప్రమాదకరం. తగిన వయసు, సరిపడినంత బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల ఆ పశువుతో పాటు దాని సంతతికి కూడా అనేక రకాల బలహీనతలు, వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు రాజమండ్రి పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రామకోటేశ్వరరావు. వివరాలు ఆయన మాటల్లోనే...
దూడలు ఒక వైపు తల్లి పాలు తాగుతుండగానే పశువుల్ని చూడి కట్టించడం ఇటీవల ఒక పోకడగా మారుతోంది. మనుషుల్లో బాల్య వివాహాలు ఎంతటి దురాచారమో పశువులకు ఈ పద్ధతి అంతటి అనాచారమని చెప్పొచ్చు. సాధారణంగా సంకర జాతి ఆవులకు పోషక విలువలు ఉన్న దాణా ఇవ్వడం వల్ల వాటిలో ముందుగానే ఎద లక్షణాలు కన్పిస్తాయి. దీంతో కొందరు రైతులు వాటిని నాలుగో నెలలోనే పొర్లించి ఎద కట్టిస్తున్నారు. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తర్వాత మాత్రమే పొర్లించాలి. ఆవులైతే 200 కిలోలు, గేదెలైతే 250-300 కిలోల బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడి కట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువుల్ని పొర్లించినప్పుడు శరీరం లోపల కలిగే ఒత్తిడిని అవి తట్టుకోలేవు. తక్కువ వయసు, తక్కువ బరువు ఉన్న పశువుల్ని చూడి కట్టిస్తే వాటి శరీరంలోని లవణాలు, విటమిన్లు పాల ద్వారా బయటికి పోతాయి. దీంతో వాటి శరీర నిర్మాణం కుంటుపడుతుంది. చిరుప్రాయంలోనే ఆవును చూడి కట్టిస్తే కటి వలయం సరైన రీతిలో సిద్ధం కాక ఈనిక కష్టతరంగా మారుతుంది. ఈ సందర్భంలో తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది.

యుక్త వయసుకు రాకుండా పొర్లించడం వల్ల పశువు తన జీవిత కాలంలో ఇచ్చే దూడల సంఖ్య తగ్గిపోవచ్చు. అలాగే దాని పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. తర్వాత ఈతకు, ఈతకు మధ్య ఒక సంవత్సరం ఉండాల్సిన ఎడం రెండు మూడేళ్లకు పెరుగుతుంది. పశువు తీసుకునే ఆహారాన్ని దాని శారీరక ఎదుగుదలకు, పాల ఉత్పత్తికి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఎద లక్షణాలు పూర్తిగా కన్పించక మూగ ఎదలకు దారి తీసే అవకాశం ఉంది. పశువులు ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిన వెంటనే తిరిగి పొర్లు సమస్య వస్తుంది. పొదుగు కణజాలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. జన్యుపరమైన లక్షణాలు తగ్గుతాయి. ఈ విధంగా తొందరపాటుతో చూడి కట్టించడం వల్ల పాడి పశువులకి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వాటి సంతతి దూడలకు అనువంశికంగా ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు ఇలాంటి పొర్లింపు కార్యక్రమాలకు ఇకనైనా స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

Friday, January 7, 2011

కంద సాగు - సొంత విత్తనంతో అధిక దిగుబడులు...!

గోదావరి, కృష్ణా లంక భూముల్లోనే కాకుండా కందను కోస్తాలోని కొబ్బరి తోటల్లో కూడా అంతర పంటగా సాగు చేసే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో కొబ్బరి దిగుబడులు తగ్గిన నేపథ్యంలో పలువురు రైతులు అంతర పంటలు సాగు చేస్తున్నారు. కొబ్బరిలో అంతర పంటగా అరటి తర్వాత కంద ఎక్కువగా సాగవుతోంది. నదీ పరీవాహక లంక భూముల్లో కంద సాగు అధికంగా జరుగుతోంది. అయితే తెగుళ్లు ఎక్కువగా సోకే కంద అత్యంత సున్నితమైన పంట.

సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం, పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం వల్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
 

సొంత విత్తనాన్ని తయారు చేసుకుంటే కందలో అధిక దిగుబడులు సాధించవచ్చునని కొత్తపేట మండలం వాడపాలానికి చెందిన పెదపూడి శ్రీనివాస్, బాపిరాజు నిరూపించారు. తండ్రి నుండి వ్యవసాయాన్ని వారసత్వంగా తీసుకున్న ఈ సోదరులు కంద సాగులో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. 2008లో వీరి తోటలో ఓ కంద దుంప ఏకంగా 16.60 కిలోల బరువు తూగి వ్యవసాయాధికారులను సైతం విస్మయపరచింది. ఈ నేపథ్యంలో సొంత విత్తన దుంపల తయారీపై వారు ఏమంటున్నారంటే...

సొంత విత్తనంపైనే నమ్మకం
కంద సాగులో రైతులు విజయం సాధించాలంటే సొంత విత్తన సేకరణ చాలా ముఖ్యం. విత్తనం కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అంతే కాకుండా విత్తనంలో నాణ్యత లోపిస్తే పంట దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇతర రైతుల వద్ద కొనుగోలు చేస్తే ఎకరం విస్తీర్ణంలో కంద సాగుకు లక్ష రూపాయల వరకూ ఖర్చవుతుంది. పైగా రవాణాలో విత్తనాలు నలిగి మొలక శాతం దెబ్బ తినవచ్చు. అందువల్ల సొంత విత్తనాన్ని వాడడమే మేలు.

సేకరణలో జాగ్రత్తలు
కందను భూమి నుండి సేకరించేటప్పుడు దుంపకు దెబ్బ తగలకుండా చూడాలి. విత్తనానికి ఎంపిక చేసే దుంప పావు కిలో నుండి కిలో వరకూ బరువు ఉంటుంది. అంతకంటే ఎక్కువ బరువున్న దుంపను సేకరించవచ్చు కానీ కిలో కంటే తక్కువ బరువున్న దుంపల్ని వాడితేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది.

సేకరించిన దుంపల్ని పక్కపక్కనే పేర్చి రెండు నెలల పాటు నీడలో ఆరబెట్టాలి. గాలి తగిలేలా చూడాలి. ఆరుబయట ఉంచాల్సి వస్తే పందిళ్లు వేసి ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తగిలే చోట దుంపల్ని ఉంచితే అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ప్రతి 20 రోజులకు ఒకసారి దుంపల్ని అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి. ఎకరం విస్తీర్ణంలో కంద సాగుకు సుమారు 7,500 కిలోల దుంపలు అవసరమవుతాయి.

ఎలా నాటాలి?
పంట సాగు చేసే ముందు ఎకరానికి 20 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా గోతులు తీసి అడుగు లోతున విత్తన దుంపల్ని నాటాలి. పావు కిలో కంటే తక్కువ బరువు ఉంటే ఒకే దుంపగానూ, అర కిలో బరువు ఉంటే రెండు ముక్కలుగానూ, కిలో బరువు ఉంటే నాలుగు ముక్కలుగానూ చేసి నాటుకోవాలి.

కోసే ముక్కల్లో మొలక వచ్చే కన్ను భాగం ఉండేలా చూసుకోవాలి. విత్తన దుంపల్ని కోయడానికి కత్తిపీట వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కోసిన ముక్కల్ని నిల్వ ఉంచకుండా వెంటనే నాటాలి. ఎకరానికి తొమ్మిది వేల దుంపల వరకూ నాటుకోవచ్చు. కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయాల్సి వస్తే కొబ్బరి చెట్టు చుట్టూ మూడు అడుగుల దూరం వదిలి ఎకరానికి ఏడు వేల దుంపలు నాటుకోవాలి. దుంప బొడుపు పైకి ఉండేలా నాటే కంటే ఏదో ఒక పక్కకు ఉండేలా పాతితే మొక్క వేగంగా, దృఢంగా ఎదుగుతుంది. మొక్కలు మొలిచే సమయంలో ఎకరానికి రెండు బస్తాల యూరియా వేయాలి.

తెగుళ్లతో జాగ్రత్త
కంద అత్యంత సున్నితమైన పంట కనుక తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువ. ఇనుము-జింక్ ధాతు లోపాలు ఏర్పడతాయి. ఆకుమచ్చ, కాండం కుళ్లు, మొదలు కుళ్లు, మెజాయిక్ వంటి తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి. వ్యవసాయాధికారుల సూచనల మేరకు సకాలంలో మందులు పిచికారీ చేయాలి. చేలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా మురుగు నీటి పారుదల కోసం కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అంతా సవ్యంగా ఉంటే ఎకరానికి 20 వేల కిలోల దిగుబడి వస్తుంది. పాతిక వేల కిలోల దిగుబడి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 250 కిలోలకు మూడు వేల రూపాయల ధర పలుకుతోంది. అంటే 20 టన్నుల కందకు 2.40 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది.

అప్రమత్తత అవసరం
ఒకసారి కంద సాగు చేసిన భూమిలో రెండేళ్ల పాటు తిరిగి అదే పంట వేయడం మంచిది కాదు. తెగుళ్లకు కారణమయ్యే శిలీంధ్రాల అవశేషాలు భూమిలోనే ఉంటాయి కనుక మళ్లీ కందనే సాగు చేస్తే పంట దెబ్బ తినవచ్చు. కందను సాగు చేసిన భూమిలో రెండేళ్ల పాటు అరటి వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మేము అరటిలో కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి రకాలు వేస్తున్నాం. కంద సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం వల్ల మంచి దిగుబడులు వస్తున్నాయి. వాతావరణం కూడా అనుకూలిస్తే ఆదాయం ఇంకా బాగుంటుంది. ఏదేమైనా కంద సాగు చేసే రైతులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.



బొజ్జా గౌతం
ఉద్యాన పరిశోధనా స్థానం అధిపతి, అంబాజీపేట

Saturday, January 1, 2011

తిండి తిప్పలు * పంటచేలలో రియల్ ఎస్టేట్‌లు

ప్రస్తుతం భారత దేశ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక్క అంగుళం కూడా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఇచ్చేట్టు లేదు. 'మరి ఫ్యాక్టరీలు ఎక్కడ కట్టాలి? ఆకాశంలోనా?' అని పశ్చిమ బెంగాల్ మంత్రి ఒకాయన అన్నారు. మనం ఆయన్ని మనం తిరిగి ఒక ప్రశ్న అడగాలి.. మరి పంటలు ఎక్కడ పండించాలి.. ఆకాశంలోనా?

1950ల్లో 9.36 మిలియన్ హెక్టార్ల భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించగా 2000 సంవత్సరానికి అది 22.4 మిలియన్ హెక్టార్లకు పెరిగిపోయింది. పంట భూమి మాత్రం 1970 నుంచి కూడా140 మిలియన్ల దగ్గరే ఆగిపోయింది. పట్టణీకరణ పుణ్యమా అని గత ఇరవై ఏళ్లుగా వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలకు, కళాశాలలకు, కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు ఉపయోగించడం ఎక్కువైపోయింది.

మరోవైపు ప్రభుత్వం కూడా వ్యవసాయ భూములను హస్తగతం చేసుకొని -సెజ్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్లు లాంటి వాటికి కేటాయిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇతరులకు తక్కువ ధరకు అమ్ముతోంది. ఇదంతా రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల అత్యాశ, మిలాఖత్‌ల వల్లే జరుగుతోంది. ప్రభుత్వానికి డబ్బు తెచ్చి పెట్టే పేరుతో వారు తమకు తామే ఇచ్చుకుంటున్న లంచం ఇది. భారతదేశంలో ఏటా 1.65 లక్షల మంది పుడుతున్నారు. 2060 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకోగలదని అంచనా. కాని ధాన్యం ఉత్పత్తి ఆ దామాషాలో పెరగడం లేదు. 1972లో మనిషికి ఏడాదికి 171.1 కిలోల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటే 2006 నాటికి అది 162.5 కిలోలకు తగ్గింది.

1958-59లో తలసరి పప్పు వాడకం 27.3 కిలోలుంటే 2010 నాటికి అది 10 కిలోలకి తగ్గింది. దిగుబడి తగ్గుతుండడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూనె గింజల ఉత్పత్తి తగ్గడం వల్ల వంట నూనె అవసరాలను తీర్చడానికి గత కొన్ని దశాబ్దాలుగా మన దేశం పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అవగాహనా రాహిత్యంతో ప్రభుత్వం మాత్రం వాణిజ్య పంటలనే ప్రోత్సహిస్తోంది. రైతులు కూడా నష్టాలు భరించలేక వాణిజ్య పంటలవైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, కడుతున్న ప్రాజెక్టులన్నీ కలిసి నీటిని అందించినా కూడా 60 శాతం భూములు వర్షం మీదే ఆధారపడాల్సి ఉంటుంది.

వర్షపాతంలో ఉండే హెచ్చుతగ్గుల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వర్షం ఎక్కువైనా, తక్కువైనా సమస్యలు వస్తాయి. దానివల్ల ఆ భూముల్లో పంట దిగుబడులు తగ్గినా కూడా అవి ఎంతో విలువైనవి. ఎందుకంటే అవి తక్కువ పంటనిచ్చినా ఆహార భద్రతనైతే కల్పిస్తున్నాయి. కాని రైతులు మెట్ట ఆహార పంటలను వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఆ పంటలను ప్రోత్సహిస్తే రైతులు కనీసం వారి అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా పంటలైనా పండిస్తారు. దాని బదులు ప్రభుత్వమే భూములను స్వాధీనం చేసుకొని- మంచి నీటి వసతి ఉన్న భూములను కూడా- అభివృద్ధి పేరిట వాడుకుంటున్నది.

ప్రభుత్వాలు వ్యవసాయ భూములను తీసుకొని, రైతులకు నష్టపరిహారం కింద చాలా తక్కు వ డబ్బును అందజేస్తుండడంతో ఆ కాస్త డబ్బూ పాత అప్పులు తీర్చుకోవడానికి, ఆరోగ్య అవసరాలకే సరిపోతోంది. ఏ కొద్ది మందికో మాత్రమే ఆ డబ్బు వల్ల కాస్త ప్రయోజనం ఉంటుంది. అందుకే అనేకచోట్ల ప్రజలు భూమిని వదులుకోవడానికి జంకుతున్నారు. వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. ఐతే ప్రజల వ్యతిరేకతని పోలీసు బలగాలతో అణచివేస్తున్నాయి ప్రభుత్వా లు. అంతేకాని ఇరుపక్షాలకు లాభదాయకమైన మార్గం గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు చెప్పిన సూక్ష్మ ప్రణాళిక పద్ధతి గాలికి కొట్టుకు పోయి ప్రాజెక్టులు స్థానికులతోను, స్థానిక ప్రభుత్వాలతోను ప్రమేయం లేకుండానే నిర్ణయింపబడుతున్నాయి. నిర్ణయాలన్నీ కూడా పై స్థాయిలో ప్రభుత్వం, కార్పొరేట్ హౌస్‌లు, కాంట్రాక్టర్ల గూడుపుఠాణితో తీసుకోబడుతున్నాయి.

మన పంటల్ని మనం పండిచుకోలేకపోతే దిగుమతి చేసుకోవచ్చుగా? అమెరికా, ఐరోపా దేశాలు అధిక పంటలతో పొంగిపొర్లుతున్నాయి అనంటారా? అయితే ఇండియా లాంటి దేశం ఆహార అవసరాలను దిగుమతి ద్వారా తీర్చుకోగలదా? మన అధిక జనాభా అవసరాలకు ప్రపంచ మార్కెట్టులో ఏది కొనాలని వెళ్లినా దాని ధరలు పెరిగిపోతాయి. మనకొక సామెత ఉన్నది. ఉప్పు అప్పు తెచ్చుకోవచ్చు కాని గింజలు(ధాన్యం) కాదు. ప్రపంచ వాణిజ్య సంస్థ వచ్చిన తర్వాత ఆహార ఎగుమతులు పెరిగి బహుళ జాతి కంపెనీలు ఆహార వ్యాపారంలోకి దిగాయి. దాంతో దేశంలో ఆహార కొరత ఏర్పడి ఆహార భద్రత కరువైంది.

కథ కంచికి..

చాలా మంది అనుకునేదేమంటే వ్యవసాయం, ఆహారం అనేవి రైతులకు, ప్రభుత్వాలకు సంబంధించినవని. కానే కాదు. ఇది వందకు వంద శాతం ప్రజలందరికి సంబంధించిన వ్యవహారం. మనకు పొట్టలో ఆకలేసినంత కాలం, రోజుకు మూడు పూటలా అన్నం తినాలనుకుంటున్నంత కాలం మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయాలు ప్రజలందరి వ్యవహారం.

కథలోని నీతి

నిజమైన ఆహారాన్ని తినండి. అతిగా మర పట్టిన (ప్రాసెస్ చేసిన) ఆహారం తినవద్దు. వీలైనంత వరకు ఇంట్లో వండుకు తినండి. ఆడవాళ్లు బిజీగా ఉంటే మగవాళ్లు వండడం నేర్చుకోండి. సహజాహారానికి (ఆర్గానిక్) ప్రాధాన్యం ఇవ్వండి. మొదటి ప్రాధాన్యం ఆహార పంటలకు ఇవ్వండి. వ్యవసాయేతర పనులకు వ్యవసాయ భూమిని వాడుకోవడాన్ని వ్యతిరేకించండి. పేదలకు ఆహార భద్రత, రైతులకు గిట్టుబాటు ధరను డిమాండ్ చేయండి. దేశ ఆహార సార్వభౌమత్వాన్ని కాపాడుకోండి. చివరగా పంటల విషయంలోగాని ఆహార విషయాల్లోగాని అమెరికాను అనుసరించకుండా ఉండండి.


- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

కరివేపాకు సాగులో లాభాల గుబాళింపు!

 
కరివేపాకే కదా అని తీసిపారేయకండి. ఆ కరివేపాకే ఇప్పుడు ఎంతో మంది రైతన్నల్ని లక్షాధికారుల్ని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య పంటల సాగు నేడు జూదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో కరివేపాకు సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందవచ్చునని నిరూపిస్తున్నారు విజయవాడ పరిసర ప్రాంతాల రైతులు.

వాణిజ్య పంటలు సాగు చేసి చేతులు కాల్చుకునే కంటే ఏళ్ల తరబడి కరివేపాకునే నమ్ముకుని లాభాల గుబాళింపును ఆస్వాదిస్తున్నారు పులగం శివరామయ్య. విజయవాడ నగరం చెంతనే ఉన్న కుంచనపల్లి గ్రామానికి చెందిన శివరామయ్య ఓ సన్నకారు రైతు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. అందులో ఎకరం భూమిని గత పదిహేనేళ్లుగా కరివేపాకు సాగుకే కేటాయిస్తున్నారు.


ఏటా పెట్టుబడి ఖర్చులన్నీ పోను యాభై వేల రూపాయల నికరాదాయం పొందుతున్నారు. శివరామయ్యను చూసి ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది రైతులు ఇప్పుడు కరివేపాకునే తమ ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ఏడాదికి మూడు కోతలు తీసుకుంటూ వాణిజ్య పంటలకు దీటుగా ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కరివేపాకు సాగు చేయడానికి ముందుకొచ్చే ఔత్సాహిక రైతులకు శివరామయ్య పలు సూచనలు అందిస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే...


మంచి డిమాండ్

ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న కరివేపాకుకు ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కరివేపాకు సాగు చేసే రైతులకు వ్యాపారులు ముందుగానే డబ్బు చెల్లిస్తున్నారు. కృష్ణా తీరంలో సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కరివేపాకు సాగు అందరికీ లాభదాయకంగా ఉంటోంది. మరో విశేషమేమంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, వాతావరణం అనుకూలించకపోయినా కరివేపాకు దిగుబడిపై పెద్దగా ప్రభావం పడడం లేదు. అదే ఇక్కడి రైతులకు బాగా కలిసొస్తోంది. ఒకసారి కరివేపాకు సాగు ప్రారంభిస్తే అయిదేళ్ల వరకూ దాని నుండి పంట తీసుకోవచ్చు.

సాగు విధానమిలా...

కరివేపాకు పంటకు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ముందుగా భూమిని దుక్కి దున్ని చదును చేయాలి. ఆ తర్వాత మడులు తయారు చేసుకొని కరివేపాకు విత్తనాలు చల్లుకోవాలి. నేరుగా సాళ్లు చేసుకొని కూడా విత్తనాలు విత్తుకోవచ్చు. సాళ్లలో విత్తుకునేట్లయితే ఎకరానికి 80-100 కిలోలు, నేరుగా మడుల్లో చల్లుకునేట్లయితే 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. దేశవాళీ రకాలతో పాటు భువనేశ్వర్ రకం రైతులకు మంచి దిగుబడులు అందిస్తోంది.

భూమి తయారీ, విత్తనాల కొనుగోలు, విత్తడం వంటి పనులకు ఎకరానికి 15 వేల రూపాయల వరకూ ఖర్చవుతాయి. ఎరువులు, పురుగు మందుల వినియోగానికి మరో 10 వేల రూపాయలు ఖర్చవుతాయి. ఆరు నెలల తర్వాత మొదటి కోత వస్తుంది. అప్పటి నుండి ప్రతి వంద రోజులకు ఒకసారి కోత కోయవచ్చు. ఎగుమతి అవకాశాలు, సీజన్‌ను బట్టి ఒక్కో కోతకు 25 వేల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు స్థానిక మార్కెట్‌లోనే నాలుగు వేల రూపాయల ధర పలుకుతోంది. ఒకసారి పంట వేస్తే అయిదేళ్ల వరకూ దానిని కదిలించాల్సిన అవసరం ఉండదు. పైగా కోత తర్వాత వచ్చే పిలకలు త్వరితగతిన ఏపుకు వస్తాయి.


చీడపీడలు తక్కువే

కరివేపాకు సాగులో చీడపీడల ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయితే పేనుబంక, పొలుసు పురుగు ఆశించే అవకాశం ఉంది. పేనుబంక నివారణకు రోగార్, కాన్ఫిడార్ వాడితే ఫలితం ఉంటుంది. పొలుసు పురుగు నివారణకు కానుగ నూనె పిచికారీ చేయడం మేలు. ఒకవేళ రసాయన మందులు వాడాల్సి వస్తే మలాథియాన్ పిచికారీ చేయవచ్చు.

ఎగుమతులకు భలే గిరాకీ

కరివేపాకు ఎగుమతులకు మంచి గిరాకీ ఉంది. విజయవాడ మార్కెట్ నుంచి చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్‌కు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. దుబాయ్‌లో కూడా కరివేపాకుకు మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు ముందుగానే రైతుల నుండి తోటలు కొని ఇక్కడి నుండే నేరుగా ఎగుమతి చేస్తున్నారు. కరివేపాకును ఔషధాల్లోనూ, బేకరీ ఫుడ్స్‌లో సువాసన కోసం వాడటం వల్ల మంచి డిమాండ్ ఏర్పడింది. కరివేపాకు నుండి స్వేదన క్రియ ద్వారా ఓలియో రెజిన్ అనే నూనెను తయారు చేస్తున్నారు. దీనిని వంటకాల్లో వినియోగిస్తున్నారు. కొన్ని మందుల కంపెనీలు కరివేపాకు పొడిని వినియోగిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ప్రాంతం నుంచి కరివేపాకును ముందుగానే పొడి చేసి నేరుగా ఎగుమతి చేస్తున్నారు.

Gouthamaraju as WUA